Read more!

డేంజర్ బెల్స్ కొట్టే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్!

మూత్రపిండాల నుండి విసర్జింపబడే మూత్రము మూత్రనాళము, మూత్రాశయం ద్వారా మాత్రమే బయటకు విసర్జింపబడుతుంది. ఈ మూత్ర అవయవాలు చాలా తరచుగా ఇన్ఫెక్షన్ గురవుతుంటాయి. కొన్నిసార్లు మూత్ర అవయవాల్లో రాళ్ళు, లేదా పోస్ట్రేట్ గ్రంథి వాపు వలన మూత్రనాళాల దారి సంకోచించి ఇన్ ఫెక్షన్ వస్తుంటుంది. అలాంటపుడు ఆ సమస్యను పరిష్కరించవలసి వుంటుంది. మూత్రనాళాలు ఇన్ఫెక్షన్కు గురికాకుండా మూత్రము ఆమ్ల లక్షణాన్ని కలిగి వుంటుంది. దేహరక్షణ వ్యవస్థ పటిష్టంగా వున్నంతకాలం ఏ ఇన్ఫెక్షన్ సోకదని గుర్తుంచుకోవాలి.


 ఇన్ఫెక్షన్లో అక్యూట్ మరియు క్రానిక్ అని రెండు రకాలు. అక్యూట్ రకంలో ఇన్ఫెక్షన్ అకస్మాత్తుగా వచ్చి కొన్ని రోజులు బాధ పెట్టి, పూర్తిగా నయమవుతుంది. కొన్ని యాంటీ బాక్టీరియల్ మందులతో వ్యాధి ఆగుతుంది. కొన్నిసార్లు అదే ఇన్ఫెక్షన్ అశ్రద్ధ చేసినట్లయితే క్రానిక్ అవుతుంది. 


యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లో లక్షణాలు:-


 మూత్రం పోసే టప్పుడు మంట రావటం, మూత్రం సాఫీగా రాక కొద్ది కొద్దిగా రావటం, నొప్పి కడుపు వరకు పాకినట్టవటం జరుగుతుంది. మూత్రం కొద్దిగా పసుపు పచ్చగా లేదా ఎరుపు రంగుగా రావచ్చు. ఇన్ఫెక్షన్ మోతాదు మించినట్టయితే పెద్ద పెట్టున, చలిజ్వరం రావటం, వణకటం వుంటాయి. వ్యాధి లక్షణాలు సేకరించి, మందును ఎంపిక చేసి వాడినట్టయితే అక్యూట్ యురినరీ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమవుతుంది. నీరు అధికంగా తీసుకోవాలి.


క్రానిక్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గించటానికి కొంత సమయం పడుతుది. ఇది ముఖ్యంగా 'గోనోకోకల్ ఇన్ఫెక్షన్' వల్ల వస్తుంది. ఇన్ ఫెక్షన్ క్రానిక్ అయినపుడు మూత్రనాళంలో స్ట్రిక్చర్స్ ఏర్పడుతాయి. మూత్రనాళంలోని జిగురు పొర కలసిపోయి మూత్రనాళం లోపలి పరిమాణం తగ్గుతుంది. మూత్రం పోసే దారి సన్నగా మారి మూత్రం పోసేటప్పుడు రోగి కడుపు కండరాలతో వత్తిడి చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు మూత్రం ధార చీలినట్టుగా వస్తుంది. స్ట్రక్చర్ పెద్దదయినట్టయితే మూత్రనాళం పూర్తిగా మూసుకుపోయి మూత్ర విసర్జన ఆగిపోతుంది. మూత్రాశయం ఉబ్బుతుంది. ఆ పరిస్థితుల్లో శస్త్ర చికిత్సచేసి మూత్రాశయ ద్వారం తీయవలసి వుంటుంది.


ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలో వున్నప్పుడే మందులు వాడినట్టయితే ఇన్ఫెక్షన్ పూర్తిగా నివారించుకోవచ్చు. స్ట్రక్చర్లు ఏర్పడితే కూడా దీర్ఘకాలిక మందులను ఎంపిక చేసి వాడినట్టయితే శస్త్ర చికిత్స అవసరం లేకుండా నయం చేసుకోవచ్చు. క్రానిక్ ఇన్ఫెక్షన్  పూర్తిగా నయం చేయటంలో కొంత సమయం పడుతుంది.


ప్రోస్ట్రేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ కు గురవటం వలన, లేదా వాపు వలన కూడా మూత్రం ఆగిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం జరుగుతుంది. ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడినవారిలో ప్రోస్ట్రేట్ గ్రంథి వాపు రావటం జరుగుతుంది. దీనికి కాథటరైజేషన్ చేస్తుంటారు. తాత్కాలికంగా నయమనిపించినా మళ్ళీ మూత్రనాళం సంకోచిస్తుంది. ప్రోస్ట్రేట్ గ్రంథిలో ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా వస్తుంది. తగిన పరీక్షలు చేయించుకుని క్యాన్సర్ కణాలు వున్నాయో లేదో నిర్ణయించవలసి వుంటుంది. ఇన్ని ప్రమాదాలు ఉంటాయి కాబట్టే.. ఇన్ఫెక్షన్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.


                                  ◆నిశ్శబ్ద