పళ్ళూడిపోయాకే పాలిటిక్సా?
posted on Oct 24, 2013 @ 12:31PM
మెగా బ్రదర్స్ పవన్‌కళ్యాణ్, నాగబాబు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పుకార్లు రావడం, ఎలక్ట్రానిక్ మీడియా ఆ పుకార్లని పెంచి పోషించి వీళ్ళు పోటీ చేయబోయే నియోజకవర్గాలను కూడా డిసైడ్ చేయడం, చివరకు తాము తెలుగుదేశంలో చేరబోవడం లేదని నాగబాబు లేఖ రాయడంతో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడిన విషయం తెలిసిందే. కాకపోతే టోటల్‌గా ఈ ఇష్యూలో బోలెడన్ని ధర్మసందేహాలు కలుగుతూ వున్నాయి.
‘అత్తారింటికి దారేది’ సినిమాకి మైలేజ్ పెంచుకోవడానికే పవన్‌కళ్యాణ్ వర్గీయులే ఈ పుకార్లని షికార్లు చేయించారనేది ఒక డౌటు. సరే, ఆ డౌట్ సంగతి అలా ఉంచితే, పవన్‌కళ్యాణ్ ఏదైనా పార్టీలో చేరితో ఆ పార్టీకి లాభమో, నష్టమో జరుగుతుంది. అంతవరకు ఓకే. మధ్యలో ఈ నాగబాబు ఎవరంట? ఆయన రాజకీయాల్లోకి వచ్చినా, ఏ పార్టీలో చేరినా ఎవరికైనా ఒరిగేదేముందంట? రాజకీయ రంగంలో ఆయన్ని పట్టించుకునేదెవరంట? తాచుపాము బుసకొడితే దాన్నిచూసి వానపాము కూడా బుసకొట్టినట్టు నాగబాబు కూడా తన తమ్ముడితోపాటు తనకి కూడా పొలిటికల్ ప్రాధాన్యం ఆపాదించుకోవడమెందుకో?! పుకార్లన్నీ మెయిన్‌గా పవన్‌కళ్యాణ్ మీద వచ్చాయి. అలాంటప్పుడు తెలుగుదేశంలో చేరట్లేదు మొర్రో అని పవన్‌కళ్యాణ్ స్టేట్‌మెంట్ ఇస్తే సరిపోయేది కదా.. ఇద్దరి తరఫున నాగబాబు ఇవ్వడమేంటి?
పవన్‌కళ్యాణ్ తనమీద వస్తున్న పుకార్లని కూడా ఖండించలేనంత బిజీనా? రేపెప్పుడైనా పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిపోతే ఆయన వ్యవహారాలన్నీ నాగబాబే చూసుకుంటారా? నాగబాబు మీడియాకి విడుదల చేసిన లేఖలో మరో కామెడీ కూడా వుంది. ప్రస్తుతం అన్నదమ్ములిద్దరూ తమ వృత్తిలో బిజీగా వున్నారన్న మాటని నాగబాబు ఉపయోగించాడు. అంటే అర్థం ఏమిటి? వృత్తిలో బిజీ అంతా అయిపోయాక, చేతిలో పనేమీ లేనప్పుడు, పళ్ళూడిపోయాక రాజకీయాల్లోకి వస్తామనా? రాజకీయాలంటే, పార్టీలంటే పనిలేనివాళ్ళ పునరావాస కేంద్రాలా? ఇలాంటి సవాలక్ష ధర్మ సందేహాలకు సమాధానాలు ఇచ్చేదెవరు?