అరుణమ్మ ప్లాను అదిరింది!
posted on Oct 23, 2013 @ 2:51PM
2014లో వచ్చే ఎన్నికలలో రాహుల్‌గాంధీ చేత మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర మంత్రిణి, తెలంగాణ ఆడపడుచు డి.కె.అరుణ కంకణం కట్టుకుంది. దీనికోసం ఈమధ్య అరుణమ్మ గారు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కి వినతిపత్రం సమర్పించింది. అక్కడితో ఆగకుండా మరింత అడ్వాన్సయి రాహుల్‌బాబుని కలిసి మహబూబ్‌నగర్‌లో పోటీ చేసి తెలంగాణని ఉద్ధరించాలని వేడుకున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తున్నట్టు ప్రకటించడంతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీమీద, సోనియాగాంధీ మీద ప్రేమ తెగ కారిపోతోందట. పాలమూరులో రాహుల్‌గాంధీ పోటీ చేస్తే ఓటర్లు ఎగబడి ఓట్లు వేస్తారట. భారీ మెజారిటీ ఇచ్చేస్తారట. ఇదీ అరుణమ్మగారు చెబుతున్న వెర్షన్. అరుణమ్మ గారు ఆహ్వానించగానే రాహుల్‌గాంధీ తన కుటుంబ నియోజకవర్గమైన అమేథీని వదిలిపెట్టి మహబూబ్‌నగర్ వస్తాడా? పొరపాటుగా కూడా రాడు.
రాహుల్‌గాంధీ మరీ అంత బుర్రలో బురదున్నోడు కాడు. ఈ విషయం డి.కె.అరుణకి కూడా తెలిసే ఉంటుంది. తెలిసినా రాహుల్‌గాంధీని పాలమూరుకి ఆహ్వానించడం వెనుక పెద్దప్లానే వుందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితో ముఖ్యమంత్రి అయిపోవాలని కోరుకుంటున్న వారి క్యూలో డీకే అరుణమ్మ కూడా వుంది. క్యూలో తన ముందు వున్న అందరినీ దాటుకుని వెళ్ళి తెలంగాణ సీఎం పీఠం ఎక్కాలంటే రాహుల్‌గాంధీ మీద తనకున్న విధేయతను ప్రకటించి ఆయనగారి దృష్టిలో పడాలి. అందులో భాగమే రాహుల్‌గాంధీకి అరుణగారి ఆహ్వాన పత్రమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ సీఎం కావడానికి వాళ్ళనీ వీళ్ళనీ కాకాపట్టడం కాకుండా కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు డైరెక్టుగా రాహుల్‌గాంధీనే టార్గెట్ చేసి అరుణమ్మ భలే ప్లాన్ వేసిందని అంటున్నారు.