రాష్ట్ర రాజకీయాలలో క్విడ్-ప్రోలు

 

జగన్మోహన్ రెడ్డి కేసుల పుణ్యమాని ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా న్యాయ సంబందమయిన అంశాల పట్ల కొంత అవగాహన ఏర్పడింది. జగన్ కేసుల్లో ఎక్కువగా వినబడే ‘క్విడ్-ప్రో’(నీకు ఇది-నాకు అది) సిద్ధాంతాన్నికాంగ్రెస్-వైకాపాలు ఇప్పుడు రాజకీయాలలోకి కూడా ప్రవేశపెట్టాయని, అందువలనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెయిలు వచ్చిందని తెదేపా వాదన. అందుకు ప్రతిగా రానున్న ఎన్నికలలో వైకాపా కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా మద్దతు ఇస్తుందని చంద్రబాబు అంచనా.

 

ఈ ఫార్ములాను విజయవంతంగా అమలు చేసేందుకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజన నిర్ణయం గురించి ముందుగానే జగన్మోహన్ రెడ్డి చెవిలో వేసి, వ్యూహాత్మకంగానే వైకాపా శాసనసభ్యుల చేత సమైక్యాంధ్రకి మద్దతుగా రాజీనామాలు చేయించారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తద్వారా సీమాంధ్రలోతెదేపాను దెబ్బతీసి, వైకాపా రానున్నఎన్నికలలో పైచేయి సాధిస్తే, ఎన్నికల తరువాత పరిస్థితిని బట్టి ముందు నిర్ణయించుకొన్న‘క్విడ్-ప్రో’ నియమావళి ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారం పంచుకోవాలని కాంగ్రెస్-వైకాపాలు ఎత్తు వేశాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాస, వైకాపాలతో ‘క్విడ్-ప్రో’ ఒప్పందాలు చేసుకొని, సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డిని, తెలంగాణా లో కేసీఆర్ ని ముందుంచి తెదేపాను దెబ్బ తీయాలని వ్యూహం పన్నిందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

 

చంద్రబాబు ఆరోపణలలో వాస్తవం ఉండవచ్చుగాక, కానీ ప్రత్యర్ధ రాజకీయపార్టీలు తమ మనుగడ కోసం, అధికారం కోసం ఎటువంటి ఎత్తులు వేసినా వాటిని తట్టుకొని విజయం సాధించడంలోనే రాజకీయ నేతల గొప్పదనం తెలిసేది.

 

కాంగ్రెస్-వైకాపాలు ‘క్విడ్-ప్రో’ ఒప్పందం చేసుకొన్నాయని ఆరోపిస్తున్న చంద్రబాబు కూడా ఇప్పుడు బీజేపీతో అదే ఒప్పందం చేసుకొనేందుకు సిద్దపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న ఎన్నికలు తెదేపా-బీజేపీలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక, ఎన్నికలలో గెలిచేందుకు తెదేపా-బీజేపీలు చేతులు కలిపితే అప్పుడు అది కూడా క్విడ్–ప్రోగానే భావించాల్సి ఉంటుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెదేపా సహాయపడితే, తెదేపా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి బీజేపీ సహాయపడే అవకాశం ఉంది.

 

అయితే ఈ నాలుగు పార్టీల మధ్య జరుగబోయే ఈ రాజకీయ ‘క్విడ్-ప్రో’ ఒప్పందాలలో ఏ ఒప్పందం ఎవరికీ అధికారం కట్టబెడుతుందో తెలుసుకోవాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

 

ఈ సారి ఎన్నికలలో నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి మరియు కేసీఅర్ లు ప్రజలపై ఎంత ప్రభావం చూపగాలరనే అంశంపైనే వార్వారి పార్టీల విజయావకాశాలు ఆధారపడవచ్చును. ఈ సారి ప్రజలు వీరిలో సరయిన కాంబినేషన్స్ ను ఎంచుకోవలసి ఉంటుంది. అప్పుడే రాష్ట్రంలో దేశంలో స్థిరమయిన ప్రభుత్వాలు ఏర్పడి పాలన సజావుగా సాగే అవకాశం ఉంది. లేకుంటే ప్రజలకి ‘ఇన్-ఫ్రంట్, ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్’ తప్పదు.