కేటీఆర్, స్వామిగౌడ్ అరెస్ట్
posted on Jan 27, 2013 @ 11:24AM
తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నిర్వహించ తలపెట్టిన ‘సమరదీక్ష’ను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ నేతలను అరెస్టు చేస్తున్నారు. విద్యార్థులను అడ్డుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సమరదీక్షను నిర్వహించి తీరుతామని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. నిర్బంధం ద్వారా దీక్షను ఆపాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు ఆదివారం సాయంత్రంలోగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. ఫిబ్రవరిలో ‘చలో హైదరాబాద్’ లాంటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తామన్నారు. అసెంబ్లీ నుంచి జేఏసీ కార్యాలయం వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో టీఎన్‌జీవో జేఏసీ నేతలను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌తో సహా టీఆర్‌ఎస్ కార్యకర్తలను, టీఆర్‌ఎస్‌వీ విద్యార్థులను పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అరెస్టు చేశారు. వీరిని గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఖైరాతాబాద్ చౌరస్తాలో రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరిన ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను పంజాగుట్ట పీఎస్‌కు తరలించారు. రాజ్‌భవన్ రోడ్డుని పూర్తిగా మూసేసిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు ఓయూలో విద్యార్థులు భారీ ర్యాలీగా బయలుదేరారు. గన్‌పార్క్ వద్దకు కార్యకర్తలో చేరుకున్న టీఆర్‌ఎస్ నేత స్వామిగౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వామిగౌడ్‌ను వెంటనే విడుదల చేయాలని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. అరెస్టులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. దానికి తెలంగాణ ప్రాంత మంత్రులే బాధ్యత వహించాలని ఆయన తెలిపారు.