"ఈ వేదవూళ్ళో సోడా వుండ"దన్నాడు రామచంద్రం.
నాగమణి ఏ మనుకుందో ఏమోగానీ పైకిమాత్రం 'పోన్లెండి'అన్నది.
మనిషి ముఖం చూడగానే, ఆ వ్యక్తి గుణ గణాలన్నీ ఇట్టే తెలుసుకోవచ్చు ననడంలో నాకు నమ్మకం లేదు. సంవత్సరాల తరబడి కలిసి మెలిసి వుండే భార్యాభర్తలు - చావబోయ్యే నాటిక్కూడా ఒకరికొకరు అర్ధంకానీ సందర్భాలు నాకు తెలుసు, కాని నాగమణిని గురించి గురించి, నా కప్పటి కప్పుడే కొన్ని అభిప్రాయాలేర్పడ్డాయి. ఆ తరువాత జరిగిన సంఘటనలు, నాకేర్పడిన అభిప్రాయాలను బలపరిచాయేగానీ, రహితం చెయ్యలేదు.
మనం అడిగినా అడగకపోయినా, నాగమణి తన అనుభవాలన్నింటినీ చెప్పుకొస్తుంది!
"ఒకసారి చిట్టివలసలో చింతామణి వేస్తున్నాం బాబూ! రాఘవాచారిగారు భవానీ శంకరుడు, పెద్దిబొట్ల బిల్వమంగళుడు, రాజమండ్రి శాస్త్రిగారు, సెట్టికి వేశారు. మేం నాటకం వేస్తున్నామని తెలిసి విజయనగరం మహారాజావారు సకుటుంబంగా వచ్చారు. నాటకం మధ్యలోనే కలగచేసుకొని నన్ను గురించి చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చారు. ఆ తరువాత విజయనగరం పిలిపించుకొన్నారు. నన్ను దివాణంలో ఉండిపొమ్మన్నారు నేనే వొప్పుకోలేదు" అనేది నాగమణి.
"తమిడాం కుమార్రాజా వారు చేటంత వెండి పళ్ళెంలో, ఇంతెత్తున రూపాయలు పోసి దానిమీద కాశీ పట్టుచీర కప్పి నాకు పంపించారు. వాటిని తెచ్చినవాణ్ణి, పంపినవాణ్ణి కూడా ముఖం వాచేలోగా చీవాట్లు వేసి పంపించాను."
"ఒకసారి స్థానంవారు నా వేషం చూసి, డంగైపోయారు. మాధవపెద్ది వెంకట్రామయ్య గారి నడగండి కావలిస్తే. చింతలపూడి రాణీగారు - తిమ్మాజీ, కౌసల్యాదేవిగారు, తనతో కబుర్లు చెపుతూ కూచోమని, నెలకు రెండొందలిస్తాననీ స్వయంగా గుంటూరొచ్చి అడిగిన సంగతి అందరికి తెలుసు, కాని నేనొప్పుకోలేదు. బరోడా దివాన్, బావాజీ రావుగారు నాకోసం గుంటూర్లో ప్రత్యేకంగా, వారంరోజులపాటు ఉండిపోయారు. ఏమిటోలెండి! ఆ రోజులే వేరు!!"
మధ్యలో నేను కలగజేసుకోకపోతే ఈ ప్రవాహం ఆగేటట్టు కనపడలేదు. ఏదో పనున్నవాడిలాగా, అవతలికెళ్ళి రామచంద్రాన్ని గట్టిగా కేకవేశాను.
"ఈ మంధర్నెందుకు తెచ్చావురా బాబు! నాకు తల్లో నాదు పుట్టుకొస్తుంది. దీన్ని భరించడం కష్టమే!" అన్నాను.
"నాలుగైదుసార్లు ఈవిడా వెంట వొస్తుంది. వయసులో ఉన్న పిల్లను వొంటరిగా మన వెంట పంపడానికి భయపడింది!" మనమీద నమ్మకం కలగాలి. కలిగేలాగా మనం ప్రయత్నించాలి.
నువ్వు తొందరపడి మంగమ్మను ఏమన్నా చేసేవు. కాస్త వోపిక పట్టు. అన్ని విషయాలు నేను చూచుకొంటాను, అది సరేగానీ వొరే! మంగమ్మెలా ఉందంటావ్?" అన్నాడు రామచంద్రం.
ఆ మాట లంటున్నప్పుడు, వాడు బుసలు కొట్టడం నేనుగ్రహించాను.
"చూడ్డానికి బాగానే ఉందే!" అన్నాను.
"బాగా 'నే' అంటావేమిట్రా చిట్టితండ్రీ! పచ్చి కొబ్బరి ముక్కలాగా లేదుట్రా! ఇంకా వ్యవహారంలోకి దిగినట్లులేదు అయినా ముండల్నెవరు నమ్మొచ్కాడుగానీ -అబ్బిగా చవగ్గా కొట్టుకొచ్చాననుకో ! నెలకు పది రిహార్సల్స్ చొప్పున, రెండు మాసాలురావాలి. రానూ పోనూ ఖర్చులు మనమే భరిస్తున్నాం. ఆ రెండు మాసాలపాటు. నెలకు అరవై చొప్పున ఇస్తున్నాం. నాటకానికి యాభై చొప్పున, ఎన్నాడితే అన్ని యాభైలిస్తున్నాం. ఇంకా కాంట్రాక్టు రాసుకో లేదన్న మాటేగానీ అనుకొన్న షరతులివి,. మరి నీ ఉద్దేశమేమిటి?" అన్నాడు రామచంద్రం.
"అంత డబ్బుమానం పెట్టుకోగలమట్రా?" అన్నాను వాడితో వాడోసారి కళ్ళెగరేసి, కుచ్చెళ్ళతో ముఖమంతా తుడుచుకున్నాడు.
"చూద్దాం - సమాజం భరించలేకపోతే, నేనే పెట్టుకుంటాను.. నువ్వు డబ్బుముఖమే చూస్తున్నావుగానీ, ఆర్టిస్టును చూస్తున్నట్టులేదు. మంగమ్మ ముడి రత్నంలాంటిది., దాన్ని సానబెట్టి ఎలా మెరిపిస్తానో చూస్తుండు." అన్నాడు రామచంద్రం.
ఈ దశలో వాణ్ణికాదన్నా ప్రయోజనముంది కనక నేనా మాటనలేదు. అదీ గాక డబ్బుపెట్టుకునేది వాడుగాని నేనుకాదు. మధ్యలో నాదేం పోయింది కనక, వాడి మనస్సు నొప్పించడానికి!
"అయితే ఓపని. మాత్రం చెయ్యరా బాబూ! ఈ మందరను తీసుకురాకు తెచ్చినా దాన్నికూడా నీతోనే ఉంచుకో. నా మీదికి తోలావంటే నేను భరించలేను" అన్నాను.
ఆ రాత్రి రిహార్సల్స్ రూము జనంతో కిటకిటలాడిపోయింది.
అందరూ పోర్షన్లు చూస్తూనే రిహార్సల్స్ చేశారు. రామచంద్రం పని ఊపిరి తిరక్కుండా ఉంది. తను హీరోనన్న సంగతిని మరచిపోయి వాడే మిగతా వారిని డైరెక్టు చెయ్యడం ప్రారంభించాడు. మంగమ్మ తనను గమనిస్తున్నదనుకొన్నప్పుడు, మనవాడు మరికొంత గొంతు పెంచేవాడు. కసురుకునేవాడు. చిత్రమేమిటంటే వాణ్నెవ్వరూ అదుపులో ఉంచడానికి చూళ్ళేదు. రాత్రి పన్నెండు గంటలకల్లా రిహార్సల్స్ పూర్తయింది.
జనమింకా వెళ్ళలేదు. మా జీతగాడు ఓ చెంపనించి చాపలు చుట్టుకొస్తున్నాడు. మంగమ్మ నాగమణి, బడి వరండాలో కొచ్చారు. నలభైయాభైమంది కుర్రకారు, పెద్దవాళ్ళుకూడా వాళ్ళను చుట్టేశారు.
"వెళ్ళాండర్రా బాబూ! మా ముఖానేమన్నా కోతులాడుతున్నాయా?" అన్నది నాగమణి.
"యహ పదండశ" అన్నాడెవరో.
ఇల్లాగయితే మాకు చాలా కష్టమండి! మా అమ్మాయిరాదు, ఇలా విసురుకుంటే ఎట్లాగండీ?" అన్నది.
"ఓరి వెంకటేశ్వర్లూ! ఇక పొండిరా వెధవల్లారా!" అని కేక పెట్టాడు రామచంద్రం "ఆడదాని ముఖం ఎరగనట్లు అట్లా చూస్తారేమిట్రా?"
"ఆడదాని ముఖం ఎరక్కకాదు; నాటకాలాడేగాని ముఖం మనవాళ్ళు చూడడం ఇదేగా మొదలు? నాలుగైదు రిహార్సల్స్ కి ఇలాగే వస్తారు. వీరిని కసురుకోకు. రేపు మననాటకానికి డబ్బివ్వవలసింది వీళ్ళే!" అన్నాను.
నాగమణి నాలుగైదు రిహార్సల్స్ కొచ్చింది. వచ్చినప్పుడల్లా మాయింట్లో నే దిగేది, ఒకసారి నాతోబాటు పొలంకూడా వొచ్చింది. జోన్నచేలు నిలువుటెత్తున పెరిగి, 'జుయ్' మంటున్నాయి. ఊచ బియ్యం కొట్టిచ్చాను. అరడజను ఏపుదోసకాయలు కోసిచ్చాను ఇంతసేపు నాగమణి ఏదో మాట్లాడుతూనే ఉంది.
"నేనో ఇబ్బందిలో ఇరుక్కొన్నానండీ!" అన్నదావిడ రెప్పలు టపటపలాడిస్తూ.
చెప్పమన్నాను.
"నాకో రెండొందలు కావాలి. ప్రాణం మీది కొచ్చింది మళ్ళా మీ డబ్బు ముద్దరసుద్దిగా చెల్లుగడతాను. మీ రుణాన పోను లెండి. నేనున్నాను, చేతిలో పిల్లవుంది. ఎలాగైనా తీర్చుకోగలం ఈ మాట అడగడానికే మిమ్మల్ని పొలం తీసుకొచ్చాను" అన్నది నాగమణి.
అప్పుడు నేనేమన్నా వ్యవహారం బెడిసికొట్టేలాగా ఉంది.
'చూద్దాం' అన్నాను.
"అలా అంతేకాదు. మీరు నాకు ప్రామిస్ చెయ్యాలి. అందాకా వదల్ను."
ఆ తరువాత ఏం జరిగిందన్నది అంతముఖ్యం కాదు కాని నేను మాత్రం రెండొందలూ నాగమణికిచ్చాను.
"ఇలా ఇచ్చానని మంగమ్మతో అనకండి. మీరు అనరనుకోండి అయినా జాగ్రత్తకోసం చెబుతున్నాను." అన్నది నాగమణి. వెనగ్గా వొచ్చి, నన్ను ఆనుకొని నిలబడుతూనే నేమన్నా అంటానేమోనని కాస్సేపలానే ఉంది. రెండు మూడుసార్లు నాగమణి చేతులు కదలడం కూడా నేను చూశాను. నేను పరస్త్రీ పరాజ్ముఖుణ్ణి కాదుగానీ, నాగమణిని చూస్తే నా కెందుకో చెప్పరానంత భయం మాత్రం కలిగింది.
నాలుగైదు వారాలపాటు నాగమణి కూడ మావూరొచ్చింది. పేరేమో మంగమ్మకు తోడుగా ఉండటం కానీ ఆవిడ ఆపని కూడా చేస్తున్నట్టు లేదు. కంటిక్కాస్త నదరుగా కనిపించిన ప్రతివాడితోనూ తననుగురించీ తన ప్రతిభను గురించి, వైన వైనాలుగా చెప్పుకునేది. అవతలివాడు వింటే సరేసరి, లేదా మంగమ్మను గురించి చెప్పుకొచ్చేది.
ఒకసారి మంగమ్మను మాదగ్గర వొదలి ఇప్పుడే వొస్తానని వెళ్ళిన వెళ్ళడం, మొన్నాడు ఉదయానిగ్గానీ నాగమణి రాలేదు ఎక్కడి కెళ్ళావని నేనడగానూలేదు, ఆవిడ చెప్పనూలేదు. రెండురోజుల తరువాత భూషయ్యగారి పెద్దరామయ్య కనిపించి, నాగమణిని గురించి వాకబుచేశాడు. విచారించగా తేలిందేమిటంటే నాగమణి మాయమైన రోజున పేద రామయ్య ఇంట్లో పడుకోలేదు. గొడ్లకాడి చిన్నాణ్ణి వాముల దగ్గరికి పంపించి తను సావిట్లో పడుకొన్నాట్ట. పెదరామయ్య పెళ్ళానికి ఈ సంగతి తెలిసి నన్నూ మా సమాజాన్నీ దుమ్మెత్తి పోస్తోందిట!
నాగమణి మూలంగా ఇటువంటి చెడ్డపేరు కలగడం నాకిష్టం లేదు. నాగమణి మహాపతివ్రత అన్న అభిప్రాయం నాకేనాడూ లేదు గానీ, ఇలా అచ్చుబోసినవతుగా తిరుగుతుందని కూడా నేననుకోలేదు. ఈమాటే నేను రామచంద్రానితో అన్నప్పుడు వాడు కాసేపు నన్ను చిల్లులుపడేట్టు చూసి, ఆ తరువాత పెదవి విరుస్తూ నవ్వాడు. పెద్ద రామయ్య మీద నీకు అసూయగా ఉందికాదుట్రా?' అన్నాడు వాడు.
మొదట ఆ ప్రశ్న నాకు బొత్తిగా అర్ధం కాలేదు. తీరా అర్ధమయ్యాక రామచంద్రం అంతమాత నన్నందుకు విచారం కలిగింది.
'అటువంటి దేమీ లేదురా! నాబాధ నాగమణి నాకు దక్కలేదనీ కాదు; పెదరామయ్యకు దక్కిందనీకాదు. ఈ దౌర్భాగ్యురాలి మూలంగా వెధవ మాటలన్నీ పడాలిసొచ్చిందే అని బాధపడుతున్నాను. ఆడదంటే నాకు అయిష్టమనిగాదు గానీ' ఆతరవాత నేను వాక్యం పూర్తిచెయ్యకుండానే వాడు వెళ్ళి పోయాడు...
ఒకసారి మంగమ్మ వొక్కతే రిహార్సల్ కొచ్చింది. ఎప్పుడూ కుందనం బొమ్మలా పకపక లాడుతూ ఉండే మంగమ్మ. ఆరోజు మబ్బు కమ్మినట్టుగా వుంది. 'ఏం జరిగిందని' వొకటి రెండు సార్లడిగాను. 'ఏంలే' దని ఒకసారీ ఒంట్లో బాగుండలేదని మరోసారి చెప్పింది. అప్పటికి నేనూ వూరుకొన్నాను. అసలు సంగతి రిహార్సల్ అయిన తరువాతగానీ బైటపడలే.
అందరూ ఇళ్ళ కెడుతున్నారు. మరో రెండుమూడు రిహార్సల్స్ తరవాత నాటకం వేయాలనీ, ఈలోగా మిగతా ఏర్పాట్లన్నీ చేసుకోవాలనీ, రామచంద్రం తన సహజధోరణిలో చెప్పుకొచ్చాడు. నాటకం సక్సెస్ కావడం ఖాయమే నన్నాడు, మంగమ్మ కళ్ళు చెదిరేలాగ యాక్ట్ చేసిందన్నాడు. ఆవిడ వున్నంతకాలమూ, మన సమాజానికేమీ ఢోకా లేదన్నాడు.
'ఇవ్వాళ్ళ జరిగినంత పకడ్బందీగా ఇంకో రెండు రిహార్సల్ జరిగితేచాలు నాటకం గుమ్మెత్తిపోతుంది!' అన్నాడు వాడు మంగమ్మ కేసి తిరిగి అదోలా నవ్వుతూ.
మంగమ్మగూడా నవ్వింది. కానీ అది నవ్వులాగా లేదు.
రాను రాను రామచంద్రం నాకు అర్ధంగాకుండా పోతున్నాడేమోననిపించింది. ఎందుకంటున్నానంటే, ఎంతో ఉద్వేగంగా నటించవలసిన రెండు సీన్సులలోనూ మంగమ్మ కొయ్యబొమ్మలాగా నటించింది. ఎంతో సున్నితంగా భావాలను పలికించగల ఆముఖంలో ఆనాడు ఒక్క భావమూ ప్రస్పుటం కాలేదు. డైలాగ్స్ తప్పుపోకుండా చిలకలాగా వొప్పగించిందే కానీ, అందులోని భావాలనుపలికించ లేకపోయింది. అయినా రామచంద్రం అన్నాడు. అంటే - దీని వెనుక ఇంకేదో గ్రంధమున్న దన్నట్లు.
"మంగమ్మ మాయింట్లో పడుకొంటుంది లేరా?" రామచంద్రం.
మంగమ్మ ఓసారి రామచంద్రం కేసి ఆపాద మస్తకం చూసి సన్నగా మిట్టూర్చింది. ఆ తరువాత రెండు చేతులతోనూ కణతలు నొక్కుకుంటూ,
"అంత దూరం నేను రాలేను మాష్టారూ! ఈ పూట డైరెక్టరు గారింట్లో పండుకొంటాను" అన్నదావిడ.
రామచంద్రం క్షణకాలం చకితుడయ్యాడు. వాడు మంగమ్మను మింగేలాగా చూశాడు.
"నాకీపూట వొంట్లో బావుండలేదండీ! కడుపులో దేవినట్లుగా వుంది కళ్ళు తిరుగుతున్నాయి. అయినా రిహార్సల్స్ ఆగిపోతుందేమోనని వచ్చాను." అన్నది. మంగమ్మ.
"నాగమణి రాలేదేం?" అన్నాను నేను.
"రాలేదు" అన్నది మంగమ్మ.
ఆరాత్రి చాలా పొద్దుపోయిందాకా నేనూ మంగమ్మా మాట్లాడుతూనే ఉన్నాము. మధ్యలో రెండు మూడు సార్లు లేచి, లేచినప్పుడల్లా, గొణిగి, గొణుగుడు అయిన తరువాత కాండ్రించి ఉమ్మి, ముసుగు పెట్టుకొని పడుకొంది మా ఆవిడ.
"చాలాకాలం నుండి నిన్నో సంగతి అడగాలనుకొంటున్నాను..నాగమణి నీ కేమవుతుంది?' అన్నాను.
మంగమ్మ చాలా తెలివిగా ఎదురు ప్రశ్న వేసింది, "మీరేమనుకుంటున్నారు?" అని.
"నే నేమీ అనుకోలేదు", అన్నాను.
ఏమనుకోవచ్చునో చెప్పింది? అన్నది
" బూ ననుకుంటారు."
మంగమ్మ కాస్సేపు మాట్లాడలేదు.
ఆ నిశ్శబ్దాన్ని నేను భరించ లేకపోయాను. నిద్రా?
'కాదు ఈ రాత్రి నాకు నిద్రపట్ట దనుకొంటాను' అన్నది మంగమ్మ మంచం మీద లేచికూచుంటూ "ఏమిటో మాష్టారూ! నా అంత దిక్కుమాలిన ముండను నేనే గానీ, మరొక రుంటారనుకోను. నాగమణి నా కేమవుతుందో నాకే తెలీదు. కానీ తల్లినని చెప్పుకుంటుంది."
"మీ అమ్మకాదా?"
మంగమ్మ బాధను అణచుకుంటూ నవ్వింది.
"మీరేమన్నా డబ్బిచ్చారా?' అన్నది మంగమ్మ. నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.
"ఇచ్చాను"
మంగమ్మ కాస్సేపు తల వంచుకొని నేలమీద, బొటనవేలితో గీతలు గీస్తూ కూచుంది.
"ఎప్పుడిస్తానన్నదండి?"
బాకీని తీర్చే విధానం గురించి, నాగమణితో అన్న మాటలన్నీ జ్ఞాపకానికొచ్చాయి. నేనున్నాను, పిల్లవుంది, ఎలాగైనా మీ బాకీ తీర్చుకుంటానుగా. అన్నమాటలు అప్పటి నాగమణి ప్రవర్తన స్మృతిపధంలో మెదిలి శరీరం గరిపొడిచింది.
"మీరు చెప్పక పోయినా నాకు తెలుసు. నాదగ్గరదాచకండి నన్ను ఆశచూపించి మీ నుండి డబ్బు గుంజింది కదండి?" అన్నది మంగమ్మ.
నా ప్రాణం విల విల లాడిపోయింది. ఈ మాటలు మా ఆవిడ విన్నదేమోనని నాభయం! నేను నాగమణికి డబ్బిచ్చిన సంగతి ఇంట్లో తెలీదు. ఎరువులకోసమని డబ్బడిగి పుచ్చుకొన్నాను. అదృష్టవశాత్తూ ఆవిడకీ మాటలేమీ వినిపించలేదు, బ్రతికిపొయ్యాను.
"లేదు నేనేమీ ఇవ్వలేదు. కాని డబ్బు కావాలని రెండు మూడు రోజులు నా ప్రాణం తీసింది,. నాదగ్గరలేదని తెగేసిచెప్పాను" అన్నాను.
"మీ అంత అనుభవం నాకు లేకపోయినా నాగమణిని గురించి నాకు తెలినంతగా మీ కెవ్వరికీ తెలియదని మాత్రం ఖచ్చితంగా, చెప్పగలను. మా అమ్మకు డబ్బే ప్రధానం, డబ్బుకోసం ఏం చెయ్యడానికయినా రెడీయే! మీరు డబ్బిచ్చినట్టు నాతో అనలేదు గానీ ఇచ్చారని నాకు గట్టినమ్మకం ఉంది. మీరు బుకాయించకండి మేస్టారూ! మీతో చనువుగా వుండమని చెప్పినట్లు చెయ్యమనీ ఏమడిగినా 'కాదు' అనొద్దని చెప్పింది. నిన్న రామచంద్రంగారొచ్చారు. అమ్మతో ఏదో మాట్లాడారు. మధ్యాహ్నం నన్ను కారెక్కిస్తున్నప్పుడు రామచంద్రంగారింటి దగ్గర పడుకోమని చెప్పింది. అంతకముందొకసారి ఎవరో పెదరామయ్యగారట -ఈవూరేనటగా ఆయన్ని ఉబకేసింది. ఆయనకి డబ్బంటే లక్ష్యం లేదంది. నేనంటే ఆ పెదరామయ్యగారికి చాలా యిష్టమట. నేనెవరితోనన్నా మాట్లాడానంటే 'ఉన్నవాదేనా?' అంటుంది. ఇంతకన్న మా అమ్మనుగురించి ఏం చెప్పమంటారు?" అన్నది మంగమ్మ.
ఆరోజును నేనెప్పుడూ మర్చిపోలేను. మంగమ్మ ఎటువంటి దుర్బర పరిస్థితుల్లో జీవిస్తోందో తెలిశాక, నాకసలు జీవితంమీదనే అసహ్యమేసింది. మంగమ్మనెలాగైనా ఆ వాతావరణం నుండి తప్పించాలనుకొన్నాను. కాని ఏమిచెయ్యాలో తోచిందికాదు. నేనే రామచంద్రాన్ని సలహా అడిగాను. వాడు నె చెప్పింది థా విని, వికలంగా నవ్వేశాడు.
'మొత్తానికి వలలో బాగా చిక్కడిపోయావురా బావా! నాటకాల్లో తిరిగేదానిమాటలు నమ్ముకొని, నువ్వు కొంపా గోడీ వదిలి దాంతో ఊరేగుతానంటున్నావంటే నిన్నేమనాలో బోధపడ్డంలేదు. దాన్ని నువ్వుద్దరించేదేమిటి? మనలాంటి సన్యాసుల్ని వందమందిని ఆవిడే ఉద్దరిస్తుంది. నీకంత మోజుగావుంటే, ఇంత డబ్బు ముఖాన పడేయ్! చక్కా అనుభవించు, అంతేగాని దిక్కు మాలిన ఆలోచనలు చేశావంటే మక్కెలిరగదంతాను జాగ్రత్త.'
ఎంతో సదుద్దేశంతో ప్రారంభమైన మా సమాజం, చివరికీ దశకు చేరుకున్నందుకు నాకే ఆశ్చర్య మనిపించింది. దీనిక్కారణాలు కూడా నేను కనిపెట్టాను. నాటకరంగం ఇచ్చే వాతావరణాన్ని కాముక స్థాయిలోకి దిగజార్చడంవల్లనే ఇటువంటి అనర్ధకాలు దాపరిస్తున్నాయి. మా సమాజంలో ఈతరహా సంఘటనలు జరగకుండా చూడటం చాలా అవసరమనిపించింది. అయితే మనుషుల్ని ఇనపగొలుసులతో బంధించలేము. అత్యాచారాలు జరిగినా, సాధ్యమైనంత తక్కువగా జరగడానికి నేను సూచించిన నిబంధనలు తోడ్పడ్డాయి.
చచ్చీ చెడీ శాయశక్తులా వున్నపళంగా, అనుకొన్న వేళకు నాటకం వేశాము. మేమాశించిందాని కన్నా అద్భుతమైన విజయం మాకు లభించింది. రామచంద్రం, కృష్ణమూర్తి, అద్భుతమైన పబ్లిసిటీ ఇచ్చారు. మంగమ్మను 'నూతన తారగా' వర్ణించారు. చుట్టుప్రక్కల పది పదిహేను గ్రామాలనుండి కూడా, జనం, నాటకం చూడ్డానికి వచ్చారు.
అసలు 'పస'కన్నా ప్రచారం ఎక్కువ ఉండడంవల్ల, కలిగే ప్రయోజనమేమిటో తొలిసారిగా నా కనుభవంలో కొచ్చింది. రామచంద్రం, మంగమ్మ ఎన్నడూ లేనంత ఉద్వేగంగా నటించారు వేషంలో వున్న మంగమ్మను చూసి జనం దిమ్మతిరిగి పోయారనడం అబద్దంకాదు. హీరో తండ్రినిపట్టుకొని మంగమ్మ దులిపేసిన ఘట్టంలో హాలు హాలంతా కరతాళ ధ్వనులతో బద్దలై పోతుందేమో ననిపించింది. నాటకం అయిపోయిన తరువాతకూడా, జనం హాలును వదల్లేదు. కొంతమంది మంగమ్మను స్టేజీమీదికి తీసుకు రమ్మన్నారు కూడా.