పాకుడు రాళ్ళు
(మాధవరావు చెప్పిన కధ)
ఇది మంజరికధ కాదు. నాసొంత గొడవ. మీకు పత్రికలూ చదివే అలవాటున్నదా? పదిహేను సంవత్సరాలక్రిందట నవ్యాంధ్ర కళామండలిని గురించి పత్రికల్లో చదివేవుంటారు. బహుశామీకు జ్ఞాపకం వుండదనుకుంటాను. రేపెప్పుడన్నా ఏ మహానుభావుడన్నా అవతరించి ఆంధ్ర నాటకరంగ క్రమాను గతాభివృద్దిని గురించి వ్యాసం వ్రాయడమే జరిగితే అందులో నవ్యాంధ్రకలా మండలిని గురించి తప్పకుండా పేర్కొనితీరాలి. ఎందుకంటే, అటు పాత కాలపు నాటకాలకు ఇటు కొత్తరకం నాటకాలకు, మధ్య సమయంలో ఈ మండలి అవతరించింది, పాతనాటకాలమీద జనానికి మోజు తగ్గిపోయింది. కొత్తనాటకాలంటే నమ్మకం కుదరలేదు. అదీపరిస్థితి!
నాకేమో నాటకాలంటే ఆపేక్ష ఉన్నమాట నిజమే! ఎంత కాలమని శ్రీ కృష్ణ రాయబారం, పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం, సారంగధర, ఆడుకుంటూ కూచోవడం! ఈ నాటకాలు మాకన్నా బ్రహ్మాండంగా ఆడుతున్న సమాజాలు చాలా ఉన్నాయి. వాళ్లని కాదని మానాటకాలు చూడ్డానికి జనం రాలేదంటే, అది అక్షరాలా మాతప్పే!
మా ఊళ్ళో ఉన్న కవిని పట్టుకొని కొత్తనాటకం ఒకటి రాసి పెట్టమన్నాం. అతగాడేమో, నావల్లకాదన్నాడు. నాటకం రాయడం అంత కష్టం కాదని ప్రయత్నిస్తే రాయగలవనీ, అతనికి నచ్చచెప్పాం. అప్పటికి 'సరే' అన్నాడు గానీ, చివరకు వేసినగొంగడి మాత్రం కదలలేదు.
'అది గాదురా అబ్బిగా! కధ మేమే యిచ్చాం గదా! ఒక కధానాయకుడు, కధానాయకి ఉండాలి. వీరిద్దరి కులాలు వేరు వేరు. కధానాయకుడు, భూస్వామి కొడుకు. ఆ భూస్వామి పరమనీచుడు. జీతగాళ్ళను అస్తమానం దోచుకు తింటూవుంటాడు. వారి శ్రమను పీల్చుకుని మేడలు కట్టేసిన బాపతు. దొంగ లెక్కలు రాయడంలో మేటి. కూలీలకు సరిగ్గా డబ్బివ్వడు. అతనిభార్య మహాలక్ష్మిలాంటిది. బ్రాహ్మలయందు భక్తినీ పేదలయందు ఆదరాభిమానములున్నూ కలిగిన మహాసాధ్వి. భర్తమాటను కాదని ఎరుగని ఇల్లాలు. ఆమెకు వెంకటేశ్వరస్వామి వారి దయవల్ల ఒక్కడంటే ఒక్కడే కొడుకు పుడతాడు. వాడే మనకధానాయకుడు. చిన్నతనం నుండీ మనవాడు మాంఛి తెలివైనవాడు. చకచకా పై చదువులలో కొచ్చేస్తాడు. ఒక రోజున పట్నంనుండి ఇంటి కొస్తూ వొస్తూ, పొలాలమధ్య, నెత్తి మీద దుత్త పెట్టుకొస్తున్న ఓ అమ్మాయిని చూస్తాడు. ఈ అమ్మాయియే కధానాయిక. ఇది మొదటి అంకం. ముందు ఇంతవరకూ డైలాగ్స్ పడేయ్. ఆతరువాత సంగతి చూసుకుందాం' అని సలహా యిచ్చాను కవికి.
ఇద్దరం కూచుని నాలుగు రోజులపాటు తంటాలుపడి, ఇంత వరకూ సంభాషణలు రాసిపారేశాం. తెరయెత్తగానే, కధానాయకుని తండ్రి, పెట్టిబూర్జువా వేషంలో, అటూఇటూ కోపంగా తిరుగుతుంటాడు. మీసాలు మెలేస్తూ ఉంటాడు. మధ్య మధ్య సైడ్ వింగ్ లోకి చూస్తూ కోపంగా మాట్లాడుతుంటాడు. క్రమంగా నలుగురైదుగురు కూలీలు రావడం, వాళ్ళు కూలీ అడగడం, మనవాడు దొంగ లెక్కలు చూపడం, వాళ్ళు కాదనడం, నానా గొడవ జరగడం, కోపంతో మనవాడు, తెరలోపలికి వెళ్ళగానే అటునించి కధానాయకుడి తల్లి, మహాసాధ్వి రావడం, కూలీలందరూ, 'భూదేవి, లక్ష్మి, శాంతమ్మ, బంగారుతల్లి, అంటూ దణ్ణాలు పెట్టడం,' కులాల మాటలనే మనస్సాక్షిగా నమ్మి, వారికి రావలసిన దాని ప్రకారం కూలిడబ్బులిచ్చి పంపేయడం ఆఖర్న 'అబ్బాయింకా రాలేదే' అనడంతో తెరపడుతుంది.
రెండవ రంగంలో, కధానాయకుడు, వాసు, కధానాయిక సుమతి దోవలో ఎదురౌతారు. ఆ పిల్లను చూసి చూడడంతోనే వాసు ప్రేమించేస్తాడు. బూర్జువా కుర్రవాడు అంతపనిచేశాక, నేనుమాత్రం ఊరుకుంటానా అన్న ధోరణిలో సుమతి, అంతకు రెండింత లెక్కువగా ప్రేమించేస్తుంది. ఆ పిల్ల, ఆపిల్లవాడికి సూట్ కేస్ అందిస్తుంది. ఆపిల్ల వాడు ఆ పిల్ల నెత్తిన దుత్తపెడతాడు. ఆ చిన్నవాడటూ, ఈ చిన్నదిటూ వెళ్ళిపోతారు. కర్టెన్ డౌన్!
'అంతవరకూ భేషుగ్గానే ఉందనుకోవోయ్! ఆ తరువాత కధనేం చేసేటట్టూ?" అన్నాడు మాకవి.
"ఇంకా ఏంచెయ్యడ మేమిటి? తండ్రి కొడుకులమధ్య వచ్చే సీనులో ఘర్షణ తీసుకురావాలి. తండ్రి యాభైవేల కట్నం, పాతికెకరాల మాగాణి, ఓ మోటారుకారు అదనంగా ఇంకోమోటారు సైకిలూ - కాక - పై చదువులకు ఇంగ్లండు పంపించే ఏర్పాటు మీద వో సంబంధం మాట్లాడుకొచ్సాడు. వాసు వొప్పుకోడు; తన హృదయం ఏనాడో ఇంకొకరికిచ్చేశా నంటాడు. ఇచ్చిందాన్ని తీసుకోవడం తనవల్లకాదంటాడు. లౌక్యం తెలిసిన తండ్రి, అప్పటి కూరుకొని, ఆ తరువాత వేగుమనుషుల్ని పెట్టి, అసలుసంగతి కూపీతీయిస్తాడు. సుమతి దీనికి ప్రధాన కారకురాలని తేలిపోయింది. సుమతి తండ్రి తనకు ఆరువందలు బాకీ ఉన్నాడు. అదిప్పుడు కట్టమని వాసు తండ్రి నిక్కచ్చి చేశాడు. ఈలోగా అతను ఇంకో కూలీ భారయ్ను తప్పుడుమాటలనడంతో కూలీలందరూ సమ్మెచేస్తారు. ఆ సమ్మెకు వాసు నాయకుడు. వాసు తండ్రి బస్తీనుంచి గూండాలను పిలిపించుకొచ్చాడు వాళ్ళు గ్రామాన్నంతా అల్లకల్లోలం చేస్తూ ఉంటారు. ప్రజలందరూ వాసు తండ్రికి వ్యతిరేకంగా, ఐక్యంగా నిలబడతారు, కర్రవెళ్ళి గొడ్డలితో చేరడంతో వాసు తండ్రి చేయగలిగిందేమీ లేక పోయింది. చివరికి వాసుకూ, సుమతికి, పెళ్లవడంతో నాటకం క్లోజ్.
రాత పనులు పూర్తయ్యేసరికే రెండుమాసాలు పట్టింది. ఆ తరువాత ఊళ్ళో ఉన్న కుర్రకారుని పోగేసి నాటకం చదివి వినిపించాను. అందరూ బాగానే వుందన్నారు. కాని నాకు మాత్రం సంతృప్తికరంగా లేదు. ఎందుకంటే, నాటకమయ్యేలోగా ఎనిమిది సార్లు తెర పడుతుంది. ఇన్ని రంగాలుండకూడదని నా ఉద్దేశ్యం! కొన్ని కొన్ని సీన్లు, పావుగంటను మించి ఉండవు. అటువంటివి వెంట వెంటనే మూడు సీన్లున్నాయి. ప్రతి పావుగంటకూ తెరపడి లేస్తూవుంటే, చూసేవాడి ప్రాణం విలవిల లాడిపోదా మరి! అదీగాక, మూడు గంటలసేపు నడిచే నాటకంలో, ఒక్క పద్యంలేదు, కనీసం ఒక్క పాత కూడాలేదు. వందపద్యాలకు ఒక్కటి తక్కువైనా వొప్పుకొని ప్రేక్షకుల ముందుకు, అసలు పద్యమనేదేలేని నాటకంతీసుకెడితే చూస్తారా?
ఈసారి నేను కూచుని నాటకాన్నంతా తిరగరాశాను. మళ్ళా కొత్తనాటకం రాసినంత పనయింది! మొత్తం నాటకాన్ని నాలుగు సీన్లలోకి కుదించాను. తెరపడి, తిరిగి లేవడానికి మధ్యకాలంలో, అయిదారు నిముషాలకన్నా వ్యవధి ఉండకుండా చూశాను. అంటే - రంగస్థలంలో పెద్దమార్పులంటూ ఏమీ ఉండకూడదన్నమాట!
కవిని పట్టుకొని పది పద్యాలూ నాలుగుపాటలూ రాయించాను. మావాళ్ళందర్నీ పిలిచి, మరోసారివినిపించాను, 'బ్రహ్మాండం' అన్నారందరూ.
మొదటి నాతకమూ బాగుంది, ఇదీ బాగుందే పక్షంలో, మా సమాజానికి అసలు 'బాగు' అంటే ఏమిటో తెలియదేమోననిపించింది. ఏమైనా ఉన్న మనుషులు వీరు నాటకాలాడదలచుకుంటే వీరితో ఆడాలి లేదా మానుకోవాలి. మరోదారి లేనే లేదు.
ఇంతవరకూ జరిగింది వొకెత్తు; ఇకముందు జరగవలసినది మరోఎత్తు. అంతకుముందు, మాలో ఎవరికీ నాటకానుభవం లేనేలేదు. అధవా ఉండటమంటూ జరిగితే -అంతో ఇంతో నాకేఉంది. సూర్య నారాయణ మేష్టారి దగ్గర చదువుకునేటప్పుడు 'భక్త శ్రీయాళ' - "సతీ అనసూయ" - " ధృవవిజయం" - "రామవనవాసం" వగైరా నాటకాలను ఆడినమాట నిజమే! ఎప్పుడో పదిహేనేళ్ళ క్రిందట ఆడిన నాటకాల తాలూక జ్ఞాపకాలు కూడా నాకంతగా ఉపయోగ పడలేదు.
ఆ రోజుల్లో రంగులక్కూడా దగ్గర డబ్బులుండేవికావు. కాకిచిప్పలు కాల్చి, వేడివేడిగా ఉన్నప్పుడే నీళ్ళుచల్లి, మెత్తగా నూరేవాళ్ళం. ఆ చూర్ణాన్ని వాజ్ లైన్ లో గానీ, కొబ్బరినూనెలో గానీ కలిపి ముఖాలకు పూసుకునేవాళ్ళం. వెంకట్రామయ్య మాకు మేకప్ చేసేవాడు. విగ్గులనుకూడా మేమే తయారుచేసుకొన్నాం. జనపనారను సన్నగా పాయలు పాయలుగా తీసి, సిరాలో ముంచి ఎండబెట్టి, ఆపీచుల్నే మలిచి, విగ్గుల కింద మార్చుకొనేవాళ్ళం. తెరలకు బదులు, దుప్పట్లు వాడేవాళ్ళం! ఊళ్ళో ఉన్న ఒకేవొక పెట్రో మాక్సు లైటును తెచ్చుకొనే వాళ్ళం! ఏదో అయిందనిపించి, చూసే వాళ్ళచేత, మెప్పులుకూడా పుచ్చు కొనేవాళ్ళం!
కానీ అవన్నీ ఇపోపుదేలా కుదురుతాయి. ఆ అనుభవాలు ఈ నాటక ప్రదర్శనలో ఎందుకూ పనికిరావని, నాకు బాగా తెలుసు. కాకపోతే, ఆ విధంగా నాటకాలాడవలసిన పరిస్థితే కలిగితే అంతకన్నా మానుకోవడమే ఉత్తమం! నాటకం ఆడితే బ్రహ్మాండంగా ఆడాలి. లేదా తోకముడుచుక్కూచోవాలి! అంతే!!
"ఇంతా చేసి, ఇప్పుడిలా నీళ్ళుకారి పోవడం నాకేమీ బావుండలేదు. మనకేం కావాలో నువ్వుచెప్పు. వాటిని సాధించడం నాకు విడిచిపెట్టు" అన్నాడు రామచంద్రం.
వాడు మాట జారడేగానీ, అన్న తరువాత నిలబెట్టుకొంటాడని నాకు తెలుసు.
"చిన్నికన్నడూ! నాటకం అద్భుతంగా తయారయింది. పేరు కూడా పెట్టేశాను."
"ఏం పేరు?" అన్నాడు రామచంద్రం.
"ప్రజావిజయం" - మరింక నువ్వు పేచీపెట్టకు. అన్ని సంగతులూ, ఆలోచిన్చాకనే ఈ పేరు ఖాయం చేశాను" అన్నాడు.
"అయితే ఇంకేంరా! నాటకం ఎప్పుడేద్దామంటావ్? ఓ నెల రోజులు ముందునుండి మాంఛి పబ్లిసిటీ ఇవ్వాలి. గుంటూర్లో నాకు తెలిసిన ప్రెస్సొకటి ఉంది. వాళ్ళనడిగి నోటీసులు కొట్టించేస్తాను. మనవాళ్ళందర్నీ వెంటేసుకొని, చుట్టుప్రక్కల ఊళ్ళలో తడికలు కట్టిస్తాను. గోడలమీద రాయిస్తాను. సరా?" అన్నాడు వాడు చిటికెలు వేస్తూ.వాడి తొందరపాటు చూస్తుంటే నాటకం, మరో పదిరోజుల్లో ఆడకపోతే, ప్రాణాలు తినేస్తాడేమో ననిపించింది.
"అదికాదురా నీబండ పద! ఇంతవరకూ మనం, పోర్షన్లు రాసుకోవడమే కాలేదు. ఈ పని కావడానికి ముందు, ఎవరెవరు, ఏ మేం వేషాలు వేయాలో అనుకోవాలి. అధమపక్షం పాతికముప్పయ్ రిహార్సల్సయినా పడాలి. ఇవన్నీ ముందు సక్రమంగా జరగాలిగదా!" అన్నాను.
వాడూ 'జరగవలసిందే' నని వొప్పుకున్నాడు. ఈ రాత్రే అందరం కలుసుకొందామనీ, ఎవరెవరు ఏం చదవాల్సిందే నిర్ణయిద్దామనీ వాడన్నాడు. ఎవరింట్లో కలుసుకొందామన్నాను. వాడు కాస్సేపు ఆలోచించి 'బళ్ళో కలుసుకొందా'మన్నాడు. నాకూ ఆ సూచన బాగానే నచ్చింది. నెలరోజులపాటు ఏకధాటిగా జరిగే రిహార్సల్సకు బడికన్నా అనువైన చోటులేదు.
ఓ గంట అటూ ఇటుగా అందరూ వచ్చారు. అనవసరమే అయినా, నాటకంలోని పాత్రల్ని వోసారిచెప్పి, ఎవరెవరు ఏ యే వేషాలు వేస్తే బావుంటుందో తేల్చండన్నాను. రభస మెల్లగా ప్రారంభమయింది. ఉన్న పదిమందికి మంచి వేషాలే కావలసివచ్చాయి. చిల్లర వేషాలకు మనుషులే దొరకలేదు.
"అబ్బాయిలూ! ఇలా అయితే మనం వొక్కనాటికి నాటకం ఆడలేం. మనందరి ఉద్దేశమూ, నాటకం బాగా ఉండటమేగానీ, ఏ వెంకయ్యో, పుల్లయ్యో గ్రాండ్ గా నటించటంకాదు. నాటకం బాగా ఆడేందుకు -అందులో ఉన్నవారందరూ కలిసికట్టుగా పనిచెయ్యాలి. ఎవరిదారినవారు పెదాలాడితే, నాటకం - కుక్కలు చింపిన విస్తరి లాగా తయారవుతుంది! ఆ తరువాత మీ యిష్టం!" అన్నాను.
తెగిందాకా వురిపెట్టడం మంచిది కాదనుకొన్నారో ఏమో ఇష్టమున్నా లేకపోయినా, అందరూ మెదలకుండా వూరుకున్నారు. ఇప్పుడు వేషాలు పంచవలసిన బాధ్యత నామీద పడింది! ఇలాంటి సందర్భాల్లో బరువంతా ఏ వొక్కడి నెత్తినో ఉండటం మంచిదికాదని నాకు తెలుసు, అందుకని నేను రామచంద్రాన్ని గూడా సాయం తీసుకొన్నాను.
వాసుగా కోటేశ్వరరావు, వాసు తండ్రిగా నేను, సుమతిగా రామచంద్రం, సుమతి తండ్రిగా నాగభూషణం, వాసు తల్లిగా నరసింహారావు చదవాలనుకొన్నాం. శ్రీరాములు హార్మోనిస్టుగా పనిచేస్తానన్నాడు. నన్ను డైరెక్టు చెయ్యమన్నారు. వారంరోజుల్లోగా పోర్షన్లు రాసుకోవడమే కాకుండా కంఠతాకూడా రావాలన్నాను. వచ్చే బుధవారం నుండి, ప్రతిరోజూ రిహార్సల్స్ వుంటాయనీ,. ఏ పరిస్థితిలోనూ, వాటిని దాటేయడానికి చూడకూడదనీ అనుకున్నాం. అందరం సరేనంటే సరేననుకొన్నాం! అప్పటికో గండం గడిచింది!
"నాటకం గొప్పగా వెయ్యొచ్చురా బ్రదర్! నేను చెబుతున్నాను చూడు! వేలు కురుస్తాయనుకో?" అన్నాడు రామచంద్ర.
"నీ నోటి చలవవలన అంతపనీ జరగాల్నే గానీ -మన సూరిగాడికి తప్పకుండా ఏమన్నా ముట్టచెబుదాం. వాడిచేత నాటకం రాయించుకున్నాం. చిల్లికానీ ఇవ్వలేదు. వాడైనా అడిగిన పాపాన పోలేదనుకో. నాలుగు డబ్బులొస్తే -నిన్ను అన్యాయం చెయ్యను రా బాబిగా" అని చేపపా. "సరే" అన్నాడు. మనమెంత గింజుకు చచ్చినా, నాటకంలో పసలేకపోతే ఇట్టే నీళ్ళు కారిపోతుంది. ఏమంటావ్? అన్నాను.
వాడేమీ అనలేదు.
"ప్రజా విజయం" రిహార్సల్స్ అనుకొన్న రోజునకాకుండా మూడో రోజున మొదలయ్యాయి. సరిగ్గా పోర్షన్లు రాకపోవడంవల్లా వచ్చిన వారికైనా, ఏ డైలాగ్ తరువాత ఏ డైలాగ్ అనాలో తెలియక పోవడంవల్లా, ఒక్క సీనన్నా జరగలేదు. పోర్షన్లు రానివాళ్ళమీద రామచంద్రం కేకలేశాడు.
"అనుకొన్న పన్లు అనుకొన్నట్టుగా ఠంఛన్ గా జరగాలోయ్ వారంరోజులకల్లా పోర్షన్లు రావాలంటే, వచ్చి తీరాల్సిందే. అంత కచ్చితంగా ఉంటే తప్పపన్లుకావు" అన్నాడు రామచంద్రం.
కోటేశ్వరరావుకి మన వాడిధోరణి నచ్చినట్లుగాలేదు.
"నీకంటే -సంపాయించి పెట్టే బాబుగాడొకడున్నాడు గనక గడుస్తుంది. మరి మాసంగతేమిటి? పగలల్లా ఏదో పనిచేసుకోవాలి నాటకాలాడటమే మనవృత్తి కాదుగా!" అన్నాడు వాడు.
"ఇక ముందెప్పుడో, ఏదో వొరుగుతుందని, ఇప్పణ్నించే మాడిచావడం నావల్ల కాదు, పోర్షన్లు వొచ్చిన్నాటికే వస్తుంది. నన్ను సతాయిస్తే లాభంలేదు. మీకిష్టం లేకపోతే, నన్ను తొలగించండి అన్నాడు కోటేశ్వరరావు."
"నీముష్టి బెదిరింపులకిక్కడ జడుసుకొనేవాళ్ళెవరూ లేరు. నువ్వు లేకపోయినా నాటకం పడుతుంది. బహుశా గొప్పగా కూడా ఉంటుందేమో! నీలాంటి తోకపీకుడుగాళ్ళ వల్ల ఎప్పుడూ ప్రమాదమే అన్నాడు రామచంద్రం."
కోటేశ్వర్రావు పోవడానికి లేచాడు. నేను సర్దిచెప్పినా ఉపయోగం లేకపోయింది. కోటికాస్త మెత్తబడేవేళకు చంద్రంగారు పెట్రేగిపోవడం సాగించాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరుండాలి తప్ప, ఇద్దరూ సమాజంలో ఉండటం సాధ్యంకాదని, నాకప్పుడు అనిపించింది. కోటిని వొదులుకొని, రామచంద్రాన్ని సమాజంలో వుండమన్నాను. ఆరోజున నేను తీసుకొన్న ఈ నిర్ణయంవల్ల భవిష్యత్తులో ఊహాతీతమైన మార్పులు జరుగుతాయని ఎవ్వరూ అనుకోలేదు. నేను అనుకోలేదు. పదేళ్ళ తరువాత నేనూ కోటి గుంటూర్లో "దేవకన్య" సినిమా చూస్తున్నప్పుడు ఈమాటే అనుకొన్నాం!
ఈ గొడవ ఇంతటితో ఆగిపోలేదు. కోటేశ్వరరావు, ఆక్షణం నుండే మా సమాజంమీద కత్తికట్టాడు. మాకు పోటీగా ఇంకో సమాజాన్ని ఏర్పాటు చేశాడు. దానికి వాడే డైరెక్టరు. గుంటూరు వెళ్ళి పాతిక నాటకాలు కొనుక్కొచ్చాట్ట. వారంరోజుల పాటు వాటి నన్నింటిని చదివాట్ట. అందులోంచి మాంఛి నాటకాన్నొకదాన్ని ఎన్నిక చేసి, పోర్షన్లుకూడా తనేరాసి సిద్దంగా ఉంచాట్ట. ఈ సంగతులన్నీ ఎప్పటి కప్పుడు మాకు తెలుస్తూనే ఉన్నయ్. అయినా వాణ్ణి ఆపటానికి నేను ప్రయత్నం చేయలేదు.
"ఇప్పుడేమంటావురా?" అన్నాను రామచంద్రంతో.
"వాడు నాటకం వేసినప్పుడు చూస్తాను. వాడి ముఖంకాదూ! వాడేమిటి? నాటకం వేయడమేమిట్రా" అన్నాడు రామచంద్రం.
కోటేశ్వరరావు నాటకంవేయడంలేడన్న అనుమానం -అనుమానమేమిటి గట్టినమ్మకమే - రామచంద్రానికి ఎందుక్కలిగిందో నాకైతే తెలీదు. వాడా నమ్మకంలో ఉంటుండగానే జరగవలసిన పనులన్నీ జరుగుతున్నాయి. కోటిగాడి సమాజంవాళ్ళు జోరుగా రిహార్సల్స్ వేస్తున్నారనికూడా నాకు తెలిసింది! సంక్రాంతినాటికి, ఆరునూరైనా నూరు ఆరైనా సరే నాటకం వేసితీరతా మన్నట్టు కూడా నాకు తెలిసింది. పనీ పాటా మానేసి వాడీ పనిలోనే ఉంటున్నాడన్నారు.
"దీన్ని బట్టి చూస్తే వాడెంత తుచ్చుడో తెలిసిపోవడంలేదా? పోర్షను రాలేదేమని అడిగితే అలా సమాధానం చెప్పినపక్షిగాడు, ఇప్పుడీపనంతా ఎలా చేస్తున్నాట్ట?" అన్నాడు రామచంద్రం.
"అదామనకిప్పుడు ముఖ్య విషయం?" దీన్ని చర్చిస్తూకూచుంటే పుణ్యకాలం కాస్తా దాటిపోతుంది. మనం వాడికన్నా ముందుగా నాటకం ఆడాలి. ఇప్పటికే మన సమాజంలోంచి ముగ్గురు జారుకున్నారు. మరో వారంరోజులాగితే, ఉన్ననలుగురూ పోతారు. అప్పుడు నువ్వూ నేనూతప్ప మిగిలే దెవరూ ఉండరు!" అని విసుక్కొన్నాను రామచంద్రం మీద.
అప్పటికి గాని వాడికి వేడిపుట్టలేదు. జారిపోయిన వాళ్ళను తిరిగి లాక్కొచ్చాడు. తను హీరో వేషం వేస్తానన్నాడు. హీరోయిన్ గా గుంటూరునించి ఎవర్నన్నా కొట్టుకొద్దామన్నాడు. అవసరమైతే, తను నాలుగైదొందలు పెట్టుకుంటానన్నాడు. బ్రహ్మాండం తలక్రిందులైనా సరే - ఇది జరిగి తీరుతుందన్నాడు.
రామచంద్రం మాటలపోగుకాదని నాకు తెలుసు. వాడు అన్న మాటను అక్షరాలా నిలబెట్టుకున్నాడు.
మేము గుంటూరునించి ఓ అమ్మాయిని తీసుకురావటానికి నిశ్చయించు కొన్నామన్న సంగతి కోటి ముఠాకు తెలిసింది. వాళ్ళూ ఇంకో అమ్మాయిని తీసుకొస్తామన్నారు. కానీ ఆపని జరగలేదు. ఆ సమాజానికి డబ్బులేదు. మాకుంది. ఉన్నదంటే రామచంద్రంగాడిచ్చాడు. కోటి ముఠామీద కోపమే లేకపోతే, వాడినించి పైసా రాలడానికి నల్లమేక తెగాల్సిందే!
ఓ రోజు సాయంత్రం ఆరు గంటలకు రామచంద్రం, మాయింటి కొచ్చాడు. వాడివెనకాల పదిహేను, పదహారేళ్ళమ్మాయొకటున్నది. ఆపిల్లకు వెనగ్గా నలభై ఏళ్ళ 'అమ్మాయి' ఇంకోతున్నది.
"మంగమ్మారా!" అంటూ ఆ పిల్లను చిన్న పిల్లను పరిచయం చేశాడు రామచంద్రం. "ఈవిడ నాగమణి -బళ్ళారి రాఘవాచారి ట్రూపులో పనిచేసిందట, ప్రస్తుతం గుంటూర్లో ఉంటుంది. మంగమ్మకు -"
మంగమ్మ "నమస్తే" అన్నది. నాగమణి "నమస్తే" అనడమే కాకుండా, ఆ కాసేపట్లోనూ, ఓ లవ్ సీనులో నాయికి చేసినంత అభినయం చేసింది. అయిదారుసార్లు. కళ్ళు టపటపలాడించి, రెండు మూడు సార్లు పమిటెను విదిలించివేసుకొని మరో రెండుసార్లు కుచ్చెళ్లు దులుపుకొని - అప్పుడు తీరిగ్గా నవ్వింది.
"సోడా దొరుకుతుందా బాబూ!" అన్నది నాగమణి.