సెల్ తీసి తన ప్రాణ స్నేహితుడైన బాబ్జీకి ఫోన్ చేశాడు... బాబ్జీ అప్పటికే నిద్రలోకి జారిపోయాడేమో సుమారు ఆరు రింగుల తరువాత మత్తుగా పలికాడు."హల్లో" అంటూ...."బాబ్జీ నేను ఆదిత్య ని...పాపని తీసుకోస్తున్నాను.... నువ్వు రెడీగా ఉండు....నాతొ గుంటూరు రావాలి."
"ఇప్పుడా....?" మత్తు ఎగిరిపోయిందేమో ఆశ్చర్యంగా అడిగాడు బాబ్జీ.
"గుంతూరుకి ఇప్పుడెందుకురా ....?పాప ఉందా నీ దగ్గర....?"
"ఉంది.. నేను వస్తున్నాను.రెడీగా ఉండు.అంతా తరవాత చెప్తాను." సెల్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకోని తిరిగి కారు స్టార్ట్ చేసి వనస్థలి పురం వైపు కారు పోనిచ్చాడు.
అతనిమనసులో రక రకాల ఆలోచనలు, కలగా పులగంగా కదుల్తున్నాయి. పాపని చూస్తుంటే మమతానురాగం ఉప్పెనలా పొంగుతోంది.గట్టిగా గుండెలకి హత్తుకుని కూర్చోవాల నుంది. కానీ, ఇది సమయంకాదు. పాపని చేర్చాల్సిన చోటుకిచేర్చాక భానుప్రియతో ఎంతైనా ఫైట్ చేయచ్చు. ముందు పాపసంగతి చూడాలి.
ఈ పాప నాది. అలా అనుకోగానే అతని గుండె ఉప్పొంగింది.ఈపాపని పెంచి పెద్ద చేసి, పెళ్ళి చేయాలి. పాపకి పది మందిపిల్లలుపుట్టాలి. వారందరినీ తనుసాకాలి....ఆపేద్ద కుటుంబంలో తనూ ఒకడిగా ఉంటూ పెద్ద కుటుంబం లో ఆనందం ఏమిటో అనుభవించాలి.
కారు దిల్ షుక్ నగర్ ఉన్న ఒక కాలనీచేరింది . కాలనీ బస్టాఫ్ లో కారు అపు చేసి బాబ్జీకి మళ్ళీ కాల్ చేశాడు.
బాబ్జీ వెంటనే ఫోన్ తీశాడు. "చెప్పు ఎక్కడి దాకా వచ్చావు...?" అనడిగాడు.
"బస్టాఫ్ లో ఉన్నాను. మీ ఇల్లు నాకు సరిగా గుర్తు లేదు.ఈ చీకటి లో అసలే గుర్తు పట్టలేను...."
"సరేలే అక్కడే ఉండు నేనే వస్తాను..." సెల్ ఆఫ్ అయింది.
స్టీరింగ్ మీద చేతులు పెట్టుకొని హాయిగా నిద్రపోతున్న పాప వైపు చూస్తూ కూర్చున్నాడు.
20 సంవత్సరాలు కూడా నిండని కుర్రాడైన ఆదిత్య కి ఈ పాప నా రక్తం అనుకుంటుంటే ఒళ్ళంతా పులకించి పోతోంది.
అమ్మ ఏమనుకుంటుందో ...తల్లి గుర్తుకు రాగానే ఒక్క క్షణం బాధనిపించింది. తను కనీసం ఆమెకి చెప్పలేదు. తనేక్కుడున్నాడో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. పాపం ఏడుస్తోంది.
మళ్ళీ జాలి స్థానం లో కోపం అవహించింది. బాగైంది ఏం? పాపని మనం పెంచుకుందాం అంటే నోర్ముయ్యరా పిచ్చి వెధవా వెధవ పని చేసింది కాక,ఈ వయసులో పిల్లల తండ్రివై గుమస్తా బతుకు బతుకుతావా...?వెధవ్వేషాలేయకు వాళ్ళిష్టం వచ్చినట్టు చేసుకోని పిల్లని అంది.
ఎంత నిర్దయ! మగాడైన తనకే పాపనిపెంచుకోవాలని ఎంతో ఆశగా ఉందే! పాపాయిని పెంచుకోవాలని తన రక్తం , తన ప్రాణం, తన సర్వస్వం పాప, పుట్టి ఎంతోసేపు కాకపోయినా, ఏడు నెలల నుంచి తహతహలాడి పోతున్నాడు పాపనా, బాబా.....?బాబా......పాపా......అంటూ....
ఇద్దరిద్దరే అటు ప్రఖ్యవాళ్ళ అమ్మ అంతే ... ఇటు మా అమ్మ అంతే . మీ వయసేంటి మీరేంటి మీకు పెళ్ళి కావాలా! పిల్లలు కావాలా! అంటూ తిట్టడాలు. బహుశా ప్రఖ్య కూడా తనకిలాగే పాపాయి మీద ప్రేమ ఉండే ఉంటుంది. వాళ్ళమ్మ కి భయపడి అడాప్షన్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుంది.
ఇస్తారిస్తారు. ఎలా ఇస్తారో చూస్తా.... పాపని తీసుకుని అమ్మమ్మ దగ్గరకి చేర్చాలి. ముందు.చాలా తెలివిగా అమ్మదగ్గరఅమ్మమ్మ వివరాలు లాగాడు. జరగబోయేది అంతా ముందే ఊహించే తానీ ప్లాన్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన పాపని వదులుకొనేది లేదు.
తనకి పిల్లలంటే ఇంత ప్రేమ ఎందుకో అమ్మకి ఎంత చెప్పినా అర్ధం కాదు. అందరూ అందరే. ఎందుకో ఈ ఆడవాళ్ళు ఇలా తయారవుతున్నారు. ప్రఖ్య ని ఎంత బతిమాలాను పెళ్ళి చేసుకుందాం ప్రఖ్యా పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు. నామాట విను అని, కానీ,విన్నదా. కెరియర్ , కెరియర్ అంటూ అబార్షన్ చేయించుకుంటానంది. అది కుదరలేదని పిల్లని కన్నది. దీన్ని తల్లి, తండ్రీ అటు నానమ్మ, ఇటు అమ్మమ్మ బతుకుండగా అనాధ చేయడానికి ఎలా మనసోప్పుతుందో.
ప్రఖ్య తల్లి అదేం తల్లి, ఎవరైనా కూతురు పెళ్ళి కాకుండా తల్లి అయిందంటే భయపడతారు సమాజం కుళ్ళబోడుస్తుందని, ఎలాగోలా పెళ్ళి చేస్తారు కానీ, భానుప్రియ గారు అమ్మే అంటే ఆవిడ కంటే నాలుగాకులు ఎక్కువే చదివింది.ఇద్దరూ ఒక్కటే.... భర్త లను వదిలేసి , ఒంటరిగా పిల్లల్ని చూసుకుంటూ.... ఉద్యోగాలు చేసుకుంటూ స్వేచ్చ, స్వాతంత్ర్యం అంటూ తిరుగుతున్నారు.
అసలు స్వేచ్చ అంటే ఏమిటి...? ఆదిత్య కి అర్ధం కాలేదు. అవును స్వేచ్చ అంటే ఏంటి....?మరోసారి ఈ ప్రశ్న మనసులో వేసుకున్నాడు. బాబ్జీ రాని వాడ్ని అడగాలి....ఆదిత్య అలా అనుకున్నాడో లేదో బాబ్జీ పరుగు పరుగున వస్తూ కనిపించాడు. ఆదిత్య అలర్ట్ అయ్యాడు. స్టీరింగ్ మీద చేతులు సిద్దంగా పట్టుకొని కూర్చున్నాడు. బాబ్జీ వెనక డోర్ తీసుకొని కారులో కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు ఆదిత్య. మూడున్నర గంటల వయసున్న ఆ చిన్న పాపాయిని తీసుకుని అ రాత్రి వేళ అత్యంత ఆత్మ విశ్వాసంతో , మనో బలంతో ఆ ఇరవై ఏళ్ళ కుర్రాడు తనేప్పుడో చూసీ, చూడనట్టు చూసిన ఓ వృద్దురాలిని వెతుక్కుంటూ బయల్దేరిన ఆ క్షణం నల్లని ఆకారంలో నక్షత్రాలన్నీ ఒక్కసారిగా వెలిగి అతనికీ దారిచూపిస్తున్నట్టు మెరుపులు కురిపించాయి. చందమామ దారి నిండా వెన్నెల పరిచాడు.
"ఏంటిరా ఇది....?ఏం చేశావు పాపని ఎత్తుకొచ్చావా....? ఎలా పెంచుతావు...? ఏం చేస్తావు...?నీకు పిచ్చి గాని పట్టిందా...?"
ఆదిత్య నవ్వాడు... "బాబ్జీ, ఈ పాప కోసం ఈ తొమ్మిది నెలలు ....తొమ్మిది యుగాల్లా గడిపాను.... ఆఫ్ కోర్స్ యుగం అంటే ఎన్ని సంవత్సరాలో నాకు తెలియదనుకో.... కానీ ఈ నిరీక్షణ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసుకున్నాను..."
"కరెక్టేరా. కానీ ఎలా పెంచగలవు చెప్పు...? మీ మదర్ కోపరేషన్ లేదు. ప్రఖ్య కోపరేషన్ లేదు. వాళ్ళమ్మ సరేసరి. వాళ్ళెవరో పెంచుకుంటామన్నారు కదా ఇచ్చేస్తే సరిపోయేది అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవాడివి...."
"చట్ట బద్దంగా ఎవరో పెంచుకుంటేనాకీ పాప మీద హక్కులెం ఉండవురా .ఈ చిన్నారి భవిష్యత్తు నా అభిరుచులకు అనుగుణంగా మలచు కుంటాను . ప్రస్తుతం గుంటూరు దగ్గర కారం పూడి లో ఉన్న మా అమ్మమ్మ దగ్గర ఉంచి పెంచుతాను..."
"మీ అమ్మమ్మ నీకెలా తెలుసు...?ఎప్పుడూ చూడలేదన్నావుగా...?"
నవ్వాడు ఆదిత్య...."బాబ్జీ నీకో సంగతి తెలుసా....? ప్రఖ్య కన్సివ్ అయిందని తెలిసిన దగ్గర్నుంచీ నేను పాపని నా దగ్గరకు తెచ్చుకోడానికి పకడ్బందీ యాక్షన్ ప్లాన్ వేసుకున్నాను. మా అమ్మ పెంచదని నాకు తెలుసు. అందుకే అమ్మమ్మ దగ్గరకు బయల్దేరాను. ఒకరోజు అమ్మతో ప్రేమగా మాట్లాడుతూ అమ్మమ్మ ఎక్కడుంటుందీ ....ఏం చేస్తుంది తెలుసుకున్నాను అమ్మమ్మ ఫోటో కూడా సంపాదించా...."
బాబ్జీ మెచ్చుకోలుగా అన్నాడు.... గుడ్ అదీ....చాలా క్లవర్ ఐడియా వేశావు. అది సరే ప్రఖ్యా వాళ్ళమ్మ ఇప్పడు అక్కడ చాలా గొడవ చేస్తుందేమో కదా..."
"ఈ పాటికీ ఆవిడ నా మీద పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చి ఉంటుందని నాకు తెలుసు. పిరికి వాడిలా పారిపోను ఫైట్ చేస్తాను. ముందు దీనికి సెక్యూర్డ్ ప్లేస్ అమ్మమ్మ. అమ్మమ్మ కి పాపాయిని అప్పజెప్పి వాళ్ళ సంగతి చూస్తా..."
"ఎందుకురా ఆడపిల్ల తనే కేర్ నాట్ లా ఉంటె నీకెందుకీ రిస్క్...?"
"బాబ్జీ మీరెంతమంది పిల్లలురా మీ అమ్మా నాన్న లకి..."
"నలుగురం ..." వింతగా చూస్తూ చెప్పాడు.
"కదా....! నీకో అన్న, అక్క, చెల్లి ఇంతమంది ఉన్నారు. అమ్మ, నాన్న వాళ్ళ చుట్టాలు చాలా మంది ఉన్నారు. కానీ , నాకు ఎవరూ లేరు తెలుసు కదా.... నాకూ నీలా పెద్ద కుటుంబం లో ఉండాలని ఉందిరా. ఎలాగూ నాకా అదృష్టం లేదు. కనీసం నా చిట్టి తల్లికైనా పెద్ద కుటుంబం ఏర్పాటు చేయాలి నేను."
"అంటే ఏం చేయాలి?"
"చూస్తా.... ఏం చేయాలో ఆలోచించలేదు. ఎలా చేయాలో ప్లాన్ చేశాను....అవును కానీ, నిన్నో ప్రశ్న అడగనా?"
"ఏం ప్రశ్నేంటి...? అడిగాడు బాబ్జీ.
"స్వేచ్చ అంటే ఏంట్రా....?"
"ఫ్రీడం"....
"నేనడిగింది దాన్ని ఇంగ్లీషు లో ఏమంటారు అని కాదు అసలు స్వేచ్చ అంటే అర్ధం ఏమిటని....?"
"ఏమో ఎందుకిప్పుడు....?"
"దాని కోసమేగా మా అమ్మ, ప్రఖ్య వాళ్ళమ్మ ఇవాళ ప్రఖ్య ఒంటరిగానే బతకాలను కుంటున్నారు. అందుకే దాని నిర్వచనం అందులో వాళ్ళు పొందే సుఖం ఏమిటో తెలుసుకోవాలని ఉంది..."
అలా అంటుండగానే పాప బుల్లి స్వరం వినిపించింది. ఆదిత్య చేతులు చిన్నగా కంపించాయి. పాప ఏడుపు ప్రారంభించింది. కారు స్లో చేసి ఓ పక్కగా ఆపాడు.
"ఎందుకేడుస్తుందో ఆకలంటావా....?" అడిగాడు బాబ్జిని.
"ఏమో మరి నాకు మాత్రం ఏం తెలుసు.... చలేస్తోందేమో చూడు పక్క పాడు చేసిందేమో...."
బాబ్జీ పాప పడుకున్న బొంత తడిమాడు. చల్లగా తగిలింది. "అయ్యో పాస్ పోసింది ఏం చేద్దాం...?"
"అదే మడత పెట్టి వేయి చల్లగా ఉన్న చోట. నేను అన్నీ రెడీ చేసుకున్నాను, కానీ డైపర్స్ తీసుకోలేదు. దారిలో ఎక్కడైనా మెడికల్ షాప్స్ కనిపిస్తే డైపర్స్ కొందాం..."
"నాకు వేయడం రాదు..."
"నేను ట్రై చేస్తాలే...." ఆదిత్య చెప్పినట్టు బొంత తడిపిన మేర మడత వేసాడు.
పాపాయిని దాని మీదకి మృదువుగా జరిపాడు.
"బాబ్జీ పాపాయిని చూడు నా పోలికే కదూ....అదో రకంగా అన్నాడు ఆదిత్య.
"రేపు మార్నింగ్ చూస్తాను పద త్వరగా... నాకెంటో అనుమానంగా ఉంది కారు ఎవరైనా చెక్ చేస్తారేమో...."
బాబ్జీ అలా అనగానే ఆదిత్య కి కూడా భయం వేసింది. వెంటనే కారు స్టార్ట్ చేసాడు. పాప మళ్ళీ నిద్రలో కెళ్ళి పోయింది.
హైవే లో కారు వేగంగా వెళ్తోంది..."ఆదిత్యా! ఎక్కడన్నా డాబా కనిపిస్తుందేమో చూడు. కాసిని పాలు దొరికితే పాపాయికి స్పూన్ తో నాలుగు స్పూన్ లు పోద్దాం ఆకలేస్తుందేమో కదా..." అన్నాడు బాబ్జీ.