Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 22

    అపూర్వమైన అనుబూతితో పాప నందుకొని గుండెలకు హత్తుకుంటూ దానికంటే ప్రేమగా, "నా ప్రాణం లా చూసుకుంటా...నీ మేలు మరిచిపోను.... ఇదిగో... అంటూ ఎడం చేతి మీద పాపని జాగ్రత్తగా పట్టుకొని కుడి చేతి గుప్పిట్లో ఉన్న నోట్లు అమెకిచ్చాడు.
    "వద్దు బాబూ ...నీ బిడ్డని నీ కప్పగించాను... నువ్వు డబ్బిచ్చి నన్ను అవమానించకు.నేనేదో తప్పు చేసినదానిలా బాధపడతాను...." అంది ఆయా.
    "నువ్వు నిజానికి చాలా రిస్క్ తీసుకున్నావు ఆయా... కాదనకు తీసుకో..." బలవంతం చేశాడు.
    "వద్దు బాబూ ఇప్పుడు నేనిక్కడ ఒక చిన్న నాటకం ఆడాలి... ఆ నాటకంలో ఈ డబ్బు బయట పడితే నా మీదే అనుమానం వస్తుంది... ముందుమీరిక్కడి నుంచి వెళ్ళిపొండి. నేను వెళ్ళి వాచ్ మాన్ ని పిలుస్తాను. ఈ లోపల మీరు గేటు దాటండి. ఊ వెళ్ళండి..." త్వరపట్టింది ఆయా.
    "చాలా థాంక్స్ ఆయా... నేను మళ్ళీ కలుస్తాను... నీకేం సాయం కావాలన్నా నేనున్నాను.... ఒకే... భై .." అంటూ పాపని గుండెలకి హత్తుకొని వెనక్కి తిరిగాడు... ఆయా చకచకా నడుస్తూగేటు వైపు వెళ్ళి, "బహదూర్" అని పిలిచింది.
    బహదూర్ పిలుపు వచ్చిన వైపు చూశాడు. ఆయా మెట్ల మీద నిలబడి ఉంది.
    బహాదూర్ ఆమె వైపు వెళ్ళాడు. అది అదనుగా చప్పుడుచేయకుండా ఆదిత్య గేటు బయటకి వెళ్ళిపోయి రోడ్డు కావలి వైపు పార్క్ చేసిఉన్న కారు దగ్గరకి వెళ్ళి కారు డోర్ తీసి పాప నేత్తుకునే డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాడు.
    కారు కదలిన శబ్దం విన్న బహదూర్ కారు దగ్గరకు వెళ్తున్నవాడల్లా వెనక్కి తిరిగాడు.
    అది గమనించిన ఆయా "బహదూర్ ఇటు రా..." అని మళ్ళీ పిలిచింది.
    బహదూర్ సనుక్కుంటూ ఆమె వైపు వచ్చాడు.
    "టీ కావాలి .....తెస్తావా...? ఇవాళ నర్సింహ రాలేదు..."
    బహదూర్ అలాగే వెనక్కి చూస్తూ... "చాలా సేపట్నించీ గాడ కారు పార్కు చేసి ఉండే... ఎవరిదా అని చూస్తున్నా నేనీడకు రాంగానే కారు పోయింది. ఎవరో, ఏందో అన్నాడు..."
    "బాగుంది నువ్వు చెప్పేది... రోడ్డు మీద ఎవరో కారు ఆపుకుంటే మనకెందుకు...?"
    "లే అయమ్మా  ఇంత లేట్ నైట్ వరకు ఆడనే ఉంది కారు. డౌట్ గుంది నాకు ఎవడన్నా బద్మాష్ గాడున్నడెమో అని..."
    "పోనీలే వెళ్ళిపోయాడుగా ...టీ తెస్తావా...?"
    "గేటు కాడ ఎవరుంటారు...?"
    ఆయా అలోచిస్తున్నట్టుగా చూస్తూ.... "సర్లే వదిలేయ్ బాగా తలనొప్పి గా ఉందని అడిగాను...." అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అలా నడుస్తూనే ఆమె తను అడాల్సిన నాటకం మనసులోనే రిహార్సల్స్ చేసుకోసాగింది.
    రూం నెంబర్ నాలుగు తెల్లటి దుప్పటి పరచిన బెడ్ మీద మత్తుగా పడుకొని ఉంది ప్రఖ్య. మరో వైపు అటెండెంట్ కోసంఏర్పాటు చేసిన మరో బెడ్ మీద భానుమతి కూర్చొని ఉంది. ప్రఖ్య కి ఇవ్వాల్సిన మందులు ఏ వేళకి ఎలా ఇవ్వాలో భానుమతికి వివరించి పాపని తీసుకొచ్చే ఆయా కోసం అసహనంగా ఎదురు చూస్తోంది సిస్టర్ జానకి.
    ఇంతలో గట్టిగా అరుపు.... ఒక్కసారిగా పరిసరాలు ఉలిక్కిపడ్డాయి. మత్తులో జోగుతున్న ప్రఖ్య కూడా కళ్ళు తెరిచి ఏమైందన్నట్టుగా భయంగా చూసింది. అఆరుపుకి ఉలికిపడిన భానుప్రియ గబగబా కూతురు దగ్గర కెళ్ళి తల మీద మృదువుగా రాస్తూ ఏం లేదులే పడుకో" అంది.
    ఆయా రొప్పుతూ వచ్చింది. సిస్టర్ జానకి అయాని పట్టుకొని "ఏంటి?" ఏమైంది ఎందుకట్లా అరిచావు?" నిన్నే...." అని భుజాలు కుదుపుతూ అడుగుతోంది.
    ఆయా భయం, భయంగా "నే....నేను....పాపని క్రెడిల్ లో ఉంచి బాత్ రూమ్కి వెళ్ళి వచ్చాను. వచ్చేటప్పటి కి పాప కనిపించ లేదమ్మా ఎవరో వెనక కౌపౌండ్ వాల్ దూకి పారిపోయాడు. .... వాడి చేతిలో ఏదో ఉంది. బహుశా పాపేమో అని అరిచాను . పాప, పాప" అంటూ వణికిపోసాగింది ఆయా.
    "ఏంటి...? పాపనేత్తుకు పోయాడా....? ఎవడు వాడు...? ఇంతవరకు మన హాస్పిటల్ లో అలాంటి వెం జరగలేదు. ఎలా జరిగింది?" జానకి హడావుడిగా లేబర్ రూమ్ వైపు పరిగెత్తింది. ఆమెను అనుసరించింది ఆయా.
    ఆయా మాటలకి, జరిగిన సంఘటన కి నిర్ఘాంత పోయిన భానుప్రియ మెదడు లో ప్లాష్ లా మెరిసింది.
    పాపనేత్తుకు పోయాడా? అంటే వాడు, ఖచ్చితంగా వాడే. వాడికి ప్రఖ్య ని డెలివరీ కి ఈ హాస్పిటల్ కి తీసుకొచ్చినట్టు తెలిసిందన్న మాట....ఎప్పటి నుంచి కాపు కస్తున్నాడో డర్టీ ఫెలో....ఎంత పని జరిగింది. ఎవరికైతే పాప దక్కకూడదని పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుందో వాడి చేతికే చిక్కింది పాప....వాడు ఖచ్చితంగా బ్లాక్ మెయిల్ చేస్తాడు....
    అసలైనా ఈ హాస్పిటల్ లో సరైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకుండా ఏం చేస్తున్నారు...?
    వేలకు వేలు ఫీజులుతీసుకోవడం తప్ప పేషెంట్స్  సంక్షేమం చూడరా...? ఆవేశంగా డాక్టర్ రూం లోకి నడిచింది భానుప్రియ. డాక్టర్ ప్రవీణ తాపీగా కూర్చొని జర్నల్ తిరగేస్తోంది మనిషి అలికిడి కాగానే తలెత్తి చూసింది.
    "రండి ఎలా ఉంది అమ్మాయి...? పాపకి ఫీడ్ చేసిందా....? ఆహ్వానిస్తూ అడిగింది.
    భానుప్రియ ఆవిడకి సమాధానం చెప్పకుండా ముఖంలో విసుగు కనబరుస్తూ "ఆ రాస్కెల్ అన్నంత పనీ చేశాడు . నేనింత పకడ్భందీగా ప్లాన్ చేసుకున్నా వాడు తెలుసుకొని పాప నెత్తుకొని పోయాడు..."
    "వ్వాట్" అడిరిపడుతూ చూసింది డాక్టర్..."పాపనేత్తుకు పోయాడా ? ఆర్ యూ ష్యూర్....?"
    "ఇప్పుడే మీ ఆయా వచ్చి చెప్పింది సిస్టర్ పరిగెత్తింది నేనిట్లు వచ్చాను. ఇప్పుడు వాళ్ళకేం చెప్పాలి...?"
    'అవును వాళ్ళడిగితే ఏం చెప్పాలి...?" డాక్టర్ అయోమయంగా అంది.
    "మీ హాస్పిటల్ సెక్యూరిటీ అరేంజ్ మెంట్స్ ఇంత ఘోరంగా ఉన్నాయన్న మాట..."
    డాక్టర్ కొంచెం కోపంగా చూసింది... "డోంట్ ట్రై టు బ్లేం అవర్ హాస్పిటల్ ఇలాంటి సంఘటన జరగటం ఫస్ట్ టైం. అయినా ఇంతకు ముందు నా దగ్గరకు ఇలాంటి కేసు కూడా రాలేదు... మీదే చిత్రమైన కేసు....సాధారణంగా కడుపు చేసి ప్రియుడు పారిపోతే అబార్ద్షన్ చేయించు కునో, పిల్లని కానీ అనాధ శరణాలయానికి ఇచ్చేసో వెళ్ళిపోతారు. ఆ అబ్బాయి పెళ్ళి చేసుకుంటాను మొర్రో అంటుంటే మీరు వద్దంటూ మీ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారు ఇది మీకేం పద్దతిగా ఉంది చెప్పండి అంది...."
    కుడిచేయి పైకెత్తి అపమన్నట్టుగా సంజ్ఞ చేస్తూ అంది భానుప్రియ."ప్లీజ్ ఇది పూర్తిగా మా స్వవిషయం .మీకు నేను ఎక్స్ ప్లేనేషన్ ఇవ్వడం కంటే ముందు ఏం చేయాలో ఆలోచించండి . వెంటనే మీ హాస్పిటల్లో పాప మాయం అయిందని పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి..."
    "సారీ మిసెస్ భానుప్రియ గారూ!నేను చేయలేను నా హాస్పిటల్ పరువుపోతుంది. మీకు ఖచ్చితంగా అతనే ఎత్తుకెళ్ళాడని నమ్మకముంటే మీరే పోలీస్ కంప్లయింట్ చేసుకోండి."
    "మీ వాళ్ళ కోపరేషన్ లేకుండా అతను ఎలా తీసు కెళ్తాడండీ...?"
    సూటిగా భానుప్రియ వేసిన ప్రశ్న కి నివ్వెరపోయింది డాక్టర్. నిజమే ఎవరు సహకరించి ఉంటారు? సిస్టరా...? జానకి ఎన్నటికీ అలా చేయదు. మరి అయానా....? ఆయా ఎన్నో ఏళ్ళుగా తన దగ్గర పని చేస్తోంది . ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు. మరి ఎవరు...? ఏ సిస్టర్ సహకరించింది  ఆవిడతీవ్రంగా ఆలోచించసాగింది. ఆవిడ ఆలోచనలు చెదరగొడుతూ హాస్పిటల్లో ఉన్న ఆయాలు, నర్సులు బిలబిల లాడుతూ వచ్చారు. నిద్రపోతున్న పేషెంట్స్ లేచి కూర్చున్నారు. వాళ్ళకు తోడుగా ఉన్న బంధువులు...కొందరు భయంతో ఉయ్యాలలో ఉన్న పిల్లల్ని చేతిలోకి తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే గలాటా చెలరేగింది.
    ఈ హడావుడంతా చూస్తున్నభానుప్రియకి పిచ్చి పట్టినట్టయింది. ఏం చేయాలో అర్ధం కాక మెదడుమొద్దు బారినట్టు నిశ్చేష్టురాలై తల చేత్తో పట్టుకొని నిలబడ్డ చోటే కూలబడింది.
    ఇదిలా ఉండగా........
    హాస్పిటల్ నుంచి ఆయా సాయంతో పాపను తీసుకుని పరారైన ఆదిత్య కొద్ది దూరం పోగానే తన పక్క సీటులో తాను రెడీగా ఉంచుకున్న బేబీ బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి పల్చటి బట్ట కప్పాడు. కొన్ని క్షణాలు తన రక్తాన్ని పంచుకు పుట్టిన ఆ చిన్నారిని అపురూపంగా చూసుకొని కారు స్టార్ట్ చేశాడు.
    రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి.అడపా దడపా వెళ్తున్న కార్లు, లారీ తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. మూసి ఉన్న షాపుల ముందు కొందరు ముష్టి వాళ్ళు పడుకుని నిద్రపోతున్నారు.
    అటు వేసవి,ఇటు చలి కాని ఆహ్లాదకరమైన కాలం అది. నెల ఫిబ్రవరి . ఆరోజు తేదీ 17 పాప పుట్టినతేదీ, వారం , టైం మరోసారి మనసులో మననం చేసుకున్నాడు కారు ఓ పక్కగా ఆపి,జేబులోంచి డైరీ తీసి వివరాలన్నీ రాసుకున్నాడు.

 Previous Page Next Page