"అన్నీ ఉన్నాయిరా ...డిక్కీ లో బాస్కెట్ ఉంది. అందులో ప్లాస్క్ లో వేడి నీళ్ళు , పాలపొడి డబ్బా, పాల సీసా ....అన్నీ ఉన్నాయి. పాప లేవగానే పాలు పడదాం..."
బాబ్జీ గుండె ఆర్ద్రమైంది. జీవితంలో ఇంకా మొదటి మెట్టే ఎక్కని ఇతనికి ఈ లేత గులాబీ ని అపురూపంగా కాపాడే బాధ్యత తీసుకునే ధైర్యం ఎలా వచ్చింది? ఆవేశం లోనో, ఉద్రేకం లోనో , వయసు వేడిలోనో, కమిట్ అయినంత మాత్రాన పెళ్ళి కాకుండా కన్న పాపాయిని పెంచాలన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలావచ్చింది? రెండు వందల కిలోమీటర్ల దూరం అర్ధరాత్రి ప్రయాణం చేయడం పెద్ద కష్టమేం కాదు కాని.... పుట్టి రోజు కూడా కాని ఈ తెల్లగులాబీ ని తీసుకొని ఇంతసేపు ప్రయాణం చేయడానికి ఎంత ధైర్యం....?"
"బాబ్జీ నీకో సంగతి తెలుసా....?"
"చెప్పు...!"
"నేను పాపనేలా పెంచాలి? ఏం చేయాలి పాలెలా పట్టాలి?" సేరిలాక్ ఎలా పెట్టాలి..../ ఎప్పుడు స్టార్ట్ చేయాలి...? ఇలాంటి వన్నీ ఉన్న బేబీ గ్రోత్ బుక్స్ అన్నీ చదివాను. కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను. పాప కోసం చిన్న చిన్న జాబ్ లు కూడా చేసి ట్వంటీ దౌజేండ్ సంపాదించాను...."
"ఇక నువ్వు నీ చదువుకి స్వస్తి చెప్పి ఈ పాప కోసం సేల్స్ బాయ్ గానో, సేల్స్ ఎగ్జిక్యూటివ్ గానో ఉద్యోగం చేయాలి...."
"లేదు ఆ అవసరం రాదు. మా అమ్మతో మంచిగా మాట్లాడి అమ్మమ్మ గురించి మొత్తం తెలుసుకున్నాను. అమ్మమ్మ చాలా మంచిది. తప్పకుండా పాప ఆవిడదగ్గర క్షేమంగా ఉంటుంది. రెండేళ్ళు నా చదువు అయిందాకా అక్కడే ఉంచి చదువు కాగానే పాపనితెచ్చుకుంటాను.నేనే పెంచుకుంటాను. నాకు పిల్లలంటే ఇష్టం రా. చిన్నప్పటి నుంచీ ఒంటరిగా బతికి, బతికి నాకు నా అనేవాళ్ళు లేక చాలా మంది కావాలనిపిస్తోంది. పాపనేలా వదులుకుంటానురా...?" ఆర్తిగా, ఉద్వేగంగా అంటోన్న ఆదిత్య ముఖం చూడాలని ప్రయత్నించి చీకట్లో స్పష్టంగా కనిపించక పోవడంతో కిటికిలోంచి బైటకి చూస్తూ కూర్చున్నాడు బాభ్జీ.
దూరంగా మిణుకు మిణుకు మంటూ కనిపించిన లైట్లు కాసేపట్లో నే స్పష్టంగా కనిపించసాగాయి.
"ఏదో స్టేషన్ వస్తోందిరా" అన్నాడు బాబ్జీ.
"ఇంకా మనం సిటీలోనే ఉన్నాం...." అన్నాడు ఆదిత్య.
"అయితే ఇక్కడ తప్పకుండా డైపర్స్ దొరుకుతాయేమో...."
"లైట్స్ ట్రై. పడుకుందిగా పాప...."
'అవును పాపం చలేస్తుందేమో అని నా కోటు కప్పాను...."
"ఓ థాంక్స్ రా" మనసూర్తిగా అన్నాడు ఆదిత్య.
"ఓ పని చేద్దాం ఎక్కడన్నా కాసేపు కారాపితే ఇప్పుడు పాలు కలిపి బాటిల్ లో పోసి పెడదాం. పాప లేవగానే ఏడవకుండా పట్టేయచ్చు. పాప ఏడుపు విన్నారంటే జనం మనం పిల్లల దొంగలం అని తుక్కు కింద కొట్టేయచ్చు...." అన్నాడు బాబ్జీ. బాబ్జీకి కంగారుగా ఉంది. అప్పుడే పుట్టిన పాపనలా అర్ధరాత్రి వేళ ఎక్కడికో తీసు కేళ్తుంటే కిడ్నాపర్ అనే ఫీలింగ్ కలుగుతోంది . అందుకే కంగారుగా ఉన్నాడు.
అతని కంగారు గమనించిన ఆదిత్య నవ్వి, "సరేలే కలిపేద్దాం...." అంటూ రోడ్డు పక్కగా కారాపాడు. "ఉండు నేను కలుపుతా... ఫస్ట్ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నా సీటు పక్కన బాటిల్ లో నీళ్ళున్నాయి ఇలా ఇవ్వు...." అంటూ డోర్ తీసుకుని దిగాడు.
బాబ్జీ బాటిల్ తో నీళ్ళు పోస్తుంటే చేతులు శుభ్రంగా కడుకున్నాడు ఆదిత్య. తరువాత మంచి నాప్ కిన్ తో తుడుచుకుని డిక్కీ లోంచి బాస్కెట్ తీశాడు. అందులోంచి పాలపొడి డబ్బా, ప్లాస్క్ తీశాడు. గ్లాసు కూడా బైటకి తీసి ఒక స్కూన్ పాలపొడి వేసి, గ్లాస్ నిండా నీళ్ళు పోసాడు.
"అన్ని పాలు తాగగలదా పాప" అడిగాడు బాబ్జీ.
"ఎన్ని తాగితే అన్నే పడదాం...." అంటూ పాలు కలిపేసి ప్లాస్క్ లో పోశాడు. ఆదిత్య.
"ఈ కారేవరిదిరా....?"అడిగాడు బాబ్జీ డిక్కీ మూసి డ్రైవింగ్ సీట్లో కి వస్తున్న ఆదిత్య ని.
"సంజయ్ ది...."
"నీకెలా ఇచ్చాడు.... నువ్వు చెప్పావా ఇలా వెళ్తున్నానని...."
"వాడికంతా తెలుసు...." కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు.
"ఎంతైనా నీకు చాలా దైర్యం "అన్నాడు బాబ్జీ డోర్ గట్టిగా వేస్తూ.
ఆదిత్య చిన్నగా శబ్దం చేస్తూ నవ్వాడు. కారు బయల్దేరింది.
ఉదయం తొమ్మిది అయింది. రాత్రంతా నిద్ర పట్టక మేలుకొని ఉన్న భానుప్రియ అప్పుడే కళ్ళు తెరిచింది.
తెల్లవారు జామున ఎప్పుడో నిద్రలోకి జారిందేమో ఎంత ప్రయత్నించినా కళ్ళు తెరిపిడి పడటం లేదు. తెరిస్తే మండిపోతున్నాయి బలవంతంగా కళ్ళు విప్పి అరచేతుల్లో చూసుకుని తరవాత తన ఎదురు మంచం మీద బాగా అలసినట్టు ఆదమరచి నిద్రపోతున్న ప్రఖ్య వైపు చూసింది.
అనస్తీషియా ప్రభావానికేమో రాత్రి నుంచి ప్రఖ్య మగతగానే ఉంది. జరిగింది ఏదీ కూడా ప్రఖ్య కి తెలియలేదు.
రాత్రి జరిగిన సంఘటన గుర్తు రావడంతో దిగ్గున లేచింది భానుప్రియ.
అయ్యో ఎంత పొరపాటు చేసాను! చేతీ వాచీ చూసుకుంది. తొమ్మిది దాటుతోంది. షిట్ ఈ పాటికి పోలీస్ కంప్లయింట్ ఇవ్వాల్సింది. చటుక్కున లేచి బాత్ రూమ్ లోకి వెళ్ళింది. కాసేపట్లో బ్రష్ చేసుకొని, ముఖం కడుక్కుని వచ్చి డ్రెస్ సరిచేసుకుని మంచం మీద పడి ఉన్న చున్నీ తీసుకుని మెడకు వేసుకుంది. స్లేప్పర్స్ వేసుకుని శబ్దం చేయకుండా గది బయటకి వచ్చింది.
అప్పుడే సిస్టర్ ఇంజక్షన్ సరంజామాతో వస్తోంది.
భానుప్రియ ను చూసి మృదువుగా నవ్వుతూ "మార్నింగ్ వచ్చాను. మీరిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను. టెంపరేచర్ చూసి ఇంజక్షన్ చేస్తాను....' అంది.
"డాక్టర్ వచ్చారా....?" అడిగింది భాను.
"రాలేదు. వస్తారు టైం అయింది."
"మీరుమార్నింగ్ డ్యూటీ సిస్టర్ కదా....! రాత్రి డ్యూటీ ఆవిడ వెళ్ళిపోయిందా....?"
"అవునండీ రాత్రి డ్యూటీ వాళ్ళెవరూ లేరు. ఏం ఏమైనా కావాలా....?"
"వీళ్ళకి ఏమీ తెలియదా ....?" భాను సందేహంగా అనుకుంది.
"మీరు వెళ్ళండి లోపలికి. నేను అరగంట లో వస్తాను. వచ్చి మా అమ్మాయిని తీసు కెళ్ళి పోతాను." అంటూ వడి వడిగా బైటకి వెళ్ళిపోయింది.
ఆవిడ వెళ్ళిన వైపు చూస్తూ భుజాలెగరేసి లోపలికి వెళ్ళిపోయింది సిస్టర్.
భానుమతి రోడ్డు మీదకి వచ్చి అటో కోసం నిలబడింది. ఆమెకి ఏం చేయాలో అర్ధం కాలేదు. పోలీస్ కంప్లయింట్ తనివ్వాలా....?డాక్టర్ కదా ఇవ్వాలి . ఆవిడ ఇచ్చిందా...? రాత్రి ఏం జరిగింది..? ఒక్కసారి ఆమెకి ఏం జరిగిందో అర్ధం కాలేదు.
డాక్టర్ చాలాసేపు హాస్పిటల్ లో అణువణువు వెతికించింది. తరువాత తనని అడిగింది "ఏం చేయాలను కుంటున్నారు?" అని. ఖచ్చితంగా వాడే ఎత్తు కెళ్ళాడు అని తను అనడం గుర్తుంది.
ఆ తరువాత వాచ్ మాన్ ఏదో చెప్పాడు. ఎవరో బైట చాలాసేపు కారాపుకుని అక్కడే తచ్చాడని, అతను చిన్న కుర్రాడని చెప్పాడు. అనుమానం నిజమే అని అనుకున్నారు. సరే ఉదయం ఆలోచిద్దాం ఏం చేయాలో అంటూ డాక్టర్ వెళ్ళిపోయింది. ఇప్పుడెం చేయాలి? పోలీస్ కంప్లయింట్ చేయాలా? వద్దా? చేస్తే వాళ్ళకి చాలా వివరాలు చెప్పాలి. చేయకపోతే వాడు తప్పకుండా బ్లాక్ మెయిల్ చేస్తాడు?వాడో సైకో....వాడ్నివదలకూడదు. అయినా ఎక్కడికి పోతాడు? వాళ్ళింటికి వెళ్ళి ఉంటాడు. ఏం తెలియని నంగనాచిలా శిరీష హాస్పిటల్ కి వచ్చి కూర్చొని వెళ్ళిపోయింది. తల్లీ కొడుకు లిద్దరూ కలిసి నాటకం ఆడి, తన కూతురి జీవితం నాశనం చేసినా చేస్తారు. బలవంతంగా వాడికి కట్టబెట్టవచ్చు శిరీష. అలా జరగడానికి వీల్లేదు.... నో....బ్యాగులోంచి సెల్ తీసి శిరీష నెంబర్ డయాల్ చేసింది.
వెంటనే రిసీవ్ చేసుకుంది శిరీష. "హలో" అంది.
"పాపనేం చేశారు....?" కఠినంగా అడిగింది భాను.
"ఏ పాప....?' విస్మయంగా అడిగింది శిరీష.
"ఏం తెలియనట్లు నంగనాచిలా మాట్లాడకు. నువ్వు, నీ కొడుకు కలిసి ప్లాన్ చేసి పిల్లని కిడ్నాప్ చేసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి చూస్తున్నారు. తెలివితేటలు మీకే కాదు, నాకూ ఉన్నాయి."
"భానూ....ప్లీజ్ నాకేం అర్ధం కావడం లేదు...సరాగా చెప్పు... ఏం జరిగిందో...."
"ఏం జరగడం ఏంటి....? పుట్టిన పిల్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పోయాడు. వాడు ఎక్కడికీ వెళ్ళడు వస్తే నీ దగ్గరకే రావాలి. అంత పసిగుడ్డును తీసుకెళ్ళి ఏం చేస్తాడు....? అందుకే నేను రాత్రి పోలీస్ రిపోర్టు ఇవ్వాలనుకుని కూడా ఇవ్వలేదు. చెప్పు నీ దగ్గరికి వచ్చాడా లేదా?"
"భానూ....నిజం చెబుతున్నాను వారం అయింది నేను వాడిని చూసి. పాప నేత్తుకు పోవడం ఏంటో నాకేం అర్ధం కావడం లేదు. ఎత్తుకెళ్ళి ఏం చేసుకుంటాడు వాడు ఏం జరిగిందో సరిగా చెప్పు ప్లీజ్..."
"చెప్తున్నాగా పాపానెవరో రాత్రి ఆయా గదిలోకి తీసుకోస్తుండగా ఎత్తు కెళ్ళి పోయారు. అది మీ వాడే అని ఖచ్చితంగా తెలుసు. మర్యాదగా తీసుకొచ్చి హాస్పిటల్ లో అప్పగించమను లేదంటే వాడి మీద నేను కిడ్నాప్ కేసు పెట్టాల్సి వస్తుంది.
"భానూ ప్లీజ్ శాంతంగా ఆలోచించు. వాడికేం అవసరం కిడ్నాప్ చేయడానికి. ఎవరు చేశారో అయానే సరిగ్గా అడుగు. లేదా ఆవిడే ఏదైనా చేసిందో కనుక్కో ఇలాంటివి ఈ మధ్య చాలా జరిగుగుతున్నాయి మనం రోజూ పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా...!"
"నాన్సెన్స్.... అంత అర్ధరాత్రి పైగా ఆ హాస్పిటల్ జనరల్ పబ్లిక్ వచ్చేది కాదు... అందరూ విఐపిలే వస్తారు....ఎవరికీ అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళాడు. నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికే తీసుకెళ్ళాడు. వాడు నీ కంటికి పిల్లాడిలా కనిపిస్తుండోచ్చు కానీ, హి ఈజ్ ఏ సైకో..."
"భానూ....తీవ్రంగా పిలిచింది శిరీష. డోంటాక్ రబ్బిష్....!"
'అవును రబ్బిష్....వాడు రాబ్భిష్....నా మాటలు రబ్బిష్ ....వాడు ఎలా దొరకడో చూస్తాను. నేను అవతల పెద్ద మనుషులకి మాట ఇచ్చాను. వాళ్ళు ఇంకో గంటలో పాపని అడాప్ట్ చేసుకోడానికి వస్తారు. మంచి ఫ్యామిలీ పిల్ల భవిష్యత్తు బాగుంటుందని నేనీ ఏర్పాటు చేసాను. ఇదంతా కాదని ఆ వెధవ పిల్లని ఎత్తుకెళ్లాడంటే వాడికేదో ప్లాన్ ఉంది. లేదంటే ఎవరైనా పుష్ చేసి ఉండాలి. లేదంటే వాడు సైకో అయి ఉండాలి. చూస్తా.... ఏదో తేలుస్తా ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నాను..."
ఫోన్ పెట్టేసింది భానుప్రియ....
అవతల నుంచి శిరీష స్వరం కంగారుగా "భానూ....భానూ..." అంటున్నా వినిపించుకోకుండా ఫోన్ డిస్కనెక్ట్ అవడంతో స్థాణువై పోయింది శిరీష.