Previous Page Next Page 
తెల్ల గులాబి  పేజి 7

    వివేక్ వచ్చిన సంగతి చెప్పాడంటే ఆవిడ చేతిలో బుక్ ఎగిరి పోతుంది. గంబీర్యం చెదిరి పోతుంది. మొహంలో వెలుగు, నవ్వు నిండి పోతాయి. ఆదిత్య లో హుషారు ఎక్కువైంది. చదువు మీద శ్రద్ధ పోయింది. పుస్తకం కుర్చీలో పెట్టేసి లేచాడు. వివేక్ ఇంట్లో కి వచ్చాక ఏం జరుగుతుందో తల్చుకుంటే నరాలన్నీ తీయగా లాగుతున్నాయి. చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళెం చేస్తారో చూడాలి. లోపలికి వెళ్ళాడు.
    "అమ్మా...! అంకుల్ వచ్చారు...!" అన్నాడు.
    శిరీష పుస్తకం లోంచి తలెత్తి ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూసింది. "ఏ అంకుల్?" విస్మయంగా అడిగింది.
    "ఇంకే అంకుల్? వివేక్ అంకుల్."
    ఎన్నడూ లేనిది ఇవాళ ఆదిత్య కెందుకు ఇంత సంతోషం.... వివేక్ ని చూస్తూనే మొహం ముడుచుకునే ఆదిత్య ఇంత హుషారుగా అతని రాక గురించి తనకి చెప్తున్నాడెంటి?
    "అయితే! నేకేంటిరా నీకెందుకంత సంతోషం?" చిత్రంగా చూస్తూ అడిగింది.
    "చాలా రోజులైంది కదమ్మా అంకుల్ వచ్చి ....అందుకే..."
    పదిరోజులు వివేక్ రాకపోతే ఆదిత్య అతడిని మిస్ అయాడా? వివేక్ పట్ల ఆదిత్య మనసులో ఏదన్నా అనుబంధం, ఆత్మీయత, దగ్గరతనం ఏర్పడి ఉంటాయా? ఎంతైనా వాడూ చిన్నవాడే. వాడికీ తండ్రి ప్రేమ కావాలనిపిస్తుంది. అది వివేక్ దగ్గర లభిస్తుందన్న అశో, నమ్మకమో లేకపోతె వివేక్ కోసం ఎందుకింతగా ఎదురు చూస్తాడు? వివేక్ ని చూడగానే ఎందుకింతగా ఎక్సైట్ అయాడు. ఆదిత్య కి వివేక్ అంటే ఇష్టం లేదనే అభిప్రాయంతో ఇంతకాలం నుంచీ తను వివేక్ కీ, తనకీ ఉన్న అనుబంధం గురించి ఆదిత్య దగ్గర దాచింది. కేవలం వివేక్ తన స్నేహితుడి గానే ఆదిత్య కి చెప్పింది. అంటే అంటే ఆదిత్య ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఎంతటి సుదినం, ఆదిత్య కి తాను చెప్పే అవసరం లేకుండా వాడంతట వాడే జీవితంలోకి ఆహ్వానిస్తే అంతకన్నా తనకేం కావాలి?
    సందేహంగా చూస్తున్న ఆదిత్య వైపు ఆప్యాయంగా చూస్తూ దగ్గరకు రమ్మన్నట్టు తలాడించింది.
    ఆదిత్య సోఫా దగ్గరగా నడిచాడు. శిరీష సరిగా సర్దుకుని కూర్చుంటూ ఆదిత్య నుదుటి మీద జుట్టు సవరిస్తూ అడిగింది. "అంకుల్ ని మిస్ అయావా?"
    ఆదిత్య అవునన్నట్లు తలాడించాడు.
    నవ్వింది శిరీష.
    అప్పుడే సరిగ్గా కాలింగ్ బెల్ మోగింది.
    ఆదిత్య ఒక్కసారి శిరీష ను చూసి, తిరిగి తలుపు వైపు చూసి చటుక్కున ఆమె చేయి విడిపించుకుని ఒక్క పరుగుతో వెళ్ళి తలుపు గడియ తీశాడు. "హలో అంకుల్....!"
    నవ్వుతూ హలో చెప్తున్న ఆదిత్య వైపు విచిత్రంగా చూశాడు వివేక్. అతని క్కూడా తెలుసు తనంటే ఆదిత్యకి ఇష్టం లేదని, కానీ, ఇవాళ....! లోపలికి నడుస్తూ ఎదురు వచ్చిన శిరీష వైపు ఆశ్చర్యంగా చూశాడు.
    "హాయ్ విక్కీ...!" చేయి చాచి వివేక్ చేయందుకుంటూ అంది...."ఆదిత్య నిన్ను బాగా మిస్ అయినట్టున్నాడు.."
    "అవునా....! ఏం ఆదిత్యా...! నిజంగానా....!" ఆదిత్య వైపు చూశాడు వివేక్.
    ఆదిత్య తలవంచుకున్నాడు.
    "ఏయ్....! ఆడపిల్లలా తలొంచుకుంటావేం....? ఇలా చూడు.... చూపుడు వేలితో ఆదిత్య గడ్డం ఎత్తి చూస్తూ అన్నాడు. నిజంగా నన్ను మిస్ అయావా?"
    ఆదిత్య పల్చగా నవ్వి అవునంకుల్ మీరీ మధ్య రావడం లేదేం? బోర్ గా ఉంది మాకు" అన్నాడు.
    "మీకా?" ఆదిత్యనూ, శిరీష నూ మార్చి మార్చి చిత్రంగా చూస్తూ అడిగాడు.
    శిరీష నవ్వుతూ అంది... "ఉండదా....! మరీ ఇద్దరమే....వాడి దార్న వాడు చదువు కుంటుంటాడు. నా దారిన నేను టివి అన్ చేసి చదువుకుంటూ ఉంటాను. ఇల్లు ఇల్లులా లేదు. లైబ్రరీ లా ఉంది. నువ్వు వస్తే కాస్త హడావుడి గా ఉంటుంది గదా...!
    వివేక్ భుజాలేగరేస్తూ అన్నాడు. "ఒకే అయితే రేపట్నించీ రోజూ వస్తాను సరేనా...."
    ఆదిత్య నవ్వాడు.
    "వెళ్ళు నాన్నా.... వెళ్ళి చదువుకుంటావా? అంకుల్ తో కాస్సేపు స్పెండ్ చేస్తావా?" అడిగింది శిరీష.
    చదువుకుంటాను.
    "ఓ....! మరి నాతొ ఏదో మాట్లాడేసేవాడిలా మిస్ అయానంటున్నావు.."
    "బాగుంది నీతో వాడెం మాట్లాడతాడు? మనం మాట్లాడుకుంటూ ఉంటె వాడికి కాస్త హడావుడి  కనిపిస్తుంది. కాస్త ప్రశాంతంగా చదువుకుంటాడు. నీకో సంగతి తెలుసా...! ఇంట్లో మాట్లాడే వాళ్ళుంటేనే ఏదన్నా పని చేయాలని పిస్తుంది. పద, పద ఫ్రెష్ అయిరా. నేను కాఫీ తెస్తాను" అంటూ శిరీష వంటగది వైపు నడిచింది.
    "ఒకే మై బోయ్ ! వెళ్ళు చదువుకో! నీకెందుకు నేనివాళ మీ ఇల్లంతా సందడితో నింపేస్తాను సరేనా.... గో ...బి... కూల్" అంటూ బాత్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు వివేక్.
    ఆదిత్య కి ఇప్పుడు మరో టెన్షన్ మొదలైంది. తను ఎంత త్వరగా పడుకుంటే కాదు, కాదు పడుకున్నట్లు నటిస్తే వాళ్ళంత తొందరగా గదిలోకి వెళ్ళిపోతారు. ఆ తరవాత ఏం జరుగుతుందో చూడాలి. సన్నగా ఒంట్లో వణుకు మొదలైంది. అదేం కనిపించనీయకుండా తిరిగి బాల్కనీ లోకి వెళ్ళిపోయి కుర్చీలో ఉన్న పుస్తకం తీసుకున్నాడు. అప్పుడే చేతిలో మంచి నీళ్ళ గ్లాసుతో వచ్చిన శిరీష "చీకటి పడింది నాన్నా....! చలిగా కూడా ఉంది. నీ రూమ్ లో చదువు కో వెళ్ళు" అంది ఆదిత్య తో.
    అవును అదే మంచిది. తను గదిలోకి వెళ్ళాక వాళ్ళిద్దరూ ఏం చేస్తారో కూడా చూడచ్చు అనుకుంటూ "సరేనమ్మా" అంటూ పుస్తకం తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు.
    వెనకనుంచి శిరీష స్వరం మళ్ళీ వినిపించింది.
    "డిన్నర్ చేసేస్తావా? ఆకలేస్తోందా?"
    ఆదిత్య గోడ గడియారం చూశాడు. ఎనిమిదవుతోంది.
    "ఆకల్లేదమ్మా కాస్సేపయ్యాక తింటాను."
    "ఎనిమిదైందిరా. ఎంతాకలేస్తే అంటే తిను."
    "ఫోర్స్ చేయకు. తనకి ఆకలేస్తే తింటాడుగా!" అన్నాడు వివేక్.
    "వాడి సంగతి నీకు తెలియదు. ఇలా చదువుకుంటూ నిద్రలోకి జారిపోతాడు."
    "కొంచెం పెరుగన్నం తింటాను." అన్నాడు. ఇప్పుడు తినకపోతే ఈవిడ వదలదు" అనుకుంటూ. 
    "గుడ్ !" శిరీష లేచి వెళ్ళి చిన్న బౌల్ లో పెరుగన్నం కలిపి, స్పూన్ వేసి తీసుకొచ్చింది.
    "ఎలా చదువుతున్నావు ఆదిత్యా?" అడిగాడు వివేక్ ఆప్యాయంగా.
    "బాగా చదువుతున్నానంకుల్!"
    "వాడికిక్కడ మంచి ఫ్రెండ్ ఉంది. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి చదువు కుంటారు."
    "అవును చెప్పావు కదా! నేనెప్పుడు ఆ అమ్మాయిని చూడలేదే...?" ఆసక్తిగా అన్నాడు వివేక్.
    "చూద్దువు గాని,నువ్వు కొంచెం త్వరగా వస్తే చూడచ్చు. ఇంత లేట్ గా వస్తే ఆ అమ్మాయి ఎక్కడుంటుంది?"
    అలా ఆమె అనడం లో లేటుగా వచ్చినందుకు తనని మందలిస్తున్న ధ్వని వినిపించింది . వివేక్ కి చురుగ్గా ఆమె వైపు చూసినవ్వాడు. శిరీష గుండె జల్లుమంది. చూపులు తిప్పేసుకుని "ఎరా ఇంకా కొంచెం కలిపివ్వనా?" అంది ఆదిత్య.
    "ఒద్దు, చాలు నాకు" ఆఖరి స్పూను నోట్లో పెట్టుకుని లేచాడు ఆదిత్య.
    బౌల్ కిచెన్ సింక్ లో పడేసి మంచినీళ్ళు తాగేసి "గుడ్ నైట్ అంకుల్! గుడ్ నైట్ అమ్మా!" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
    "కాస్సేపు చదువుకుని పడుకో" వెనక నుంచి హెచ్చరించింది శిరీష.
    "ఒ.కే. అమ్మా...! ఓ.కె.!" అన్నాడు ఆదిత్య... అలా అనడం లో అతని స్వరంలో వినిపించిన ఉత్సాహం శిరీష ని ఆశ్చర్య పోయేలా చేసింది. ఏంటమ్మా ఇంతలో ఇంత మార్పు వీడిలో అనుకుంది.
    ఆదిత్య తన గదిలోకి వెళ్ళిపోయాడు. గది తలుపులు జేరవేసుకున్నాడు.
    ఆదిత్య ఇప్పుడు చాలా ఉద్విగ్నంగా కూర్చున్నాడు. ఇప్పుడు కాఫీ ఇవ్వడం దగ్గర్నించి చూడాలి....వాళ్ళెం చేస్తారో?
    నెమ్మదిగా కుర్చీ తలుపు దగ్గరగా జరుపుకున్నాడు. కర్టెన్ కొంచెం జరిపాడు. చిన్న సందులోంచి తొంగి చూశాడు.
    వివేక్ మొహం కడుక్కుని వచ్చాడు. శిరీష టవల్ అదించింది. టవల్ తో పాటు ఆమె చేయి అందుకుని దగ్గరకు లాక్కున్నాడు. శిరీష కొంచెం తల అతని గుండెల మీద వాల్చి, వెంటనే దూరం జరిగి లోపలికి వెళ్ళింది. వివేక్ టవల్ తో మొహం తుడుచుకుని, వేళ్ళతో జుట్టు సరి చేసుకుని రిమోట్ అందుకుని సోఫాలో జారగిల పడ్డాడు. టివి చానల్స్ నొక్కుతూ కూర్చున్నాడు.
    శిరీష కాఫీ కప్పులతో వచ్చింది. కప్పులు టీపాయ్ మీద పెట్టి సోఫాలో వివేక్ పక్కన కూర్చుని కాఫీ కప్పు అతని కొకటి అందిచ్చి, తానొకటి తీసుకుంది. వివేక్ నవ్వి ఏదో అన్నాడు. థాంక్యూ అన్నట్టున్నాను అనుకున్నాడు ఆదిత్య అతని లిప్ మూమెంట్ చూసి. ఎడం చేత్తో శిరీష ను దగ్గరకు లాక్కున్నాడు వివేక్.
    శిరీష గోముగా ఏదో అంటోంది. ఏం అంటోంది. పది రోజుల్నించి ఎందుకు రాలేదు అనడుగుతోందో ఏమో. నవ్వుతూ ఏదో చెబుతూ సడెన్ గా ఆగి శిరీష బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. శిరీష నోటి మీద వేలు పెట్టుకుని ఆదిత్య గదివైపు చూసింది. బహుశా తను చూస్తాడని అంటున్నట్టుంది అనుకున్నాడు ఆదిత్య.
    ఆదిత్య రక్తం వేడెక్కుతోంది. తను త్వరగా పడుకుంటే వాళ్ళు కూడా గదిలోకి వెళ్ళి పోతారేమో. పడుకుంటే ....ఛ మరీ ఎనిమిదిన్నరే ...అబ్బా.... యింకా ఏదన్నా వాళ్ళు చేస్తే బాగుండు....ఆదిత్య మనసు చదువు మీదకి పోలేదు. ప్రఖ్యతో మాట్లాడాలని పించింది. ఎలా? ఇప్పుడు ప్రఖ్య వాళ్ళింటికి వెడితే వీళ్ళెం చేస్తారో తనకి తెలియదు. వెళ్ళకపోతే ఎలా? తనతో మాట్లాడాలని పిస్తోంది. తన దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. ఉంటె ఎంచక్కా చాటింగ్ చేసేవాళ్ళు . ఐడియా....
    ఆదిత్య చటుక్కున గదిలోంచి బైటకి వచ్చాడు.
    శిరీష వివేక్ కి దూరం జరిగింది.
    "అమ్మా...! నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.... ప్రఖ్య కి ఫోన్ చెయ్యాలి అన్నాడు."
    శిరీష తన సెల్ ఫోన్ తీసి ఇస్తూ , "ఇదిగో మాట్లాడు అంది."
    "థాంక్యూఅమ్మా!" వెలిగి పోతున్న మొహంతో ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళి పోయాడు. "గుడ్ నైట్ అమ్మా!" అంటూ తలుపు వేసుకున్నాడు.
    సెల్ లో ప్రఖ్య నెంబరు తిప్పాడు. అవతలి నుంచి ప్రఖ్య స్వరం వెంటనే వినిపించింది. 
    "హలో...."
    "హాయ్. ప్రఖ్య ! నేను...నీతో విషయం చెప్పనా?"

 Previous Page Next Page