ఓసారి గాడంగా నిట్టూర్చి ట్రాన్సిస్టర్ అన్ చేసింది.
***
రమ్య కి జీవితం హాయిగా గడుస్తోంది.
సురేష్ శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి రమ్మని పికప్ చేసుకుని, సోమవారం దాకా ఆమెతో గడిపేసి, సోమవారం ఉదయం ఇంటి కెళ్ళి పోతాడు. ఈ మధ్యలో ఎప్పుడైనా ఓసారి చూడాలనిపిస్తే ఇద్దరూ కలుసుకుని ఓ గంట సేపు కబుర్లు చెప్పుకుంటారు. ఈవిధమైన రొటీన్ బాగానే ఉందని పిస్తోంది.
హడావుడి పడుతూ నిద్రలేవడం, వండడం, క్యారేజీలు సర్దడం, అలకలు కోపాలూ ఆలాంటి వేం లేవు. అత్తగారి ఆరళ్ళు, మావగారి సేవలు బోర్.
రమ్య ఐదున్నరకి లేచి ఓ అరగంట సేపు వాక్ కి వెళుతుంది. తరువాత ప్లాట్ కొచ్చి గదులు శుభ్రం చేసుకొని వంట కానిస్తుంది. ఎనిమిదిన్నర కి నింపాదిగా తయారై ఆఫీస్ కెళ్ళి పోతుంది.
సాయంత్రం పూట ఆఫీస్ నుంచి ఏదో మీటింగ్ కో, కల్చరల్ ప్రోగామ్స్ కో వెళ్ళి ఏడున్నర ఎనిమిదింటికి ప్లాట్ కి వస్తుంది. మూడ్ బాగుంటే సింపుల్ గా కూర, చారు చేసుకుని రాత్రి భోజనం చేస్తుంది. లేకపోతె బ్రెడ్ తినేస్తుంది! ఓ గంట చదువుకుని ఆ తరువాత నిద్రపోతుంది. ఈమధ్యే వాషింగ్ మిషిన్ కొంది. మూడు రోజుల కోసారి బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తుంది.
***
ఆరోజు రమ్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అంతా హడావుడిగా ఉంది చాలామంది పిల్లలు, పెద్దలు అందంగా ముస్తాబై కళకళ్ళాడుతూ కన్పించారు. ఎదురుగా ఉన్న ప్లాట్ లో టేప్ రికార్డర్ వెస్ట్రన్ మ్యూజిక్ విన్పిస్తోంది. పిల్లలు కొందరు మ్యూజిక్ కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. మొత్తం ప్లాట్స్ లోని వాళ్ళంతా అక్కడే ఉన్నారు.
రమ్య కి సరదాగా అనిపించింది. ఎప్పుడు చూసినా ఎవరి ళ్ళాలో వాళ్ళు తలుపులు బిడాయించుకుని ఉంటారు. నిశ్శబ్దంగా ఉండే ప్లాట్స్ అన్నీ సందడిగా ఉన్నాయి.
ఓ చిన్న పాపని పిలిచి అడిగింది. "ఏమిటి విశేషం?" మీరంతా చక్కగా తయారయ్యారు?"
"ఇవాళ పింకీ బర్త్ డే పార్టీ" తుర్రుమని వెళ్ళిపోయింది.
"పింకీ" అంటే ఎదుటి ప్లాట్స్ వాళ్ళ పాప రమ్య లోపలి కెళ్ళి పోయింది.
"ఇదేమిటి? పార్టీ చేస్తూ తనని ఆహ్వానించలేదేం! మొత్తం ప్లాట్స్ వాళ్ళందర్నీ పిలిచి తనని వెలేశారా? ఏమోలే? తను ఉదయం నుంచీ లేదు కదా! ఇప్పుడు ఎవరన్నా వచ్చి పిలవచ్చు. పింకీకి మంచి గిప్ట్ ఇవ్వాలి. రమ్య ఆ మధ్య తను కొన్న కోతి బొమ్మ తీసింది. నల్లటి బొచ్చు మెరుస్తూ పెద్ద తోకతో ఉందది! ముద్దొస్తోంది. పింకీ కళ్ళల్లో వెలిగే సంతోషం ఊహించి నవ్వుకుంది. బొమ్మ పక్కన పెట్టి, స్నానానికెళ్ళింది. అరగంటలో చక్కగా ముస్తాబై , టీ తాగుతూ కూర్చుంది. రమ్య తనని ఎవరో ఆహ్వానిస్తారని ఎదురు చూస్తుండగానే పదైనది.
చాలా బాధనిపించింది. తనేం చేసిందని, వీళ్ళు తననెందుకు అలా విడిగా చూస్తున్నారు? తనేం తప్పు చేసిందని? వాళ్ళ ఆనందం లో పాలు పంచుకునే అర్హత లేదా?"
ఓ గ్లాసుడు వేడి పాలు తాగి పడుకుంది. చదువుకోవాలని పించలేదు. ట్రాన్సి స్టర్ అన్ చేసింది. వివిధ భారతి లో పాత హిందీ పాటలు వినడం ఆమె కెంతో ఇష్టం. రఫీ కంఠం లో మృదు గంబీరత , లత కంఠం లోని తీయదనం గుండెల్ని స్పృశిస్తూ , మనసు పొరల్లో అలజడి సృష్టిస్తూ.... సురేష్ పక్కన ఉంటె బాగుండేది! ఈరాత్రి ప్లాట్స్ వాళ్ళు కలిగించిన బాధ, పాటల తాలూకు మధురానుభూతి అతనితో కలిసి పంచుకుంటే ! వెంటనే టెలిఫోన్ కనెక్షన్ కి అప్లై చేయాలి. కనీసం ఇంట్లో ఫోన్ ఉంటె సురేష్ తో కాస్సేపు కబుర్లు చెప్పుకోవచ్చు.
చాలాసేపు అల్లరి చేసిన నిద్రాదేవి ఎప్పటికో కరుణించింది.
***
"సురేష్! నిన్న మన ప్లాట్ వాళ్ళు పార్టీ చేసుకుని నన్ను పిలవలేదు తెలుసా!" టీ కప్పు అందిస్తూ చెప్పింది రమ్య.
సురేష్ మాట్లాడలేదు. కొంచెం సేపాగి అన్నాడు. "పోనీలే రమ్యా! నష్టం ఏముంది?"
"నష్టమేం లేదనుకో గానీ , అందరూ అలా సరదాగా ఉంటె నాకూ వాళ్ళ ఆనందంలో భాగం పంచుకోవాలని పించింది. సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న చరిత చెప్పింది. నేను నిన్ను ఉంచుకున్నానట. అందుకే నన్నెవరూ పిలవలేదుట. చిన్న పిల్లలతో కూడా చెప్తున్నారట. నేను మంచిదాన్ని కానని."
"అవన్నీ వినకు! వదిలేయ్"
"వదిలేస్తాను కానీ అప్పుడప్పుడు బాధనిపిస్తుంది. అసలు ఉంచుకోడం ఏమిటి? మా అమ్మ కూడా అలాగే అంది. నాకసలు ఆ పదం వింటేనే కంపరంగా అనిపిస్తుంది."
సురేష్ టీ తాగడం ముగించి, కప్పు కింద పెట్టి రమ్య చేయి తన చేతిలోకి తీసుకుని "ఇవన్నీ మామూలే రమ్యా! వివాహం కాకుండా పరాయి పురుషుడి తో సంబంధం పెట్టుకున్న స్త్రీ ని మన సమాజం చాలా చులకనగా చూస్తుంది. చెడి పోయిందానిగా భావిస్తుంది."
"మరి అదే స్త్రీతో సంబంధం ఉన్న పురుషుడ్ని గౌరవిస్తుందిగా."
'అదేగా విశేషం! తరతరాలుగా మన సమాజంలో స్త్రీకి కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయి. ఆతెంచుకున్న ప్రతి స్త్రీ నీలా కత్తి మీద సాము చేయాల్సిందే."
"ఎంత సంస్కారం లేని ఆలోచనలు! ఎవరి జీవిటంవారిదై నప్పుడు , ఎవరిష్టమైనట్టు వాళ్ళు ఎందుకు బతక్కూడదు? పెళ్ళైన వాళ్ళంతా పతివ్రతలు, కానివాళ్ళు చెడిపోయిన వాళ్ళా! అయినా ప్రేమానురాగాలతో ముడేసుకోవాల్సిన జీవితాన్ని తాళి బొట్టుతో బంధించడం ఏమిటి? ఏమో! ఎవరేమన్నా అనుకోనీ, నాకు ఈ జీవితమే బాగుంది. నా ఈ బిజీ లైఫ్ లో ఇంతకన్నా బాధ్యత నేను మోయలేను." సురేష్ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది రమ్య.
"గుడ్! ఈమాత్రం ఆత్మ స్థైర్యం ఉండాలి" ముంగురులు సవరిస్తూ అన్నాడు.
***
ఆరోజు దీపావళి.
ఊరి కెళ్ళి తల్లిదండ్రులతో గడపాలని ఎంతో అనిపించింది రమ్యకి. కానీ, సురేష్ ని తీసుకురావద్దన్న తండ్రి దగ్గరికి తను మాత్రం ఎందు కెళ్ళాలి? కనీసం పండక్కి రామ్మా అని వాళ్ళు కూడా ఉత్తరం రాయలేదు. కనీసం తమ్ముడైనా రాయొచ్చుగా వాడికేమైంది? తను వాళ్ళు తెచ్చిన సంబంధం ఒప్పుకుని మెడవంచి తాళి కట్టించుకుని, శాస్త్రోక్తంగా అత్తగారింటికి వెళ్ళి ఉంటె ప్రతి పండక్కి ఆహ్వానించి బట్టలు పెట్టె వాళ్ళేమో! సాయంకాలం చీకటి పడ్డాక కాండిల్స్ వెలిగించి, బాల్కనీ గోడ మీద అందంగా పేర్చింది. కొత్త చీర కట్టుకుంది. సురేష్ ముందే చెప్పేశాడు ఆరోజు కలవనని. ఇంట్లో వాళ్ళు అతను లేకపోతె గోల చేస్తారట. తనని వాళ్ళింటికి ఆహ్వానించవచ్చుగా? వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తననీ ఒకదానిగా భావించవచ్చుగా. పెళ్ళి కానంత మాత్రాన తను అతని భార్య కాదా!
రమ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనేమిటి ఇలా ఆలోచిస్తోంది? తామిద్దరి మధ్యా భార్యాభర్తల సంబంధం, బరువు బాధ్యతలు ఉండకూడదన్న కండిషన్ పెట్టింది తనేగా! తల విదిల్చింది.
బైట చిచ్చుబుడ్లు వెలుగుతున్నాయి. పిల్లలంతా హుషారుగా చప్పట్లు కొడుతున్నారు. ఆడవాళ్ళూ, మగవాళ్ళూ నవ్వులూ కేరింతలు , చెవులు చిల్లులు పడేలా బాంబుల మోత.
చాలాసేపు బాల్కనీ లోనే నిలబడి ఆ సంబరం చూసి మెల్లిగా లోపలి కొచ్చేసింది. కొద్దిగా అన్నం తిని చీర మార్చుకుని లైటార్పి మంచం మీద వాలిపోయింది.
పన్నెండైనా నిద్రపట్టలేదు.
చిన్నప్పుడు 'ఆడపిల్లవు, నీకు బాంబు లెందుకే " అంటే వినకుండా తమ్ముడి వాటా కూడా తనే కాల్చేసేది. ఖాళీ సీసాలో రాకెట్ పెట్టి వెలిగించి దూసుకుపోతున్న రాకెట్ ని చూసి ఆనందంతో ఎగిరెడి. ఏమైపోయాయి ఆ రోజులన్నీ! స్త్రీ స్వేచ్చ కోరుకుంటే కొన్ని ఆనందాలకి దూరం కావాలా? సంప్రదాయాలూ, ఆచారాలకు తలొగ్గి జీవిస్తేనే, ఈ సమాజంలో ఒకతిగా గుర్తింపబడి, గౌరవింపబడుతుందా?" లేకపోతె ఇంతేనా!
గుండెల మీద మరో బరువు పెట్టినట్టు భారంగా గొంతులో ఏది ఉండలా చుట్టుకు పోతోంది. బహుశా నొక్కి వేసిన దుఖం కాబోలు.
రోజులు మామూలుగా గడిచిపోతున్నాయి. రమ్య చదువు మాత్రం కుంటి నడక ప్రారంభించింది. రానురానూ సురేష్ తో అనుబంధం బలపడుతూ ఇదివరకులా వారానికో సారి కాకుండా రోజూ ఓసారి కలుసుకోవాలనిపిస్తోంది. కానీ,సురేష్ ఒక్కోరోజు ఫోన్ చేసినా దొరకడు. దాదాపు పది రోజులైంది ఈసారి మాములుగా రావాల్సిన శుక్రవారం నాడు కూడా సురేష్ రాలేదు. అలాంటి రాకపోవడాలు చాలాసార్లు జరిగింది. ఓసారి పాప పుట్టినరోజు, ఓసారి భార్య పుట్టిన రోజని, మరోసారి ఒంట్లో బాగాలేదని, అలా ఏవో కారణాలు చెప్పి ఎగ్గోడుతున్నాడు.
పదిరోజులు దాటాక రమ్య సురేష్ ఆఫీస్ కి ఫోన్ చేసింది. లీవ్ లో ఉన్నాడని చెప్పారు.
తనతో మాటమాత్రం చెప్పకుండా లీవ్ పెట్టడం ఏమిటి? కోపం వచ్చింది రమ్యకి. ఇంటికి ఫోన్ చేసింది. అతని భార్య రిసీవ్ చేసుకుంది.