రాహుల్ మళ్ళీ అడిగాడు. "రూటేంటి భాయ్ ఇలా ఉంది. విజయవాడ, హైదరాబాద్ రోడ్డు ఇప్పుడు చాలా బాగుంది కదా."
కారు ఎడం వైపు తిప్పాడతను. అక్కడ రోడ్డే కనిపించలేదు. రెండువైపులా పెద్ద పెద్ద చెట్లు పొదలు. రాహుల్ కి భయం వేసింది. వీల్లెటు వెళ్తున్నారు?
శిశిర చేయి మీద తట్టి "శిశిరా" అని పిల్చాడు నెమ్మదిగా.
మంచి నిద్రలో వుందేమో బలవంతంగా కళ్ళు తెరిచి "వచ్చేశామా?" అంది.
ఆమె వైపు బాగా ఒంగి చెవిలో అన్నాడు "వీళ్ళు దారితప్పారో, కావాలనివచ్చారో రూటు మార్చారు. గెటప్ బి అలర్ట్."
శిశిర మత్తు వదిలిపోయింది ఆ మాటలకి"ఏంటి?" గట్టిగా అనేసింది.
ముందు సీట్లో ఉన్నతను వెనక్కిచూసి "ఏమైంది?" అన్నాడు.
రాహుల్ అదే అదనుగా మళ్ళీ అడిగాడు "రూటు మారిందేంటి భాయ్..."
రాహుల్ పక్కతను కసురుతూ అన్నాడు. "ఏయ్ చుప్ బే.... ఏంటి అడిగిందే అడుగుతున్నావు మాకు తెల్వదా రూటేంటో."
అతని మొరటు మాటలకి చిర్రెత్తింది రాహుల్ కి. తమాయిన్చుకుంటూ అన్నాడు.
"తెలిసినా ఒక్కోసారి చీకట్లో దారి తప్పడం సహజం. ఇట్స్ నాచురల్. ఒక్కసారి చూసుకోండి సార్."
"ఎక్కువ మాట్లాడకోయ్ . మాకు తెలుసు ఏం చేయాలో ముందు సీట్లోంచి వచ్చిందీ మాట."
ఈసారి రాహుల్ తో పాటు శిశిరకి కూడా అనుమానం భయం, కోపం ముప్పిరిగొన్నాయి.
"తెలిస్తే ఇటేందుకు వచ్చారు?" గట్టిగా అరిచింది.
రాహుల్ పక్కన కూర్చున్నతను కుడిచేయి చాచి శిశిర తోడ మీద గిచ్చి అన్నాడు 'ఈడైతే మజా వుంటది నీతోని."
శిశిర విసురుగా అతని చేయి తోసేస్తూ గట్టిగా అరిచింది . "ఈడియట్ చెప్పుతో కొడతాను. ఎంటిరా వాగుతున్నావు" కారు కీచుమంటూ ఆగింది.
రాహుల్ కి, శిశిర కి పరిస్థితి అర్ధమై పోయింది. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. దుర్మార్గులు, ఇద్దరం గోతిలో పడబోతున్నాం. శిశిర కి ప్రమాదం వాటిల్లబోతోంది.
రాహుల్ మెదడు చురుగ్గా ఆలోచించసాగింది. ఇప్పుడు కారు దిగి పరుగెత్తినా వాళ్ళని తప్పించుకోవడం ఇంపాజిబుల్. పైగా రెండు పక్కలా పొదలు.
ఓ పక్క అంధకారం, మరో పక్క వర్షం.
రిస్క్ తీసుకుని దిగి ఇలాంటి ప్రదేశంలో పరుగెత్తడం కష్టం. మొత్తం బురద బురదగా వుంటుంది. అక్కడ కాలుపెడితే జారిపడపోడమే.
ఎటు వెళ్ళాలన్నా ప్రమాదం గానే అనిపిస్తోంది. శిశిర ఆడపిల్ల. తను వాళ్ళని ఎదుర్కోడం చాలా కష్టం. ఇప్పుడు కండబలం కన్నా బుద్ది బలం కావాలి. ఏం చేయాలి?
శిశిర కి కూడా అర్ధమైపోయింది. ఇప్పుడు తన పరిస్థితి భయంకరంగా మారబోతోంది. వాళ్ళు కచ్చితంగా తనని నాశనం చేయడానికి ఇటు వచ్చారు. రాహుల్ అడ్డుపడితే వాడి ప్రాణాలు తీసినా తీస్తారు. శిశిరకి ఒక్కసారిగా రోజూ చదివే వార్తలు , టీవిలో క్రైం న్యూస్ గుర్తొచ్చాయి. భయంతో వణికిపోసాగింది. "ఎలా/ ఎలా/ రాహుల్" అంది ఏడుపు గొంతుతో. రాహుల్ ఓదార్పుగా ఆమె చేతిని తట్టాడు.
ముందు సీట్లో కూర్చున్నవాళ్ళు దిగారు. వెనక డోర్ తెరిచి రాహుల్ వైపు చూసి "ఏయ్ దిగరా " అన్నాడు. రాహుల్ దిగలేదు. మాట్లాడలేదు.
రాహుల్ పక్కన కూర్చున్నతను "చెప్తుంటే అర్ధం ఆయితలేదా? దిగుబే" అన్నాడు.
శిశిర వణికి పోతూ రాహుల్ చేయి గట్టిగా పట్టుకుని "ఒద్దు రాహుల్ దిగొద్దు" అంది.
"ఏందే నకరలైతున్నాయా?' అంటూ రాహుల్ ని కారులోంచి తోస్తూ శిశిర పక్కకి వచ్చి రెండు చేతుల్తో ఆమెని పట్టుకున్నాడతను.
రాహుల్ కారులోంచి దాదాపు కింద పడిపోయేవాడే. నిలదొక్కుకుంటూ అన్నాడు. "బ్రదర్స్ ప్లీజ్ అమేనేం చేయొద్దు . ఇది కరెక్ట్ కాదు. మనం మనుషులం బివెహ్ లైక్ హ్యూమన్ బీయింగ్."
"నోర్మూసుకో నీకు ఇంగ్లీషు వచ్చని మాకు తెలుసు. ఎక్కువ మాట్లాడకు. ఇంత చల్లగా వున్న రాత్రి ఇంత అందమైన అమ్మాయి మేము వదలడానికి పిచ్చోళ్ళం కాదు" మరొకతను రాహుల్ మెడ పట్టుకుని లాగాడు.
"బ్రదర్స్ ప్లీజ్.... మీరు పదినిముషాల ఎంజాయ్ మెంట్ కోసం చూస్తున్నారు. ఆ తరువాత జీవితాంతం మీరు నరకం చూడాల్సి వస్తుంది. నా మాట వినండి. మనుషుల మై పుట్టినందుకు మనుషుల్లా బతకాలి. బ్రదర్స్ మీకూ సిస్టర్స్ వుంటారు. వాళ్ళని గుర్తు చేసుకోండి."
ఎవరూ ఇంక రాహుల్ మాట వినదల్చుకునేలా లేరు. ఒకతను రాహుల్ కాలర్ పట్టుకుని దూరంగా లాక్కేళుతుంటే మిగతా ఇద్దరూ శిశిర మీద పడ్డారు.
శిశిర "రాహుల్ , రాహుల్ సేవ్ మీ " అని ఏడుస్తూ గట్టిగా అరవసాగింది.
రాహుల్ బుర్ర వేగంగా పనిచేయసాగింది. రెండు చేతుల పిడికిళ్ళు బిగించి గట్టిగా తనని పట్టుకున్నవాడి పొట్టలో గుద్దాడు. తన బలమే తప్ప ఎదుటి వాడి బలం అంచనా వేయలేని అతను ఆదేబ్బకి విసురుగా నాలుగడుగులు వెళ్ళి బోర్లా పడ్డాడు బురదలో. అతను బూతులుతిడుతూ లేచేలోగా మెరుపులా వెళ్ళి రాహుల్ శిశిర మీద పడిన వాళ్ళిద్దరి కాళ్ళూ బలంగా లాగి కారులోంచి కిందపడేసి గట్టిగా అరిచాడు "శిశిరా! కమాన్ డోర్ తీసుకుని దిగి డ్రైవింగ్ వైపురా."
శిశిర అదే అదనుగా గభాల్న తనవైపున వున్నడోర్ తీసుకుని బురదలో కూరుకుపోతున్న కాళ్ళను ఈడ్చుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. అప్పటికే అమే చున్నీ లాగేసి ఎక్కడో పారేశారా కామంధులు.
పడిపోయిన వాళ్ళల్లో ఒకతనులేచి రాహుల్ ని పిడిగుద్దులు గుద్దుతున్నాడు. రాహుల్ కూడా కొడుతున్నాడు కానీ వాళ్ళ బలం ముందు నిలవలేక పోతున్నాడు. అతని పెదాలకి వెచ్చటి రక్తం తగిలింది. మరొకతను శిశిర వైపు వెళ్లి కారులోంచి ఆమెని లాగుతున్నాడు. శిశిర ప్రతిఘటిస్తూనే ఏదైనా ఆయుధం దొరుకుతుందేమో అన్నట్టు కళ్ళు అటూ ఇటూ తిప్పి చూడసాగింది.
అతను కాళ్ళు కట్టుకుని లాగడంతో రెండు సీట్ల మీద వెల్లకిలా పడిపోయింది. కాళ్ళు రెండూ నేలమీద అనాయి. తల స్టీరింగ్ కి కొట్టుకుంది. పావుభాగం శరీరం మాత్రమే కారు సీటు మీద వుంది.
శిశిర వేగంగా కాళ్ళేత్తి అతని మొహం మీదా, గుండెల మీదా తన్నసాగింది. ఆతను బలంగా ఆమె రెండు కాళ్ళు పట్టుకుని, మీదకి ఎగబాకి ఒకచేత్తో ఆమె రెండు చేతులు పట్టుకుని ఆమెని మరికాస్త పైకి నెట్టాడు. మరోసారి ఆమె తలకి స్టీరింగ్ తగిలింది. బాధగా కెవ్వుమంది. అతను కాళ్ళను పట్టుకున్న చేయి వదిలి రెండో చేయి ఆమె టాప్ మీద వేశాడు. శిశిర కాలు జాడించి తన్నబోతుంటే కుడికాలు దాష్ బోర్డు మీదకి పడి కాలికి ఏదో తగిలింది.
శిశిర పాదాలతో రెండు మూడు సార్లు అటూ, ఇటూ లాగింది ఆ వస్తువుని దొర్లుతూ వున్న ఆ వస్తువు స్పర్శ ని బట్టి అది బాటిల్ అని అర్ధమైంది ఆమెకి.
శిశిర ఆలోచించలేదింక. బలమంతా ఉపయోగించి కుడిచేయి అతని చేతుల్లోంచి విదిపించుకుంది. అతను ఆమెని మరికాస్త పైకి జరిపి ఆమె నడుం పట్టుకోడానికి రెండు చేతులూ నడుం కిందికి పోనిచ్చాడు. అదే అదనుగా గభాల్న చేయిచాచి సీటు కిందికి పోనిచ్చి అటూ ఇటూ వెతికింది. అదృష్టం బాగుంది.
బ్రాందీనో, విస్కీ నో తాగి వదిలేసినా ఖాళీ గాజు సీసా . అంతే అది తీసుకుని తనమీద పడి మొహం మీదా, మేడమీదా రక్కుతున్న అతని తల మీద లాగి కొట్టింది. శిశిర కారు దిగింది రాహుల్ కి సాయం చేయడానికి. రాహుల్ వారిస్తూ అరిచాడు "దిగకు నేనొస్తా సీట్లోనే వుండు" శిశిర తిరిగి కారులో కూర్చుంది.
వికృతంగా అరిచి తల పట్టుకుని శిశిరని బూతులు తిడుతూ వాడు కిందపడ్డాడు.
అప్పటికే రాహుల్ రెండు చేతుల్తో అందినంత బురద తీసి తనని కొడుతున్న ఇద్దరు వ్యక్తుల మొహాల మీదకి ఎడా పెడా చల్లుతున్నాడు. వాళ్ళు బూతులు తిడుతూ ఒకచేత్తో తుడుచుకుంటూ మరోచేత్తో రాహుల్ ని తోసేయడానికి ప్రయత్నిస్తున్నారు.
రాహుల్ ఇంక ఆగలేదు. మరికాస్త బురద తీసి వాళ్ళ మొహాల మీద విసిరి కొట్టి గభాల్న కారు దగ్గరకు పరుగెత్తి డ్రైవింగ్ సీటులో కూర్చుని బలంగా డోర్ లాగి , కారు స్టార్ట్ చేశాడు. మొహం నిండా వాడి గోళ్ళు గుచ్చుకుని మంట పెడుతుంటే శిశిర సీటులో సరిగా కూర్చుంది.
కళ్ళ నిండా, వంటి నిండా పడిన బురద తుడుచుకుంటూ ఆ ఇద్దరూ కాళ్ళీడ్చుకుంటూ కిందపడి గిలగిలా కొట్టు కుంటున్న వాడి దగ్గరకు వచ్చేలోగా కారు నాలుగు గజాలు ముందుకు పోవడం గమనించి "ఒరేయ్ ల....కొడకా" అని అరుస్తూ వాళ్ళల్లో ఒకడు కారు వెనకాల పరుగెత్తుకుంటూ రావాడం, జారిపడడం సైడ్ మిర్రర్ లోంచి గమనించిన రాహుల్ కారు కుడి పక్క పొదల్లోకి పోనిచ్చి, అతి కష్టం మీద రివర్స్ చేసుకుని వచ్చిన దారినే తిప్పాడు.
వాళ్ళు "అరేయ్ నా కారురా, కారు తీసుకెళ్ళిపోతున్నాడు పట్టుకోండిరా" అని అరుచుకుంటూ కారుకి ఎదురుగా పరుగెత్తుకుని వస్తుంటే కసిగా యక్సిలేటర్ తొక్కాడు రాహుల్.
బురద చిమ్ముతూ కారు మరికొంచెం ముందుకు వెళ్ళింది.
అదృష్టవశాత్తు పొదలను దాటి , బురద లోంచి కొంచెం పైకి వచ్చింది. అటు ఇటూ పొదలు, పెద్ద పెద్ద చెట్లు, మధ్యలో చాలా సన్నటి రోడ్డు.... ఎదురుగా మరో వెహికల్ రాకపోతే వేగంగా వెళ్ళిపోవచ్చు. హెడ్ లైట్స్ వెలుగులో చిన్న రోడ్లు అయినా తారు రోడ్డు అని గమనించి కారు స్పీడు పెంచాడు. వాళ్ళల్లో ఎవరో కారు తగిలి పడిపోవడం మిగతా ఇద్దరూ గట్టిగా బూతులు తిడుతూ కారు వెనకాల రావడం గమనించినా ఆగకుండా పోనిచ్చాడు. కారు బాగా ముందుకు వచ్చింది. దూరంగా పెద్ద రోడ్డు కనిపించింది . "ఇక్కడి నుంచే వాళ్ళు దారి మళ్ళించారు" అన్నాడు రాహుల్ రోడ్డు వైపు చూస్తూ.
శిశిర రెండు చేతుల్లో మొహం కప్పుకుని వెక్కివెక్కి ఏడవసాగింది.
"శిశిరా ఏడవకు ప్లీజ్ ...నువ్వేడిస్తే నాకువున్న ధైర్యం పోతుంది. దేవుడి దయవలన మనం బయటపడ్డాం. పద!మళ్ళీ సూర్యాపేట వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేసి, ఈ కారు అక్కడ హండోవర్ చేసి, అక్కడే తెల్లరిందాకా వుందాం. లేదంటే మరో మంచి బస్సు వస్తే వెళ్ళిపోదాం సరేనా? ఏడవకు. నీకు తోడుగా వుండి పెళ్ళికి తీసుకువచ్చాను. క్షేమంగా నీ పేరెంట్స్ కి నిన్ను అప్పగించడం నా భాద్యత. అయినా మీ ఆడపిల్లలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ని ధైర్యంగా, సాహసంగా బుద్ది బలంతో ఎదుర్కోవాలి కానీ ఎడుస్తారెంటి?"
"వాడి తల మీద సీసాతో కొట్టాను అది సాహసం కాదా! వాడు చచ్చాడో , బతికాడో కూడా చూడలేదు" వెక్కుతూనే అంది.
రాహుల్ గుండెల నిండా గాలి పీల్చుకుని హాయిగా నవ్వి అన్నాడు. "వాడెం చావలేదు. నువ్వేం దిగులు పడకు. అయినా మీ ఆడపిల్లలు ప్రతిదానికీ ముందు ఎడుస్తారేం? ఇలాంటి విషమ పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అని ముందు బుర్రకి పదును పెట్టాలి."
"నువ్వు చెప్పేది చాలా బాగుంది. ఓ పక్కభయంతో గుండె ఆగిపోతే ఆలోచన కూడానా? అయినా చేతిలో ఆయుధం లేకుండా ముగ్గురు వ్యక్తులను ఎలా ఎదుర్కోగలం." అంటున్న శిశిర వైపు చూస్తూ "పిచ్చిదానా, మన బుర్ర ఉపయోగించి ఆలోచిస్తే ప్రకృతే మనకి బోలెడన్ని అయుధా;లిస్తుంది. నా చేతిలో ఏ ఆయుధం వుందని చెప్పు ఇప్పుడు" అన్నాడు రాహుల్.
శిశిర కన్నీళ్లు చేత్తో తుడుచుకుంటూ అతని వైపు చూసి అంది.... "నిజమే భయంతో అరిచే కన్నా కర్తవ్యం అలోచించి ప్రమాదాన్ని దాటాలి. అయినా జంతువులలో క్రూర జంతువులేవో మనకి తెలుసు , కానీ మనుషుల్లో క్రూరులెవరో , మంచి వాళ్ళెవరో ఎలా తెలుస్తుంది రాహుల్?
"అవును ఎలా తెలుస్తుంది" అనుకున్నాడు రాహుల్ నిట్టురుస్తూ.
-----------