హైవే
సమయం రాత్రి పదకొండున్నర.
విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళే ఒల్వో బస్సు టెర్మినల్ నుంచి బయల్ద్రింది.
కుండపోతగా కురుస్తోంది వాన. అసలే విపరీతమైన రద్దీ. దానికి తోడూ ఉదృతంగా కురుస్తున్న వర్షం నెమ్మదిగా నిక్కుతూ,నీలుగుతూ కృష్ణానది బ్రిడ్జి మీదికి వచ్చింది.
శాలువా తలమీంచి చెవులకు కప్పేస్తూ లాక్కుని ముడుచుకుని కూర్చుంది శిశిర.
ఉదృతంగా కురిసిన వర్షాలకు కృష్ణానది లో నీళ్ళు పరవళ్ళు తొక్కుతున్నాయి.
"ఏంటో పెళ్ళికి వచ్చాం. వెళ్తున్నాం కాసేపు కృష్ణానది బ్రిడ్జి మీద తిరగలేదు. దుర్గమ్మ ని దర్శించుకోలేదు. విజయవాడ అందాలు వీక్షించలేదు. మళ్ళీ ఎప్పుడోస్తామో ఏంటో'దిగులుగా అంది.
"విజయవాడ రావదానికేం ఎప్పుడంటే అప్పుడు రావచ్చు...దీనికేం వీసా కావాలా?" కొంచెం అసహనంగా అన్నాడు రాహుల్.
"ఏంటి వచ్చేది! హైదరాబాద్ లో పుట్టాను, పెరిగాను, పాతికేళ్ళు వచ్చాయి. చిన్నప్పు డెప్పుడో అమ్మా, నాన్నా తీసుకెళ్ళారుట సాలార్ జంగ్ మ్యూజియం కి. నాకు గుర్తు కూడా లేదు మళ్ళీ వెళ్ళనా? పక్కన వున్నా టైం వుండద్దూ..."
శిశిర మాటలకి రాహుల్ ఏం మాట్లాడలేదు.
అతనికి టెన్షన్ గా వుంది. తెల్లవారితే మంచి కంపెనీ లో ఇంటర్వ్యూ వుంది. అక్కడికీ పెళ్ళయి భోజనాలు కాగానే బయలుదేరుదామనుకుంటే 'అప్పగింతల కార్యక్రమం వుంది. చూసి వెళ్దాం, ఇప్పుడు వెళ్ళినా అర్ధరాత్రి చేరతాం హైదరాబాదు, పదకొండు గంటలకు ఎక్కితే తెల్లవారేసరికి వెళ్ళిపోతాం ఎంతదూరం వుందని పెద్ద" అంది శిశిర.
"ఈ మహాతల్లికి అసలు టెన్షన్ లేదు. కూల్ గా ఉంటుంది" ఏం మనిషో , దానికి తోడూ అకస్మాత్తుగా ఈ వానొకటి. మరీ ఇంత దారుణంగా కురుస్తోందేంటో మూడు గంటలనుంచి ఆగకుండా కురుస్తోంది ' చిరాగ్గా అన్నాడు రాహుల్.
శిశిర, రాహుల్ విజయ్ చిన్నప్పటి నుంచీ పక్క పక్క ప్లాట్స్ లో వుంటున్నారు. ముగ్గురూ విడి,విడి స్కూల్స్ లో చదువుకున్నా ఇంజనీరింగ్ మాత్రం ముగ్గురూ హైదరాబాద్ లో ఒకే ఇంజనీరింగ్ కాలేజీ లో చదివారు.
విజయ్ పెదనాన్న కూతురు శృతి . వాళ్ళు విజయవాడ లో వుంటారు. అవడానికి పెదనాన్న కూతురైనాసొంత చెల్లెలి కన్నా ఎక్కువగా చూసుకుంటాడు విజయ్ శృతిని. కారణం అతనికి చెల్లెళ్ళు లేరు. ఒక్కడే కొడుకు. శృతి ఏడాది కోసారి హైదరాబాద్ వచ్చి వెళ్తూ వుండడంతో శిశిర కి, రాహుల్ కి కూడా మంచి స్నేహితు రాలైంది. ఆమె పెళ్ళికి విజయ్ ముందే పెళ్లి దగ్గరుండి ఏర్పాట్లు చేశాడు.
శిశిర, రాహుల్ శనాదివారాలు కలిసి వచ్చాయని రెండు రోజుల ముందు వచ్చారు. సోమవారం ఇద్దరికీ పెద్ద కంపెనీ లో ఇంటర్వ్యూ.ముగ్గురూ ఇటీవలే ఇంజనీరింగ్ పూర్తీ చేసి, ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డారు.
"ఈ వాన చూస్తుంటే సైక్లోన్ ఎఫేక్టా అనిపిస్తోంది. ఇంత సడన్ గా సైక్లోన్ ఎక్కడి నుంచి వచ్చి వుండచ్చు" అన్నాడు.
"సడన్ గానో, రెండురోజులు ముందే హెచ్చరించారో మనం నిన్నా, మొన్నావార్తలు తెలుసుకున్నామా?" లేదుగా" అంది శిశిర.
అయుండచ్చు అనుకుంటూ కిటికీ లోంచి బయటికి చూశాడు. ఏమీ కనిపించడం లేదు. అంటే విజయవాడ అవుట్ స్కర్ట్స్ కి వచ్చినట్టుంది బస్ అనుకున్నాడు.
"నాకు నిద్రొస్తోంది పడుకుంటున్నా" అంది శిశిర.
"పడుకో తల్లి చిరాగ్గా అన్నాడు. అతనికి చిరాకొచ్చింది. అసలే టెన్షన్ గా కూర్చుంటే కాసేపు ఏదో ఒకటి మాట్లాడి కాలక్షేపం చేయక నిద్రెంటో అనుకున్నాడు.
శిశిర కి కళ్ళు మూసుకున్న కొన్ని క్షణాల్లో నే మంచి నిద్ర పట్టింది. చేసేది లేక రాహుల్ కూడా కళ్ళు మూసుకున్నాడు. అతనికి కునుకు పట్టడం బస్ పెద్దకుదుపుతో ఆగిపోవడం ఒక్కసారిగా జరిగింది.
ఆ కుదుపుకి శిశిర కెవ్వుమంటూ లేచింది. "ఏమైంది" ఆదుర్దాగా అడిగింది.
"ఏమో.... " బస్ ఎందుకాగిందా అన్నట్టు డ్రైవర్ క్యాబిన్ వైపు చూస్తూ అన్నాడు.
ఇంతలో బిలబిల్లాడుతూ మిగతా ప్రయాణీకులు లేచి డోర్ దగ్గరకు వెళ్ళడం, డ్రైవర్ బస్సు దిగేయడం చూస్తుండగానే గందరగోళం గామారిపోయింది. పూర్తిలోడ్ తో వెళ్తున్న లారీ బస్సుని గుద్దింది. బస్సు వెనుక వైపు పచ్చడి అయింది. అద్దాలు పగిలి రోడ్డు మీద పెంకులు చిందర వందరగా పడ్డాయి.
రాహుల్ కూడా దిగుతుంటే నేనూ వస్తా అంటూ శిశిర కూడా లేచి శాలువా కప్పుకుని రాహుల్ ని అనుసరించింది.
అప్పుడే తగ్గుముఖం పడుతోంది వాన. సన్నగా జల్లు మాత్రం పడుతోంది. ప్రయాణీకులంతా గుమికూడి ఏదేదో మాట్లాడుతున్నారు. డ్రైవర్, అతని అసిస్టెంట్ ఇద్దరూ , మరి పదిమంది మగవాళ్ళు లారీ డ్రైవర్ ని పట్టుకుని చితకబాదేస్తున్నారు.
వాళ్ళ మాటల్ని బట్టి డ్రైవర్ తాగి బండి నడిపిస్తున్నాడు.
అదృష్టవశాత్తు ప్రయాణీకులకి ఏమీ జరుగలేదు కానీ, గవర్నమెంట్ ప్రాపర్టీ అయిన బస్సు పాడైపోయింది. ఎవరో ట్రాఫిక్ పోలీసులకి ఫోన్ చేస్తున్నారు. సెల్ ఫోన్ ల టార్చి ఫోకస్ చేసి బస్సుని పరిశీలిస్తున్నారు కొందరు.
"ఎలా ఇప్పుడు? భయంగా అంది శిశిర.
"నాకూ అర్ధం కావడం లేదు."
"ఇప్పుడు ఈ బస్సు కదలదు. మరో బస్సు రావాలి,మనం వెళ్ళాలి."
"ఎక్కడ వుందాం అందాకా" ఎటుచూసినా పెద్ద. పెద్ద చెట్లు, మైదానాలు చీకటిగా ఉన్న పరిసరాలను చూస్తూ అంది.
రాహుల్ ఆమె మాట వినిపించుకోకుండా గుమికూడిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి 'ఇప్పుడేమన్నా బస్ వస్తుందంటారా సార్" అనడిగాడు.
అయన వినిపించుకోకుండా వేరే వాళ్ళతో లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం గురించి ఉపన్యాసం ఇవ్వసాగాడు. ఎవరూ ఎవరి గోలా వినిపించుకునేలా లేరు. ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడేస్తున్నారు.
కర్త్తవ్యం ఆలోచించకుండా ఇప్పుడీ ఉపన్యాసాలు, ప్లాష్ బ్యాక్ లు , అవసరమా అనిపించింది రాహుల్ కి.
గుంపు దగ్గర్నించి కదిలి శిశిర నిలబడిన చోటుకి వచ్చాడు. అడదదపా కార్ల జర్రున సాగిపోతున్నాయి కానీ ఎవరూ బస్సేందుకు ఆగిందో, ఇంతమంది ప్రయాణీకులు ఎటు వెళ్తారో, ఏదన్నా సాయం కావాలేమో అన్న ఆసక్తి చూపించకపోవడం శిశిర కి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది.
నలుగురు ఆడవాళ్ళు కలిసి బస్సుకి కొంచెం దూరంగా చెట్ల వెనక్కి వెళ్తున్నారు. ఎవరి అవసరం వాళ్ళది అనుకుంది శిశిర.
"ఏం చేద్దాం శిశిరా? టైం చూస్తె ఒంటిగంట దాటింది. ఇంకో బస్సు రావాలి . మనమంతా వెళ్ళాలి. ఆ బస్సులో చోటుండాలి. ఇంతమందినీ ఎక్కించుకుంటాడో లేదో ఆ డ్రైవర్ ఎలా? ఏం చేద్దాం?' దిగులుగా అడిగాడు.
'ఆలోచిస్తున్నాను.... ఇలారా" అంటూ రాహుల్ చేయి పట్టుకుని రోడ్డుకి అవతల పక్కకి తీసుకెళ్ళింది.
"కార్లు వెళ్తున్నాయి, ఎవరో ఒకళ్ళు లిప్ట్ ఇస్తారు ట్రై చేద్దాం" అంది.
ఇంతలో రెండు కార్లు వీళ్ళు చేయి ఊపినా చూడలేదో, చూసి కూడా అపలేదో వెళ్ళిపోయాయి.
"షిట్" విసుక్కుంది శిశిర. "మనకి లిప్ట్ ఇస్తే వాళ్ళ సీట్లు అరిగిపోతాయా? వెధవలు ఇద్దరే వున్నారు . కారు వెనకాల సీటు ఖాళీగా వుంది ఇవ్వచ్చు కదా"
"ఈ చీకట్లో మనం చేయి ఊపడం సూల్లేదేమోలే ఎవరో ఒకళ్ళు ఆపుతారు చూద్దాం" అన్నాడు.
ఇంతలో ట్రాఫిక్ పోలీసుల వెహికల్ రావడం, యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో జనం కోలాహలం ఎక్కువైపోయింది.
"అదిగో ఇంకో కారోస్తోంది" అంది శిశిర రెండడుగులు రోడ్డు వైపు వేస్తూ.
"ఏయ్ అలా వెళ్ళకు అసలే హైవే వాళ్ళు స్పీడుగా వెళ్తున్నారు డేంజర్" అన్నాడు ఆమెని వారిస్తూ.
శిశిర వినిపించుకోకుండా రెండు చేతులు గట్టిగా ఊపసాగింది కారు ఇంకా కొంచెం దూరంగా ఉన్నప్పుడే.
అలా ఊపుతూనే వుంది దగ్గర కొచ్చిందాకా , కారు సడన్ బ్రేక్ తో ఆగింది.
"కమాన్ రాహుల్" అంటూ రాహుల్ చేయి పట్టుకుని కారు దగ్గరకికి వెళ్ళింది.
డ్రైవింగ్ సీటులో ఒకతను, అతని పక్కన మరొకతను, వెనకాల సీటులో ఒకతను ముగ్గురూ మగవాళ్ళే ముప్పై, ముప్పై ఐదేళ్ళ కుర్రాళ్ళు గ్లాస్ ఓపెన్ చేశాడు డ్రైవింగ్ సీటు పక్కతను.
శిశిర తల ముందుకు వంచి "లిప్ట్ కావాలండీ మీరు వెళ్ళేది హైదరాబాదే గా" అడిగింది .
"యస్...." అన్నాడతను.
"బస్ కి యాక్సిడెంట్ అయింది. ,మేము హైదరాబాద్ వెళ్ళాలి. రేపు ఉదయం ఇంటర్వ్యూ వుంది."
"ఎక్కండి" అన్నాడతను వెనకాల కూర్చున్నతనితో 'డోర్ తీయి' అంటూ.
శిశిర ఆనందంగా "థాంక్యూ" అంటూ రాహుల్ తో అంది . "మన బ్యాగులు తీసుకురా"
రాహుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు లోంచి ఇద్దరి బ్యాగులు తీసుకుని వచ్చాడు.
ఇద్దరూ వెనకాల సీటులో కూర్చున్నారు. కారు కదిలింది. హమ్మయ్య గండం గడిచింది అనుకున్నారిద్దరూ.
కొంచెం దూరం వెళ్ళిందాకా ఎవరూ మాట్లాడలేదు. తరువాత ముందు కూర్చున్న వాళ్ళలో ఒకతను అడిగాడు. "ఏం చదువుకున్నారు?"
"ఇంజనీరింగ్" ఇద్దరూ ఒకేసారి చెప్పారు.
"ఓ....మీరిద్దరూ క్లాస్ మెట్సా"
"అవును, మేము విజయవాడ ఒక ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వస్తున్నాం."
"ఓ ఐసీ" మళ్ళీ మౌనం.
"కొంచెం సేపట్లో సూర్యాపేట వస్తుంది. అక్కడ వీళ్ళు కారాపితే టీ తాగుదాం నాకు టెన్షన్ తో తలనొప్పిగా వుంది" అన్నాడు రాహుల్ శిశిర చెవిలో రహస్యంగా.
"సరే" అంది శిశిర అదే స్వరంతో.
ఇద్దరూ సూర్యాపేట కోసం ఎదురుచూస్తూ విండోలోంచి బయటికి చూస్తూకూర్చున్నారు.
మరో అరగంట లో సూర్యాపేట లో ఆగింది కారు. అందరికీ రాహులే టీ తెచ్చాడు.
అప్పుడు ఆ లైట్ల వెలుగులో అందరూ ఒకళ్ళ మోహాలు ఒకళ్ళు చూసుకున్నారు. అపరిచిత వ్యక్తుల్ని చూస్తుంటే ఏదో తేడాగా అనిపించింది రాహుల్ కి. వాళ్ళల్లో ఒకతను తప్ప మిగతా ఇద్దరూ పెద్దగా చదువుకున్న వాళ్ళలా కనిపించడం లేదు. చదువుకున్నవాడిలా ఉన్నతను మాత్రం కొంచెం ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు. అతనే డ్రైవ్ చేస్తున్నాడు.
మళ్ళీ శిశిరతో రహస్యంగా అన్నాడు "నాకేంటో వీళ్ళు నచ్చలేదు.
"అయితే! మనమేం వీళ్ళతో పర్మినెంట్ గా స్నేహం చేయబోడం లేదుగా? హైదరాబాద్ చేరాక వాళ్ళెవరో, మనమెవరో " అంది . కారు తిరిగి కదిలింది.
ఇద్దరికీ కొంచెం రిలాక్స్ గా అనిపించి కళ్ళు మూసుకుని కూర్చున్నారు.
శిశిరకి నిద్ర పట్టింది. రాహుల్ కి ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిచాడు. తన పక్కన కూర్చున్నతను సీటు మీంచి ఒంగి ముందు కూర్చున్నతనితో చాలా నెమ్మదిగా ఏదో మాట్లాడుతున్నాడు. రాహుల్ విండోలోంచి బయటికి చూశాడు.
కారు హైవే మీద వెళ్తున్నట్టు లేదు. చాలా చిక్కటి పొదలు కనిపిస్తున్నాయి రెండు వైపులా. మధ్యలో రోడ్డు సన్నగా వుంది.
ఇదేంటి వీళ్ళు ఎట్నించి వెళ్తున్నారు? అనుమానంగా అడిగాడు "భాయ్ ఇదే రూటు?"
వంగి మాట్లాడుతున్న అతను సరిగా సర్దుకుని కూర్చున్నాడు. ఎవరూ మాట్లాడలేదు.