Read more!
 Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 3

            ఈ కాలం
    "ఏంటంత అర్జెంటుగా మాట్లాడాలని ఫోన్ చేశావు?' లోపలికి అడుగు పెడుతూ అడిగింది లాయర్ సంధ్య లాలిత్య ని.
    "ముందు కూర్చో ... వెళ్ళిపోవాలా ?' చిరాగ్గా అంది లాలిత్య.
    "వెళ్ళే దాన్ని అయితే ఇక్కడి కెందుకు వస్తాను... చెప్పు" అంటూ సోఫాలో కూర్చుంది సంధ్య.
    లాలిత్య డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఫ్రిజ్ లోంచి ఆరెంజ్ జ్యూస్ తీసి గాజు గ్లాసులో పోసి తెచ్చింది.
    "ఎండన బడి వచ్చావు తాగు చిరాకు తగ్గుతుంది" అంటూ సంధ్య చేతికి గ్లాసు అందించింది.
    సంధ్య గ్లాసందుకుని నవ్వుతూ అంది "చిరాకు కాదు , పరాకు కాదు . నువ్వలా కొంపలంటుకుపోతున్నట్టు ఉదయాన్నే ఫోన్ చేసి రమ్మంటే ఏం జరిగిందా అని టెన్షన్ గా వచ్చాను అంతే."
    లాలిత్య నవ్వలేదు.. గడ్డం కింద చేయి ఆనించుకుని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంది. 
    "చెప్పవే...."ఆమెని పరీక్షగా చూస్తూ అంది సంధ్య.
    సరిగ్గా కూర్చుంటూ సంధ్య వైపు చూసి నింపాదిగా అంది "నాకు విడాకులు కావాలి.
    సంధ్య ఒక్క క్షణం తెల్లబోయి చూసి ఫకాల్న నవ్వి అంది "ముందే చెప్పి వుంటే బ్యాగులో వేసుకుని వచ్చేదాన్ని గా.."
    "జోక్ కాదు సంధ్యా! నిజంగా చెబుతున్నాను. ఇంక మా ఇద్దరికీ పడదు. సంసారం సాగదు. విడిపోతే ఎవరి బతుకు వాళ్ళు బతకొచ్చు. ఒకళ్ళ నొకళ్ళు ద్వేషించుకుంటూ ఒక గూట్లో ఎలా కలిసి వుంటాం చెప్పు !'
    సంధ్య లాలిత్య మొహంలోని సీరియస్ నెస్ గమనించింది. నెమ్మదిగా జ్యూస్ తాగుతూ ఆమె ఇంకా  ఏం చెబుతుందో అన్నట్టు చూడసాగింది.
    లాలిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది.
    సంధ్యా లాలిత్యా చిన్నప్పటి నుంచి క్లాస్ మేట్స్. సంధ్య లాయర్ అయింది లాలిత్య ఇంజనీరు అయింది. సంధ్యకి సొంతంగా ప్రాక్టీసు ఉంది. మంచి సివిల్ లాయర్ గా పేరుంది. ఆ చనువుతో లాలిత్య ఈ నిర్ణయానికి వచ్చిసంధ్యకి ఫోన్ చేసింది ఓసారి రమ్మని.ఇలాంటిదేదో వుందని సంధ్య ఊహించలేదు.ఎందుకంటె వ్యాస్,లాలిత్య లది చక్కటి జోడి.వ్యాస్ చాలామంచివాడు. నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు.ఏ చెడ్డ అలవాట్లు లేనివాడు. మంచి ఉద్యోగం , కంఫర్టబుల్ శాలరీ. ఒకటినొకరు కోరి చేసుకున్నారు. పెద్దలు చేసిన పెళ్లి అయినా కుదుర్చుకున్నది మాత్రం వాళ్ళే.  లాలిత్య కూడా మంచి పిల్లే. ఇద్దరూ ఇంజనీర్లే. ఏమైంది?
    సంధ్యకి అర్ధం కాలేదు. పడట్లేదు అంటే ఏం జరుగుతోంది. ఎందుకు పడటం లేదు. పెళ్ళయి రెండేళ్ళు అవుతోంది. అప్పుడే విడాకులు తీసుకునేంత గొడవలు ఏం జరిగి వుంటాయి వీళ్ళ మధ్య.
    "ఏం జరిగిందే ? ఎందుకు ఇంత దూరం వచ్చావు"అడిగింది అనుమానంగా.
    నిట్టూర్చింది లాలిత్య. "ఏం చెప్పను?" అంది ఆమె వైపు చూసి.
    "ఏం జరిగిందో అదే చెప్పు..."
    "ఏమీ జరగడం లేదు..."
    "అంటే...."
    "మా ఇద్దరి మధ్యా మాటా మంతీలేదు. సరదాలు,సరసాలు అసలే లేవు. తనదారి తనది. నాదారి నాది అన్నట్టు వుంటోంది. ఏమో మేము ఒకళ్ళ నొకళ్ళు సరిగా అర్ధం చేసుకోకుండా తొందరపడి పెళ్ళి చేసుకున్నాం అనిపిస్తోంది. అదృష్తవశాత్తు మాకు పిల్లలు లేరు. వుండి ఉంటే నేనీ విషయం అలోచించేదాన్ని కాదు."
    సంధ్య సాలోచనగా చూసింది. "వ్యాస్ తో ఈ విషయం చర్చించావా?"
    లాలిత్య కొన్ని నిముషాల నిశ్శబ్దం తరువాత అంది "తనే ఈ ప్రపోజల్ తెచ్చాడు."
    "తనే తెచ్చాడా?" విస్తుబోతూ చూసింది. "ఎందుకు? ఎప్పుడు? ఎలా ?"
    లాలిత్య మాట్లాడలేదు.ఆమెకి నెలక్రితం వ్యాస్ కి, తనకీ మధ్య జరిగిన ఘర్షణ గుర్తొచ్చింది.
    ఆరోజు లాలిత్య ఆఫీసు కి వెళ్ళడానికి తయారై క్యాబ్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. క్యాబ్ రాలేదు. ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో వున్నానని చెప్పాడు డ్రైవర్. ఆరోజు సి.ఇ.ఓ తో రెండు మూడు మీటింగ్స్ వున్నాయని త్వరగా రమ్మని చెప్పాడు మేనేజర్. టైం అయిపోతోంది. టెన్షన్ గా బాల్కనీ లోకి లోపలికి తిరుగుతోంది లాలిత్య.
    అంతలో వ్యాస్ ఆఫీసు నుంచి హడావుడిగా వచ్చాడు.
    భార్యని చూడగానే హుషారుగా అన్నాడు . "లాలీ ఈ రోజు లీవు పెట్టేయ్యవా" ఎటన్నా వెళ్లి సరదాగా ఎంజాయ్ చేద్దాం. నాకివాళ చాలా బోర్ గా వుంది."
    "లీవా? ఇవాళా? ఇంకా నయం. ఇప్పటికే క్యాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నాను. కుదరదు. సి.ఇ.ఓ తో మీటింగ్ వుంది"అంది లాలిత్య.
    "నాకన్నా నీకు సిఇఒ మీటింగ్ ఎక్కువా?ఎన్నాళ్ళ యింది కాస్త సరదాగా గడిపి మనం.... నాకీ మెకానికల్ లైఫ్ చాలా విసుగ్గా వుంది. అసలు మనం భార్యాభర్త లమేనా అని అనుమానం కూడా వస్తుంది" కోపంగా ఆడిగాడు. ఆ అడగడం లో భాధా, ఉక్రోషం కలగలసి అతని మొహాన్ని కందగడ్డ లా మార్చేయడం గమనించింది లాలిత్య.
    "ఏం చేద్దాం ? మన ఉద్యోగాలు అలాంటివి. కొత్త ప్రాజెక్టు వచ్చింది. దానికి టార్గెట్ పెట్టి చంపుతున్నాడు మా మేనేజర్ . పని పని నువ్వు చూస్తూనే వున్నావుగా ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే వున్నాను. హార్డ్ లీ ఫైవ్ అవర్స్ పడుకుంటున్నానేమో ". అదేస్థాయి లో అంది లాలిత్య . మళ్ళా అంది. "నీ దారిన నువ్వు కూడా బిజీగానే వున్నావుగా! నన్నంటావే. లాస్ట్ సాటర్ డే నేను ఫ్రీగా వున్నాను. నువ్వా ల్యాప్ టాప్ పెట్టుకుని కనీసం వంటలో సాయం కూడా చేయలేదు."
    "నాదీ ఉద్యోగమేగా. నాకూ నెలకి యాభై వేలిస్తున్నారుగా. నేనూ పని చేయాలి. కానీ పనేనా జీవితం అంటే... అసలు మనం ఈ రెండేళ్ళ లో ఎన్ని రాత్రులు సంసారం చేశామో నీకు గుర్తుందా? ఇలాగే జరిగితే నువ్వు నా భార్యవన్న విషయం కూడా మర్చిపోతాను ' కసిగా అన్నాడు వ్యాస్.
    ఇంతలో క్యాబ్ రావడంతో లాలిత్య పరిగెత్తింది.
    ఆ సంఘటన ఆధారంగా మర్నాటీ నుంచి ఇద్దరి మధ్యా వాదోపవాదాలు , గొడవలు , అలకలు, కోపాలు ఎక్కువైపోయాయి.
    "ఏనాడన్నా నామోహన కమ్మగా వండి పెట్టావా? మొగుడికి వంట చేసి పెట్టలేని  పెళ్ళాం నాకెందుకు?" మండిపడ్డాడు వ్యాస్ ఒరోజు కయ్యానికికాలు దువ్వుతూ...
    "వంట పెళ్ళామే చేయాలని రూలేం లేదు. నువ్వు కూడా చేయొచ్చు . పోనీ నీకు పెట్టకుండా నేను పంచ భక్ష్య పరమాన్నాలు చేసుకు తింటున్నానా? ఎందుకలా నోరుపారేసుకుంటావు?"
    "నేను నోరు పారేసుకోవడం కాదు . నువ్వే ఇంకెక్కడో నీ మనసు పారేసుకున్నావు. అందుకే నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావు. ఈ ప్రపంచంలో నువ్వేనా ఉద్యోగం చేస్తున్న ఆడదానివి. నూటికి ఎనభై మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళంతా మొగుడితో కాపురాలు చేయడం లేదా? వండి పెట్టడం లేదా ?" వెటకారంగా అన్నాడు వ్యాస్.
    "షటప్.... ఏం మాట్లాడుతున్నావు? ఇదేనా నీ భార్య మీద నీకున్న నమ్మకం. ఇదేనా భార్యని గౌరవించే పద్దతి.... నేనే ఆ మాట అంటే.... " రెచ్చిపోయింది లాలిత్య.
    సడన్ గా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టిన లాలిత్య ను చూసి నిశ్చేష్టురాలింది సంధ్య.
    "ఏయ్ లాలిత్యా...కమాన్ ఏడవకు" ఆమె దగ్గరగా జరిగి కన్నీళ్లు తుడుస్తూ అంది. "సరేలే నువ్వనుకున్నట్టే చేద్దాం.... ఒకసారి అతనితో కూడా మాట్లాడటం నా ధర్మం.... అతను కూడా కావాలంటే ఆరునెలల్లో విడాకులు ఇప్పిస్తాను.... సరేనా? కూల్ డౌన్."
    "ఏంటో సంధ్యా.... మా ఇద్దరి మధ్యారోజు రోజుకీ గ్యాప్ పెరిగిపోతోంది. కొంతకాలం స్నేహితుల్లా ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటూ వుండేవాళ్ళం. వీకెండ్స్ సినిమాకో, మాల్ కో వెళ్ళి సరదాగా తిరిగి వచ్చేవాళ్ళం. ఈమధ్య చాలా రొటీన్ గా , మెకానికల్ గా అయిపొయింది లైఫ్.మామధ్య అసలు మాటలు లేవు" కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది.
    "ఒక్కసారి అతనితో కూర్చుని అతని మనసులో ఏముందో తెలుసుకోవచ్చుగా లాలిత్యా.,.."
    "ఇంకా ఏం తెలుసుకొను? రోజూ గొడవలు, కోపాలు అరుచుకోవడాలు....ఆఖరికి విడాకులు తీసుకుందాం నా మనసు విరిగిపోయింది అన్నాడు. నా మనసూ విరిగి పోయింది.విరిగిన పాలతో పెరుగు తోడేయ లెంగా సంధ్యా!"
    సంధ్య నిట్టురుస్తూ అనుకుంది. "మీరోక్కల్లె కాదులే లాలిత్యా ...ప్రస్తుతం వివాహ వ్యవస్థ లో ఏదో లోపం వస్తోంది. మంత్రాలలో బలం తగ్గిందో, మనుషుల్లో మమతలు తగ్గాయో!"
    అనుభవజ్ఞురాలైన సంధ్య కి బాగా తెలుసు. ఆవిడ దగ్గరకిరోజుకి కనీసం నాలుగు విడాకుల కేసులైనా వస్తుంటాయి. కొందరికి తప్పనిసరి పరిస్థితుల్లో విడాకులు ఇప్పించాల్సి వస్తోంది. అలాంటప్పుడు ఆమె ఎందుకీ వృత్తి ఎంచుకున్నాను నేను అని పశ్చాత్తాపపడుతూనేవుంటుంది. ఆమెకి ఒక్కోసారి భార్యాభర్తల్ని విడదీస్తున్న పాపానికే తనకి ఏ సంబంధమూ కుదరక ముప్పై కి దగ్గరవుతున్నా పెళ్ళి కాలేదేమో అని కూడా అనిపిస్తుంటుంది. ఇప్పుడు స్నేహితురాలే తనచేత మరో పాపం చేయిస్తోంది. 
    

 Previous Page Next Page