Read more!
 Previous Page Next Page 
ఒక కోయిల గుండె చప్పుడు  పేజి 2

    నీళ్ళు నిండిన హరిత కళ్ళకి మసగ్గా బ్లీడింగ్ హార్ట్. వెళ్ళిపోవాలి . నగలు, డబ్బుసూట్ కేస్ లో వున్నాయి. అవి తనవే కాబట్టి.... ఇది దొంగతనం కాదేమో! ఈ డబ్బు, నగలు కొంతకాలం ఆడుకుంటాయి... తరవాత ఉద్యోగం చూసుకోవాలి. టెన్త్ మాత్రం చదువుకున్న తనకి ఉద్యోగం ఎవరిస్తారు?
    అయితే ఎలా? ఎలా బ్రతకాలి? ఎలాగైనా బ్రతకాలి. స్వేచ్చగా.... హాయిగా... ఆనందంగా.... పచ్చిక బయళ్ళ మీద లేడిపిల్లలా.... అడవిలో నెమలిలా ...ఆడుతూ తుళ్ళుతూ బ్రతకాలి.
    ఈ పరువు ప్రతిష్టలనే పునాదులు కదిలించి.... రెండు కుటుంబాల గౌరవాన్ని మంట కలిపి పారిపోవాలి. ఈ లేత రెక్కల్ని రెపరెపలాడిస్తూ.... రివ్వున ఈవిశాల విశ్వం లోకి ఎగిరిపోవాలి. అటు పుట్టింట్లో పేదరికం వల్ల స్వేచ్చ లేదు. ఇటు మెట్టినింట్లో కలిమి వల్ల స్వేచ్చ లేదు.
    ఈ బ్రతుకిలా తెల్లరడానికి వీల్లేదు.. పారిపోవాలి. ఇష్టం లేని ఈ జీవితాన్నుంచి, ఇష్టమైన జీవితం వెతుక్కుంటూ సాగిపోవాలి. ఈ వర్షం తగ్గదా! ఈ రాత్రి గడిస్తే.... మళ్ళీ ఈ అవకాశం రాదు... కానీ..ఎలా?హరిత లో తెగింపు. ఏమైనా సరే వెళ్ళిపోవాలి. దృడంగా నిర్ణయించుకుంది. వంగిక్రిండ పెట్టిన సూట్ కేస్ అందుకుంది. బైట వరండా లో లైట్లన్నీ ఆఫ్ చేసింది. రోడ్డు మీద వెలుగుతున్న ట్యూబ్ లైట్ కాంతి లేతగా పడుతోంది.
    ఓసారి అడుగులు శబ్దం కాకుండా అన్ని గదుల్లోకి తొంగి చూసింది. అందరూ గాడంగా నిద్రపోతున్నారు. చలికి ముసుగులు బిగించి.... పనిపిల్ల కాళి.... వంటావిడ సీతమ్మ గారు.... బాయ్ కిష్టయ్య హరిత అత్తగారి గది వైపు వెళ్ళడానికి ధైర్యం చాల్లేదు. తలమీదుగా చీర చెంగు లాక్కుని, నెమ్మదిగా  వరండా తలుపుతీసి చీకట్లోకి నడిచింది.
    వాచ్ మెన్ క్వార్టరు కిటికీ లోంచి బెడ్ లైట్ వెలుగు కనిపిస్తోంది. గేటుకి పెద్ద తాళం కప్ప .
    హరితకీ నీరసం ముంచు కొచ్చింది. ఎలా?గోడ దూకాలా? పెదాలు కొరుక్కుంటూ నిలబడిపోయింది.
    హటాత్తుగా వెలుగు పడింది తాళం మీద.
    హరిత త్రుళ్ళిపడి వెనక్కి తిరిగింది.
    చేతిలో కర్ర సాయంతో అత్తగారు.
    మ్రాన్పడి పోయింది హరిత. చేతిలో సూట్ కేస్ జారిపోయింది.
    "లోపలికి రా' గంబీరమైన ఆవిడ స్వరం.
    హరిత కదులుతున్న అలలా ఆవిడని అనుసరించింది.
    "కూర్చో" ఆవిడ మంచం మీద కూర్చుంది.
    "చూడు హరితా! నేను ఉదయం నుంచే గమనిస్తున్నాను. బట్టలన్నీ సర్దుకున్నావనీ కాళి చెప్పింది. మీ అమ్మగారింటికి వెళ్తున్నావేమో నువ్వే చెప్తావులే అని అడగలేదు. నీ ప్రవర్తన నీ చూపులు నీ కళ్ళల్లో భయం...నాకెందుకో అనుమానం రేకెత్తించాయి.
    నాకు తెలుసు.... నీకు వాడితో సుఖం లేదు. ఈ ఇంట్లో స్వేచ్చ లేదు. యాభై ఏళ్ళ నుంచీ ఈ ఇంట్లోనే బ్రతికాను. అయన, మీ మామయ్యా బ్రతికున్నప్పుడు కూడాఇదే ఇల్లు ఇవే పరిసరాలు, ఇదే నిశ్శబ్దం. అయన వారసత్వంగా కొడుక్కిచ్చింది అయన అహమే... అయన స్వార్ధమే.... తరతరాలుగా మగవాడికి తన పూర్వీకుల నుంచి దక్కింది అహంకారమే . స్వార్ధమే . అయినా ఆ మగవాళ్ళతో ఆడవాళ్ళు బ్రతక్క తప్పటం లేదు. సృష్టి గడవాలి కదా! ఈ వాస్తవం తెలుసుకున్నాడు కాబట్టే , భగవంతుడు ఆడదానికి సహనం ప్రసాదించాడు. కానీ.... మీ తరం వాళ్ళకు.... ఎందుకనో ఆ సహనం కొరవడింది.. అయినా నేనిప్పుడు నిన్ను సతీసుమతిలా సహనంతో నీ భర్త లోని మార్పు కోసం ఎదురు చూడమని చెప్పను.
    నీ నిర్ణయం మార్చుకోమనీ చెప్పను. ఈ నిశ్శబ్దం లో బ్రతికిన నాకు కనీసం ఆఖరి మజిలీ లోనైనా ....నా మనసు పంచుకునే తోడూ కావాలనుకున్నాను. బీదింటిపిల్ల అయితే.... నా కష్టసుఖాలు అర్ధం చేసుకుంటుందనుకున్నాను. కానీ మనసనేది బీదవాళ్ళ కి, గోప్పవాళ్ళకి ఒకేలాగే వుంటుందని తెలిసింది.
    ఏ నిశబ్దాన్ని చేదించాలని ...నిన్ను తెచ్చుకున్నానో.... ఆ నిశ్శబ్దం నీకూ వేదనే మిగిల్చింది. నేడో రేపో రాలిపోయే నాకోసం నీ మనసు చంపుకుని ఉండిపొమ్మని కోరను. 
    తల్లికి తన కొడుకు యెంత దుర్మార్గుడైనా వాడి నుంచి విడిపోయే అవకాశం చట్టం కానీ శాస్త్రాలు కానీ ఇవ్వలేదు. ఎందుకంటె చనిపోయాక తలకొరివి పెట్టవలసిన వాడు కొడుకు కదా! కానీ భార్యకీ దుర్మార్గుడైన భర్త నుంచి నిస్సంకోచంగా విడిపోయే అవకాశం శాస్త్రాలు, చట్టం కూడా ఇచ్చాయి.
    నీకు లభించిన ఈ మహాదవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం నీకెంతో వుంది. కాకపొతే ఒక్కమాట. వెళ్ళేముందు ఎక్కడి కెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? వెళ్ళి ఏం చేయాలి?.... అని ఆలోచించుకుని వెళ్త బాగుంటుంది. పెద్దాదానిగా, అనుభవజ్ఞురాలిగా నీశ్రేయోభిలాషిగా ఇది నా సూచన మాత్రమే. ఆకాశంలో ఎగిరే పక్షికి కూడా ఓ గూడంటూ వుంటుంది కానీ, ఆడదానికి నాది అని చెప్పుకునే నీడ దొరకడం చాలా కష్టం. అందుకు నువ్వు మానసికంగా, శారీరకంగా కూడా చాలా శ్రమపడాలి."
    హరిత మంత్రముగ్ధ;లా కూర్చుండి పోయింది.
    పల్చటి ట్యూబ్ లైట్ కాంతి వరండా గుండా ఆవిడ మొహం మీద పడుతోంది. చీకటిని చీల్చుకుని ప్రసరిస్తున్న అ కాంతిలో బైట వర్షపు ధారలు, జలతారు తీగల్లా మెరుస్తున్నాయి. ఆ ప్రశాంతమైన వాతావరణం లో వినిపిస్తున్న ఆవిడ మృదు గంబీర స్వరానికి బైట కురుస్తున్న ఆ వర్షపు హోరు నేపధ్య సంగీతం లా వుంది.
    ఆవిడ మంచం వెనుక నుంచి కిటికీ గుండా లాన్ లో కనిపిస్తున్న బ్లీడింగ్ హార్ట్ ఎర్రగా.... గాయపడిన హృదయంలా ప్రకాశిస్తోంది.... అయితే ఆ హృదయం ఇప్పుడామె కి తన హృదయం లా కనిపించడం లేదు. యాభై ఏళ్ళ నుంచీ అణచుకున్న కోరికలతో , అణగారిన ఆశలతో.. అవమానాల గాయాలతో పగిలి, బీటలు వారిన అత్తగారి హృదయం లా....

                                                                        ---------- 
     

 Previous Page Next Page