Previous Page Next Page 
అసురవేదం పేజి 4

 

    "ఏమెవ్ అలివేలూ!"   

    ముందు తనని కాదనుకుంది హనిత. ఈసారి మరీ దగ్గరగా వినిపించింది.

    "నిన్నన్నే!"

    ఓ వృద్దురాలు ఆమె భుజంపైన చేయి వేసింది. ఎంత మారేవే అలీవేలూ? అవునూ మీ అయన పోర్టులో పని చేస్తున్నాడటగా? అబ్బాయి చెప్పడులే."

    "సారీ బామ్మగారూ. నేను అలివేలుని కాను"

    ఓ క్షణం మరింత పరిశీలనగా చూసిన బామ్మగారు __ "అలాగటే అమ్మడూ! సాక్షాత్తూ మహాలక్ష్మీ లా ఉంటేనూ అలివేలువే అనుకున్నాను. ఏమాటకామాటే చెప్పుకోవాలిగానీ నిన్ను చూస్తూంటే అచ్చు మా అలివేలువే గావన్నమాట."

    చేయి పట్టుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ హనితని బలవంతంగా ఇసుకలో కూర్చోబెట్టెసింది.

    "ఎంత పని చేసిందనీ పిచ్చిపిల్ల! అబ్బాయి మీద మనసు పడితే మాత్రం ముందుగా నాకు చెప్పొద్దూ పాడు ముండని నేనూ తెలుసుకో లేక పోయాను."

    చీర చెంగుతో ఆమె కళ్ళో త్తుకుంటు౦టే విస్మయంగా చూస్తుంది. హనిత. తను చాలా పరిచయస్తురలిలా చెప్పుకుపోతూ ఉంది. అంత టెన్షన్ లోనూ చిత్రమైన రిలీఫ్. ఎప్పుడో కాలేజీ రోజుల్లో తప్ప అసలు బీచ్ కి సైతం సహజంగా రానంత పెద్ద కుటుంబంలో పుట్టింది హనిత.

    "వాడు మాత్రం ఎం తక్కువ తిన్నాడా? అప్పటికీ అది వాడ్ని ముందే అడిగిందట. మగాడు వాడన్నా చెప్పొచ్చుగా. చదువో చదువో అంటూ ఒకటే యావ. తెలీదు కానీ అమ్మడూ వాడున్నాడు చూశావా" ఓ క్షణం ఆగింది.

    లేదన్నట్లు తలూపింది హనిత.

    "అంతా వాళ్ళ నాన్న పోలికే. బారెత్తు మనిషి. ఏదో న కడుపున పడ్డాడు గానీ  లేకపోతే మనసు చూస్తె మారాజే అనుకో. అంతెందుకు ? వాడు చదివిన చదువు మా ఊళ్ళో ఎవరన్నా చదవగలిగారా?"

    "ఏ ఊరు బామ్మగారూ?"

    తుంపాల. అనకాపల్లి దగ్గిర మూడు మైళ్ళ దూరమ౦టు౦దిలే. శారదానది పేరు వినే ఉంటావు. అది మా ఇంటికి అదిగో అల్లంత దూరములో ఉంటుందన్నమాట అయితే అలా ఆ సంబంధం దూరమైపోయింది. పోనీ మరో పిల్లని పెళ్ళి చేస్తాన్రా అంటే అదేం చోద్యమోగానీ వాడికేదోఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఇవ్వాలీ అంటే అదేం చోద్యమోగానీ వాడికేదో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఇవ్వాలీ అంటే పెళ్ళి కాకూడదని షరతు పెట్టారట. దాంతో ఇక పెళ్ళే చేసుకోమని బీష్మించుక్కూర్చున్నాడు."

    హనిత నిర్విణ్ణురాలైన వింటూ౦ది . "అలాంటి ఉద్యోగాలుంటాయని నాకూ తెలీదు బామ్మగారూ."

    సంచీలోంచి ఓ మిఠాయినీ, కాస్త శనగపప్పునీ చేతి కందించి౦ది "ఎన్నాళ్ళ మొక్కుబడే తల్లీ? ఆ సింహాద్రి అప్పన్న ఇన్నాళ్ళకి దయచూపితే ఇదిగో ఈ వేళ వచ్చాను. వెళ్ళాక గాని మనసుకి స్థాయి లేదే అమ్మడూ! అప్పటికీ వాడి పేరన అర్చన చేయించాను. కుంకుమ పూజసహస్ర నామార్చన విడిగా ఖర్చు చేయించి."

    "పాపం! చిక్కిపోయినట్లున్నారు." గోణుకు తున్నట్ట్లుగా అని సమీపంలో సెటిలైపోయాడు ఓ వ్యక్తి.

    అంతలోనే ఆమె చెప్పిన "మారాజు' అతనే అని అర్ధమైన హనిత క్షణం అతనివేపు చూసి వెంటనే తల తిప్పుకుంది.

    విన్నట్లు౦ది బామ్మగారు.

    "ఇదుగోనమ్మ. వీడే నా సుపుత్రుడు వాళ్ళ నాన్నలాగ ఎప్పుడు నన్నాడిపోసుకోవడంతోనే సరిపోద్దిగాని అలివేలుని మరచిపోరా, నీకు సరిజోడీ అంటే అదిగో ఆ ఉద్యోగం ...."

    "అమ్మా .... అమ్మా! నీకు దణ్ణం పెడతానే. ఇక్కడ కూడా ...." రహస్యంగా చెవిలో అన్నాడు. "మన చరిత్ర చాటి సూక్తిముక్తావళీలా ఆవిణ్ణి బాధించక."

    "విన్నావుటే అమ్మడూ?"

    హనిత పెదవులు బిగుసుకున్నాయి రాబోతున్న నవ్వుని అపుకుంటున్నట్టుగా.

    "అమ్మా! అంత పెద్ద సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు దాని కథా కామామీషూ వదిలిపెట్టి  నా కథ చెప్పి అందర్నీ చిత్రవథకు గురిచేయడం నీకు న్యాయం కాదె" ఆమెను వారించాలని అపసోపాలు పడిపోతున్నాడా వ్యక్తి.

    "నోర్మూయ్యంటే నోర్ముయ్!"

    "అమ్మా ఇది మన ఊరు ...."

    "కాకపోతే మాత్రం నేను నే ఏటల్లిని కాకుండా పోతానట్రా బడుద్దాయీ?"

    "అబ్బా!" తల పట్టుకున్నాడు.

    "అలా ఏడువ్, పోయిన నీ అబ్బకోసం. ఇదంమా వీడి వరస. ఊళ్ళో అందరికన్నా ఎక్కువ చదువు చెప్పిస్తే అలివేలు కలా అన్యాయం చేసి ...."

    "హయ్యో! నేను అన్యాయం చెయ్యడమేమిటే?"

    "ఒరే అబ్బీ! నీ సంగతి నాకు తెలీదట్రా? పావలా ఇస్తే పొట్లాం బఠానీలు కొనుక్కుని కన్న తల్లి ఎదురుగా ఉంది కదా కాసిన్ని చేతిలో పోయాలన్న ఇంగితం లేనివాడిని నువ్వు అలివేలుకి అన్యాయం ...."

    ఆ మారాజు నలిబలి కావడం చూసిన హనిత పగలబడి నవ్వేసింది. అలా నవ్వగలిగి ఎన్నాళ్ళయిందో ఆమెకి గుర్తులేదు. పసిపిల్లలా నిర్మలంగా పడీ పడీ నవ్వింది. అప్పటికే జేబులోని పిడికేడుతీసి ఆమె చేతిలో ఉంచాడు.

    అంత బారెత్తు 'మారాజు' ఇప్పుడు హనితని సూటిగా చూడలేక పోతున్నాడు. ఆమె ఇలా  నవ్వడం చూస్తుంటే మంటగా వుంది. చీర చెరగుని పెదవులను అడ్డంగా వుంచుకుని పైకి లేచింది వెళ్ళడానికన్నట్ట్లుగా.

    "వస్తాను బామ్మగారూ."

    "అప్పుడేనా అమ్మడూ."

    "పనుంది బామ్మగారూ" హనిత రోడ్డువేపు వేగంగా నడుస్తుంటే రెండు అంగాలలో చేరుకున్నాడు 'మారాజు'

    "మనసు మంచిదే కాని మా అమ్మదో చాదస్తం" ప్రాధేయ పూర్వకంగా అన్నాడు.

    "ఇప్పుడు నేనేం అనలేదే?" హనిత ఆగింది.

    "అన్నా బాగుండేది. మీ వేషం చూస్తుంటే అమ్మ హింసకు తాళలేక ఈ సముద్రానికి సుదూరంగా పారిపోతున్నట్లనిపిస్తూంది. అయితే ఓ అభ్యర్ధన.

    ఏమిటన్నట్ట్లుగా చూసింది.

    "మీరింకా కావాలంటే బీచ్ లో వుండండి"

    "మీ పేరు మరాజా?' మళ్ళీ నడక మొదలు పెట్టింది.

    "అహం కిరిటి"

    సాయంకాలపు సముద్రపు గాలికి ఆమె కురులు అల్లరిగా పైకేగురుతూ చెంపల్ని తాకుతుంటే, ముందు గమనించింది హనిత.

    "ఏమిటలా? ఎక్కడికి?" అడిగింది తననే అనుసరిస్తున్న కిరిటీని చూస్తూ.

    "తె .... తెలుసుకుందామని"

    "ఏమిటీ?"

    "పే ... పేరు"

    "మిస్టర్!" హనిత సీరియస్ గా చూసింది.

    "ఆహా! నా పేరు మీరు అడిగారుగా  _ నేను అడక్కపొతే మీరేమన్నా అనుకుంటారేమో అని యిలా నేననుకుంటూ మీరనుకొవడమే నిజమయితే ...."

    అప్పటికే రోడ్డు చేరుకున్న హనిత కారులో కూర్చుంది.

    అమెకిప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంది.

    మారాజు .... కాదు కిరీటి _ చదువుకున్న వాడిలాగే ఉన్నాడు. అదికాదు ఆమెని అతిగా ఆకట్టుకున్నది _ తల్లీ కొడుకుల మధ్య గొడవ కూడా లలితంగా వుంది. అంత వయసోచ్చీ అమ్మను అణుకువగానే ఎదుర్కుంటున్నాడు. ఇది ఆమెకి పరిచయం లేని ప్రపంచం!

    ఎప్పుడో ఏడాది వయసులో అమ్మ పోయాక అయాలూ, బోర్డింగులూ స్కూల్సూ, అపరిమితమయిన డబ్బూ, నాన్న ఆప్యాయతా. యివి తప్ప ఇలాంటి అనుభూతులు ఆమెకి తెలీవు.

    ఆస్వాదించాగల మనసుంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ మనోజ్ఞమయినదే.

    ఎవరనగలరు కాలువలో కాగితపు పడవలు వదిలితే పిల్లల నవ్వులు ఆహ్లాదంగా వుండవని? మంచులో తడిసిన కలుపుమొక్క కూడా నీరెండలో మెరిసి మనసుని ఉల్లాస పరుస్తుంటే ఎవరు కాదనగలరు! ఉనికి కాదు యిక్కడ ముఖ్యం వివేచన, రవ్వంత స్పందన!

    ప్రతి నుముషాన్నీ ప్రోడక్టవ్ గా మార్పుకావాలనుకునే మనిషికి కూడా ఈ మాత్రం మానసికమయిన విశ్రాంతి అవసరమే.

    ఆమె కారు నడుపుతూనే ఆలోచిస్తూంది.

    సీటు పైన చేతికిదో తగిలింది ఓ కాగితంలా.

    ముందు అంత ఆసక్తి ప్రదర్శించకపోయినా ఎడం చేత్తో అలవోకగా అందుకొంది కారు నడుపుతూనే.

    తెలుగులో టైప్ చేసి వుంది.

    "మిస్ హనితా ...." కారుని ఆపింది మొదటి అక్షరాలు చదవడంతోనే.

    ఈసారి స్పష్టంగా కనిపించాయి.

 Previous Page Next Page