"మెడికల్ షాపు ఎంత దూరంలో వుంది?"
"ఒక ఫర్లాంగు దూరంలో ఒక షాపుంది సార్. కానీ ఈ టైములో......" నసిగాడు డాక్టర్.
"షటప్... "విసుగూ. కోపం కలిపిన శృతిలో అరిచాడు ఆనందమూర్తి అసహనంగా.
నవ్వడం, నవ్వించడం, నవ్వుతూ పనిచేసుకోవడం తప్ప అతని కోపాన్ని చూడని ఆ నర్సుకీ, డాక్టరుకీ కూడా ఆశ్చర్యం వేసింది.
ఆనందమూర్తి మొహంలో ఆందోళన ఎక్కువైంది.
"సిస్టర్! స్టోర్సు తాళాలు ఎక్కడుంటాయి" అడిగాడు ఆనందమూర్తి అసహనంగా.
"ఇక్కడే డాక్టర్. కీ బోర్డులో......"
"అయితే వెంటనే స్టోర్స్ తెరిచి, ఇంజక్షన్ పట్టుకురా......"
"డాక్టర్ ! ఇండెంటు లేకుండా..పైగా స్టోరు కీపర్ లేనప్పుడు నేను తాళాలు తీసి తేవడం, ఎగైనిస్ట్ రూల్స్ డాక్టర్..... నా మీద యాక్షన్ తీసుకోవచ్చు" భయంగా అంది నర్సు.
"మీకేం ఫర్వాలేదు. నేను సంతకం చేస్తాను ఇండెంట్ ఫారమ్ మీద, స్టోర్స్ డోర్ మీద నేనే తెరిచినట్టు కూడా సంతకం చేస్తాను. గో........సూన్..." అంటూ ఇంజక్షన్ కోసం రాసిన ఇండెంటును సంతకం చేసి మర్నాడు సూపరింటెండెంటుకి పంపించమని చెప్పి ఇచ్చాడు.
వాచ్ మెన్ ని కూడా తీసుకుని వెళ్ళి స్టోర్స్ తెరిచి ఇంజక్షన్ తెచ్చింది సిస్టర్. గబగబా ఇంజక్షన్ చేశాడు ఆనందమూర్తి. ఇంకేవో మందులు వేశాడు. నొప్పితో చుట్టుకుపోతూన్న సుదర్శన్ మెల్లగా రిలాక్స్ అయ్యాడు. పల్స్ మానీటరింగ్ మెషీన్ పెట్టారు. ఆక్సిజన్ ట్యూబ్ పెట్టారు. మెల్లగా మత్తులో నిద్రలోకి జారుకున్నాడు.
"సిస్టర్! జాగ్రత్తగా చూసుకోండి. రేపటి ఉదయం వరకూ ఇంకే మందులూ అక్కర్లేదు. హీ....విల్.....బి...... ఆల్ రైట్. ఒకవేళ నా అవసరం కావాలనుకుంటే, హెసిటేట్ చెయ్యకుండా ఫోన్ చెయ్యండి. బై....." అంటూ బయలుదేరాడు ఆనందమూర్తి.
ఒక మామూలు చౌకీదారు కోసం, అర్ధరాత్రీ అపరాత్రీ అని ఆలోచించకుండా వచ్చి, రూల్స్ ని కూడా లక్ష్యపెట్టకుండా అతనికోసం అంత ఆతృతపడ్డ ఆనందమూర్తి, డాక్టర్ రావుగారి కళ్లకా, సిస్టర్ కళ్లకీ దేముడిలా కనిపించాడు. అతని వెనకాలే నడిచారు ఇద్దరూ డాక్టర్ రూమ్ దాకా!
అక్కడ కూర్చుని ఏదో మెడికల్ మాగజైన్ ని తిరిగేస్తూన్న హర్షితని చూసి "సారీ.... హర్షితా ఆలస్యమైంది" అన్నాడు ఆనందమూర్తి.
"అతనెలా వున్నాడు?" అడిగింది హర్షిత.
"ఫరవాలేదు. అవుటాఫ్ డేంజర్. పద....." అంటూ కారువైపు నడిచాడు. డాక్టరు భార్యగా ఆమె చూపుతున్న స్పందనకి కూడా, డాక్టరు రావూ, సిస్టర్ సుజాతలు ముగ్దులయ్యారు.
కారు కదిలేవరకూ వుండి, హర్షితకీ, డాక్టరు గారికీ నమస్కారాలు చెప్పి లోపలికెళ్లారు.
తలుపు తాళం తీసి లోపలికెళుతున్న హర్షిత అప్పటికి గానీ గడియారం చూడలేదు. సరిగ్గా మూడు గంటలైంది. మరో గంటలో తెల్లారిపోతూంది పాలవాడూ, పనిమనిషీ వచ్చేస్తారు. కనీసం రెండు మూడు గంటలైనా నిద్రపోకపోతే, మళ్లీ రేపు పొద్దుటే హాస్పిటల్, సాయంత్రం క్లినిక్ అలిసిపోతారు అనుకుంటూ లోపలికెళ్లి ఫ్రిజ్ లోంచి పాలు తీసి వేడి చేసి తెచ్చి ఆనందమూర్తికి ఒక గ్లాసిచ్చి తనూ ఓ గ్లాసు తాగింది. ఆ తర్వాత బట్టలు మార్చుకుని, నిద్రలోకిజారుకున్నారు.
దినకరుని వెచ్చని కిరణాల తాకిడికి మెల్లిగా కళ్లు తెరిచాడు ఆనందమూర్తి. కళ్లు బరువుగా వున్నాయి. గడియారంవంక చూశాడు. ఎనిమిదీ పది నిమిషాలయింది. "హర్షితా" పిలిచాడు.
తలంటి పోసుకున్న జుట్టు ఆరబెట్టుకుంటూ, నారింజరంగు చీరలో, ఎర్రటి పొడుగాటి కుంకుమరేఖ నుదుటిపైన జ్యోతిలా వెలిగిపోతూ వుంటే హర్షిత అందం మరీ వన్నెకక్కినట్టుంది. ఆనందమూర్తి దగ్గరికెళ్ళి తల నిమురుతూ, "బాగా నిద్రపోయారా?" అడిగింది.
"ఓ....... తమరు పక్కన పడుకున్నాక నిద్రకేం లోటు? ఆ ఆనందం ఏ నిద్ర మాత్రకీ సరికాదు....." నవ్వుతూ దగ్గరికీ తీసుకున్నాడు.
"ఆగండి. ఇంకా పూజకాలేదు. టిఫిన్ రెడీ కాలేదు" అంటూ అతని చేతుల్లోంచి తప్పించుకుంది.
"హర్షితా! నువ్వూ నేనూ ఒక్కసారే పడుకున్నాం కదా! మరి నీకు నిద్దరసరిపోయిందా? టైముకెలా లేవగలిగావ్."
"నాదేముందండి! నేనూరికే మీ పక్కన కూర్చున్నానంతే. మీరెంత టెన్షన్ పడ్డారని రాత్రి. అసలు ఫణికుమార్ ఫోనూ, అతని మాటలు నాకు తిక్క పుట్టిస్తే, పాపం సుదర్శన్ అకస్మాత్తుగా ఇలా వచ్చిపడ్డాడు. అక్కడ ఫణికుమార్ పేషంటు ప్రాణాలు కాపాడారు. టెన్షనంతా మీదే. భగవంతుడు మీకు ఇంకా ఎంతో శక్తిని ప్రసాదించాలి. ఆ ఆలోచనలతోనే అసలు నిద్రపట్టలేదు నాకు. ఆ బద్దకం పోవాలనే వేడి నీళ్ళతో తలంటి పోసుకున్నాను ఫ్రెష్ గా వుంటుందని" అంది బోర్న్ విటా కలపటానికి లోపలికి వెళుతూ.
ఆనందమూర్తి లేచి టూత్ బ్రష్ చేసుకుని అలాగే స్నానం కూడా ముగించుకుని వచ్చాడు.
"హర్షీ! టిఫిన్ కూడా పెట్టేయ్. టైమయిపోయింది. అన్నట్టు రాత్రి ఆసుపత్రి నుంచి ఫోన్లేమీ రాలేదుకదా?" అడిగాడు.
"లేదండీ. అయినా మీకు కంగారు దేనికి, ఒక్కసారి మీ చెయ్యి వాళ్ల ఒంటిమీద పడితే చాలు. జబ్బంతా పోయినట్టు. మీ హస్తవాసి అలాంటిది" అంది నవ్వుతూ.
ఆమె ప్రేమతో చెప్పే మాటలు తనకి ఎంత సేద దీరుస్తున్నాయో! వింజామరలు వీచినట్టుగా వున్నాయి ఆ పలుకులు.
"హర్షీ!....మన పెళ్లయి ఎన్నాళ్ళయింది?" అడిగాడు నవ్వుతూ.
"ఏమిటా ప్రశ్న? మీకు తెలీదా? రెండేళ్ళు" అతడి కళ్ళలోకి చిలిపిగా చూస్తూ చెప్పింది.
"ఏమో! నాకింకా రెండ్రోజుల్లాగానే వుంది. అయినా ఇవాళ ఏమనిపిస్తోందో తెలుసా?
"చెప్పండి"
"నాకు ఒక చిట్టి హర్షిత కావాలని"
"ఊ.....హూఁ......మరో ఏడాది తరువాత నాకు మరో బుచ్చి ఆనంద్ కావాలి."
"మరో ఏడాదే........" అన్నాడు ఇడ్లీని సాంబారులో ముంచుతూ.
"ఆహాఁ......." అంది మరో ఇడ్లీ వేస్తూ.
* * *