ఆనందమూర్తి , ఫణి కారు దిగారు.
"ఫణీ! మేం వెళ్ళొస్తాం. హర్షితా....... కారెక్కు!" అన్నాడు ఆనందమూర్తి.
"భెజనం చేసి వెళ్ళండి ఆనంద్ గారూ!" అంతి లతిక.
"ఇప్పుడు అర్ధరాత్రిదాటి ఒంటిగంటన్నర అయింది. ఇప్పుడేం భోజనాలు. మేము డిన్నర్ చేసేశాము. మరో రోజు ఎప్పుడైనా వచ్చి భోజనం చేస్తాంలే!" అన్నాడు ఆనందమూర్తి నవ్వుతూ.
"ఎప్పుడో ఎందుకు, ఎల్లుండి ఆదివారమే కదా! ఆ రోజు మీకేమీ ఎంగేజిమెంటు లేకపోతే మా ఇంటికి లంచ్ కి వచ్చేయండి. అందరం కలిసి సరదాగా భోజనం చేద్దాం!" అన్నాడు ఫణికుమార్.
"ఓ యస్! ఆదివారం వస్తున్నాం, వెళ్లొస్తాం" అంటూ కారెక్కాడు ఆనందమూర్తి హర్షిత కూడా వాళ్ళిద్దరికీ చెప్పి కారెక్కి కూర్చుంది. కారు ముందుకి దూసుకుపోయింది! ఉన్నట్లుండి హర్షిత గావుకేక పెట్టింది. ఆనందమూర్తి సడన్ బ్రేక్ వేశాడు.
పెరిగిన గడ్డం, మాసిన బట్టలు, దుబ్బుగా వున్న జుట్టు, బలిష్టమైన శరీరం, దాదాపు నలభై అయిదేళ్ళుంటాయి. ఒక్కసారిగా కారుకడ్డం వచ్చి ఇంచుమించు కారుకింద పడ్డట్టే ఒక పది గజాల దూరంలో పడ్డాడు. అతడు కారుకింద పడి పోయాడనే ఫీలింగ్ హర్షితని ఊపేసింది. గజగజ ఒణికిపోతూ ఆనందమూర్తి భుజం మీద వొరిగిపోతూ గావుకేక పెట్టింది భయంతో. అంత చీకట్లోనూ అతనికడ్డంగా రావడం గమనించిన ఆనందమూర్తి సడన్ బ్రేక్ వేశాడు. కీచ్ మంటూ కారు శబ్దం చేసుకుంటూ, ఆగింది. ఆనందమూర్తి డోర్ తెరిచి దిగబోయాడు. భయంతో ఒణికిపోతూ నోట మాటరాక నాలిక పిడచకట్టుకు పోతుంటే, ఎలాగో గొంతు పెగల్చుకొని, రెండు చేతులతో ఆనందమూర్తిని కారు దిగకుండా పట్టుకుంది హర్షిత.
"మీరు కారు దిగకండి, వాణ్ణి చూస్తే నాకేదో రౌడీషీటర్ లా అనిపించింది. పెద్ద గడ్డంవాడు. ఏ ఉద్దేశ్యంతో కారుకడ్డం వచ్చాడో తెలీదు. రోడ్డు మీద ఎవ్వరూ లేరు. పదండి వెళ్ళిపోదాం కారు స్టార్ట్ చేయండి. ప్లీజ్!" భయంతో దుఃఖంతో గొంతు బొంగురుపోతూంటే ఎలాగో అంది హర్షిత.
"ఆనందమూర్తి ఆమె తల నిమురుతూ, భయం లేదన్నట్టుగా, భుజం మీద వాల్చిన ఆమె తలని పైకెత్తి "డోంట్ వర్రీ.......! అలా అన్నింటికీ భయపడితే ఎలా?" అంటూ హర్షిత వారిస్తున్నా వినకుండా కారు డోర్ తెరిచి, పాంటు జేబులో వున్న చిన్న టార్చ్ లైట్ తీసి ఆన్ చేశాడు. టార్చిలైట్ వెలుతురులో అతడి మొహం స్పష్టంగా కనిపించింది. "అరె సుదర్శన్ నువ్వా?" అంటూ ఒక్క ఉదుపులో కారు దిగి అతడి దగ్గరికెళ్ళాడు.
"ఇతడు మా వాచ్ మెన్ సుదర్శన్" హర్షితకి చెప్పాడు.
అతడు రెండు చేతులూ జోడించి ఆనందమూర్తికి నమస్కరిస్తూ "సాబ్ ఉన్నట్టుండి గుండెలో నొప్పొచ్చింది. చెమటలు పట్టేశాయ్! ఇంట్లో ఎవరూ లేరు, మా ఆవిడా పిల్లలూ మా అత్తగారింటికెళ్లారు. సైకిల్ తొక్కుదామని తీస్తే నా వల్ల కాలేదు. ఒక్క ఆటోగానీ, రిక్షాగానీ దొరకలేదు. అలాగే కొంత దూరం నడిచాక, ఒక ఆటో దొరికింది. మీ ఇంటికి వెళితే ఇల్లు తాళం వేసి వుంది. బహుశా మీరు ఫణికుమార్ సాబ్ ఇంటికే వెళ్లుంటారని చెప్పి ఆటోని ఇటు రమ్మన్నాను. టైమయిపోయిందని, ఆటో ఇచ్చెయ్యాలని ఆటోవాడు రానన్నాడు. సరేనని వాడికి డబ్బిచ్చి పంపించేసి నడుచుకుంటూ ఇటొచ్చాను. నా అదృష్టం మీరు ఎదురుపడ్డారు. కాస్త ఆలస్యమైతే నేను మిమ్మల్ని ఇక్కడకూడా కలుసుకునేవాణ్ణి కాదేమో!" అంటూ మరి మాట్లాడలేక గుండెల మీద రెండుచేతులతో రాసుకుంటూ ఆనందమూర్తి కళ్ళలోకి చూశాడు. అప్పటికే ఆనందమూర్తి అతడి పల్స్ చూశాడు. మెల్లగా లేవనెత్తి కారు వెనుక డోర్ తెరిచాడు.
ఈ సంభాషణంతా కారులో కూర్చునే వింటున్న హర్షిత రిలీఫ్ గా నిట్టూర్చింది. 'రౌడీ షీటరో, దొంగో కాదు., పాపం ఎవరో పేషంటు' అన్న నమ్మకం ఆమెలో కలిగి, కారు డోర్ తెరవటంలో తనూ ఆనందమూర్తికి సాయపడింది.
కారు శరవేగంతో నడుపుతున్నాడు. ఆనందమూర్తి. అతని మనసులోని ఆందోళనని పసిగట్టింది హర్షిత. "మెల్లగా వెళ్లండి. తొందరపడొద్దు" అంది మెల్లగా చెవిలో చెబుతూన్నట్టుగా అతని దగ్గరగా జరుగుతూ.
"డోంట్ వర్రీ హర్షీ!" అంటూ ధైర్యం చెప్పాడు ఆనందమూర్తి.
కారు డిస్పెన్సరీ వైపు కాకుండా మరో రూట్ లో వెళ్ళడం చూసి "డిస్పెన్సరీకి కాదా?" అడిగింది.
"కాదు. హాస్పటల్ కి" అంటూ వేగంగా పోతూనే సమాధానమిచ్చాడు.
కారు రెడ్ హిల్స్ లోని ప్రిన్సెస్ నిలోఫర్ హాస్పిటల్ ఆవరణలో ఆగింది. నైట్ డ్యూటీ వాచ్ మెన్ ఆనందమూర్తి కారు చూసి పరుగెత్తుకుంటూ వచ్చాడు.
"నమస్తే సాబ్, ఏమయింది"అంటూ.
"బాలచందర్! వెనుక సీట్లో సుదర్శన్ వున్నాడు. మెల్లగా దింపి తీసుకురా" అని చెప్పి తను కారు దిగాడు. హర్షితా! నువ్వూ దిగు. లోపల కూర్చుందువు గాని నా రూమ్ లో" అన్నాడు.
హర్షిత కారు దిగి అతని వెనకాలే వెళ్ళింది. ఆనందమూర్తి నైట్ డ్యూటీ ఎమర్జన్సీ వార్డ్ లో వున్న డాక్టర్ ని కలిశాడు. అప్పుడే కాస్త కునుకుతీద్దామని స్టాఫ్ రూమ్ లోకి వెళుతూన్న ఎమర్జెన్సీ వార్డ్ సిస్టర్, ఆవులించుకుంటూ వచ్చి "నమస్తే సార్" అంది.
"సిస్టర్! మన వాచ్ మెన్ సుదర్శన్ కి సివియర్ అటాక్ వచ్చింది. లక్కీ ఫెలో ఎలాగో నా దగ్గరకొచ్చాడు. ఐ.సి.సి యు.లో బెడ్ ఏర్పాటు చెయ్యండి" అన్నాడు.
డాక్టరూ, నర్సూ కంగారు కంగారుగా బెడ్ ఏర్పాటు చేశారు.
బాలచందర్ సుదర్శన్ ని ఇంచుమించు ఎత్తుకుని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు.
"డాక్టర్! కార్టెజాన్ ఇంజక్షన్ చెయ్యాలి" అన్నాడు ఆనందమూర్తి సుదర్శన్ పల్స్ చూస్తూ.
వెంటనే ఈ.సీ.జీ ఏర్పాటు చేస్తోంది సిస్టర్, అవతలికెళ్ళి దానికి సంబంధించిన వ్యక్తుల్ని లేపి తీసుకొచ్చి, డాక్టర్ రావు అలమారాలన్నీ చూశాడు. సిస్టర్ని పిలిచి అడిగాడు కార్టెజన్ ఇంజక్షన్ ప్యాక్ ఎక్కడుందని.
"స్టాకు లేదు సార్. ఇండెంటు పెడదామంటే స్టోర్ కీపర్ రాలేదు. రేప్పొద్దున్నే తీసుకోవచ్చులే ఇప్పుడవసరం లేదు కదా అని ఊరుకున్నాను" అంది నెమ్మదిగా సిస్టర్ డాII రావు ఆనందమూర్తికేసి చూస్తూ విషయం చెప్పాడు. ఆనందమూర్తి మొహం కోపంతో ఎర్రబడిపోయింది "ఎమర్జెన్సీ వార్డ్ లో ఎప్పుడు ఎవరికి ఏ మందు అవసరమొస్తుందో ఎవరికి తెలుసు? స్టాక్ వుంచుకోవద్దూ?" సిస్టర్ని కోపడ్డాడు ఆనందమూర్తి.
"బయటినుంచి తెప్పిద్దామా డాక్టర్?" అడిగాడు డాక్టర్ రావ్.