ఆసుపత్రి ఆవరణలో కారు పార్క్ చేసి సరాసరి సుదర్శన్ బెడ్ దగ్గరికెళ్ళాడు ఆనందమూర్తి. సుదర్శన్ నవ్వుతూ డాక్టరు గారికి రెండుచేతులూ జోడించి నమస్కరిస్తూ "డాక్టర్ సాబ్!........ నిన్న మిమ్మల్ని కలుసుకోలేకపోతే ఈపాటికి నా ప్రాణాలు పోయుండేవి" అన్నాడు, కృతజ్ఞతనంతా కళ్లల్లోనే చూపిస్తూ. "ఛ! అవేం మాటలు." అంటూ కేస్ షీట్ చూసి, పల్స్ చూసి, సిస్టర్ కి చెప్పి ఏవో మందులు వెయ్యమని చెప్పాడు. అంతలోనే ఫోన్ మోగింది. సిస్టర్ ఫోన్ తీసి "సార్........ మిమ్మల్ని సూపరింటెండెంటు గారు పిలుస్తున్నారు" అంది.
వెంటనే ఆనందమూర్తి సూపరింటెండెంటు గదిలోకెళ్లాడు. అప్పటికే డాక్టర్ రెడ్డి, వీరయ్య చౌదరి అందరూ అక్కడే వున్నారు. ఎప్పుడొచ్చాడో ఏమో ఫణికుమార్ కూడా అక్కడే వున్నాడు. డాక్టర్ సూర్యచంద్ర ఆనందమూర్తిని చూసి "డాక్టర్ ఆనంద్ రండి, గుడ్ మార్నింగ్! ప్లీజ్ టేక్ యువర్ సీట్" అన్నాడు ఎదురుగా వున్న కుర్చీ చూపిస్తూ.
"గుడ్ మార్నింగ్ డాక్టర్" అంటూ కూర్చున్నాడు ఆనందమూర్తి.
"డాక్టర్ ఆనంద్! మీరు చాలా మంచివారు చాలా సున్నితమైన మనసుగల వారు. పైగా మంచిడాక్టరు. అయితే ఉద్యోగంలో కొన్ని రూల్సున్నాయి. అవి......."
"నాకు తెలుసు డాక్టర్. మీరు చౌకీదారు సుదర్శన్ విషయంలో నేను చేసిన పనిని గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో 'కార్టిజాన్' ఇంజక్షన్ ఇవ్వకపోతే అతని పరిస్థితి ప్రమాదకరంగా మారుండేది. అందుకే నేనే స్టోర్స్ తెరిపించి ఆ ఇంజక్షన్ చేయించాను. ఆ రాత్రి మీకు ఫోన్ చెయ్యడం ఎందుకులే, డిస్టర్బ్ చేయడం తప్ప అని ఊరుకున్నాను. ఇప్పుడే వెళ్ళి సుదర్శన్ ని చూశాను. మీదగ్గరికి వచ్చి చెబుదామనే లోపుల మీరే ఫోన్ చేశారు" అన్నాడు అనునయంగా.
"అదంతా నిజమే ఆనంద్. కానీ రూల్స్ ని అధిగమించి మనం ఏమీ చెయ్యకూడదు"
"డాక్టర్! మానవత్వం వున్న ఎవరైనా ప్రాణాపాయంలో వున్న పేషెంటుని ఎలా కాపాడాలో చూస్తాడు కానీ, రూల్స్ గురించి ఆలోచించడు."
"ఇంజక్షన్ తెప్పించవలసింది."
"తెచ్చే లోపల ఆ రాత్రి ఏ ఘోరమైనా జరగొచ్చు."
"అలా అని హాస్పిటల్ రూల్స్ ని మనమే బ్రేక్ చేస్తామా?"
"అవి మనం పెట్టుకున్న రూల్సే డాక్టర్"
"అవును. మనమే వాటిని బ్రేక్ చేస్తే ఇతరులేం గౌరవిస్తారు?"
"రూల్స్ ని బ్రేక్ చేస్తే సంజాయిషీ చెప్పుకోవచ్చు. మనిషి ప్రాణాలు పోతే ఏం సంజాయిషీ ఇస్తాం డాక్టర్?" ఆవేశంగా అన్నాడు ఆనందమూర్తి.
"వాడేదో పెద్ద వి.ఐ.పి. అయినట్టు. అందుకోసం విధిలేక రూల్స్ ని బ్రేక్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు మీరు" అన్నాడు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యచంద్ర.
ఫణికుమార్ పకపకా నవ్వాడు.
డాక్టర్ రెడ్డి, డాక్టర్ వీరయ్య చౌదరి కూడా చిన్నగా నవ్వేరు. ఆనందమూర్తి రక్తం ఉడికిపోయింది. కోపం ఎరుపురంగు ధరించింది.
"ఐ యామ్ సారీ...... టునో..... వి.ఐ.పి.ల ప్రాణాలు వేరు, మామూలు వాళ్ళ ప్రాణాలు వేరూ అని నాకు తెలీదు. డబ్బుతో ప్రాణం విలువ పెరుగుతుందని నేను నేర్చుకున్న మెడికల్ కోర్సులో ఎక్కడా లేదు. నాకు తెలిసిందల్లా పేషంటుకి ఏ ప్రమాదమూ రాకుండా చూసుకోవటం, దట్స్ ఆల్!" అన్నాడు.
"అంటే నేనెప్పుడూ ఎక్కడా ఎవరితోటి అనలేదు"
"డాII ఆనందమూర్తీ, మీరు చాలా ఆరగెంటుగా మాట్లాడుతున్నారు"
"నిజాన్ని ఆరగెంటుగానూ, వృత్తిని వ్యాపారంగానూ చిత్రించడం నాకు చేతకాదు"
"మీరిష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు" అరిచాడు డాక్టర్ సూర్యచంద్ర. వాతావరణం సీరియస్గా మారడం చూసి మిగిలిన డాక్టర్లందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డాక్టర్ ఫణికుమార్ కూడా వెళ్లిపోయాడు. మళ్ళీ కలుస్తాని సైగచేసి చెబుతూ.
"డాక్టర్ సూర్యచంద్రగారూ! నేను చేసింది తప్పుకాదు."
"అని మీరంటే సరిపోదు. స్టోర్స్ లోంచి ఎన్నోమందుల్ని అర్ధరాత్రిపూట డాక్టర్ ఆనందమూర్తి కాజేశారు అంటే మీ సంజాయిషీ ఏమిటి?"
"వ్వాట్? వైద్య వృత్తిలో వుండి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన డాక్టరు పైన ఇటువంటి నిందలా మోపడం? అన్యాయం" "ఏం? డాక్టర్లంతా మానవ సేవ చేస్తున్నారా? డబ్బు తీసుకోవడం లేదా? కొందరు ఎక్కువ తీసుకుంటారు. కొందరు తక్కువ తీసుకుంటారు. అది వాళ్ల ప్రతిభనిబట్టి వుంటుంది."
"ఓ.......! డబ్బుతో ప్రతిభని కొలుస్తారన్నమాట...."
"వాదన నాకనవసరం డాక్టర్ ఆనందమూర్తీ, మీరు చేసిన పనికి క్షమాపణ కోరుతూ లెటర్ రాసివ్వండి. లేకపోతే...."