"డాక్టర్ గారూ! మా నాన్నగారు రెండేళ్ళుగా ఆస్త్మాతో బాధపడుతున్నారు. ఎన్ని రకాల వైద్యాలు చేయించినా ఫలితం కనిపించలేదు. ఆర్నెల్లుగా ఫణికుమార్ గారు వైద్యం చేస్తున్నారు. తగ్గుతున్నట్టు తగ్గి మళ్ళీ మొదటి స్థితికే వస్తోంది.
"ఆ ఆయాసం, బాధ భరించలేక మా నాన్న రెండుసార్లు ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చేసారు. అదృష్టవశాత్తు ఆ రెండుసార్లూ నేను గమనించి అలా జరగకుండా ఆపగలిగాను కానీ, ఈ రెండు మూడు రోజులుగా ఆయన పడుతున్న నరకయాతన చూస్తే నాకే గుండెలు తరుక్కుపోయాయి. ఆయన పడే హింస శత్రువుకి కూడా రాకూడదని అనిపించింది. మేమంతా మా ప్రాణాల కంటే అధికంగా ప్రేమించే మా తండ్రిగారిని ఆ నరకం నుంచి విముక్తి చేయడానికి ఆయన్ని పొడిచి చంపేద్దామనుకున్నాను.
ఆ హత్య ఆస్తికోసమో, మరే లాభం కోసమో ఆశించిమాత్రం కాదు. అవసాన దశలో కూడా ఆయన ఇలాంటి గుండెలు పిండేసే బాధని ఎదుర్కోవటం నేను చూసి తట్టుకోలేకపోయాను. మెర్సీ కిల్లింగ్ పేరుతో విదేశాల్లో డాక్టర్లు మానవతా దృక్పధంతో ఇలాంటి నరకయాతన అనుభవించే వారి కష్టాలు గట్టెక్కించేందుకు ప్రాణాలు పోయేలా చేస్తున్నారని విన్నాను. నా తండ్రిని కూడా ఈ బాధనుంచి విముక్తి చేసేందుకు రిక్వెస్టు చేద్దామనుకున్నాను. కానీ, మన డాక్టర్లు అందుకు ఒప్పుకోరని నాకు తెలుసు. అందుకే ఆ పనేదో నేనే చేద్దామనుకున్నాను ఆవేశంలో, ఆవేదనలో తరువాత ఎదురయ్యే పరిస్థితుల్ని పరిణామాల్ని ఆలోచించలేదు. డాక్టర్ గారూ! ఇప్పుడు మా నాన్నగారు కళ్ళు తెరిచి చూస్తున్నారు. మాట్లాడుతున్నారు. ఆయాసం తగ్గింది. మీరు వచ్చాక నాకు ధైర్యం చిక్కింది. మీ చేతి చలవతో నా తండ్రి బతుకుతాడనే నమ్మకం ఏర్పడింది. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయనకి మీరే ట్రీట్ మెంట్ ఇవ్వండి. ఆయన్ని ఆరోగ్యవంతుణ్ణి చేయండి. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ డాక్టర్! నా మాట కాదనకండి!" ఆవేశంగా అతను చెప్పుకుపోతున్నాడు.
ఫణికుమార్ అవమానభారంతో, దిగులుగా తల దించుకు నిలబడ్డాడు.
ఆనందమూర్తి ఆవేశంగా మాట్లాడుతున్న ఆయువకుడి భుజం మీద చెయ్యి వేసి, ఆవేశపడవద్దన్నట్టు సైగ చేశాడు.
"చూడు మిస్టర్! ఏ డాక్టర్ అయినా తనను నమ్మి వచ్చిన పేషంట్ ఆరోగ్యాన్ని బాగుచేయడం కోసమే కృషి చేస్తాడు. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని చివరి క్షణాల వరకు అతని ప్రాణం నిలబెట్టడానికే డాక్టర్ తపనపడతాడు. ఈ విషయంలో ఏ డాక్టర్ కేరక్టర్నీ సందేహించవలసిన అవసరం లేదు. మా ఫణికుమార్ కూడా మీ తండ్రిగారి జబ్బు బాగుచేయడానికి రాత్రింబవళ్ళు ప్రయత్నిస్తూనే వున్నాడు. అతని ప్రయత్నలోపం ఏమీ లేదు. మీ తండ్రిగారి నరకయాతన చూసి నువ్వు ఆలోచించిన పద్దతి చూస్తే కొడుకుగా నువ్వెంత ప్రేమిస్తున్నావో అర్ధం అవుతోంది. అంతే కానీ, ఆ తరువాత నువ్వు, నీ కుటుంబం ఎదుర్కొనే సమస్యల్ని గురించి నువ్వు ఆలోచించలేకపోయావు. ఏమైతేనేం! ఏ ప్రమాదం, అఘాయిత్యం జరగనందుకు నేను సంతోషిస్తున్నాను.
మీ తండ్రిగారికి ఇక ఎలాంటి ప్రమాదం ఉండదు. నేనూ, డాక్టర్ ఫణికుమార్ చర్చించుకొని ఆయనకి స్పెషల్ ట్రీట్ మెంట్ ఇస్తాము. నువ్వు ధైర్యంగా ఉండవచ్చు. ఇక మీరంతా వెళ్ళి రెస్ట్ తీసుకోండి" అన్నాడు ఆనందమూర్తి.
"థాంక్యూ సార్! వస్తాను!" అంటూ డోర్ తెరుచుకొని గబగబా వెళ్ళిపోయాడు ఆ యువకుడు.
అప్పటివరకు స్థాణువులా నిలబడిపోయిన ఫణికుమార్ లో చలనం లేదు.
ఆనందమూర్తి అతన్ని పట్టుకొని గట్టిగా కుదిపాడు.
"ఫణి! అడవిలో ముని శాపానికి గురైన రాజకుమారుడిలా శిలా విగ్రహంలా చలనం లేకుండా నిలబడిపోయావేమిటి?" అన్నాడు నవ్వుతూ.
ఫణికుమార్ లేని నవ్వును ముఖం మీదికి తెచ్చుకొంటూ "వాడు వెళ్ళిపోయాడా! ఆ కత్తితో నన్ను పొడిచి చంపటానికి వచ్చాడని భయపడ్డాను" అన్నాడు.
"నవ్వు చేసిన పనికి అతను అంతపని చేసినా తప్పులేదు. ఫణీ! ఎప్పుడూ డబ్బే ప్రధానమని అనుకొని వైద్యం చేయకూడదు. రోగి ఆరోగ్యం తరువాతే మిగతా విషయాలు. డాక్టర్ గానీ , లాయరుగానీ ఏ చిన్న పొరపాటు చేసినా కొన్నికుటుంబాలే కూలిపోతాయి. జీవితాలు నాశనం అయిపోతాయి. 'డబ్బు' అనే పదార్ధాన్ని నీ దారికి అడ్డు రానివ్వకు. ఎదుటివారినీ, వారి ప్రాణాలనూ ప్రేమించు. అప్పుడే నీవృత్తికి నువ్వు న్యాయం చేయగలుగుతావు" అన్నాడు ఆనందమూర్తి నవ్వుతూ. ఫణికుమార్ చిన్నబుచ్చుకున్నాడు. "ఆనంద్! నేనిప్పుడు చేసిన తప్పేమిటి? పేషంట్ల విషయంలో నేనెప్పుడూ నిర్లక్ష్య వైఖరిని చూపలేదు. ఎంతో శ్రద్దతోనే వైద్యంచేస్తున్నాను. ఈ ఒక్క కేసులోనే అనుకోని పొరపాటు జరిగి రాంగ్ మెడిసిన్స్ ఇవ్వటం జరిగింది" అన్నాడు ఫణికుమార్.
"చూడు ఫణీ! అనుభవంతో పాఠాలు నేర్చుకొనేవారిని జ్ఞానులంటారు. ఇతరుల అనుభవంతో పాఠాలు నేర్చుకొనేవారు వివేకవంతులవుతారు. తమ అనుభవం నుంచిగానీ ఇతరుల అనుభవం నుంచి గానీ, ఏ పాఠమూ నేర్చుకోని వారు అజ్ఞానులవుతారు!" అన్నాడు ఆనందమూర్తి.
ఆ మాటలు ఫణికుమార్ కి సూటిగా తగిలాయి. తీక్షణంగా ఆనందమూర్తి ముఖంలోకి చూశాడు. అంతటితో ఆ ప్రస్తావన ముగించటం మంచిదని భావించిన ఆనందమూర్తి -
"ఫణీ! చాలా ఆలస్యమయింది. ఇక ఇంటికి పోదాం పద!" అన్నాడు.
నైట్ డ్యూటీ స్టాఫ్ కి ఇన్ స్ట్రక్షన్ ఇఛ్చి ఫణి బైలుదేరాడు.
ఆనందమూర్తి కారుమీద ఇద్దరూ ఫణికుమార్ ఇంటికి చేరారు.
ఫణికుమార్ కారుని, డ్రైవర్ వాళ్ళ వెనుకే ఫాలో అవుతూ తీసుకొనివచ్చి షెడ్ లో పెట్టాడు. కారు శబ్దం విని లతిక, హర్షిత బైటికి వచ్చారు.