"డాక్టరుగారూ! మా ఫాదర్ పరిస్థితి ఎలా ఉంది?" అడిగాడు. అతని గొంతు బొంగురుపోయింది.
ఆనందమూర్తి అతని కళ్ళల్లోకి ఒకసారి చూశాడు. అతని భుజం మీద చెయ్యి వేసి తట్టాడు.
"మీ ఫాదర్ కి ఎలాంటి ప్రమాదం లేదు. ఇంకాసేపట్లో నార్మల్ స్టేజీకి వచ్చేస్తారు. మీరేమీ కంగారుపడనక్కరలేదు. ఆయన్ని మాత్రం డిస్టర్బ్ చెయ్యకండి" అతనికి ధైర్యం చెప్పాడు ఆనందమూర్తి.
ఆనందమూర్తి వాష్ బేసిన్ లో చేతులు కడుక్కున్నాడు. ఫణి అందించిన టవల్ తీసుకుని చేతులు తుడుచుకున్నాడు.
ఫణి కూర్చునే ఆఫీసు రూమ్ లోకి నడిచారిద్దరూ.
ఆనందమూర్తి ఛైర్లో రిలాక్స్ అయ్యాడు.
అతని కెదురుగా పణికుమార్ కూర్చున్నాడు.
"ఫణీ! తెలిసీ తెలిసి రాంగ్ మెడిసిన్ వాడి పేషంట్స్ ప్రాణాలతో చెలగాటం ఆడటం అలవాటయిపోయింది నీకు. ఇంతకు ముందు ఇలాగే ఒక పేషంట్ కి ఒకదానికి ఇంకొకటిస్తే అతడు కళ్ళు తేలేసాడు. అప్పుడు కూడా నన్ను ఇలాగే కంగారుపెట్టి పిలిచావు. సరైన సమయానికి అతడికి ఆపరేషన్ చెయ్యబట్టి బతికిపోయాడు. లేకపోతే నీ పీకకి చిక్కులు చుట్టుకొనేవి" మందలింపుగా అన్నాడు ఆనందమూర్తి.
"అయామ్ సారీ ఆనంద్! నీకు చాలా ట్రబులిచ్చాను" ప్రాధేయపూర్వకంగా అన్నాడు ఫణికుమార్.
"నాకు ట్రబులివ్వటం కాదు. నీ దగ్గరికొచ్చే పేషంట్ల ప్రాణాల్ని ట్రబుల్స్ లో ఇరికిస్తున్నావు. నీకు తెలియకపోతే కనీసం నాకు ఫోన్ చేసి సలహా అడగొచ్చు కదా! ఎవడి ప్రాణాల మీదకైనా ప్రమాదం వస్తేగానీ అవసరం రాదా? ఏ క్షణంలోనైనా నా కోపరేషన్ ఉంటుంది. నువ్వు మొహమాటపడక్కరలేదు. ఏమంటావ్?" అన్నాడు ఆనందమూర్తి.
"థాంక్యూ ఆనంద్! నువ్వెప్పుడూ నాకు తోడుగా ఉంటావని నాకు తెలుసు. ఇలాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్ లో ఎన్నిసార్లో నాకు హెల్ప్ చేశావు తాంక్యూ వెరీమచ్!" కృతజ్ఞతగా అన్నాడు ఫణికుమార్.
"మనలో మనకి ఫార్మాలిటీస్ ఏమిటిగానీ, మీ ఇంటిదగ్గర లతికకి తోడుగా హర్షిత ని వదిలివచ్చాను. వెళ్ళేటప్పుడు పికప్ చేసుకోవాలి. పద ఇంటికి వెళ్దాం" అన్నాడు ఆనందమూర్తి.
ఫణికుమార్ కళ్ళు చెమ్మగిల్లాయి.
"ఆనంద్! నీ రుణం ఎలా తీర్చుకోగలను" అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు.
"సెంటిమెంటల్ ఫూల్ ! పద వెళ్దాం!" అంటూ కదిలాడు ఆనందమూర్తి.
అంతలో
ఆ గది స్ప్రింగ్ డోర్స్ తెరుచుకొని ఒక వ్యక్తి లోపలికొచ్చాడు.
అతను ఆ పేషంట్ పెద్దకొడుకు!
అతని చేతిలోని కత్తి తళుక్కున మెరిసింది.
అది చూసి ఫణికుమార్ కంగారుపడ్డాడు.
బెదురుగా ఒకడుగు వెనక్కివేసి ఆనందమూర్తి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతను విసురుగా ఆనందమూర్తి దగ్గరికొచ్చి, తన చేతిలోని కత్తిని ఆయన పాదాల దగ్గరుంచి, రెండు చేతులెత్తి దణ్ణం పెట్టాడు.
"డాక్టర్ గారూ! నేను హంతకుణ్ణి కాకుండా నన్ను కాపాడారు" అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు.
ఆనందమూర్తి అతనికి ధైర్యం చెప్తున్నట్లుగా వీపుమీద తట్టాడు.
ఫణికుమార్ కి అంతా అయోమయంగా వుంది.
ఆనందమూర్తి లేకపోతే వాడు ఆ కత్తితో తనని పొడిచి చంపేసేవాడేమో! 'అతని తండ్రికి ఆర్నెల్లుగా ఆస్త్మాకి వైద్యం చేస్తున్నాడు. ఫీజు పేరుతో వేలాది రూపాయలు అతని దగ్గర్నుంచి రాబట్టుకున్నాడు. పేషంటు ఆరోగ్యంలో అణువంత డెవలప్ మెంట్ కూడా కనిపించలేదు. బంగారుబాతుని వదులుకోవటం ఎందుకని తను కూడా మొక్కుబడి వైద్యం చేశాడు. అది వీడికి అర్ధమయిపోయి నన్ను చంపి పాతేయడానికి వచ్చి ఉంటాడు.'
ఇలా రకరకాల ఆలోచనలతో ఫణికుమార్ బుర్ర మొద్దుబారిపోయింది. ఆనందమూర్తి తన కాల్ల దగ్గరున్న కత్తిని తీసి, ఆ వ్యక్తి చేతికి అందించాడు. "మీరేమంటున్నారో నాకు అర్ధం కాలేదు. స్పష్టంగా చెప్పండి. మీకెలాంటి సాయం కావాలన్నా నేను తప్పకుండా చేస్తాను!" అని అతనికి హామీ ఇచ్చాడు ఆనందమూర్తి.