Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 5

    హర్షిత చెప్తూండగానే ఆనందమూర్తి డ్రెస్ మార్చుకొని సిద్దమయ్యాడు.

    "హర్షితా! నువ్వూ బైలుదేరు" అన్నాడు ఆనందమూర్తి.

    "నేనెందుకు"

    "నువ్వు డిస్పెన్సరీకి కాదు. నేను వెళ్తూ నిన్ను ఫణికుమార్ ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్తాను. పాపం లతిక ఒక్కర్తే ఉంటుంది. తోడుగా ఉందువుగాని, నువ్వూ ఒక్క దానివేం వుంటావ్. తిరిగి వచ్చేటప్పుడు నిన్ను పికప్ చేసుకుంటాను"

    "అలాగే" అంది హర్షిత.

    "నేను షెడ్ లోంచి కారు బైటికి తీస్తాను. నువ్వు త్వరగా కిందికి రా! "బ్యూటీ కాంటెస్ట్ కి వెళ్ళేంత హడావుడి ఇప్పుడేం చేసుకోనక్కర్లేదు!" అంటూ ఆనందమూర్తి గబగబా కిందికి మెట్లు దిగాడు.

    మరో రెండు నిమిషాల్లో హర్షిత తయారై కారు దగ్గరికి వచ్చింది.

    ఎర్ర మారుతీకారు వెన్నెల్లో బాణంలా ముందుకు సర్రున దూసుకుపోయింది.

    పక్క వీధిలో ఫణికుమార్ ఇంటి దగ్గర హర్షితని దిగబెట్టాడు.

    ఫణికుమార్ భార్య లతికకు విషయం వివరించాడు.

    నేనూ రావటం లేటు అవ్వొచ్చు. అందుకే ఒకరికొకరు తోడుగా ఉంటారని హర్షితని తీసుకొచ్చాను. తిరిగి వెళ్ళేటప్పుడు హర్షితని పికప్ చేసుకుంటాను" అని చెప్పి కారు ముందుకి పరుగెత్తించాడు ఆనందమూర్తి. ఆనందమూర్తి కారు బంజారా హిల్స్ లో రోడ్ మీద మెలికలు తిరుగుతూ వెళ్ళి ఫణి క్లినిక్ ముందు ఆగింది.

    కారు ఆగగానే అప్పటివరకు వరండాలో కాలు కాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న ఫణికుమార్ పరుగున కారు దగ్గరికొచ్చి డోర్ తెరిచాడు.

    ఆనందమూర్తి కారు దిగగానే ఒక్కసారిగా అతన్ని కావులించుకున్నాడు ఫణికుమార్.

    "థాంక్యూ ఆనంద్! చాలా టెన్షన్ గా నీకోసమే ఎదురుచూస్తున్నాను.

    త్వరగా లోపలికి పద!" అంటూ తొందరచేసి, పరుగులాంటి నడకతో లోపలికి దారితీశాడు ఫణికుమార్.

    ఇద్దరూ ఇన్ పేషెంట్స్ ఉండేవైపు వెళ్ళారు. ఒక్కో రూమ్ లో ఒక్కో పేషంట్ ఉన్నారు.

    తిన్నగా మూడో నెంబర్ రూమ్ లోకి ఆనందమూర్తిని తీసుకెళ్ళాడు ఫణి.

    అక్కడ ఇద్దరు నర్సులు, కాంపౌండర్  ఉన్నారు.   

    వారు ఏం చేయాలో తెలీని అయోమయంలో ఉన్నారు.

    బెడ్ మీద యాభై ఏళ్ళ వయసున్న పేషంట్ ఉన్నాడు.

    అతను ఆయాసంతో ఎగిరెగిరి పడుతున్నాడు. అతను ఎగిరిపడకుండా నర్సులు, కాంపౌండరు అణచి పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పేషంట్ తాలూకు బంధువులు కొందరు రూమ్ లోను, మరికొందరు బయట నిలబడి వున్నారు.

    వాళ్ళ ముఖాల్లో ఆందోళన, భయం, దిగులు -ఒకటి తర్వాత ఒకటి మారుతున్నాయి.

    ఆనందమూర్తి పేషంట్ బెడ్ దగ్గరికెళ్లి చెయ్యిపట్టుకుని పల్స్ చూశాడు.

    స్టెత్ ను అతని గుండెలమీద పెట్టి పరీక్షించాడు.

    "ఆస్త్మా పేషంటా?" అడిగాడు ఆనందమూర్తి.

    అవునన్నట్లు తలాడించి, కేస్ షీట్ ని ఆనందమూర్తికి అందించాడు ఫణికుమార్.

    గబగబా దాన్ని తిరగేశాడు ఆనందమూర్తి.

    పేషంట్ కి వాడిన మందుల వివరాలు పరిశీలించాడు.

    ఒక్కసారిగా ఫణికుమార్ ముఖంలోకి చివాల్న చూశాడు.

    ఏమిటన్నట్లు కంగారుగా చూశాడు ఫణికుమార్

    "ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడావు ఫణీ? వీటివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఈ కంపెనీ మెడిసన్స్ అన్నీ లస్టియర్ బ్యాన్ చేస్తూ సర్కులర్ పంపారు. గుర్తులేదా?" నిశితంగా ఫణి కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు ఆనందమూర్తి.

    ఆ చూపులకి ఫణికుమార్ తట్టుకోలేకపోయాడు. మారు మాట్లాడకుండా తల దించుకున్నాడు.

    ఈ మందువల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మెడికల్ మేగజైన్స్ లో ఆ కేసుల వివరాలు ఆర్నెల్ల కిందట పబ్లిష్ చేశారు. ఇవన్నీ నీకు తెలియవని నేననుకోను. తెలిసి తెలిసీ ఈ మందులు వాడావంటే నిర్లక్ష్యం అని అనుకోవాలి. లేకపోతే శాంపిల్స్ గా వచ్చిన టాబ్లెట్స్ వాడితే నష్టమేమిటనే కక్కుర్తితో ప్రవర్తించి వుంటావు."

    ఫణికుమార్ ని మెత్తగా చివాట్లేస్తూనే బీరువాలోంచి ఒక ఇంజక్షన్ బాటిల్ వెతికి తీసుకొని, సిరంజిలోకి మందు ఎక్కించాడు ఆనందమూర్తి.

    గబగబా పేషంట్ దగ్గరికెళ్ళాడు. ఇంజన్ ఇచ్చాడు.

    పేషంట్ వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నర్స్ లకు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాడు.

    పేషంట్ పెద్దకొడుకు ఆనందమూర్తి దగ్గరికి వచ్చాడు.

    అతని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.

 Previous Page Next Page