ఒక పేషంట్ కి బ్రీతింగ్ ట్రబుల్ వచ్చి తలకిందులవుతున్నాడని చెప్పింది. ఏం చేయాలో ఫోన్ లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అవసరమైతే మళ్ళీ ఫోన్ చేయమని చెప్పి, రిసీవర్ పెట్టేసి హర్షిత దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. "డిస్పెన్సరీ నుంచి వచ్చి గంట కూడా కాలేదు..... అప్పుడే అక్కణ్ణుంచి ఫనా?" అంది హర్షిత.
"తప్పదు. ఒక పేషెంట్ బ్రీతింగ్ ట్రబుల్ వల్ల అప్ సెట్ అయ్యాడట. నైట్ డ్యూటీలో వున్న వాళ్ళు కంగారుపడి నాకు ఫోన్ చేశారు" అన్నాడు ఆనందమూర్తి నవ్వుతూ.
"మీరు ఒక పని చెయ్యండి!" అంది హర్షిత ఆనందమూర్తి ని చిరుకోపంతో చూస్తూ.
"రాణీగారు చెప్తే చేయకుండా ఉంటానా? ఏమిటో సెలవియ్యండి!" అన్నాడు ఆనందమూర్తి హర్షితను అనునయంగా దగ్గరికి లాక్కుంటూ.
"రాత్రిళ్ళు కూడా ఇంటికి రావటం ఎందుకు డిస్పెన్సరీలోనే కాపురం పెట్టేయండి" అంది హర్షిత.
"నువ్వు సరేననాలేగానీ నేను రెడీ!" అన్నాడు ఆనందమూర్తి.
"చాల్లే వూరుకోండి. అందరి ఆరోగ్యాలు రక్షించటం కోసం మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్న విషయం మర్చిపోతున్నారు. అర్ధరాత్రీ, అపరాత్రీ చూడకుండా పేషంటు దగ్గర్నుంచి ఫోనొస్తే చాలు,విష్ణుమూర్తి పెళ్ళాన్ని కూడా పట్టించుకోకండా గజేంద్రుణ్ణి రక్షించటానికి పరుగెత్తినట్టు పరుగు పరుగున వెళ్తారు" ఆవేశంగా అంది హర్షిత.
"స్టాప్! స్టాప్! అమ్మాయిగారు ఆవేశానికి పుల్ స్టాప్ పెట్టాలి. డాక్టరుగా వృత్తిధర్మం నేను నిర్వహిస్తున్నాను. నీకు మాత్రం నా మనసు తెలియదా! పిచ్చిదానా!" అన్నాడు ఆనందమూర్తి హర్షిత బుగ్గ మీద చిటికేస్తూ.
సిగ్గుమొగ్గలై అతని ఒళ్ళో ఒదిగిపోయింది హర్షిత.
మళ్ళీ ఫోన్ మోగింది.
హర్షిత భారంగా నిట్టూర్చింది.
"మళ్ళీ ఫోన్. మోగి మోగి అదే ఊరుకుంటుంది. మీరు వెళ్ళకండి" ఆనందమూర్తిని గట్టిగా కౌగిలించుకొంది హర్షిత
"ఉండు హర్షీ! వెళ్ళనీ!" ఆమెను విడిపించుకొని లేచాడు ఆనందమూర్తి "నా ఖర్మ మిమ్మల్ని కట్టుకోవటం నా బుద్ది తక్కువతనం. డాక్టర్ని పోలీస్ ఆఫీసర్ని కట్టుకున్న ఏ ఆడదీ సుఖపడదని మా అమ్మమ్మ చెప్తుండేది .అవన్నీ అమ్మమ్మ కబుర్లని కొట్టిపారేసి మీ మోజులో పడి పెళ్ళాడాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను" రోషంగా అంది హర్షిత.
ఆనందమూర్తి తనలో తను నవ్వుకుంటూ వెళ్ళి ఫోనెత్తి "హల్లో!" అన్నాడు.
అవతలి నుంచి ఫణికుమార్ కంఠం వినిపించింది.
"ఆనందమూర్తీ! నువ్వు అర్జెంటుగా రావాలి. ఆలస్యం చేయ్యవద్దు!"
అతని గొంతులో ఆందోళన ధ్వనించింది.
ఫణికుమార్ , ఆనందమూర్తి స్నేహితులు.
ఇద్దరూ డాక్టర్లే!
ఇద్దరూ ఒకేసారి ప్రాక్టీసు ప్రారంభించారు.
ఫణికుమార్ ధనవంతులైన పెషంట్లకి ట్రీట్ మెంట్ చేయడంలో ఆనందం పొందుతాడు.
"కలవారు క్లినిక్ కి వస్తే, మన కష్టానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. నీలాగా దరిద్ర నారాయణులకు వైద్యం చేయడం మొదలెడితే ముందు మనం దరిద్రుల జనాభాలో చేరిపోతాం" అని ఆనందమూర్తితో జోక్ చేస్తుంటాడు ఫణికుమార్.
ఆనందమూర్తి, ఫణికుమార్ బాల్యమిత్రులు. వైద్య వృత్తిమీద, వైద్యం మీద వారిద్దరి అభిప్రాయాల్లో తేడాలున్నా- ఇద్దరూ ఆత్మీయులే!
ఇద్దరి ఇళ్ళు పక్కపక్క వీధుల్లోనే ఉన్నాయి. డిస్పెన్సరీలు మాత్రం చాలా దూరంలో వున్నాయి.
ఎప్పుడూ నిబ్బరంగా మాట్లాడుతూ తొణకని కుండలా ఉండే ఫణికుమార్ అర్దరాత్రి సమయంలో ఆందోళనగా తనకు ఫోన్ చేయటం ఆనందమూర్తికి ఆశ్చర్యం కలిగించింది.
"ఫణీ! ఎక్కణ్నుంచి మాట్లాడుతున్నావ్?" అడిగాడు ఆనందమూర్తి ఫోన్ లో.
"నా డిస్పెన్సరీ నుంచి"
"ఏమిటీ అర్జెంటు పని?"
"ఒక సీరియస్ కేసు. నాకు అంతుపట్టడం లేదు. నువ్వు వెంటనే ఇక్కడికి రా. వివరాలు ఇక్కడ చెప్తాను. ప్లీజ్!" బ్రతిమాలుతున్నట్లు హడావుడిగా చెప్పాడు ఫణికుమార్
"కంప్లయింట్ ఏమిటీ?" ఇంకా ఏదో అడగబోయాడు ఆనందమూర్తి.
"ఆనంద్! ముందు నువ్వు ఇక్కడికి రా. నీకే తెలుస్తుంది. ఆలస్యం చేస్తే పేషెంట్ బ్రతకడు. ప్లీజ్!" ఫణికుమార్ మాటల్లో భయం, వణుకు ధ్వనించాయి
ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగాడు ఆనందమూర్తి.
హర్షిత దగ్గరికి వచ్చింది.
"ఫణికుమార్ దగ్గర్నుంచా?" అడిగింది.
"ఆ......"
"ఏమిటి విశేషం?"
"ఒక పేషంటుకి సీరియస్ గా ఉందట. మన వాడికి కాల్ళూ చేతులూ ఆడటంలేదు. నన్ను అర్జెంటుగా రమ్మన్నాడు" అన్నాడు.
"వైద్యం మానేసి ఏదైనా వ్యాపారం చేసుకోమని నేను ఫణితో లక్షసార్లు చెప్పాను. వింటేగాయ ప్రతిసారీ ఎవరికో ఒకరికి ప్రాణాల మీదికి ముప్పుతీసుకువచ్చి మీకు ఫోన్ చేయటం, ఆపద్బాందవుడిలాగ మీరు పరుగున వెళ్ళి చక్రం అడ్డేయటం.... మామూలేగా!"