హర్షిత ఏదో చెప్పబోయింది.
"అబ్బ! నువ్వుండవమ్మా మధ్యలో..." అంటూ కసిరాడు.
ఆనంద్ కోపం తారాస్థాయికి చేరుకుంది.
"అసలు విషయం తెలుసుకోకుండా, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి.
మీ ఇష్టం వచ్చినట్లు ఏవేవో మాటలన్నారు. నేనూ మాట్లాడగలను. మీలాగే కాకపోతే సభ్యత కలవాణ్ణి, అందుకే"
"అంటే.... నాకు సభ్యత లేదంటావా
"నేననలేదే"
"అంటే దవడ పగలకొడతాను"
"మర్యాదగా మాట్లాడండి" అరిచింది హర్షిత.
"నీ పని చెబుతా ఉండు. నీ అంతం చూస్తాను. నా మేనల్లుడి రక్తం కంట చూసినవాణ్ణి, వాడికి తగిలిన దెబ్బలకి, దెబ్బ తీస్తాను" అరిచాడు కేశవ్ "ప్లీజ్ ఊరుకోండి సార్" అంటూ ఏదో సర్దిచెప్పబోయాడు ఇన్స్ పెక్టర్. కేశవ్, అతణ్ణి అంటే దొంగగారిని చెయ్యిపట్టి తీసుకెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్ ధన్యవాదాలు చెబుతూ కార్లో కూర్చున్నాడు. కారు రయ్ మని గాలిలో తేలిపోతున్నంత వేగంగా వెళ్ళిపోయింది.
కారు పార్క్ చేసి అప్పుడే లోపలికొస్తూ పణి "ఏమయింది?" అనడిగాడు.
జరిగినదంతా చెప్పింది హర్షిత.
"అరె! వాడెవడో దుర్మార్గుడిలా ఉన్నాడే...." అన్నాడు మిగతా విషయాలు ఇన్స్పెక్టర్ ని అడుగుతానని వెళుతూ.
"అఖ్కర్లేదు పోదాం పద!" అన్నాడు ఆనంద్ తన కారెక్కుతూ.
హర్షిత వెనకాలే వెళ్ళి కార్లో కూర్చుంది.
ఫణి కూడా తన కారు దగ్గరికెళ్ళాడు. కార్లు స్పీడుగా పోతున్నాయి. ఆలోచనలతో పోటీ పడుతూ!
* * *
ఇల్లంతా హడావుడిగా వుంది. మామిడి తోరణాలతో పసుపు గుంభాల గడపలతో కళకళలాడుతోంది. బంధువులూ స్నేహితులతో ఇల్లు నిండిపోయింది . దబ్బపండులా నిగనిగలాడుతూ, ఆకుపచ్చ జరీ అంచు పట్టు చీరలో కొత్త అందాలతో మెరిసిపోతోంది హర్షిత. ఒద్దన్నా వినకుండా, తలనిండా పూలూ, చేతినిండా ఎరుపూ ఆకుపచ్చ గాజులూ, కాళ్ళకు పారాణీ పెట్టేసరికి, ఎత్తుగా వున్న పొట్ట తప్పిస్తే, కొత్త పెళ్ళి కూతురిలా వుంది హర్షిత. అద్దం ముందునుంచుని, చీర సవరించుకుంటున్న హర్షితని వెనకనుంచి వాటేసుకున్నాడు ఆనందమూర్తి.
"ఆ...ఆ...! బాబు నలిగిపోతాడు దూరం వుండండి అంది చిలిపిగా చూస్తూ చిన్నగా అతణ్ణి వెనక్కి తోస్తూ. ఆనంద్ కొంచెం తూగి చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ , "అయ్యబాబోయ్! వీడెక్కడ దొరికాడురా నాయనా. వాడు బయటికి రాకముందే నన్ను నీ దగ్గిరనుంచి దూరం చేస్తున్నాడు. ఒచ్చాక ఇంకేమయినా వుందా?" అన్నాడు బెంబేలు పడిపోతూన్నట్టు రెండు చేతులతోటీ గుండెల్ని అదిమి పట్టుకుంటూ. హర్షిత పకపకా నవ్వింది చిలిపిగా.
అంతలో హర్షిత అమ్మగారు లలితాంబగారూ, అత్తగారు మహలక్ష్మమ్మ గారూ అటుకేసి రావడంతో ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
"బుగ్గచుక్క పెట్టడం మర్చిపోయా.... అందుకే... చెప్పబోయింది లలితాంబ"
హర్షిత నవ్వుతూ తలెత్తి చూసింది. కిటికీ చువ్వలలోంచి ఫణి తనవైపే చూస్తూండడం కనిపించింది.
హర్షితకి కంపరం పుట్టుకొచ్చింది. అలా ఎంత సేపటినుంచి చూస్తున్నాడో.....
ఛీ...ఛీ! అయినా వీడికిదేం బుద్ది? అనుకుంటూ పళ్ళు కొరుకుతూ అటు చూసేసరికి, అప్పుడే లతిక వచ్చి తల్లో కనకాంబరాల దండ పెట్టి "ఇంకరా... కుర్చీలో కూర్చుందువుగాని...." అంటూ చెయ్యిపట్టి తీసుకెళ్ళి ఆమె కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోబెట్టింది. ఒక్కొక్కరే పేరంటాళ్ళు వస్తూ వున్నారు. చుట్టు పక్కల వాళ్ళూ, క్లాస్ మేట్సూ, బంధువులతో ఇల్లు పెళ్ళి వారిల్లులా వుంది. ఆనందమూర్తి స్నేహితులు కొందరొచ్చారు. పిలవకపోయినా అభిమానంతో కొందరు పేషంట్లూ వచ్చారు. ముత్తైదువులందరూ హర్షిత చేతికి ఎఱ్ఱగాజులూ, ఆకుపచ్చగాజులూ తొడిగారు. హారతిచ్చి మంగళహారతులు పాడారు. హర్షిత మనసు ఆనందంతో ఊగిపోతోంది. పెళ్ళిరోజున ఇవన్నీ జరుగుతూంటే మనసు నిండి ఆక్రమించుకున్నది ఆనందమూర్తి బొమ్మ. ఈ రోజున ఆనంద్ పక్కన మరో బుజ్జి ఆనంద్ ఉయ్యాల్లో ఊగుతూ ఇల్లంతా పాకుతూ, చిలిపితనంతో చిందులు తొక్కుతూ చిన్ని కృష్ణుడిలా కనిపిస్తూ కమ్మని ఊహలతో నిండిపోయి గిలిగింతలు పెడుతున్నాడు. స్నేహితులందరూ ఆట పట్టిస్తున్నారు. వెంటనే ఆనంద్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. "నాకు చిట్టి హర్షిత కావాలి" అంటూ వెంటనే మనస్సనే కాన్వాస్ మీద, చిట్టి హర్షిత రూపం వెలిసింది. పట్టు పరికిణీలో తనే పసిపాపై ఉయ్యాల్లో ఊగుతూన్నట్టనిపించింది. తన పిచ్చి ఊహలకి తనకే నవ్వొచ్చింది. చిన్నగా నవ్వుకుంది.
"ఏం జ్ఞాపకం వచ్చిందోయ్? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? అదేదో మాకూ చెప్పు, మేమూ సంతోషిస్తాం" అంటూ ఆట పట్టించారు స్నేహితులు.
"ఏం లేదు చెప్పడానికి" అని తప్పించుకోబోయింది.
"ఏదో మనోజ్ఞమైన తలపు నీ మదిని గిలిగింతలు పెట్టింది కనుకే ఆ చిరుమందహాసం నీ పెదవుల మీద పూచింది. ఏమిటో ఆ సంఘటన వివరించవే చెలీ...." క్లాస్ మేట్ తపస్య గేలి చేసింది నాటక ఫక్కీలో మాట్లాడుతూ! మిగిలిన వాళ్ళందరూ తందాన తాన అన్నారు.
పేరంటం అంతా ఎంతో సరదాగా పెద్దల ఆశీస్సులతో, స్నేహితుల ఆట పట్టింపులతో సరదాగా గడిచిపోయింది. మెల్లగా ఒక్కొక్కరూ వెళ్ళిపోవడంతో రద్దీ తగ్గింది.