Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 33

    "ఇంతకన్నా ఘరానాదొంగలు ఎందరో ఉన్నారు ఈ నాటి సమాజంలో, మన చుట్టూనే తిరుగుతున్నారు. మనం ఏం చెయ్యగలం? ఎవరైనా కొన్నిసార్లు కొందరిని పూల్స్ చేసి బతుకుతారు. కానీ, అన్నిసార్లూ అందర్నీ మోసం చెయ్యలేరు. నోబడి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఐస్ ఆఫ్ లా... న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకున్నా, ఎవరూ కూడా న్యాయాన్నీ, చట్టాన్నీ ఎల్లకాలం ధిక్కరించి బతకలేరు. పట్టుబడిపోక తప్పదు. అంతవరకూ వాళ్ళ ఆటలు సాగుతాయ్ అంతే" అన్నాడు.

    "నీ ఫిలాసఫీ ప్రాక్టికల్ కాదు. వీడు న్యాయదేవత కంట్లో పడేసరికి మరో వంద పిక్ పాకెటింగ్స్ చేస్తాడు. వీణ్ణి ఇప్పుడే పోలీసులకు అప్పగిస్తే మంచిది"

    "అవును ఆనంద్! ఫణి చెప్పింది కూడా కరెక్టే" అంది హర్షిత.

    "మేము తీసుకెళతామమ్మా పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళండి" అన్నాడు గుంపులోంచి ఎవరో.

    "కాదు. మనమే తీసికెళదాం" అని ఆనంద్ సమాధానానికి కూడా ఎదురు చూడకుండా,  "మీలో మరో నలుగురు ఎవరైనా రండి. వాణ్ణి నా కార్లో కూర్చోబెట్టండి. నాంపల్లి పోలీస్ స్టేషన్ కి వెళదాం" అన్నాడు ఫణి తన కారు డోర్లు తెరిచి, తను స్టీరింగ్ దగ్గర కూర్చుంటూ
   
    వెంటనే నలుగురైదుగురు కలిసి దొంగని గట్టిగా పట్టుకొని ఫణి కారెక్కారు.

    ఆనంద్ , హర్షిత వాళ్ళ కారులో బయలుదేరారు.

    "ఆనంద్, సారీ! ఇట్లా జరుగుతుందని అనుకోలేదు" అంది క్షణాపణ చెబుతున్నట్లుగా హర్షిత.

    ఆనంద్ జవాబు చెప్పలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు.

    "ఆనంద్! ఏమిటాలోచిస్తున్నావ్"

    ఆలోచనలకి బ్రేక్ వేస్తూ  "ఏం లేదు? ఎంతో జాగ్రత్తగా ఉంటావు. అటువంటిది నీ పర్సుపోవడం, ఆ సమయానికే ఫణి అక్కడికి రావడం అంతా నాటకీయంగా లేదూ? ఆసుపత్రినీ, పేషెంట్లనీ వదిలిపెట్టి, లతిక కూడా లేకుండా ఒక్కడే ఈ వేళప్పుడు ఫణి అక్కడికి రావడం ఆశ్చర్యంగా లేదూ?" అన్నాడు.

    "అవును! కానీ ఈ విషయంలో ఫణిని అనుమానించడం కరెక్టు కాదు. అది సరే....ఎప్పుడూ ఫణి మీద నాకు డౌటొచ్చేది. కానీ ఇవాళ నీకు డౌట్ రావడం ఆశ్చర్యంగా ఉంది."

    "నో....నో... డౌటేం కాదు. 'తమాషా కోయిన్సిడెన్స్' అన్నాడు."

    కారు నాంపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. వెనకాలే ఫణి కారు కూడా ఆగింది.

    దొంగని నలుగురు మనుషులు పట్టుకుని దిగారు.

    "ఆనంద్! మీరెళ్ళి పోలీస్ కంప్లయింట్ చెయ్యండి. నేను కారు పార్క్ చేసొస్తా" అంటూ పార్కింగ్ ప్లేస్ కి వెళ్ళాడు ఫణి.

    హర్షితా, ఆనంద్ లోపలికి వెళ్ళారు. జరిగినదంతా చెప్పింది హర్షిత. ఇన్ స్పెక్టర్ వాళ్ళు చెప్పినదంతా రాసుకున్నారు. ఇన్స్ పెక్టర్, కానిస్టేబుల్స్ కి చెప్పి దొంగని లాకప్ లోకి పంపించాడు.

    అంతలోనే వచ్చాడు ఒక ఆగంతకుడు. ఇన్ స్పెక్టర్ కి చెప్పి ఆ దొంగని బెయిల్ మీద విడిపించమన్నాడు. వాడు నిజంగా దొంగ కాదనీ, కొంచెం మెంటల్ అనీ, వాడు తనకి అక్క కొడుకు అవుతాడనీ, తల్లీ తండ్రీ యాక్సిడెంట్ లో చనిపోతే వాడిలా అయిపోయాడనీ, వాడి పేరు మీద బోలెడాస్తుందనీ, కావాలంటే లాయర్ పి.ఎస్.చౌదరిగారికి ఫోన్ చేసి మాట్లాడమనీ" చెప్పాడు.

    అతను మాట్లాడుతూ ఉండగానే ఫోన్ మోగింది.

    ఇన్ స్పెక్టర్ ఫోన్ తీశాడు "చెప్పండి సార్! నమస్తే" అన్నాడు ఇంచుమించు ఫోన్ కే సెల్యూట్ కొడుతూ.

    "వొదిలేస్తాను సార్.....! అట్లాగే! ఇప్పుడే అతని మావయ్య కేశవ్ గారొచ్చారు. అంతా చెప్పారు ఇక్కడే ఉన్నారు మాట్లాడండి" అంటూ ఫోన్ అతనిచేతికిచ్చాడు.

    "నమస్కారం లాయరుగారూ!...." అంటూ ఏవేవో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. హర్షితా, ఆనంద్ బిత్తరపోయి ఒకరిమొహాలొకరు చూసుకున్నారు.

    కాస్సేపటికి తేరుకుని "నేను డాక్టర్ ఆనంద్. ఈమె నా భార్య హర్షిత....." అంటూ ఇంకా ఏదో చెప్పేలోపలే  "ఏం డాక్టరువయ్యా... అసలు నువ్వు మనిషివా పశువువా? గొడ్డును బాదినట్లు బాదావ్. చూడు వాడి ముక్కు ఎలా బద్దలయిందో!" అన్నాడు.

    "అదికాదండీ! నాకసలేమీ తెలీదు. నేనిప్పుడే నా వైఫ్ ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను" అంటూ చెబుతుండగానే.

    "షటప్! సూదులు గుచ్చి డబ్బులు లాక్కున్నట్టు కాదు. కాస్త మానవత కూడా ఉండాలి. బ్రుట్ లా పడి కొట్టెయ్యడమే. అసలు కొట్టే అధికారం నీకు లేదు. పట్టుకుని పోలీసులకి అప్పగించవలసింది. కొడతారో, ముద్దుపెట్టుకుంటారో అది వాళ్ళిష్టం! నువ్వు చేసిన పనికి పరువు నష్టం కేసు పెడతాను" అన్నాడు. ఆనంద్ కి ఒళ్ళు మండిపోయింది. ఆ పెద్దమనిషి తన గొడవే తప్ప మాట్లాడనివ్వలేదు.

 Previous Page Next Page