"ఫణీ పద, మనమూ వెళదాం" పిలిచింది లతిక. ఆనందమూర్తితో కబుర్లు చెబుతూన్న ఫణి లేచి హర్షిత దగ్గరికొచ్చాడు. మెల్లగా రహస్యం చెబుతున్నట్టుగా "హర్షితా! రంభా, రాగిణీ, మేనకా, తిలోత్తమలను తలదన్నే అప్సరస ఎవరో దివినుంచి భువికి దిగొచ్చి, మా మధ్యన కూర్చున్నట్టుంది" అన్నాడు.
మామూలుగా అయితే హర్షిత ఏదో సమాధానం చెప్పేదేగానీ ఆ రోజు తనూ ఆనంద్ లు మాట్లాడుకుంటున్నప్పుడు ఫణి దూరం నుంచి తమనే చూడడం సంస్కారంలేని అతని స్వభావాన్ని గుర్తుకుతెచ్చింది.
చిన్నగా నవ్వి ఊరుకుంది హర్షిత.
అందరి దగ్గరా సెలవు తీసుకుని, ఫణి, లతికలు కూడా వెళ్ళిపోయారు.
లలితాంబగారు హర్షితని లోపలికి తీసుకెళ్ళి దిష్టి తీశారు. " ఇంక బట్టలు మార్చుకుని రామ్మా" అంది.
"అమ్మా.... వేడి వేడి నీళ్ళతో స్నానం చెయ్యనా? నడుం నొప్పిగా వుంది అడిగింది హర్షిత.
"అలాగే చెయ్యి! హాయిగా నిద్దరపడుతుంది" అంది ఆమె.
మహలక్ష్మమ్మగారు కోడలికి తల్లోపూలు తీసి జుట్టు చిక్కు విప్పారు. తల్లి వేన్నీళ్ళు పెట్టొచ్చి దిష్టి తీసింది.
తియ్యని తలపులతో వెళ్ళి స్నానం చేసొచ్చింది హర్షిత.
ఆ రాత్రి హర్షిత జీవితంలో మరపురాని మరువలేని వెండి వెన్నెల రాత్రి! ఆనంద్ అనురాగ డోలికలలో పాపాయిలా ముడుచుకుపోయిన మధురమైన రాత్రి!
కొత్త కొత్త తలపులతో, మురిపించే వలపులతో ఒకరిలో ఒకరు ఐక్యమయిపోయిన రాత్రి!
రెండు మనసులూ పెనవేసుకుపోయి అనురాగాల ఆప్యాయతల పందిట్లో పరవశంతో పరవళ్ళు తొక్కిన రాత్రి!
పసిపాపలా, గువ్వలా, ఆనంద్ కౌగిట్లో ముడుచుకుపోయి హాయిగా నిద్రపోయింది హర్షిత ఏ తెల్లవారు ఝాములోనో!
ఆమె అందాల నగుమోముని తిలకిస్తూ, అమాయకమైన, చంద్రబింబంలాంటి మొహాన్ని చూసి ఆనందిస్తూ, నుదిటిపై చిందరవందరగా పడ్డ ముంగురులను సవరిస్తూ, ఆమెకి నిద్రాభంగం కలగకుండా అపురూపంగా అదిమి పట్టుకుని జోపుచ్చుతూ తెల్లవార్లూ మేలుకునే వున్నాడు ఆనంద్. అతని మనో భావాలకి ఊహా చిత్రాన్ని రూపకల్పన చేసుకోవాలే తప్ప వర్ణించలేము.
సూర్యోదయమైన నాలుగయిదు గంటల వరకూ హర్షితకు మెలకువ రాలేదు.
ఆనంద్ మాత్రం మామూలు టైముకే లేచిపోయి, మార్నింగ్ వాక్ కి వెళ్ళొచ్చి, రెడీ అయి కూర్చున్నాడు. "అర్జంటు కేసులేమైనా వుంటే ఇంటికి ఫోన్ చేస్తే క్లినిక్ కి వస్తాను. లేకపోతే రానని ముందుగానే కాంపౌండర్ కి నర్సుకీ చెప్పేశాడు.
తెల్లని మల్లెపువ్వులాంటి మక్ మల్ పైజమా, కుర్తా వేసుకుని బాల్కనీలో కూర్చున్నాడు తల్లి అందించిన వేడివేడి ఇడ్లీలు తింటూ.
అప్పుడడిగింది లలితాంబగారు "ఆనంద్ బాబూ, హర్షితని నాతో తీసుకెళ్ళనా పురిటికి" అని.
ఆనంద్ కి గుండె క్షణం కొట్టుకోవడం మానేసినట్టనిపించింది. ఇడ్లీ చేదుగా వున్నట్టు మింగుడు పడలేదు. 'హర్షిత పురిటికని వెళ్ళిపోతే కనీసం ఏ అయిదారు నెలలో తనకి దూరంగా వుండాల్సొస్తుందా? హర్షిత లేనిదే ఒక్కరోజైనా తను ఊహించుకోలేడే! ఎలాగ?'
మహలక్ష్మమ్మగారు నవ్వుతూ కొడుకుకేసి చూసింది. అతని ఆలోచనలను అర్ధమయినట్టుగా పురుడొచ్చాక కావాలంటే నెల రోజుల్లోనే తీసుకొస్తాం. అప్పుడు నేనొచ్చి పాపకి మూడో నెల వచ్చేదాకా ఇక్కడ వుంటాను" అంది.
అప్పుడే లేచిన హర్షిత అటొచ్చి ఈ మాటలు విని ఆనంద్ కేసి చూసి నవ్వింది.
"హర్షితని విడిచి నేను క్షణం కూడా వుండలేను" అని అమ్మకీ అత్తగారికీ ఎలా చెప్పాలో తెలీక తికమకపడుతూన్న ఆనంద్ కి హర్షిత అలా నవ్వితే ఉడుకుమోతుతనం కలిగింది.
"ఆమెనే అడగండి," అన్నాడు ముక్తసరిగా.
"పుట్టింటికి వెళ్ళడానికి ఏ ఆడపిల్ల ఇష్టపడదు? నువ్వు సరేనంటే తనూ సరేనంటుంది" అంది మహలక్ష్మమ్మగారు కొడుకునుద్దేశించి.
"నాకు తెలుసు బాబూ! అన్నాళ్లు నువ్వు ఒంటరిగా వుండాలంటే ఇబ్బందే....!" అంది లలితాంబ అల్లుడికేసి చూసి.
'హమ్మయ్య! ఈమైనా నన్నర్ధం చేసుకున్నారు అదే చాలు' అనుకుంటూ ఊపిరి పీల్చుకునే లోగా "అన్నాళ్ళు హోటల్లో భోజనం అదీ కష్టమే! కానీ తప్పదు కదా" అంది మళ్ళీ!
"ఓహో ఈవిడ నా భోజనం గురించి ఆలోచిస్తోందా? దాందేముంది? ఏ హోటల్లోనో భోంచెయ్యొచ్చు. కానీ నా బాధ అదికాదు కదా! గలగలా మాట్లాడుతూ, చిరునవ్వుతో పలుకరిస్తూ అడుగడుగునా తన కష్టసుఖాలను విచారిస్తూ తన చుట్టూ తిరిగే హర్షితని ఒదిలి ఎలా వుండాలి అని" ఆ విషయం ఎవ్వరూ ఆలోచిస్తున్నట్టు లేదు.


