Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 32

    ఈ కేకలూ, పరుగులూ విని చుట్టుప్రక్కల దుకాణాల వాళ్ళంతా కూడా పరుగెత్తుకొచ్చారు.

    "హర్షితా... ఏం జరిగింది?" గుంపులో ఎక్కడ్నుంచో పిల్చి అడిగాడు ఫణి. ఫణిని చూడగానే ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి హర్షితకి.

    "ఎవడో దొంగ నా పర్సు కొట్టేశాడు. అటెళ్ళాడు. అయినా నువ్విక్కడికెలా వచ్చావ్" అడిగింది.

    "ఊరికే...ఒక్క రౌండ్ కొట్టి, బాగుంటే రేపు నిన్నూ లతికనీ, ఆనంద్ ని తీసుకొద్దామనుకుని వచ్చాను. ఇప్పుడే వచ్చాను. అది సరే... ఇక్కడేమైనా కొన్నావా?"

    "అవును. రెండు చీరలు తీసుకున్నాను. బిల్లు నాలుగువేల రెండొందలయింది. 'పే' చేద్దామని హ్యాండ్ బ్యాగ్ చూస్తే, ఎవడో చూడు ఎలా  కట్ చేసి పర్సు తీసుకుపోయాడో!" అంటూ కత్తిరించబడిన బ్యాగ్ చూపించింది.

    "సరే ముందు బిల్లు కట్టేసి పోదాం. వాడి పని చూస్తాను" అంటూ జేబులోంచి డబ్బు తీసి బిల్లు కట్టేశాడు ఫణి.

    "హర్షిత! ఒక పని చెయ్యి, నువ్వు షాపులోనే కూర్చో. నేను వీడి సంగతేమిటో చూసొస్తా" అంటూ ఒక్క పరుగులో గుంపులోకి వెళ్ళిపోయాడు ఫణి.  "అలాగే" అంటూ హర్షిత షాపు దగ్గరే ఉండిపోయింది. అందరి దృష్టి హర్షిత వైపు, ఆ గుంపువైపే!

    దాదాపు పదినిముషాల తరువాత, ఆ గుంపంతా షాపు వైపుకి కదిలారు. మధ్యలో ఫణి ఎవరిదో చొక్కా పట్టుకొని లాక్కొస్తున్నాడు. జనం అతణ్ణి తలో దెబ్బా వేస్తున్నారు. ఫణి అతణ్ణి ఒక్క తోపు తోశాడు హర్షితవైపు. వాడు తుళ్ళుకుంటూ వెళ్ళి ఆమె పాదాల దగ్గర పడ్డాడు. పర్సు తీసి ఆమె చేతిలో పెట్టి తప్పయిందన్నట్టు లెంపలేసుకున్నాడు.

    హర్షిత గబగబా పర్సు తెరిచి చూసి "అంతా సరిగ్గానే వుంది" అంది.

    "పద! ...పోలీస్ స్టేషన్ కి" అంటూ వాణ్ణి చొక్కా పట్టుకొని లేవనెత్తాడు పణి. వాడి ముక్కులోంచి రక్తం కారుతోంది. ముక్కు మీద బాగా దెబ్బ తగిలినట్లుంది వాచిపోయింది.

    "తప్పయిపోయింది సార్........ ఈసారికి వదిలెయ్యండి సార్....మేడమ్ తప్పయింది మేడమ్.... పెద్ద మనసుతో క్షమించండి మేడమ్...." ఏడుస్తూ బతిమాలుతున్నాడు వాడు.

    "ఫణీ! వదిలేసెయ్! మన డబ్బు మనకి దొరికింది కదా. ఒంటిగంటవుతోంది ఆనంద్ వస్తాడు నా కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు." అంది ముందుకి నడుస్తూ.

    "హర్షితా! చదువుకున్నదానివి. నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? వీణ్ణి ఒదిలేస్తే ఇంకా ఎందరి పర్సులు కొట్టేస్తాడో ఏమో! మరోసారి ఇలాంటి వెధవపని చెయ్యకుండా వీణ్ణి జైలులోకి తోయించాలి. పోలీసు లాఠీ దెబ్బలు ఒక్కసారి తగిలితే, ఇంక జన్మలో ఇట్లాంటి పన్లు చెయ్యడు."

    "ఫణీ! ఇలాంటివాళ్ళు ఎన్నిసార్లో జైలుకి వెళుతుంటారు. వస్తుంటారు మళ్ళీ ఇట్లాంటి పనులే చేస్తారు. అది వాళ్ళ వృత్తి. దేముడి దయవల్ల మన డబ్బు మనకి దొరికింది. వాడికి దేహశుద్ది జరిగింది. సమయానికి నువ్వొచ్చి, కాపాడావు. పద ముందు ఇక్కడినుంచి బయటపడదాం" అంది ముందుకు నడుస్తూ.

    "నో....నో....నో..! ఎవరికి వారు ఇట్లా అనుకోబట్టే ఈ పిక్ పాకెటర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మన అదృష్టం వబావుండి వాణ్ణి పట్టుకున్నాం. డబ్బు దొరికింది. లేకపోతే... సరే!  మనం అంటే కాస్సేపు బాధపడి మర్చిపోతాం. అదే సామాన్యుల దగ్గరనుంచి పోతే, వాళ్ళెంత బాదపడలవసివస్తుంది? అందుకే పద. వీణ్ణి పోలీస్ స్టేషన్ లో అప్పగించి వెళదాం. ఆనంద్ వస్తే మరీ మంచిది" అన్నాడు ఉద్రేకంగా ఫణి.

    ఫణి మాటలు కరెక్టేననిపించింది హర్షితకి.

    'సరే'నంది.

    ఇద్దరూ బయటకొచ్చారు. కొందరు దొంగని పట్టుకుని లాక్కొచ్చారు. అప్పటికే ఆనందమూర్తి వచ్చి పావుగంట దాటింది. హర్షితనీ, ఫణినీ వాళ్ళ వెంట వస్తున్న గుంపునీ చూసి, అర్ధం కాక  "హర్షితా! ఏం జరిగింది?" అడిగాడు కంగారుగా.

    జరిగినదంతా ఒక్క ముక్కలో చెప్పింది హర్షిత. "సమయానికి అక్కడ ఫణి కనిపించి, ఆ దొంగని నాలుగు తన్ని లాక్కొచ్చాడు" అంది ఆ దొంగని చూపిస్తూ.

    ఆనందమూర్తి దొంగని చూశాడు. వాడి ముక్కు పెద్దగా వాచిపోయి వుంది. రక్తపుచారలు ముక్కుమీద, చెంపల మీదా కనిపిస్తున్నాయ్.

    "బాగానే బుద్ది చెప్పినట్లున్నారు. ఇంక వదిలెయ్యండి. వాడి పాపాన వాడే పోతాడు. మనకెందుకొచ్చిన గొడవ. వాడెలాగూ నాలుగు రోజుల్లో బయటికొస్తాడు. అనవసరంగా మన పన్లు పాడవుతాయ్" అన్నాడు ఫణిని చూస్తూ.

    "ఆనంద్! డోంట్ బి స్టుపిడ్! మనలాంటి వాళ్ళం కూడా, మన పన్లు పాడవుతాయనో, వాడి పాపాన వాడే పోతాడనో, ఒదిలేస్తే ఈ సమాజం ఇంకా దిగజారిపోతుంది"

 Previous Page Next Page