"ఏయ్ హర్షితా! ఏమిటిక్కడే నుంచుండి పోయావ్? అరగంట నుంచి చూస్తున్నా. ఏముందబ్బా అంత చూడవలసింది ఇక్కడ" అంది భుజం తట్టి పలకరిస్తూ అపర్ణ.
"ఓయ్...... నువ్వా? బాగున్నావా? ఎన్నాళ్ళయిందో మనం కలిసి," అంటూ పలకరించింది హర్షిత.
"చూడవే! మన రాష్ట్రం. మనదేశం... ఐ మీన్... ఆల్ ఇండియా... ఎంత గొప్పదో! ఎటుచూసినా ఒక దాన్ని మించిన కళానైపుణ్యత మరో దానిలో! ఓహో ఎంత గొప్పదేశమే మనది! ఇదంతా ఒకెత్తయితే ఇంతకు మించిన గొప్ప సంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వాన్ని సృష్టించగల శక్తి ఒక్క మనదేశానికే ఉందే! అంది ఆవేశంగా హర్షిత.
"వండర్ ఫుల్.......తమరేదో విదేశాలలో పుట్టి, విదేశాల్లోనే పెరిగి, ఇప్పుడే ఇండియాకొచ్చి ఇవన్నీ చూస్తూన్నట్టు మొదటిసారిగా, అలా ఫీలయిపోతున్నారంటబ్బా" వ్యంగ్యంగా అంది అపర్ణ.
"అదేనే మన దౌర్భాగ్యం! ఎవరో విదేశీయులు మెచ్చుకుంటే తప్ప మన వాళ్ళకి మనం విలువ ఇవ్వం. మన ప్రతిభని పరదేశీయులు గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చాక, మనం మనవాళ్ళని గుర్తిస్తాం. అంతదాకా మాట్లాడం. అదే మన ఖర్మ.....! పొరుగువాణ్ణి పొగడడం మనకు నామోషీ! మనని మనం గౌరవించుకుని మనలో మనం అంతా కలిసి మెలిసి ఉన్నరోజున మనం ప్రపంచ దేశాలన్నింటిల్లోనూ ప్రధన స్థానంలో ఉంటాం" అంది మరింత ఆవేశంగా హర్షిత.
"వెరీ గుడ్......నీ సంగతి ముఖ్యమంత్రిగారికో ప్రధానమంత్రిగారికో రాస్తే నీ వాగ్ధాటికి మెచ్చి, నీకు టిక్కెట్టిచ్చి ఎలక్షన్లలో నుంచోబెట్టి గెలిపించి, నీకు చేనేతమినిస్ట్రియిస్తే నీ వల్ల కళాకారుడికి గొప్ప గుర్తింపొస్తుంది. అది నెక్స్ట్ ప్రోగ్రాం. తల్లీ! ఇప్పుడు ఏమైనా చూడదలుచుకున్నావా? ఏమైనా కొనదల్చుకున్నావా? చెప్పు, కలిసి చూద్దాం. లేదా 'బై'..." అంది అపర్ణ., అపర్ణ హర్షిత పి.జి.లో క్లాస్ మెట్స్! అఫర్ణ అదే కాలేజ్ లో లెక్చరర్ ఉద్యోగం చేస్తోంది. కట్నాలూ, కానుకలూ ఎక్కువగా అడిగే ఊరు వాళ్ళది. అంత ఇచ్చుకునే స్థోమత వాళ్ళకి లేకపోవడంతో అపర్ణకింకా పెళ్ళికాలేదు. మామూలు వాళ్ళైనా సరే డైమండ్ దుద్దులూ, డైమండ్ ముక్కుపుడకా, ఇంటికి సరిపడే స్టీలు సామాన్లూ కనీసం మూడునాలుగు కేజీ వెండి పూజసామాన్లూ వగైరా, ఏదో ఒకలెక్క ప్రకారం ఇన్నీ అని పట్టుచీరలూ ఇవన్నీ కావాలి. "అలాంటివేవీ అడగనివాళ్ళు నన్ను నన్నుగా కోరుకుని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు వచ్చినప్పుడే పెళ్ళి చేసుకుంటాను. లేకపోతే అసలు నాకు పెళ్లే అక్కర్లేదు" అని పట్టుబట్టి కూర్చుంది అపర్ణ. "ఉన్న ఇల్లూ వాకిలీ అమ్మి ఒక్కగానొక్క బిడ్డవు. నీపెళ్ళి చేసేస్తే , మిగిలిన ఇద్దరూ మొగపిల్లలు. బాధలేదు" అనేవారు అమ్మానాన్నలు! "నన్నూ మొగపిల్లాడినే అనుకోండి. నా కోసం ఉన్న ఇల్లూ , సామాన్లూ అమ్మేసి మీరు తమ్ముళ్ళూ ఏం చేస్తారు? అసలు ఈ వ్యవస్థ మారాలి. ఆడపిల్ల తండ్రులు ఎందుకింత డబ్బిచ్చుకోవాలి? అయినా డబ్బుకీ, పెళ్ళికీ ఏమిటి సంబంధం? నాలాగే ఆలోచించే వ్యక్తి తటస్థపడినప్పుడే నా పెళ్ళి, లేకపోతే లేదు......" అని ఖచ్చితంగా చెప్పెయ్యడంతో అపర్ణకింకా పెళ్ళికాలేదు.
చాలారోజుల తరువాత కలుసుకున్న స్నేహితులు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అన్ని స్టాల్సూ చూశారు. చివరగా ఐస్ క్రీం షాప్ దగ్గర ఆగి, "అపర్ణా ఐస్ క్రీం తిందాం. తింటూ నీకొక గుడ్ న్యూస్ చెపుతాను అంది హర్షిత.
"అరె! సరిగ్గా నేనూ అదే అనుకున్నాను" అంది అపర్ణ.
"ఏమిటో! అయితే నువ్వే ముందు చెప్పు" అంది హర్షిత.
ఇద్దరూ రెండు చాక్ లెట్ కోన్ ఐస్ క్రీంలు తింటూ, మెల్లగా నడుస్తూ మాట్లాడుకుంటున్నారు.
"నాకు పెళ్ళి కుదిరింది. అట్ లాస్ట్ నాకు నచ్చిన విధంగా, మా ప్రిన్సిపాల్ గారి తమ్ముడు. దమ్మిడీ కట్నం లేదు. రిజిష్టర్ పెళ్ళి, హోటల్ ద్వారకాలో డిన్నరు. డిన్నరు ఖర్చు ఇద్దరిదీ ఫిఫ్టీ ఫిఫ్టీ! అంది అపర్ణ.
"వెరీగుడ్! మొత్తానికి సాధించావు! కంగ్రాట్స్! అతనేం చేస్తున్నాడు"
"సి.ఎ. స్వంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు. పేరు రఘు" చెప్పింది.
"ఐ.....యామ్.......ప్రవుడ్ ఆఫ్ యూ. అన్నమాట నిలబెట్టుకున్నావు . అందరాడపిల్లలూ నీలా ఉంటే అసలు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఏ బాధలూ ఉండవు" అంది హర్షిత.
"మరి నీ గుడ్ న్యూస్ ఏమిటి?" అడిగింది అపర్ణ.
"నేను మమ్మీని కాబోతున్నాను మరో ఆరునెలల్లో...."
"కంగ్రాట్స్! ఆనంద్ కి కూడా నా తరపున కంగ్రాట్స్ చెప్పు. కార్డ్ పంపుతా.... ఐయామ్ సారీ తిట్టకు. నేనే స్వయంగా వచ్చి ఇస్తా. వీలైతే నేనూ రఘూ ఇద్దరం కలిసే వచ్చి పిలుస్తాం. అతని ఫ్రెండ్స్ నీ, నా ఫ్రెండ్స్ నీ, అలా కలిసి పిలుద్దామని అనుకున్నాం. " అంది అపర్ణ . అపర్ణ మొహంలో సంతోషం. సంతృప్తి చూసి ఎంతగానో ఆనందించింది హర్షిత.
అపర్ణ 'బై' చెప్పి ఏదో పనుందని వెళ్ళిపోయింది.
అంతవరకూ అన్ని స్టాల్సూ చూడ్డం, కబుర్లు చెప్పుకోవడం తప్ప ఏమీ కొనుక్కోలేదు.
"అపర్ణా, ఏమీ కొనకుండానే వెళ్ళిపోతున్నావేమిటి?" అడిగింది హర్షిత.
"ఇవ్వాళ ఊరికే చూడ్డానికే వచ్చాను. ఆదివారం నేనూ, రఘూ కలిసొచ్చి కొంటాం. రఘూతో వాళ్ళాఫీసుకొస్తానని చెప్పాను. లేటయిపోయింది. వెయిట్ చేస్తుంటాడు. వస్తా" అని బయలుదేరింది అపర్ణ.
హర్షిత మాత్రం మధ్యప్రదేశ్ స్టాల్లో తనకు నచ్చిన ఒక చీర కొందామని వెళ్ళింది. లైట్ గ్రీన్ కి, వైలెట్ బార్డర్ చీర తీసి ప్యాక్ చేయ్యమంది. బిల్లు కౌంటర్ దగ్గరికెళ్ళి, డబ్బులు తియ్యడానికి బ్యాగ్ తీసింది. అంతే షాక్ తింది. పర్సు కత్తిరించి ఉంది. ఎవడో గుంపులోంచి పరుగులు తియ్యడం చూసింది. అంతా క్షణాల్లో జరిగింది.
"దొంగ... దొంగ... ప్లీజ్ పట్టుకోండి. నా పర్సుకొట్టేసి పారిపోతున్నాడు" అంటూ గట్టిగా అరిచింది హర్షిత. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా దొంగని పట్టుకోవడానికి పరుగెత్తారు. ముఖ్యంగా యువకులు.