Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 30

    "ఆనంద్! ఈ రోజు ఎంత హాయిగా గడిచిపోయింది. మనకోసమేనన్నట్లు వెన్నెల వెతుక్కుంటూ, వేటాడుకుంటూ వెండి జల్లులు వెదజల్లుతూ విరిసింది" అంది తన్మయత్వంతో గువ్వలా అతని ఒడిలో ఒదిగిపోయి హర్షిత.

    "అవును హర్షీ! ఇద్దరం ఒకే మనసుతో ఆలోచించి ఒకే కంటితో చూసి ఒకే అడుగులో నడుస్తున్నట్టనిపించింది" మరింత ఆమెలో ఐక్యమైపోతూ అన్నాడు ఆనంద్.

    "అదుగో.....డాక్టర్ కవై పోతున్నాడు" అంది చక్కిలిగింతలు పెడుతూ హర్షిత.

    "అవును! ఎందరో డాక్టర్లు యాక్టర్లైపోయారు. యాక్టర్లందరూ డాక్టర్లవుదామనుకున్నామంటారు. ఈ డాక్టరుకీ, కళకీ ఏదో అవినాభావ సంబంధం ఉందనుకుంటా" అన్నాడు నవ్వుతూ.

    ఇద్దరూ నవ్వుల పువ్వుల్ని వెన్నెల్లో ఏరుకుంటూ ఏకమైపోయారు.

    "ఆనంద్ 'హ్యాండ్ లూమ్ ఎక్స్ పోర్ట్స్' ఎగ్జిబిషన్ జరుగుతోందిట. నీకెలాగూ అటువంటివి నచ్చవు. నేను వెళ్ళిరానా. గబగబా వంటచేసి నీతోనే వొచ్చేస్తా. సరిగ్గా ఒంటిగంటకి నువ్వు అక్కడికి వచ్చేయ్. నేను రోడ్డు దగ్గరే పుట్ పాత్ దగ్గరుంటాను. ఇద్దరం కలిసి వచ్చెయ్యొచ్చు" అంది హర్షిత.

    "అలాగే .....గెట్ రెడీ..... అమ్మగారి కోరిక కాదనగలనా? అంటే మా బుజ్జి హర్షితకి కోపం రాదూ? మా బుజ్జి హర్షిత ఏం కొనమంటే అది కొనెయ్" అంటూ బ్యాంకు నుంచి డ్రా చేసిన అయిదువేల రూపాయల కట్టని హర్షిత బ్యాగ్ లో వేశాడు.

    "థాంక్యూ డార్లింగ్" అంది నోటిదగ్గర చెయ్యిపెట్టి ప్లైయింగ్ కిస్ ఇస్తూ. "ఇంత పెద్దమనిషిని ఎదురుగుండా ఉండగా ఫ్లైయింగ్ కిస్ ఏం ఖర్మ?" చిలిపిగా నవ్వుతూ అన్నాడు.

    "ఫో... చిలిపీ! పొద్దున్నే ముద్దులివ్వొద్దు అంది మీ బుజ్జి" అంది నవ్వుతూ హర్షితా.

    గబగబా వంట పూర్తిచేసి, ఇల్లుతాళం పెట్టింది హర్షితా.

    "లతికను రమ్మంటావా? లేదా ఇంకే ఫ్రెండయినా......" అడిగాడు ఆనందమూర్తి.

    "ఇంత సడన్ గా ఎవరూ రాలేదు. లతికయితే వస్తుందనుకో. వెంట జిడ్డు మాస్టర్ కూడా వస్తాడు. నేను భరించలేను. ఒక్కదాన్నే వెళ్లి అంతా చూసొస్తాను" అంది.

    "ఓ....కే!" అంటూ ముందుకి నడిచాడు.

    కారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఆగింది.

    ఆనంద్ కి 'బై' చెప్పికారు దిగింది హర్షిత. ఆనంద్ క్లినిక్ కి  వెళ్ళిపోయాడు. ఎగ్జిబిషన్ ఎంతో బాగా పెట్టారు. అన్ని రాష్ట్రాల నుంచి వారి వారి ప్రత్యేకమైన చేనేత వస్త్రాలను అందంగా అమర్చారు.ప్రతీ స్టాల్ లో ఏదో ఒక ఆకర్షణీయమైన బొమ్మా, బుఱ్ఱకథలూ, డాన్సులూ జనాన్ని ఆకట్టుకున్నాయి. ఒక్కొక్క స్టేట్ ఎంపోరియంనీ చూసుకుంటూ వెళుతోంది హర్షిత. ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా ఉన్నాయి బట్టలు.

    హర్షిత మనసు గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది. అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంపుగా అమర్చిన వస్త్రాలను చూస్తూ ఉంటే. ఆ వస్త్రాలకన్నా, వాటిని నేసిన పద్మశాలీల నైపుణ్యాన్ని గురించి ఆలోచించడం మొదలెట్టింది హర్షిత. ఎంతటి కళానైపుణ్యం! ఎన్నిరకాల డిజైన్లు, వేలాదిమంది కార్మికులు ఈ వృత్తిలో ఎంతో శ్రమకోడ్చి రకరకాల రంగులలో డిజైన్లలో ఈ వృత్తిని చేపట్టి నిర్వహిస్తున్నా వారికింత కట్టుకోవడానికి గుడ్డ, వుండడానికో గూడు, తినడానికింత తిండీలేక కనీస వసతులు కూడా కొరవడి బాధపడుతున్నారే! ఏమిటి వైపరీత్యం? కలవారి అమ్మాయో, అబ్బాయో కాస్త ప్రావీణ్యం చూపిస్తే , పేపర్లలోనూ, రెడియో. ,టి.విల్లోనూ వాళ్ళ ఇంటర్వ్యూలు వేసి, వాళ్ళ ఫోటోలు వేసి, బహుళ ప్రచారం చేస్తారే! మరి వీరికెవరు దిక్కు? పైగా వీరికెవరు సాటి? రెక్కలు ముక్కలయినా డొక్కాడని వీరి గురించి ఎవరూ పట్టించుకోరేం? ఒక్క వస్త్రాలే కాదు. రకరకాల హస్తకళలు! వెండి పిలిగ్రీ పని ఒరిస్సా రాష్ట్రంలో, మద్రాసులోని చెక్క సామాగ్రి, మైసూర్ లోని మైసూర్ గంధం చెక్క సామాగ్రి, ఆంధ్రాలో లేసులూ, వీణలూ, బిద్రీపని అంటే జింకూ, రాగీ కలిపిన లోహం మీద వెండితో డిజైన్లు వేసే అనేక వస్తువులు, షర్టు బటన్లూ చెవిపోగులూ, ఆష్ ట్రేలూ ఎన్నో ఇలా ఆలోచిస్తే ఇండియా మొత్తంలో ప్రతీరాష్ట్రంలోనూ వున్నాయి ప్రత్యేకతలు. కొన్ని కోట్ల జనాభా కొన్ని లక్షలమంది కళాకారులూ, చేనేత కళాకారులూ, చేతివృత్తి పనులు కళాకారులూ వున్నారంటే అతిశయోక్తికాదు. దేవతామూర్తులను కళ్ళకు కట్టినట్లు రాతినుంచి మలచే స్థపతులను ఏమిచ్చి సత్కరించాలి. మనదేశంలో ఎన్ని కాళాఖండాలు? ఎంత సౌందర్యం! ఈ దేశంలో పుట్టినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెబుతూ, మళ్ళీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని కోరుకుంటూ, అలా నిలుచుండి పోయింది హర్షిత, మెల్లగా అప్పుడే వేడివేడిగా చేసి అమ్ముతూన్న పాప్ కార్న్ కొనుక్కుని ఒక్కొక్కటే నోట్లో వేసుకుంటూ.

 Previous Page Next Page