"ఆనంద్! ఫణిని ఎక్కువగా నమ్మకూడదంటావా?" అడిగింది.
"పిచ్చి హర్షీ! నేను చెప్పింది ఫణిని గురించి గానీ, ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ కాదు. జనరల్ గా ఎవ్వరినీ పూర్తిగా నమ్మకూడదు. నీ స్వభావం, నమ్మితే పూర్తిగా నమ్మేస్తావ్? జాలిపడితే ఏమైనా ఇచ్చేస్తావ్? కోపం వస్తే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతావ్? అందరూ నీలాగే సిన్సియర్, ఆనెస్ట్ అనుకుంటావ్. నేను చెవులతో విన్నవాటిని అసలు నమ్మను. కళ్ళతో చూసినవాటిని యాభై శాతం నమ్ముతాను" అన్నాడు హర్షిత కేసి నవ్వుతూ.
హర్షిత ఆనంద్ మాటలలోని అర్ధాన్ని వెతుక్కుంటోంది.
ఆమె అలా సైలెంట్ గా ఉండడం చూసి "హర్షతా! కేవలం నీకు ఈలోకం పోకడ చెప్పడానికే ఇలా అన్నాను. ఫణి విషయంలో ప్రత్యేకించి కాదు. ఫణి ఆవేశపూరితుడు. అంతే! నాతో, నీతో తగవులు పడ్డా, మనవి విడిచి ఒక్కరోజు కూడా ఉండలేడు. ఆ కల సంగతి నీకు చెప్పేదాకా వాడికి అన్నం సహించి ఉండదు. సాయంత్రంలోగా , నాకూ చెప్పేదాకా వాడికి నిద్రపట్టదు" అన్నాడు.
"అదే! అదొక రకం అమాయకత్వం" అంది హర్షిత నవ్వుతూ.
"కరెక్ట్! అది సరే లెటజ్....... ఛేంజ్ ది టాపిక్ సాయంత్రం సినిమా కెళదామా?"
"సాయంత్రమా?"
"అవును. ఏం?"
"తమరికి క్లినిక్ లేదా?"
"తమరివాళ ఆదివారమనీ, సాయంత్రం పూట ఆదివారాలు క్లినిక్ కి వెళ్లడం మానేసి ఆ సమయం అమ్మగారి కోసమే కేటాయించారనీ, మర్చిపోయి నట్టున్నారు"
"ఓ.....గాడ్....... ఇవాళ సన్ డే కదూ!.....మర్చేపోయాను. లెట్ అజ్ గో అవుట్. సాయంత్రం పిక్చరూ........రాత్రి ఓబరాయ్ హోటల్ లో డిన్నరూ ఓకే!.."
"ఓ...కే...."
అంతలోనే ఫోన్ మోగింది.
ఆనంద్ వెళ్లి రిసీవర్ తీశాడు.
"ఎవరూ ఫణేనా?" అడిగింది హర్షిత.
ఎడమచేత్తో ఫోను చెవిదగ్గర పెట్టుకుని, కుడిచేత్తో రిసీవర్ నిమాటలు వినబడకుండా అరచేత్తో మూస్తూ, "నే చెప్పానా? వాడే? నీకు చెప్పినదంతా మళ్ళీ నాకు చెప్పాలి" అన్నాడు.
"అది సరే సాయంత్రం మన ప్రోగ్రాం చెప్పకు. లేకపోతే తనూ వస్తానని వెంటబడతాడు. ఎంత గొప్ప స్నేహమైనా, అభిమానమైనా, కొంత సమయం కేవలం వాళ్ళకే ఉండాలని అనిపిస్తుందని తెలుసుకోరు కొందరు, బాగా చదువుకున్నవారు కూడా. భోజనం వేళలో, రెస్ట్ తీసుకుందామనుకున్న సమయంలో చెప్పా పెట్టకుండా వచ్చేస్తారు. అది అవతలి వాళ్ళకి వీలయిన సమయమా, కాదా అని ఆలోచించరు" విసుక్కుంది హర్షిత.
అవతల ఫణి ఏదేదో మాట్లాడుతున్నాడు.
అన్నింటికీ 'ఊ' కొడుతూ విన్నాడు ఆనంద్.
సాయంత్రం ప్రోగ్రాం ఏమిటని అడిగినట్లున్నాడు ఫణి.
"ఆఁ........ ఏంలేదు" అనేశాడు.
"అయితే మా ఇంటికి రండి..."
"లేదులే......హర్షిత బాగా అలిసిపోయింది. కాస్త రెస్ట్ తీసుకోమన్నాను"
"ఏం.....అయితే మేమే రామా..... నేనూ లతికా?"
"నో....నో.... అర్లీ ప్రెగ్నెన్సీ పీరియడ్ కదా. షీ నీడ్స్ రెస్ట్. ఎక్కువ స్ట్రెయినవడం మంచిదికాదు" అన్నాడు.
"ఓ....కే....వి.....విల్ మీట్ ఎగైన్! బై" ఫోన్ పెట్టేశాడు.
"హమ్మయ్య!" అంది సంతోషంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటూ హర్షిత.
"పూర్ ఫెలో...... ఐ పిటీ హిమ్...." అన్నాడు ఆనంద్.
"ఏం పిటీయో! ప్రాణం తీసి ఉండేవాడు వాగి వాగి! బాగా టాకిల్ చేశావులే అంది ఆనంద్ కేసి చూసి నవ్వుతూ.
సాయంత్రం సినిమా, రాత్రిబయట భోజనం, ఏకాంతంగా ప్రశాంతంగా కాలం గడిచిపోయింది. ఇద్దరూ ఎంతో రిలాక్స్ డ్ గా ఫీలయ్యారు. ఆ రోజంతా నూతన వధూవరుల్లా వేరే ప్రపంచంలో తేలిపోయారు. బాదలూ, గాధలూ అన్నీ మర్చిపోయి విరబూసిన పండువెన్నెల్లో స్నానమాడి, నక్షత్రాల జలతారు దుప్పట్లో గుసగుసలు చెప్పుకుంటూ, చందమామ దొంగచూపుల్ని తప్పించుకుంటూ ఒళ్ళు మరిచిపోయారిద్దరూ. పసిపిల్లల్లా నవ్వుకున్నారు. ఆడుకున్నారు, పాడుకున్నారు ఒకరి ఒడిలో ఒకుర ఆదమరిచి నిదురపోయారు.