హర్షిత అతని మొహంలోకి చూసింది?
"ఓ.....లతికా! మీ శ్రీవారు ఇక్కడే వున్నారు. మాట్లాడతావా?" అడిగింది. అవతలినుంచి లతిక తను ఫోన్ చేసింది శ్రీవారి కోసం కాదనీ, రాత్రి ఫణికి కల రావడం, ఆ కల తాలూకు వివరాలూ అన్నీ మళ్ళీ తనూ చెప్పి, "నేనే నిన్ను చూసి రమ్మని చెప్పాను. మనసు కుదుట పడుతుంది కదా! వచ్చారో లేదో ఏదో అర్జంటు కేసు అంటూ ఆసుపత్రికెళ్ళిపోయారో కనుక్కుందామని ఫోన్ చేశాను" అంది. కాసేపు ఇద్దరూ ఏవేవో మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేసింది లతిక. హర్షిత మనసులోని మంచుతెరలు క్షణంలో కరిగిపోయాయి. కానీ తన మీద తనకే కోపం వచ్చింది. ఎన్నడూ లేనిది తనెందుకు ఇంత చవకగా ఆలోచిస్తోంది? ఎన్నో ఏళ్ళనుంచి ఫణి తనకు పరిచయమే. అతని దుడుకు స్వభావం పరిచయమే! అయినా ఇప్పుడు మరీ ఒక సంస్కారహీనుడిగా, నీచుడిగా ఎందుకు భావిస్తోంది? తనలో అసలు ఈ భయాలూ, ఈ అనుమానాలూ ఎందుకు చోటుచేసుకుంటున్నాయ్?
అసలు రాత్రి బాత్ రూంలో ఎవరినో చూసినట్టు కూడా భ్రమేనేమో? లేకపోతే అంత రాత్రి ఎవరొస్తారు?
ఈ మధ్యన మనసెందుకిలా భయాందోళనలకు గురవుతూందో అర్ధంగాక అదంతా తనలోనే కలుగుతూన్న ఏదో బలహీనత, అది పోగొట్టుకోవాలి అని ఒక నిర్ధారణకొచ్చింది.
"ఏమిటి దీర్ఘాలోచనలో పడ్డావ్? మళ్ళీ కలంతా విపులంగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పిందా లతిక?" అడిగాడు ఫణి.
"అవును ఫణీ! అంతా చెప్పింది. నీ కల సంగతేలెగానీ, నాలో ఏదో కలవరం పుడుతోంది. తాడును చూసి పామనుకుని, నా నీడని చూసి ఎవరో అనుకుని భయపడుతున్నానీ మధ్య. ఎందుకో తెలీదు" అంది ఫణికేసి ఆప్యాయతగా చూస్తూ.
"అదేంటి నీకు భయమా? కాలేజీలో ఎవరైనా పొరపాటున ఏదైనా అంటే పళ్ళు రాలేలా చెప్పుతో కొట్టేదానివి., ప్రిన్సిపాల్ తో చెప్పి కాలేజీనుంచి డీబార్ చేయిస్తాననే దానివి, నీకు భయమా?" అన్నాడు కాలేజీలో ఒక రోజు నవీన్ అనే కుర్రాడు హర్షిత జడ పట్టి లాగితే, వాణ్ణి దవడ వాచేలా చెప్పుతో కొట్టి, ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసి వాడిచేత క్షమాపణ చెప్పించుకున్న సంఘటనని గుర్తుచేస్తూ!
నాటి సంగతులు మాట్లాడుకుంటూ ఉంటే హర్షితలో భయం పోయింది. పాత జ్ఞాపకాలను మననం చేసుకుంటూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారిద్దరూ.
కాస్సేపు కూర్చుని 'టీ' తాగి, వెళ్ళొస్తానని బయలుదేరాడు ఫణి.
"సరే" నంది హర్షిత.
నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు ఫణి మీద కలిగిన అనుమానపు పొరలు తొలగిపోయాయి.
ఫణి మాటలు, అతని కల మొదట్లో నమ్మకపోయినా, లతికకూడ ఫోన్ చేసి చెప్పడంతో నమ్మింది. ఫణి ఎప్పుడూ అబద్దాలు చెపుతాడు కనుక, ఈసారి కల కూడా ఒక కట్టుకథేనని అనుకుంది. అదే ఎప్పుడూ అబద్దాలు చెప్పేవాళ్ళకొచ్చే ప్రమాదం, ఎప్పుడైనా నిజం చెప్పినా నమ్మరు అనుకుంది.
ఫణి స్వభావం ఎంత ఆలోచించినా అంతుబట్టకుండా ఉంది. ఒక్కొక్కసారి ఎంతో మంచివాడిలా కనిపిస్తాడు. ఆప్యాయంగా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి పరమ దుర్మార్గంగా కఠినంగా మాట్లాడతాడు. అప్పుడు మళ్ళీ మండుకొస్తుంది. ఈ ద్వంద్వ స్వభావం అర్ధం గాకుండా ఉంది అనుకుంటూ వంట ప్రయత్నంలో మునిగిపోయింది.
మళ్ళీ ఫోను మోగడంతో ముక్కల పులుసు కోసం చింతపండు కలుపుతున్నదల్లా చెయ్యి కడుక్కుని వెళ్ళి ఫోన్ తీసింది.
ఆనంద్ గొంతు విని "హల్లో ఆనంద్ ఇప్పుడే ఫణి వచ్చి వెళ్ళాడు" చెప్పింది.
"ఎందుకట?" అడిగాడు ఆనంద్.
వివరంగా అంతా చెప్పింది.
ఆనంద్ విని వూరుకున్నాడు.
హర్షిత ఇంకా ఏదో చెప్పబోయింది. "భోజనానికొచ్చేప్పుడు మాట్లాడుకుందాంలే" అన్నాడు.
"అలాగే! ఇంకా నా వంట కూడా కాలేదు. ఎంత సేపులే పదినిముషాల్లో చేసేస్తాను"
"హర్షీ! ఎందుకు నీకీబాధ,. ఆ రాధాబాయమ్మకి కబురు చేస్తే వొచ్చి హాయిగా వండి పెడుతుంది. ఎందుకంత శ్రమ పడతావ్?"
"ఆనంద్! నాచేతులతో చేసిన వంట నువ్వు సంతోషంగా తింటూ ఉంటే నాకు తృప్తి! పైగా ఆ మాత్రం పని కూడా లేకపోతే నాకు ఇంక ఎక్సర్ సైజు ఏముంది చెప్పు?"
"బుల్లి హర్షిత వొస్తే బోలెడు ఎక్సర్ సైజ్........"
హర్షిత బుగ్గలు మందారాలయ్యాయి. చిరు ఎరుపు రంగు మొహమంతా చిందినట్టయింది.
"సర్లే! మరి అంతదాకా ఎక్సర్ సైజ్!" నవ్వుతూ అంది.
"ఓకే.!.... ఒచ్చేస్తున్నా" అంటూ ఫోన్ పెట్టేశాడు ఆనంద్.
గబగబా వంటింట్లోకి వెళ్ళి ఆనంద్ కిష్టమయిన ముద్దపప్పు, ముక్కల పులుసూ, కొబ్బరిపచ్చడి చేసింది. ఆలూవేపుడు ఆనంద్ కోసం, వంకాయ కారం పెట్టి తనకోసం చేసింది.
సరిగ్గా వంట పూర్తయ్యింది. ఆనంద్ వచ్చాడు.
ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు.
భోజనం చేస్తున్నంతసేపూ ఫణిరావడం, ఏం మాట్లాడాడో , ఎలా మాట్లాడాడో అంతా చెప్పింది, పూసగుచ్చినట్లు.
అన్నీ 'ఊ.....ఊ.' అంటూ విన్నాడు ఆనంద్!
హర్షిత చెబుతున్న మాటలు చెవిలో పడుతూన్నా, ఆనంద్ ఆలోచనలు ఎటో ఉన్నాయి. లేకపోతే ఏవో కామెంట్లు చేసేవాడే!
అది గ్రహించిన హర్షిత "ఆనంద్! నువ్వీలోకంలో లేవు, ఏదో ఆలోచిస్తున్నావు. ఆ సంగతి గ్రహించకుండా నేను ఏదో వాగుతూ పోతున్నాను. హౌ.....ఈజ్ యువర్ డే....! ఆసుపత్రిలో ఏమీ సమస్యలు లేవు కదా" అడిగింది చెయ్యి కడుక్కుని. తడి చెయ్యి తువ్వాలుకు తుడుచుకుని ఆనంద్ రెండు భుజాలూ పట్టుకుని వెనకనుంచి మెడమీదకు వంగి, అతని మొహంలోకి చూస్తూ.
"హర్షీ! నీలోని అమాయకత్వం, పసితనం, అభిమానం చూస్తూంటే, నువ్వు ఇంకా ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేదేమోననిపిస్తుంది. మనుషులు నువ్వనుకున్నంత మంచివాళ్ళు కాదు. తొందరగా ఎవర్నీ నమ్మకూడదు" అన్నాడు.
అతడు మామూలుగా జనరల్ గా చెప్పినట్లు చెప్పినా, ఎందుకనో ఫణిని కూడా దృష్టిలో పెట్టుకుని అన్నాడేమోననిపించింది.