"ఓ... గొప్ప రిసర్చ్ చేశావన్నమాట నా మీద."
వ్యంగ్యంగా అన్నాడు ఆనందమూర్తిని ఇంకా వుడికించాలనే ధోరణిలో.
"అవునురా! నీ గురించి ఏనాడో రిసెర్చ్ చేశాను. అసలు నీలాంటి వాళ్ళకి ఫారిన్ లో శాడిస్ట్ అనో సైకిక్ అనో ట్రీట్ మెంట్ ఇప్పిస్తారు. నీలో పేరుకుపోయి వున్నది స్వార్ధం తప్ప ఇంకేమీ కాదు. కేవలం నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు అంతే! చిన్నప్పుడు నీ సొంత తమ్ముడు హరి నీకన్న రన్నింగ్ రేసులో ముందున్నాడని, వాడికడ్డం వెళ్ళి కాలికి మెలికేసి పడేసి నువ్వు ముందు పరుగెత్తావు. వాడుపడి కాలు బెణికి పదిహేనురోజులు మంచంపట్టాడు సరే. నువ్వు చేసిన వెధవపనికి, నీకు బహుమతిరాకపోగా నిన్ను డిస్ క్వాలిఫై చేశారు. నీకు బహుమతి రాలేదన్న బాధకన్నా వాడికి రాకుండా చేశావన్న తృప్తి నీకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇది శాడిజమ్ కాదా?" చెప్పడం ఆపి పక్కగ్లాసులో వున్న మంచినీళ్ళు తీసి గడగడా తాగేశాడు. నీటి చల్లదనానికి కాస్త ఆవేశపు వేడి చల్లారినట్టయింది.
"ఫణీ! నీకన్నా నీ చెల్లెలికి ఎక్కువ మార్కులొచ్చాయని తెలిసి, మీ అమ్మా నాన్నా అర్చనని పొగడడం చూసి, ఆమె నోట్ పుస్తకాలు చింపి పారేసి ఏమీ తెలీనట్టు కూర్చున్నావు. అది చూసిన నేను నిన్ను చీవాట్లు పెట్టి మీ నాన్నగారికి చెప్తానంటే, చెప్పొద్దని కాళ్లమీద పడితే మరోసారి చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చి వదిలేశాను గుర్తులేదూ? ఒరేయ్! ఇప్పటికీ నీకు నీ రక్త సంబంధమున్న వాళ్ళ మీద కూడా కొంచెం కూడా ప్రేమ లేదు. అభిరాం అమెరికా వెళ్ళాడని అసూయ, అర్చన పెద్ద రిసెర్చ్ స్కాలర్ అనీ ఆమె భర్త సైంటిస్టని నీకు కొంచెమైనా గర్వం ఆనందం లేకపోగా అసూయ. అసూయవల్ల ద్వేషం! నీ కెంతసేపూ "నేనూ......నా" అనే అహం తప్ప ఎదుటివారి పచ్చ గిట్టదు.
ఒరేయ్! ఈ ప్రపంచంలో మూడు రకాల మనుషులుంటార్రా,. మొదటి రకం వారు, వారి కోసం ఏమీ కోరుకోరు. "స్వామీ! భగవంతుడా! ఈ దేశాన్ని ఈ మనుషలందరినీ రక్షించు" అని దేవుణ్ని వేడుకుంటారు. వారిని ఉత్తములంటారు. పీఠాధిపతులు, మతాధిపతులూ, బాబాలూ, గాంధి మొదలైనవారంతా ఆ కోవకు చెందిన వాళ్ళు.
'ఇక నన్నూ నా కుటుంబాన్ని నా వాళ్ళందరినీ రక్షించుదేవా!' అని వేడుకుంటారు. వారిని మధ్యములంటారు.
పోతే మూడోరకం మనుషులుంటారు. వాళ్ళు ఎంతసేపూ, 'నాకు లేకపోయినా పరవాలేదు కానీ నా పక్కవాళ్ళకీ నా తోబుట్టవులకీ వాళ్ళందరికీ నా కన్నా ఎక్కువ వరాలిచ్చి కాపాడకు' అని ప్రార్ధిస్తారు.వీరినే అధములంటారు.
ఫణీ! నువ్వు ఆ కోవకు చెందిన వాడివిరా. ప్రతిక్షణం ప్రతి వ్యక్తి ముందు నీ ఆధిక్యతని చూపించుకోవాలనే నీ ఆరాటం, అందరికన్నా నువ్వే ధనవంతుడివనీ, గొప్పవాడివనీ, అనిపించుకోవాలనే నీ ఆబ తప్ప నీకు నిజమైన ప్రేమ ఎవ్వరి మీదా లేదురా! నీ ప్రేమ కల్తీ! నీ అభిమానం కల్తీ నీ స్నేహం కల్తీ! నువ్వు కల్తీ!"
ఆవేశంతో మాట్లాడలేక క్షణం ఆగాడు ఆనందమూర్తి.
ఫణి టేబుల్ మీదున్న లెటర్ ప్యాడ్ మీద బాల్ పెన్నుతో ఏవో పిచ్చిగీతలు గీస్తూ కూర్చున్నాడు.
ఆనందమూర్తి ఆవేశం ఆగడం లేదు. రెచ్చగొట్టిన పుల్లిలా వున్నాడు. అన్ని విషయాలు మాట్లాడి ఈ రోజుతో అతని స్నేహం నిలవడమో, తెగిపోవడమో నిర్ణయించుకోవాలనుకున్నాడు. అందుకే మళ్ళీ మొదలెట్టాడు.
అంతలో ఫోన్ మోగింది!
రిసీవర్ తీసి "హల్లో" అన్నాడు!
అవతలి నుంచి మాట్లాడుతూన్నది హర్షిత. "ఏమిటి? ఇంతసేపయింది? మన వెడ్డింగ్ డే అంతా ఫణి క్లినిక్ లోనేనా? భోజనం చేసేదెప్పుడు? పన్నెండవుతోంది. పదార్ధాల్నీ చల్లగా అయిపోయాయి. రండి "అని! "హర్షితా! నువ్వూ, లతికా భోజనంచేసెయ్యండి. మాకు ఇంకాస్త టైం పడుతుంది" అంటూ పెట్టేశాడు.
"ఒరేయ్! నువ్వు హర్షితని ప్రేమించానంటున్నావ్! ఎన్నిసార్లు ఆమె బాధపడేటట్లు సూటిపోటి మాటలు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నావు. నిజంగా ప్రేమించే మనస్సు ద్వేషించగలదా? సరిగ్గా ఈ రోజుకు మా పెళ్ళయి రెండేళ్ళు పూర్తయ్యాయి. హర్షిత కొన్ని నెల్లో తల్లికాబోతుంది.!..."
ఫణి తలెత్తి ఆనందమూర్తికేసి చూశాడు.
"అవును. ఈ రోజు ఈ వార్తని భోజనాలయ్యాక స్వయంగా హర్షిత మీకు చెప్పాలనుకుంది. అలా జరగక నేను ఇక్కడ చెప్పాల్సొచ్చింది. నీ పెళ్ళయి కూడా సంవత్సరంన్నర దాటింది. లతిక కూడా మంచిపిల్లే! కాకపోతే, నీలో వున్న అసూయ, ద్వేషాలు పెద్దగా లేకపోయినా ఒక్క గుణం మాత్రం నీలాగే వుంది. అది అందరికంటే తాము అదికులమనిపించుకోవాలని పట్టుపట్టడం, డాక్టర్ కుముదిని వాషింగ్ మెషిన్ కొంటే అలాంటిదే అయినా అంతకన్నా కొంచెం ఎక్కువదే అయినా కొనాలని, కొనేదాకా నిద్రపోకపోవడం ఈ రకమయిన పోటీ మనస్తత్వం ఆమెకీ వుంది. బహుశః లోవర్ మిడిల్ క్లాసు నుంచి వచ్చిన ఆ అమ్మాయికి, సడన్ గా నీ సంపాదన బంపర్ లాట్రీ కొట్టినట్టయింది. అందుకే ఆడంబరాల మీద అంతే మోజు. ఈ ప్రవర్తన వల్ల తన గొప్పతనాన్ని చాటుకోలేక ప్రతీసారీ ఫెయిలయిపోతోంది!"