Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 25

      "ఇదంతా నీకెలా తెలుసు?" ఫణి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.

    "ఫణీ! కాస్త సైకాలజీ అర్ధం చేసుకునే మనిషైతే ఎవరికైనా అర్ధమవుతుంది. డాక్టర్నయి వుండి ఆ మాత్రం సైకాలజీ అర్ధం కాదా? మనుషులకి మంచి మందివ్వడంతో పాటు వాళ్ళ మనస్తత్వాన్ని కూడా స్టడీ చేస్తేనే, మంచి డాక్టరుగా వాళ్ళ ముందు పరిగణింపబడుతాం" ఫణి తలవంచుకుని మళ్ళీ కాగితం మీద గీతలు గియ్యడం మొదలెట్టాడు.

    "ఫణీ! మనిషికి పట్టుదల వుండాలేగానీ, సాధ్యం కానిదేదీ వుండదు.

    "ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు కాచి అతుకు నేర్చు కమ్మరీడు, మనసు విరిగెనేని మరి అతుకునేర్చునా అని వేమన అన్న మాట అక్షరాలా నిజమే! విరిగిన మనసు అతుక్కోవడం కష్టం! అయితే కారు మబ్బు పట్టిన ఆకాశం వర్షించాక మామూలుగా మారినట్టు మనసుకు పట్టిన మబ్బును. కృషితో, కార్యదీక్షతో పట్టుదలతో నిజాయితీతో - అంటే నిజమైన పశ్చాత్తాపంతో కడిగేసి మనసులనూ మమతలనూ కలుపుకోవడానికి ప్రయత్నించొచ్చు! అది చాలా కష్టం. ఈ ప్రొసెసింగ్ లో మనిషి కొత్త సమస్యలు సృష్టించుకుంటాడు. అందుకే మనస్సులు అతుక్కునే బదులు మళ్ళీ విడిపోతాయి. నూటికో కోటికో ఏ ఒక్కరికో తప్ప మనస్సులను అతికించే ఓపిక ఎవ్వరికీ వుండదు అందుకే వేమన 'మరి అతకబడవు' అని స్పష్టంగా చెప్పేశాడు. ఫణీ! జెలసీ అండ్ ఇగో అసూయా, అహం ఈ రెండే ప్రధాన కారణాలు మనుషుల మధ్య అకారణ శత్రుత్వాని కలిగించడానికి" అంటూ అలిసి పోయినవాడిలా కుర్చీకి ఆనుకుని కూర్చున్నాడు.

    "అయిందా నీ ఫిలసాఫికల్, సైకాలాజికల్, సోషల్ ప్రాబ్లమ్స్ మీద లెక్చరు సరిగ్గా మూడు గంటలు సుత్తికొట్టావ్!" అన్నాడు ఫణి ఆవేశం చల్లారిన స్వరంతో.

    "ఫణీ! మూడు గంటలు సుత్తికొట్టాను కనుకేనీలోని ఆవేశం కొంచమైనా తగ్గింది. నువ్వు సుత్తి అనుకున్నా కత్తి అనుకున్నా నాకు కావలసింది నువ్వు మారడం. మన స్నేహం కలకాలం నిలవడం, అంతే!" అన్నాడు గద్గదస్వరంతో ఆనందమూర్తి.

    మళ్ళీ ఫోనుమోగింది.
   
    ఈ సారి ఫణి తీశాడు ఫోను.

    "భోజనానికి రారా! అక్కడే పడుకుంటారా ఏమిటి? ఇప్పుడు టైమెంతయిందో తెలుసా ఫణీ?" అడిగింది హర్షిత.

    "వచ్చేస్తున్నాం. ముందు వెడ్డింగ్ అనివర్సరీతో పాటు రాబోయే పాపాయికి కూడా స్వాగతం పలుకుతూ కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నాను. స్వీకరించు" అన్నాడు.

    "థాంక్యూ... అయితే ఆనంద్ చెప్పేశాడన్నమాట! అదిసరే ఇంక కబుర్లు మాని ఇంటికి రండి. లతిక నిద్రపోతోంది కూడా!" అని ఫోన్ చెప్పేసింది హర్షిత.

    "అబ్బ! తుఫానొచ్చి వెలిసినట్టుంది" అన్నాడు ఆనందమూర్తి.

    "నన్ను క్షమించు ఆనంద్" అన్నాడు ఫణి.

    "ఇది నీకెప్పుడూ అలవాటేగా! తప్పుచెయ్యడం, క్షమాపణ అడగడం ఫణీ! ఈసారి అసలు తప్పు చెయ్యకుండా వుండడానికి ప్రయత్నించు" అంటూ కుర్చీలోంచి లేచాడు ఆనందమూర్తి. ఇద్దరూ డోర్ తెరుచుకొని చిరునవ్వుతో బయటికి రావడం చూసి, నర్సింగ్ హబోం స్టాఫంతా ఎంతో సంతోషించారు. యుద్దం వొచ్చి ఆగిపోయినంతగా రిలీఫ్ పొంది, తృప్తిగా నిట్టూర్చారు.

    నర్సింగ్ హోం గేటు బారాల్ల తెరిచి రెండు కార్లూ ఒకదాని వెనకే ఒకటి పోతూవుంటే, సెల్యూట్ చేశాడు వాచ్ మెన్. నిశిరాత్రి చీకట్లో దీపాల వెలుగుల్లో రెండు తెల్లని మారుతీకార్లూ, వెన్నెల ముద్దల్లా అగుపిస్తున్నాయి. కదిలే మంచు కొండల్లా అనిపిస్తున్నాయి. కార్ల చప్పుడు విని వరండా లైటు వేసి బయటికొచ్చారు హర్షిత, లతికలు.

    ఏం గొడవ జరిగిందో అని భయపడుతూన్న హర్షిత ఇద్దరూ నవ్వుకుంటూ రావడం చూసి 'హమ్మయ్య' అనుకుంది.

    లోపలికెళ్ళి పదార్ధాలన్నీ వేడి చేసింది హర్షిత, టేబుల్ మీదున్న గ్లాసుల్లో మంచినీళ్ళు పోస్తూ "మీరిద్దరూ ఇంతవరకు రాకపోతే ఏదైనా ఘర్షణ పడుతున్నారా లేక ఏమైనా గొడవ జరుగుతోందా అని హడలి చచ్చాను" అంది తన మామూలు ధోరణిలో లతిక! ఫణి గతుక్కుమన్నాడు. వెంటనే తేరుకుని "అయినా నీకెప్పుడూ పిచ్చి అనుమానాలే! అయినా నీ నోట్లో  ఏదో మచ్చ వున్నట్లుంది. శుభం పలకమంటే ఏదో వాగుతావ్"

    "అంటే నా అనుమానం నిజమే నన్నమాట!"

    "నోర్ముయ్! అపశకున పక్షి!"

    "ఏమిటా మాటలు అర్ధం పర్ధం లేకుండా" విసుక్కుంది లతిక.

    ఇది చినికి చినికి గాలివానవుతుందన్న భయంతో "మీరిద్దరూ ఎప్పుడూ ఇలా పిల్లీ ఎలకలాగా పోట్లాడుకుంటూ వుండకపోతే హాయిగా చిలకా గోరింకల్లా వుండొచ్చుగా" అంది నవ్వుతూ హర్షిత.

    అందరూ భోజనానికి కూర్చున్నారు.  "గుత్తొంకాయ కూర, కొబ్బరన్నం, పాయసం, సాంబారు, కొబ్బరి పచ్చడి ఓహో! ఇవన్నీ నువ్వే చేశావా" అడిగాడు ఫణి.

 Previous Page Next Page