Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 23

    "ఒరేయ్! మన ఇద్దరి సర్వీసులూ అలాంటివే. ఎమర్జెన్సీ సర్వీసెస్. అసలు నన్ను మా వాళ్ళు డ్యూటీకి పిలవకుండా, పీటల మీద కూర్చోనిస్తే చాలు" పెద్దగా నవ్వాడు సురేంద్ర.

    ఆనంద్, ఫణి కూడా నవ్వేశారు.

    ఇద్దరి దగ్గరా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఇన్స్ పెక్టర్ సురేంద్ర.

    ఫణికి ప్రాణం లేచొచ్చింది.

    సురేంద్ర వెళ్ళాక దాదాపు అయిదు నిమిషాలు ఆనంద్, పణీలు ఎవరూ ఎవరితోటి మాట్లాడుకోలేదు.

    ఫణి మనసు ఆవేశంతోనూ ద్వేషంతోనూ నిండిపోయింది. ఇక్కడి కొచ్చేముందు ఆనంద్ సురేంద్రకి ఫోన్ చేసి వచ్చాడేమోనన్న అనుమానం అతణ్ణి దహించేస్తోంది.

    "ఫణీ! అయిందేదో అయిపోయింది, ఇకపైనైనా జాగ్రత్తగా వుండు" అని చెప్పి లేవబోయాడు ఆనంద్.

    ఆనంద్ భుజాలు పట్టుకుని కూర్చోబెట్టేశాడు ఫణి.

    ఆనంద్ మొహంలోకి తీక్షణంగా చూశాడు ఫణి.  "ఆనంద్! నేనాలోచిస్తూన్నది ఇప్పుడు జరిగి పోయినదానికి బాదపడుతూ కాదు. రేపు జరగబోయే దానికి భయపడుతూనూ కాదు."

    "మరి?"

    "నీ గురించి!"

    "అంటే?"

    "నువ్వు ఇంత తెలివిగలవాడివి ఎప్పుడయ్యవా  అని"

    "నువ్వేమంటున్నావో నాకర్ధం కావడం లేదు."

    "కాదు! యూ... ఆర్..ఎ.... గ్రేట్ ఏక్టర్!.నాకు తెలీని పోలీస్ కజిన్ నీకెక్కడ నుంచి సడన్ గా ఊడిపడ్డాడు? పైగా బారసాలకి పిలవడానికి ఈ రాత్రిపూటే పనిగట్టుకుని రావాలా? అదీ నువ్వు ఇంట్లో ఉండకపోయినా నిన్ను వెతుక్కుంటూ, ఇదంతా ఆశ్చర్యంగా లేదూ? ఎంత పిచ్చి వాడికైనా నువ్వు తెలివిగా చేశాననుకున్న పని క్షణం ఆలోచిస్తే ఇది నీ ప్లాననీ ఇట్టే తెలిసిపోతుంది. మైడియర్......ఫ్రెండ్.......నన్ను పోలీసులకప్పగించాలనుకుంటున్నావా?" ఆవేశంతో, కోపంతో ఊగిపోతూ ఒక్కొక్క మాటే నొక్కి పలుకుతూ అన్నాడు ఫణి.

    ఆనంద్ కి నోట మాట రాలేదు.

    "ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నావ్ ఫణి! ఇటువంటి పాడు ఆలోచనలు నాకు ఛస్తే రావు. ఆ సంగతి నీ అంతరాత్మకి తెలుసు. అయినా నన్ను బాధ పెట్టాలని ఉద్దేశపూర్వకంగా ఇట్లా మాట్లాడుతున్నావ్!"

    "కాదు. ఉన్న మాటే అంటున్నాను"

    "ఫణీ! పిచ్చిపిచ్చిగా వాగకు. ఇన్ స్పెక్టర్ సురేంద్ర మా బాబాయిగారబ్బాయి . ఐ.పి.ఎస్.కి సెలక్టయి ఫస్టు పోస్టింగ్ కడపలో చేసి వారం రోజుల క్రితమే ఇక్కడికొచ్చాడు. వాడికి బాబు పుట్టి మూణ్ణెల్లయింది. మీనా వాళ్ళమ్మ గారింటినుంచి మొన్ననే వచ్చిందట. ఈ సంగతి రెండ్రోజుల క్రితం ఫోన్ లో చెప్పాడు. ఈ రోజు పిలవడానికి వస్తాడని కూడా చెప్పాడు. అయితే ఇంతలోనే ఈ గొడవ జరిగి నువ్వు ఒంటరిగా క్లినిక్ కి రావడం చూసి వామనరావు కొడుకు నీతో ఏదైనా గొడవ పడితే సర్ది చెబుదామనే ఉద్దేశ్యంతో నీవెనకే నేనూ వచ్చాను" నెమ్మదిగానే అన్నా ఖచ్చితంగా అన్నాడు ఆనందమూర్తి.

    "స్టాప్......యువర్.......స్టోరీస్....ఐ.....సే..." ఏహ్యభావంతో అన్నాడు ఫణి. ఆనంద్ కి ఎంత నిగ్రహించుకోవాలని చూసినా కోపం ఆగడం లేదు.

    "ఫణీ! నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నువ్వు ఏం వాగుతూన్నా, మనం ఇద్దరం చిన్నప్పటి స్నేహితులం, ప్రస్తుతం ఇద్దరం గౌరవనీయమైన వైద్య వృత్తిలో వున్నా అని సహిస్తూ వచ్చాను"

    లేకపోతే ఏం చేస్తావేమిటీ" నేను ప్రేమిస్తున్నాని తెలిసి కూడా హర్షితను పెళ్ళి చేసుకున్న ద్రోహివి. నువ్వా స్నేహాన్ని గురించి మాట్లాడేది?" పళ్ళు పటపట కొరికాడు కోపంతో ఫణి.

    "ఫణీ! నీకు నిజంగానే పిచ్చెక్కింది. లేకపోతే ఏమిటా మాటలు? ప్రేమంటే ఏదో ఒక మందు నీ ఇష్టం వచ్చింది పేషంటుకిచ్చేసి పంపించడం అనుకున్నావా? ఏమందిచ్చినా నయం అవడం అవకపోవడం వాళ్ళ ఖర్మకొదిలేసి డబ్బులాగే వ్యాపారంగా మార్చుకున్న వ్యవహారం అనుకున్నావా? నువ్వు హర్షితని ప్రేమిస్తున్నావని గోలపెడితే సరా? ఆమె నిన్ను ప్రేమిస్తోందో లేదో తెలుసుకోనక్కర్లేదా? ఆమెని నువ్వు ప్రేమించావు. కానీ ఆమె నన్ను ప్రేమించింది. నన్ను ఆరాధించే ఆమెను నేను పెళ్ళి చేసుకోవడం తప్పెలా అవుతుంది?"

    "షటప్! నేనామెను ప్రేమిస్తున్నాని తెలిసి, నువ్వు కావాలనే ఆమెను వలలో వేసుకోవడానికి ప్రయత్నించావు. నా కన్నా నాలుగడుగులు ముందుకెళ్ళి ఆమెని పెళ్ళి చేసుకున్నావు. నీది మొదటి నుంచి కుళ్ళుబుద్దే! అంతా నటనే! నీ స్నేహం, నీ అభిమానం అంతా నటనే! అసలు హర్షిత మీద నువ్వు చూపిస్తున్న ప్రేమా గీమా అంతా కూడా నటనమేనని నా అభిప్రాయం" ప్రతి అక్షరాన్ని కక్షతో నొక్కి నొక్కి పలుకుతూ అన్నాడు ఫణి.

    ఫణి అంటూన్న ప్రతిమాటా ఆనందమూర్తి గుండెల్లో ముళ్లులా గుచ్చుకున్నాయి. కోపం, అసహ్యం, రెండూ ఆనందమూర్తి మనసులో గరళంలా నిలిచి, కళ్ళు ఎర్రబడ్డాయి. "షటప్...... అండ్ స్టాప్... దిస్ నాన్సెన్స్" అంటూ పెద్దగా అరిచేశాడు. ఆపుకోలేని ఆవేశంతో ఆనంద్.

    ఆ కేకకి నర్సింగ్ హోమ్ లోని నర్సులూ, వార్డ్ బోయా లు, కొందరు పేషంట్లు అందరూ పరుగెత్తుకొచ్చారు.

    కానీ, ఎవ్వరూ గదిలోపలికి వెళ్ళడానికి సాహసించలేద. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేంత స్నేహితులు ఒకరంటే ఒకరికి ప్రాణమిచ్చుకునేంత స్నేహితులు, చిన్న నాటి క్లాస్ మేట్స్, ఎప్పుడూ సరదాకి, కూడా గట్టిగాకేకలేసుకుని ఎరుగని ఈ మిత్రులు ఇవాళ ఇలా ఎందుకు గంటల తరబడి దెబ్బలాడుకుంటున్నారో అర్ధం కాలేదు. షాక్ కొట్టిన వాళ్ళలా ఎవరికి వారే మూగగా వుండిపోయారు.

    "నిజం చెబితే ఎంత ఉక్రోషమో"...... ఎగతాళిగా అన్నాడు ఫణి.

    "హూ! ఫణీ! నిజం చెప్పడమనేది నీ డిక్షనరీలోనే లేదు. నీ నరనరంలోనూ నిండుకున్నది అసూయా, ద్వేషం నీ కన్నా ఎవరూ ఎక్కువగా వుండకూడదు. అందరూ నీమోచేతికింద నీరు తాగుతూన్నట్టు పడుండాలి. అందరూ నిన్ను తప్ప ఎవ్వరినీ పొగడకూడదు."

 Previous Page Next Page