Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 22

    "నీ కోసం మీ ఇంటికెళితే మీ ఆవిడ నువ్విక్కడున్నావని చెప్పింది. నిన్నెలాగయినా పట్టుకోవాలని వెంటనే ఇక్కడికొచ్చేశాను" అన్నాడు ఇన్ స్పెక్టర్ సురేంద్ర.

    "మీ పోలీసులకి ఎక్కడున్నా క్షణాల మీద పట్టుకోవడం కష్టం కాదుగా" నవ్వేడు ఆనందమూర్తి ఫణికి అక్కడ కూర్చోబుద్ది కావడం లేదు.

    'ఆనందమూర్తి ఫోన్ చేసి పోలీసులని పిలిపించి వుంటాడు. మళ్ళీ ఏమీ తెలీనివాడిలా నటిస్తున్నాడు. ఎంత ప్లాన్ వేశాడు!' ఆనందమూర్తిని చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది. ఫణికి. ఆవేశాన్నెలాగో అమిచిపెట్టుకుని లేవలేక కదల్లేక కూర్చున్నాడు.

    "బై...ది...బై! మీట్ మై కజిన్ ఇన్స్ పెక్టర్ సురేంద్ర....! మొన్నటి వరకు కడపలో వున్నాడు. మొన్నీ మధ్యే ఈ వూరు ట్రాన్స్ ఫర్ ఇక్కడికొచ్చాడు. మీట్ మై క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ ఫణికుమార్......" అంటూ పరస్పరం పరిచయం చేశాడు ఆనందమూర్తి.

    ఫణి అయిష్టంగానే షేక్ హాండ్ ఇచ్చాడు యాంత్రికంగా.

    ఆనందమూర్తి ఎంత సరదాగా మాట్లాడుతున్నాడో ఫణికి అంత కోపంగా వుంది. 'బంధువు కదా బయలుదేరే ముందే ఇంటినుంచి ఫోన్ కొట్టి, ఏమీ తెలీనివాడిలా ఇక్కడికొచ్చుంటాడు. లేకపోతే అంత అర్జంటుగా వెతుక్కుంటు నా క్లినిక్ కి రావలసిన పనేముంది?' అని ఊహలు అల్లుకుపోతున్నాడు ఫణి.

    అంతలో లోపల్నుంచి ఫెల్లున ఏడుపులు వినిపించాయి.

    "ఏమైంది?" అడిగాడు ఇన్స్ పెక్టర్ సురేంద్ర.

    "ఒక పేషంటు పోయాడు. వాళ్ళ బంధువులు వాళ్ళు" ముక్తసరిగా చెప్పాడు ఆనందమూర్తి.

    "ఓ.....ఏమిటి జబ్బు?"

    "సివియర్ అటాక్ ఆఫ్ ఆస్త్మా బట్ నౌ సడన్ కార్డియాక్. అరెస్ట్....." చెప్పేడు ఆనందమూర్తి ఫణి మొహంలో నెత్తురు చుక్కలేదు. అతని ధ్యాసల్లా ఆనందమూర్తి అతనికి ఏం చెబుతాడోనన్న భయమే. మౌనంగా వుండిపోయాడు.

    "ఏం గొడవరా నాయనా! తెల్లవారి లేచినప్పటినుంచి ఆఫీసు కెళ్ళినా ఇంట్లో వున్నా ఇవే గొడవలు. వరకట్నపు చావులు, రేపులతో చావులు. మర్డర్లూ దొంగతనాలూ తలలు పగలకొట్టుకోవడాలూ....ఛ.. ఛ మనిషి ప్రాణం ఇంత చవకైపోయింది. చెట్టునుంచి ఒక కాయ కోసినంత సులువుగా ఒక ప్రాణం తీసేస్తున్నారు. ఒక మనిషిని మరో మనిషి చంపడం అంటే ఎక్కడో ఒక మృగం లాంటి మనిషి తప్ప మామూలు వాళ్ళెవరూ చేసే వాళ్ళు కాదు. ఇప్పుడు పైకి పెద్ద మనుషుల్లా కనిపిస్తూ చేసేవన్నీ వెధవపన్లే! ఆఖరికి ఆడవాళ్ళు కూడా తయారయ్యారు. కట్నం తేలేదనో, తెచ్చింది చాలలేదనో, కిరసనాయిల్ పోసి, స్టవ్ అంటించినంత తేలిగ్గా మనిషిని అంటించి చంపేస్తున్నారు" అన్నాడు సురేంద్ర.

    ఫణిలో ఒణుకు ఎక్కువైంది. కాళ్ళూ చేతులూ చల్లబడుతూన్నట్లనిపించింది. ఆనందమూర్తి కేసి మింగేసేలా చూశాడు.

    ఫణిలో సుళ్లు తిరుగుతూన్న ఆలోచనలని పసిగట్టినా ఏమీ తెలీనట్టుగానే ఊరుకున్నాడు ఆనందమూర్తి "ఆనంద్ అసలీ పరిస్థితికి కారణమేమిటంటావ్? స్వార్ధం. డబ్బు! కీర్తి! వీటికోసం పెద్ద పెద్ద విద్యావంతులు కూడా వెధవ పన్లు చేస్తున్నారు. శిక్ష వెయ్యవలసిన పోలీసులూ, న్యాయవాదులే కట్నం కోసం ఆడపిల్లలని హింస పెడుతూంటే, ఆమె రక్షణ కోసం ఇంకెక్కడికి పోతుంది? రోగి చావు బతుకుల మధ్య పోరాడుతూ డాక్టర్ దగ్గరికొస్తే, కాసులు రాబట్టే పద్దతే తప్ప అతని స్థితి పట్టించుకోని డాక్టర్లుంటే రోగి ఏమైపోతాడు. కంచే చేను మెయ్యడమంటే ఇదే మరి" చెప్పుకుపోతున్నాడు సురేంద్ర.

    వామనరావు చిన్న కొడుకు టాక్సీ పట్టుకొచ్చాడు. నర్సూ వార్డ్ బాయ్ ల సహాయంతో వామనరావు శవాన్ని టాక్సీలోకెక్కించాడు.

    మళ్ళీ అందరూ ఘొల్లుమన్నారు. వామనరావు పెద్ద కొడుకు ఆనందమూర్తి కాళ్ళ మీద పడి భోరున ఏడ్చాడు. అతణ్ణి లేవనెత్తి ఓదార్చాడు ఆనందమూర్తి.

    "వస్తాం డాక్టర్."...అటూ ఫణికుమార్ కి నమస్కరించి వెళ్ళి టాక్సీలో కూర్చున్నారు. టాక్సీ కదిలింది. పది నిముషాల పాటు ఏడుపులతో గగ్గోలెత్తిపోయిన ఆసుపత్రి ఆవరణ ప్రశాంతంగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆనందమూర్తి కర్చీపుతో కళ్ళు తుడుచుకున్నాడు. ఫణి నుదుటి మీద పట్టిన చెమటని కంగారుగా తుడుచుకున్నాడు.

    అందరి మధ్యా భరించలేని నిశ్శబ్దం!

    నిశ్శబ్దాన్ని బద్దలు గొట్టేలా పెద్దగా నవ్వాడు ఇన్స్ పెక్టర్ సురేంద్ర.

    ఆనంద్, ఫణీ ఆశ్చర్యంగా చూశారతనికేసి.

    ఒరేయ్ ఆనంద్! చావుకీ బతుక్కీ మధ్య ఎంత చిన్న తేడారా! కళ్ళు తెరిస్తే పుట్టుక కళ్ళు మూస్తే గిట్టుక. ఈ రెంటికి మధ్య కాలం ఒక్క క్షణం చాలు!" ఏమిట్రా......ఖాకీ బట్టలు వేసుకుని కవిత్వం చెబుతున్నావు?" నవ్వుతూ అన్నాడు ఆనంద్.

    "కాదు! ఏ బట్టలు వేసుకుంటేనేం?నే చెప్పింది కఠిన సత్యం. నాకు బాబు పుట్టాడు. ఎల్లుండి నామకరణం అని చెప్పడానికి నేనొచ్చాను. క్షణంలో ఇక్కడి వాతావరణం ఆ విషయాన్ని చెప్పనియ్యక విషాదంతో నిండిపోయింది. అదే మరి...." అన్నాడు వేదాంతిలా చిన్నగా నవ్వుతూ ఇన్స్ పెక్టర్ సురేంద్ర.

    "ఓ..... కంగ్రాచ్యులేషన్స్. మీనాకి కూడా చెప్పు. ఇంక తన క్రికెట్ ఆట చాలించమని చెప్పు. ఆడుకోడానికొక బుడతడొచ్చాడుగా!" అన్నాడు నవ్వుతూ.

    "అన్నట్టు మా మీనా.....అంటే వీడి వైఫ్ మంచి క్రికెట్ ప్లేయర్. ఎన్నో చోట్లకి టీమ్ కెప్టెన్ గా కూడా వెళ్లింది." చెప్పాడు ఫణితో ఆనంద్.

    ఈ సంభాషణతో ఫణి మనసు కాస్త తేలికపడింది.  "కంగ్రాట్స్" అన్నాడు చేతులు కలుపుతూ ఫణి. "మీరు కూడా రండి మా ఆనంద్ తో పాటు. డాక్టర్" అంటూ ఇన్ వైట్ చేశాడు ఫణిని కూడా ఇన్ స్పెక్టర్ సురేంద్ర.

    "అలాగే" తలూపాడు ఫణి.

    కాస్సేపు కూర్చుని  "వస్తారా...డోంట్.....ఫర్ గెట్ టు కం......... హర్షితకి కూడా మరీ మరీ చెప్పా. ఏదో కేసొచ్చిందని అదీ ఇదీ చెప్పి డుంకీ కొట్టక" నవ్వుతూ లేచాడు సురేంద్ర.

    "కేసులూ గీసులూ అని సాకులు చెప్పడం మీ పోలీసోళ్ళ అలవాటు" అన్నాడు ఆనంద్, సురేంద్ర భుజాల మీద చేతులు వేస్తూ.

 Previous Page Next Page