Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 21

    "గత నాలుగు రోజులుగా నువ్వు వామనరావుకి ఇచ్చిన మందులు ఏమిటి? అవి వాడితే మనిషి బతికి బట్టకట్టలేడని నీకు తెలీదా? నీకు తెలియదని నేననుకోను. నువ్వు తెలిసి తెలిసీ అవి వామనరావుకు వాడావు. ఔనా?" సూటిగా అడిగేసరికి ఫణి ఇబ్బందిగా చూశాడు.

    "అవి వాడినట్లు నీతో ఎవరు చెప్పారు?" కంగారుపడ్డాడు ఫణి

    "కేస్ షీట్ చూశాను!"

    "దాన్లో నోట్ చేయవద్దని చెప్పానుగా........" కంగారుగా అన్నాడు.

    "నువ్వు చెప్పినట్టే నోట్ చెయ్యలేదు. నిజంగా కేస్ షీట్ నేను చూడలేదు" ఫణి కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఆనందమూర్తి.

    "అలాగా" తడబడ్డాడు ఫణి.

    "చేసిన తప్పుని నువ్వే ఒప్పుకున్నావు. ఆ మందులు నోట్ చేయకుండా అతనికి ఇచ్చావు. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశావని అర్ధం అవుతోంది" అన్నాడు ఆనందమూర్తి.

    "ఆనంద్! నన్ను క్షమించు. ఇది కావాలని నేను చేయలేదు" ఆనందమూర్తి రెండుచేతులూ పట్టుకున్నాడు ఫణి.

    "ఫణీ! నువ్వెందుకిలా మారిపోయావ్? నీకేమయింది. సైకిక్ గా తయారవుతున్నావు. ఇది ఆరోగ్యానికీ, భవిష్యత్తుకీ, నీ వృత్తికీ సరిపడేది కాదు."

    "సారీ ఆనంద్....... వామనరావు కొడుకుని పోలీస్ కంప్లయింట్ ఇవ్వకుండా నువ్వే ఆపాలి. లేకపోతే చాలా చిక్కుల్లో ఇరుక్కుంటాను" అన్నాడు ఫణి.

    "నీ టెండన్సీ మార్చుకుంటేగాని అది సాధ్యం కాదు"

    "తప్పకుండా మార్చుకుంటాను. ప్రామిస్.. ప్లీజ్, వెళ్ళి చెప్పు ఆనంద్"

    "ఆందోళనపడకు. వామనరావు డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. పోలీసు కంప్లయింట్ ఇవ్వటం లేదు. నేను నచ్చజెప్పాను. ఈ విధంగా నీ పాపంలో నేనూ భాగం పంచుకున్నట్లు అయింది ఫణి. ఇక ముందెప్పుడూ ఇలాంటివి జరక్కుండా జాగ్రత్త తీసుకో!" కొంచెం పరుషంగానే ధ్వనించింది ఆనందమూర్తి గొంతు. ఫణిలో ఆందోళన, భయం తగ్గాయి. కొంచెం రిలీఫ్ ఫీలయ్యాడు.

    "థాంక్యూ ఆనంద్! నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను" కృతజ్ఞతగా చూశాడు ఫణి.

    "ఈ జన్మలోనే కాదు. ఏ జన్మలోనూ తీర్చవలసిన అవసరం లేదు. ప్రాణాలమీదికి తెచ్చే ఇలాంటి తెలివితక్కువ పనులు చేయుకుండా ఉంటే చాలు!" హెచ్చరించినట్లుగా అన్నాడు ఆనందమూర్తి.

    "అలాగే!" అన్నాడు ఫణి అవమానంతో ముఖం చిన్నబుచ్చుకుని.

    "ఆనంద్! నువ్వు నాకొక ప్రామిస్ చేయాలి!"

    "ఏమని?"

    "చేస్తానని మాటివ్వు!"

    "విషయమేమిటో చెప్పు!"

    "ఇక్కడ జరిగినదేమీ హర్షితకు గానీ, లతికకు గానీ తెలియనివ్వద్దు" ఆనందమూర్తి నవ్వాడు.

    "ఏమిటలా నవ్వుతావ్? ప్రామిస్ చెయ్యవా?"

    "చేస్తాను" అన్నాడు ఆనందమూర్తి. 

    "మరి నవ్వుతావెందుకు?"

    "నేను ప్రామిస్ చేసి, ఆ మాటమీద నిలబడినా ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలియకుండా ఉండదు"     "ఎలా తెలుస్తుంది?"

    "వామనమూర్తి విషయంలో జరిగిన యదార్ధం ఏమిటో వాళ్ళిద్దరూ ఊహించుకొని ఈ సబ్జెక్టు మీదనే ఇంట్లో కూర్చుని చర్చించుకుంటున్నారు ఏ క్షణంలో అయినా ఫోన్ చేసి ఎవరో ఒకరి ద్వారా జరిగిన విషయం అంతా తెలుసుకుంటారు. అప్పుడు నువ్వు అనుమానిస్తావు"

    "అంటే...నిన్నెందుకు అనుమానిస్తాను?"

    "ఈ విషయం మనిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదని నీ భ్రమ. నిజం నిప్పులాంటిది. ఎంత దాచినా అది దాగదని నీకు తెలుసు. ఆ నిజం మనవాళ్ళకి నాద్వారా మాత్రమే తెలిసిందని నా మీద అనుమానపడవని గ్యారంటీ ఏమిటి?"

    "ఛ! అలా ఎప్పటికీ జరగదు"

    "ఎందుకు జరగదు? ఇంతకుముందే జరిగింది. వామనరావు కొడుకు నాతో మాట్లాడకపోయినా మాట్లాడాడని నువ్వు ఊహించి నా మీద కోపం పెంచుకున్నావు. ఆ గొంతుతో నేను మాట్లాడుతున్నట్లు మాట్లాడి అతని అభిప్రాయం తెలుసుకున్నావు. తన తండ్రిని నా డిస్పెన్సరీకి తీసుకురాకముందే అతనికి ఆ అవకాశం కలగకుండా స్లా పాయిజన్ ఇచ్చి అతని తండ్రిని శవంగా మార్చావు"

    ఫణి గభాల్న ఆనందమూర్తి నోరు నొక్కాడు. తలుపు దగ్గర ఏదో చప్పుడైతే! అప్పుడే తలుపులు తెరుచకొని పోలీస్ ఇన్ స్పెక్టర్ సురేంద్ర ప్రవేశించాడు.

    అతన్ని చూడగానే ఫణి ముఖం పాలిపోయింది.

    ఆనందమూర్తి ముఖం వికసించింది.

    ఫణి మొహం నెత్తురుచుక్క ఇంకిపోయినట్లు పాలిపోయింది. వెన్నులోంచి చలి పుట్టుకొచ్చినట్టనిపించి ఒణుకుతున్నాడు. ఏదో భయం అతని మనసు నిండా చుట్టుకుని, కదలనీయడం లేదు. ఒళ్ళంతా చిరు చెమటలు పట్టేశాయ్. కూర్చున్న కుర్చీ భూమిలోకి కూరుకుపోతున్నట్లనిపించింది. తల వంచుకుని టేబుల్ మీద వున్న పేపర్ వెయిట్ ని అటూ ఇటూ తిప్పుతూ కూర్చున్నాడు. 'అప్పుడే పోలీసులకెలా తెలిసింది? వామనరావు కొడుకుచెప్పుంటాడా? కానీ అతడు ఆ శవం దగ్గిరి నుంచి కదలడం కూడా కనిపించలేదే? పైగా ఎందుకైనా మంచిదని తను జనరల్ ఫోన్ ప్లగ్ తీసేసి వుంచాడు. ఎవరూ ఫోన్ చెయ్యడానికి గానీ, ఫోన్లు రావడానికి గానీ వీలు పడదు కదా! అలాంటప్పుడు ఈ వార్త పోలీసులకెలా పొక్కింది? నిముషాల మీద ఇన్ స్పెక్టర్ ఎలా వచ్చాడు, ఆలోచనల్లో అంతు దొరకక అవస్థపడుతూ సతమతమయిపోతున్నాడు ఫణికుమార్. సురేంద్ర ఆనందమూర్తితో కరచాలనం చేసి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

 Previous Page Next Page