"మీరు....... ఆవేశపడకండి. ఏ డాక్టరూ కూడా తన వద్దకి వచ్చిన పేషెంటు విషయంలో నిర్లక్ష్యం వహించడు. అతనికి నయం చేయడానికి తన శక్తియుక్తుల్ని ఉపయోగిస్తాడు. ఎంత అసమర్ధుడైన డాక్టర్ అయినా రోగి బతికి బట్ట కట్టలేకపోతే - రోగి తాలూకు వారికంటే డాక్టరే ఎంతో బాధపడతాడు. తన ప్రయత్నం ఫలించలేదని కుమిలిపోతాడు. ఇప్పుడు ఫణి పరిస్థితి అలానే ఉంది. మీ తండ్రి పోయినబాధ మిమ్మల్ని మాత్రమే కాదు. అతనిని కూడా దహించివేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మీరు అనాలోచితంగా పోలీస్ కంప్లయింట్ ఇస్తాననటం ఏమంత సబబుగా ఉంది? మీరే ఆలోచించండి!" అతనికి నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు ఆనందమూర్తి. "డాక్టరు గారూ! ఇదే కేసు మీ దగ్గరికి వస్తే నా తండ్రి ఏనాడో ఆరోగ్యవంతుడై మా కళ్ళ ఎదుట లేచి తిరుగుతూ వుండేవాడు" అన్నాడు అతను కళ్ళు తుడుచుకుంటూ.
"నామీద అభిమానంతో మీరలా అంటున్నారు గానీ, దేనికైనా కాలం ఖర్మం కలిసిరావాలి" అన్నాడు ఆనందమూర్తి. కాలంమీద, ఖర్మంమీద కంటే తన శక్తియుక్తుల మీద, ఆత్మవిశ్వాసం మీద ఎంతో నమ్మకం ఉన్న ఆనందమూర్తి ఎదుటి వ్యక్తిని ఓదార్చటం కోసం ఆమాటలు ప్రయోగించక తప్పలేదు.
"నా మాట విని....... వెంటనే డెడ్ బాడీని ఇంటికి తీసుకువెళ్ళండి. పోలీసుల వరకు వెళితే మీకూ, ఫణికి తలనొప్పి తప్ప ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదు."
"అలా అని మేం ఊరుకుంటే ఆయనగారి నిర్లక్ష్యం ఇంకా పెరిగిపోతుంది. మరికొంతమంది పేషెంట్లు ప్రాణాలు పోగొట్టుకొనే అవకాశం కలుగుతుంది. అందుకే పోలీసుల చేత హెచ్చరించేలా చేయాలి" గుప్పిళ్ళు బిగించి ఉద్రేకంగా అన్నాడు అతను.
"మీ తండ్రిగారు పోయిన బాధలో మీరలా మాట్లాడుతున్నారు. ఇకపై ఫణి డిస్పెన్సరీలో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొనేలా నేను హెచ్చరిస్తాను. మీరిక జరగాల్సిన కార్యక్రమాలు చూడండి"
ఆనందమూర్తి చెప్పిన మాటలకి అతను మౌనంగా తల ఊపి అక్కణ్నుంచి తన మనుషులు ఉన్న స్పెషల్ వార్డు వైపు వెళ్లాడు. అప్పుడు అటుగా వెళ్తున్న నర్స్ ని ఆపి పలకరించాడు ఆనందమూర్తి నర్స్ ఆనందమూర్తికి నమస్కారం పెట్టి నిలబడింది. "ఈవేళ ఆదివారం కదా! డ్యూటీకి వచ్చావేమిటి?" అడిగాడు ఆనందమూర్తి.
"పోయిన వారమంతా నేను నైట్ డ్యూటీలోనే ఉన్నాను సార్! వామనరావుగారి పరిస్థితి బాగోలేదని ఆదివారం కూడా డ్యూటీకి వచ్చి జాగ్రత్తగా చూసుకోమని డాక్టరుగారు చెప్పారు. అందుకే ఈవేళ కూడా రావటం తప్పలేదు" అంది నర్స్.
"వామనమూర్తికి మెడిసిన్స్ ఇవ్వటం అంతా నువ్వే డీల్ చేస్తున్నావు కదూ!"
"ఔనండీ, నేను ప్రొద్దుటే డ్యూటీలో నర్స్ కి వివరాలన్నీ చెప్పి వెళతాను. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు ఆమె సరిగ్గా నేను చెప్పినట్లు చేసిందో లేదో చెక్ చేసుకుంటాను"
"ఈవారం రోజులుగా వామనరావుకి ఏమేం మందులు ఇస్తున్నారో నీకు తెలుసుకదూ!"
"తెలుసండీ!" అంటూ ఆ వివరాలు చెప్పింది నర్స్.
"థాంక్స్" అన్నాడు ఆనందమూర్తి. నర్స్ ముందుకి వెళ్లడానికి వెనక్కి తిరిగాడు. ఫణి గబగబా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ మళ్ళీ రూమ్ లోకి వెళ్లారు.
"ఆనంద్! వామనరావు కొడుకు ఏమన్నాడు?" ఆతృతగా అడిగాడు.
"పోలీసు కంప్లయింట్ ఇస్తానంటున్నాడు"
"నువ్వు నచ్చజెప్పలేదా?"
"చెప్పాను!"
"అయితే ఏమంటాడు?"
"ఇప్పుడుకానీ కంప్లయింట్ ఇవ్వకపోతే ఇంకా ఎంతమంది పేషంట్ల ప్రాణాలు తీస్తాడోనని ఎదురు ప్రశ్న వేశాడు"
"ఇడియట్.....అలా అన్నాడా?" కోపంగా అన్నాడు ఫణి.
"అతనన్నదాంట్లో తప్పేముంది? ఇది మొదటి కేసు కాదుగా నీకు....."
"ఆనంద్!"
"అవును......కన్నతండ్రి ప్రాణాలతో ఆటలాడుకున్న నీలాంటి డాక్టర్ని ఏకంగా పొడిచి చంపకుండా పోలీసు కంప్లయింటు మాత్రం ఇస్తానంటున్నాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడివనే చెప్పాలి"
"ఆనంద్........ ఇలాంటి పరిస్థితిలో జోక్ చేస్తున్నావా?" ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఫణి.
"జోక్ కాదు ఫణీ! నిజమే మాట్లాడుతున్నాను. నీ పేషంట్లు నీకు బిడ్డల్లాంటి వాళ్ళు. ఆ విషయం మరిచి నువ్వు వాళ్ళమీద ప్రయోగాలు చేసి వాళ్ల ఆరోగ్యంతో ప్రాణాలతో ఆడుకుంటావా?"
"ఏమిటలా మాట్లాడతావ్? నేనేం చేశాననీ?" బెదురుగా చూశాడు పణి.