ఆనందమూర్తి అతని భుజం తట్టి గుండె దిటవు చేసుకోమ్మన్నట్టు ధైర్యం చెప్పాడు.
"డాక్టర్ గారూ ! ఆ ఫణి బాబే నా తండ్రిని చంపేశాడు. మమ్మల్ని అన్యాయం చేశాడు" ఆవేదనగా అన్నాడు వామనరావు రెండో కొడుకు.
"చూడండి, మీరెంత ఆవేశంలో ఉన్నా, బాధలో ఉన్నా అలాంటి మాటలు అనకూడదు. డాక్టర్ ని, డాక్టర్ వృత్తిని అవమానపరచకూడదు. ఫణి మీ తండ్రిగారి ఆరోగ్యం బాగుచేయటానికి తన సాయశక్తులా ప్రయత్నించాడు. అలాంటి డాక్టర్ని మీరు నిందించటం విజ్ఞత అనిపించుకోదు. మీరు మీ తండ్రిపోయిన ఆవేదనలో అలా అంటున్నారని నాకు తెలుసు. నా దగ్గర అన్నట్లు ఇంకెవరి దగ్గరా అనకండి....... రిలాక్స్ అవండి" అంటూ ఆనందమూర్తి గబగబా లోపలికి వెళ్లాడు.
తన రూమ్ లో ఫణికుమార్ తల పట్టుకు కూర్చుని ఉన్నాడు.
ఆనందమూర్తి వచ్చినట్లు చప్పుడు విని ఫణికుమార్ తల పైకెత్తి చూశాడు.
"ఆనంద్! నువ్వొచ్చావా?" ఆశ్చర్యపోయాడు ఫణికుమార్.
"ఏం...? రాకూడదా?" సూటిగా ప్రశ్నించాడు ఆనందమూర్తి.
"అదేం కాదు. ఇప్పుడు.......నువ్వు ఉంటే బాగుండునని అనుకుంటున్నాను. అంతలో నువ్వే వచ్చావు. థాంక్ గాడ్!" అన్నాడు ఫణికుమార్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ.
"ఎనీ ప్రాబ్లమ్?" అన్నాడు ఆనందమూర్తి.
"వామనరావు కొడుకు పోలీస్ కంప్లయింట్ ఇస్తానంటున్నాడు. నా అజాగ్రత్త వల్లనే తన తండ్రి చనిపోయాడని పోలీసు రిపోర్టు ఇస్తాడట. ఆనంద్! అతనికి నువ్వు నచ్చజెప్పి నాకు సాయం చేయాలి" ప్రాధేయపడుతూ అన్నాడు ఫణి.
"నీ తప్పులేనప్పుడు.....నువ్వు భయపడటం దేనికీ?" అన్నాడు ఆనందమూర్తి.
"తప్పు ఉన్నా, లేకపోయినా......పోలీసులు, గొడవలలో ఇరుక్కుంటే చాలా తలనొప్పి, నీకు తెలియనిది ఏముంది? ప్లీజ్ హెల్ప్ మీ!" ఫణి ఆనందమూర్తి రెండుచేతులూ పట్టుకున్నాడు.
"ఫణీ! నీలో ఆవేశం పాలు ఎక్కువ. ఆలోచనని ఆ ఆవేశం మింగేసి, నీలో ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్మాదిని చేసేస్తోంది. వారంక్రితం ఎంతో హెల్దీగా ఉన్న వామనరావు ఎందుకు వీక్ అయిపోయాడు? అతను చనిపోవడానికి కారణం..... నువ్వు వాడిన మెడిసిన్స్ కాదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలవా? డాక్టరుగా నీ బాధ్యతల్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించలేకపోయావని నేనంటాను. నువ్వు ఏం సమాధానం చెప్తావ్?" కొంచెం కటువుగా అన్నాడు ఆనందమూర్తి.
ఫణి మారు మాట్లాడకుండా తల వంచుకున్నాడు.
అతని మౌనం అతను తన తప్పుని అంగీకరించినట్లు అనిపించింది ఆనందమూర్తికి.
"ఫణీ! హర్షిత నీతో ఎన్నోసార్లు చెప్పింది. డాక్టర్ వృత్తి మైనేసి ఏదైనా వ్యాపారం పెట్టుకోమని. కాని, నువ్వు నీ వృత్తినే వ్యాపారంగా మార్చేసుకున్నావు. పేషంట్ల ప్రాణాలతో చెలగాటం మంచిది కాదని నీకెన్నిసార్లు చెప్పినా తలకి ఎక్కటం లేదు. నువ్వు వామనరావుని వాంటెడ్ గా చంపావు. అతన్ని నా డిస్పెన్సరీకి తీసుకురాకుండా ఉండటం కోసం, నీ పరువు పోకుండా ఉండటంకోసం వామనరావు ప్రాణాలు నిలువునా నువ్వే తీశావు. ఔనా?" ఆవేశంగా అన్నాడు ఆనందమూర్తి.
"డాక్టర్ వృత్తికి మచ్చ తెచ్చే నీలాంటి వాడికి ఒకసారి సరైన గుణపాఠం చెప్పాలి. పోలీసులే నీకు తగిన మందు నీకు శిక్షపడాలి!" అంటూ విసురుగా గదిలోంచి బైటికి నడిచాడు.
"ఆనంద్!" అంటూ పిల్చాడు ఫణి.
ఆనందమూర్తి ఫణి గదిలోంచి బైటికి వచ్చి వామనరావు డెడ్ బాడీ ఉన్న స్పెషల్ వార్డు దగ్గరికి వచ్చాడు. "డాక్టర్ గారూ! ఇప్పుడు నన్నేం చేయమంటారు?" అడిగాడు వామనరావు పెద్దకొడుకు. అతని కడుపులోంచి దుఃఖం పొర్లుకువచ్చి కళ్ళలో నీళ్ళు నిండాయి. ఆనందమూర్తి అతని భుజం మీద చెయ్యివేసి పక్కవార్డు దగ్గరికి తీసుకెళ్ళాడు" జరిగిపోయినదానికి బాధపడి ప్రయోజనం లేదు. గుండె దిటవు చేసుకోండి. డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంకా ముఖ్యమైన వాళ్ళెవరైనా ఉంటే కబురు పెట్టండి" అన్నాడు ఆనందమూర్తి.
"లేదు డాక్టరు గారూ! నా తండ్రి చావుకి ఫణి బాధ్యులు. అందుకే పోలీసు కంప్లయింట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతకాలం ట్రీట్ మెంట్ ఇచ్చినా ఆయనకి నయం చేయలేకపోయారు. అడిగినంత డబ్బు ఇచ్చాను. కానీ తన నిర్లక్ష్య వైఖరితో నా తండ్రి ప్రాణాలను తీశారు. ముమ్మాటికీ ఫణిగారి అశ్రద్దవల్లనే ఆయన చనిపోయారు" ఆవేదనగా అన్నాడు వామనరావు కొడుకు. "అందుకే కేసు పెడతాను. అతడి రోగం కుదురుస్తాను"