"ఫణి అతనికి ఫోన్ చేసింది మీ పేరుతో!" లతిక మాటలకు ఆనందమూర్తి అదిరిపడ్డాడు. హర్షిత ఆశ్చర్యపోయింది.
"నా పేరుతో అంటే......నేను మాట్లాడుతున్నట్లుగా గొంతు మార్చి మాట్లాడాడా?" అడిగాడు ఆనందమూర్తి.
"అవును"
"అందువల్ల.....ఫణికి వచ్చే లాభమేమిటి" హర్షిత అడిగింది.
"ఆనందమూర్తి గారే మాట్లాడుతున్నారని అనుకొని వామనమూర్తి కొడుకు ఫోన్ లో మిమ్మల్ని తెగ పొగిడేశాడు. ఫణిని తిట్టాడు. తన తండ్రికి ట్రీట్ మెంట్ ఇచ్చి ఆరోగ్యవంతుణ్ని చేస్తే అడిగినంత డబ్బు ఇస్తానని బతిమాలాడు" చెప్పింది లతిక.
"ఆ మాటలు విన్న ఫణి రియాక్షన్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిప్పులు తొక్కిన కోతిలా చిందులేసి ఉంటాడు" అంది హర్షిత.
"అవును, చాలా మండిపడ్డాడు. రెండు రోజుల తరువాత డిస్ చార్జ్ చేసేస్తానని. వారం తర్వాత డిస్పెన్సరీకి వామనరావుని తీసుకొని రమ్మని అతని కొడుకుతో చెప్పాడు. ఈలోగా ఫోన్ మాత్రం చేయవద్దని చెప్పాడు" అంది లతిక.
"అతను మీకు ఫోన్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది కదా! అందుకే తెలివిగా అలా చెప్పి ఉంటాడు" అంది హర్షిత ఆనందమూర్తివైపు చూసి.
ఆనందమూర్తిలో ఒక రకమైన ఆందోళన చోటుచేసుకుంది.
"లతికా! ఆతర్వాత ఏమైందో చెప్పగలవా?" ఆతృతగా అడిగాడు ఆనందమూర్తి.
"ఫణి వెంటనే డిస్పెన్సరీకి ఫోన్ చేసి, డ్యూటీలో ఉన్న నర్స్ తో మాట్లాడాడు. వామనరావుకి ఏయే టాబ్లెట్స్ ఇవ్వాలో, ఎన్ని గంటలకి ఇంజక్షన్స్ ఇవ్వాలో చెప్పాడు" అంది లతిక.
"ఏమేం టాబ్లెట్లు......ఇంజక్షన్లు......పేర్లు ఏమైనా గుర్తున్నాయా?" అడిగాడు ఆనందమూర్తి.
"ఊ......హూ.....నేను వాటి సంగతి పట్టించుకోలేదు. డిస్పెన్సరీకి ఫోన్ చేశారెందుకని అడిగాను"
"ఏం చెప్పాడు?"
"వామనరావు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోమని, సరైన టైమ్ కి మందులు ఇమ్మని చెప్పానని అన్నాడు ఫణి" అంది లతిక.
ఆనందమూర్తి ఆలోచనలో పడ్డాడు.
"వామనరావు కొడుకు తనతండ్రిని ఫణి దగ్గరనుంచి తీసుకొచ్చి మీ డిస్పెన్సరీలో ఎక్కడ చేరుస్తాడోనని ఫణికి భయం పట్టుకొని ఉంటుంది అలాగ్గాని జరిగితే అతని ఇమేజ్ దెబ్బతింటుంది. అతని పేషెంట్స్ అందరూ ఒక్కొక్కరే జారిపోయే ప్రమాదం ఉంది. అందుకే వామనరావుని స్లో పాయిజన్ తో తనే కడతేర్చి ఉంటాడు" అంది హర్షిత.
"హర్షితా!" గట్టిగా అరిచాడు ఆనందమూర్తి. హర్షిత, లతిక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఆనందమూర్తి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. హర్షితకి భయం వేసింది.
"హర్షితా! నోటికొచ్చినట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. ఏ డాక్టరూ ఒక రోగిని తన స్వార్ధం కోసం ప్రాణాలు తీయడు" అన్నాడు స్వరం పెంచి.
"సారీ ఆనంద్" అంది హర్షిత ముఖం చిన్నబుచ్చుకొని.
"హర్షితా! డాక్టర్ వృత్తి ఎంతో పవిత్రమైంది. తనను నమ్మి వచ్చిన రోగికి ఆరోగ్యం చేకూర్చటానికి డాక్టర్ తన సర్వశక్తులూ ధారపోస్తాడు. అతడి ప్రాణాన్ని కాపాడటానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయడు డాక్టర్. అలాంటిది నువ్వు అలా కించపరుస్తూ మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను. ఫణికి తెలియకుండా మళ్ళీ ఏదో పొరపాటు జరిగి ఉంటుంది" అన్నాడు ఆనందమూర్తి.
"పొరపాటు......ఒకటి..... రెండుసార్లు అయితే ఫర్వాలేదు. ప్రతిసారీ పొరపాటని సరిపెట్టుకోగలమా? ఇది ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం. పరిస్థితి చెయ్యి దాటిపోయాక పొరపాటు జరిగిపోయిందంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తి ఇన్నిసార్లు పొరపాటు చేస్తే ఎవరూ క్షమించరు" ఆవేశంగా అంది హర్షిత.
లతిక మెల్లగా హర్షిత భుజం మీద చెయ్యి వేసింది.
"ఆవేశపడకు హర్షితా! నేను వెంటనే ఫణి దగ్గరికి డిస్పెన్సరీకి వెళ్తాను. అక్కడి పరిస్థితి ఏమిటో చూడాలి. లతికా, నువ్వూ ఉండండి. వెంటనే వచ్చేస్తాను" అంటూ గబగబా బైటికి నడిచాడు ఆనందమూర్తి.
హర్షిత, లతిక అతను వెళ్ళినవైపే చూస్తూ నిలబడిపోయారు.
* * *
వామనరావు చనిపోయాడు!
అతని ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, వాళ్ళ పిల్లలూ ఫణి డిస్పెన్సరీలోనే వున్నారు. అందరూ బోరున ఏడుస్తున్నారు.
వామనరావు పెద్దకొడుకు దుఃఖానికి ఆనకట్ట లేకుండా పోయింది. గుండెలు బాదుకొని భోరున ఏడుస్తున్నాడు.
అతను ఆనందమూర్తిని చూడగానే అతని చేతులు పట్టుకొని స్వరం పెంచి గట్టిగా ఏడవసాగాడు.
"డాక్టర్ గారూ! మా నాన్నని మీచేతుల్లో పెడితే ఆరోగ్యవంతుడవుతాడని ఆశపడ్డాను. మీరు చెప్పినట్టు మరో నాలుగురోజుల్లో మీ డిస్పెన్సరీకి తెచ్చి జాయిన్ చేద్దామనుకున్నాను. కానీ, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. బాగా కోలుకుంటున్న మనిషి ఈ నాలుగు రోజులుగా చాలా బలహీనపడిపోయాడు. కారణమేమిటో తెలియదు. ఈవేళ ఉదయం కూడా బాగానే మాట్లాడాడు. నాలుగు రోజుల తర్వాత మీ దగ్గరికి తీసుకెళ్తానని చెప్తే ఆయన సంతోషించాడు. మాట్లాడుతూండగానే ఆయనకి వెక్కిళ్ళు వచ్చాయి. ఉండే కొద్దీ అవి తీవ్రస్థాయికి వెళ్లి ప్రాణాంతకమయ్యాయి. మంచినీళ్ళు తాగించబోతే గుటకవెయ్యలేదు. అంతే, నాచేతుల్లోనే ప్రాణాలు వదిలేశాడు. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు" కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ జరిగింది వివరించాడు వామనరావు పెద్దకొడుకు.