"ఆగండి. ఇప్పుడే రాసిస్తాను" అనిబ్రీఫ్ కేసు తెరిచి దాన్లోంచి లెటర్ ప్యాడ్ తీసి గబగబా లెటర్ రాయడం పూర్తిచేసి "తీసుకోండి" అంటూ డాక్టర్ సూర్యచంద్ర కందించాడు.
లెటర్ చదివి ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్ సూర్యచంద్ర "ఏమిటిది?" అంటూ.
"క్లియర్ గానే వుంది. అది నా రాజీనామా లేఖ. నా మనస్సుని చంపుకుని, నా వృత్తికి అన్యాయం చెయ్యలేను. ఇమడలేని చోట తప్పుకోవటం మంచిది. గుడ్ బై....." అంటూ గబగబా అడుగులు బైటకు వేశాడు, డాక్టర్ సూర్యచంద్ర పిలుస్తున్నా వినిపించుకోకుండా.
కారు దగ్గర కనిపించారు సిస్టర్ సుజాతా, డాక్టర్ రావుగారూ.
"సా.....సారీ...డాక్టర్...." అన్నాడు డాక్టర్ రావ్.
"డాక్టర్! మీలాంటి మంచివాళ్ల దగ్గర పనిచేసే అవకాశం పోగొట్టుకున్న మేము దురదృష్టవంతులం" అంది సిస్టర్ సుజాత.
"ఏం ఫరవాలేదు. మీకెప్పుడు ఏం కావాలన్నా నా దగ్గరకు రావచ్చు" అన్నాడు.
అంతలోనే ఈ వార్త ఆసుపత్రి అంతా పొక్కిపోయింది. వాచ్ మెన్ మొయిన్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. 'సుదర్శన్ ఒక్కసారి మిమ్మల్ని చూడాలంటున్నాడని' ఆనందమూర్తి ఒక్క అంగలో అక్కడికి చేరుకున్నాడు. "డాక్టర్ సాబ్! అంతా నా వల్లనే జరిగింది. నన్ను క్షమించండి" అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ.
"నో...నో! నీ వల్ల ఏం కాలేదు. నువ్వు రెస్టు తీసుకో. డాక్టర్ రావుగారి తోటీ సిస్టర్ సుజాత తోటీ, అంతా మాట్లాడాను. నీకేం ఫరవాలేదు. డిశ్చార్జ్ అయ్యాక వొచ్చి, నా డిస్పెన్సరీలో కలువు" అన్నాడు.
"థాంక్యూ. నమస్కారం డాక్టర్ సాబ్" అన్నాడు మనసు నిండిన కృతజ్ఞతని మాటల్లోనే కురిపిస్తూ సుదర్సన్. ఆనందమూర్తి రాజీనామా ఎందరినో కదిలించింది.
"పేదల పాలిటి పెన్నిధి"
"దేముడి లాంటి మనిషి"
"ఎంత మంచి హస్తవాసో....." ఇలా పేషెంట్లు నర్సులూ, కొందరు డాక్టర్లూ బాధపడితే డాక్టర్ రెడ్డి, డాక్టర్ వీరయ్య చౌదరిలు, ప్రొఫెషనల్ జెలసీతో 'పీడా విరగడైపోయింది. అందరూ ఆనందమూర్తిని మచ్చుకున్నేవారే' అంటూ లోలోన ఎంతో సంతోషించారు.
* * *
బాల్కనీలో వున్న పూలకుండీలోకు నీళ్ళు పోస్తూన్న హర్షిత కారు చప్పుడు విని, తలుపు గడియ తీసింది. 'ఏమిటి ఇలా వెంటనే వచ్చేశారు. ఒంట్లో బాగులేదేమో! రాత్రి భోజనం, నిద్రా రెండూ సరిగ్గా లేవు కదా!' అనుకుంటూ వెళ్లి తలుపుతీసింది.
ఆనందరావు మొహంలో తొణికిసలాడుతున్న విచారరేఖల్ని గమనించింది.
పెళ్లయి రెండేళ్లు పూర్తవుతున్నా అతణ్ణిలా చూడలేదు.
"ఒంట్లో బాగులేదా?" అడిగింది.
"బాగానే ఉంది."
"మరి?"
జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు ఆనందమూర్తి.
"ఫణికుమార్ ఎందుకొచ్చాడో అక్కడికి అర్ధం కాలేదు." అంది హర్షిత.
"నాకూ అదే అర్ధం కాలేదు. వచ్చినవాడు ఊరుకోకుండా, డాక్టర్ సూర్యచంద్ర చెప్పే మాటలకి , అందరితోపాటు తనూ తందాన తానా అన్నాడు"
బాధ అతని గొంతులో తొణికిసలాడింది. "ఫణికి మొదటినుంచీ మీరంటే జలసీయే. నేను ఎన్ని సార్లు చెప్పినా మీరు నమ్మేవారు కాదు. అతడికి డబ్బు తప్ప మరో ప్రపంచం లేదు. డబ్బు ముందు దేనికీ విలువలేదు. అతగాడిని, పాపం లతిక ఎలా భరిస్తోందో! చివరికి ఒక మామూలు చీర కొనుక్కోవాలన్నా అతగాడి పర్మిషన్ కావాలి. లతికని చూస్తే జాలేస్తుంది."
"అవునా?" ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్.
"చివరికి పిల్లలు పుడితేకూడా ఎక్స్ ట్రా ఖర్చులుంటాయని, పిల్లలు ఇప్పుడప్పుడే వద్దని ప్లాన్ చేస్తున్నాడట. పాపం లతికకి పిల్లలంటే చాలా ఇష్టం"
"ఇడియట్!" అసహ్యంతో అన్నాడు.
అంతలోనే ఫోన్ మోగడంతో ఆనందమూర్తి వెళ్లి ఫోన్ తీశాడు.
డాక్టర్ యాదవ్ హాస్పిటల్ నుంచి, జరిగినదానికి బాధపడుతూ ఏదో చెప్పాడు.
"నాకేం ఫరవాలేదు. అదివరకు సాయంత్రంపూటే నా క్లినిక్ కి వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు ఉదయం కూడా వెళతాను. అంతా మనమంచికే" అన్నాడు.
కాస్సేపు ఇద్దరూ మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేశాడు ఆనందమూర్తి.
అతని మూడ్ మార్చే ఉద్దేశంతో "ఏమండీ చెస్ ఆడదామా?" అడిగింది హర్షిత.
"రెడీ...." అన్నాడు ఆనందమూర్తి డ్రెస్ మార్చుకుని పైజామా లాల్చీ వేసుకుంటూ.
వెంటనే బోర్డూ పావులూ తెచ్చింది హర్షిత.
ఇద్దరూ ఆట మొదలెట్టారు.
ఈ ఆటలో ఎప్పుడూ గెలుపు ఆనందమూర్తిదే. అటువంటిది ఈరోజు హర్షిత గెలిచింది.
"వెరీగుడ్!" అన్నాడు ఆమె చెంపలు నిమురుతూ.
"మీరు కావాలని ఓడిపోయినట్టున్నారు. లేకపోతే మీతో నేను గెలవడమేమిటి?" అంది నవ్వుతూ హర్షిత.
"నేను బాగానే ఆడాను. అయితేనువ్వు చాలా బాగా ఆడావు" అన్నాడు ఆనందమూర్తి ఆమె నడుం చుట్టూ చెయ్యేసి.