"ఎదిరించను సౌజన్యా. నా దారిలో నేను ముక్కుకుసూటిగా వెళ్ళిపోతాను. నాదారిని హర్షించేవాళ్ళు అనుసరించే వాళ్ళు ఉంటె ఆనందిస్తారు. విమర్శించే వాళ్ళని పట్టించు కొను. కానీ" ఆగిపోయింది రమ్య.
"ఊ కానీ ...' రెట్టించింది సౌజన్య.
"సౌజన్యా? నేను వృత్తి రీత్యా ఎగ్జిక్యూటివ్ ని. చదువుకున్న దాన్ని. పబ్లిక్ రిలేషన్స్ లో పిహెచ్ డి చేయాలన్న ఉద్దేశంతో బంధాలు, బాధ్యత లూ లేకుండా పెళ్ళైన సురేష్ తో నా జీవితం పెనవేసుకున్నాను కానీ నా లక్ష్యాన్ని మర్చిపోయి సురేష్ తో అనుకోని బంధం పెరిగిపోయింది. ఎందుకనో.... మనసు అతని సాంగత్యాన్ని అనుక్షణం కోరుకుంటుంది. తాత్కాలికంగా కోపం వచ్చినా మళ్ళీ అన్నీ మర్చిపోయి నేను అతనితో కంప్రమైజ్ అవుతున్నాను. అలాగే నాలో పోసేసివ్ నెస్ కూడా పెరిగి పోతోంది. ఇదంతా ఎందుకు జరిగుతుందో అర్ధం కావడం లేదు."
సౌజన్య రమ్య చేయందుకుని మృదువుగా నిమురుతూ అంది.
"రమ్యా! దీన్నే ప్రేమానుబంధం అంటారు. అతని మీద నీకున్న ప్రేమచేతే నీలో పోసేసివ్ నెస్ పెరుగుతోంది. అదే మాంగల్య బంధంతో ముడేస్తే అతని మీద హక్కు కూడా కోరతావు. మగవాడికి అవసరాలతో పాటు అధికారం కావాలి. మనం బంధాలతో పాటు బాధ్యతల్ని అంటగట్టాలి. అప్పుడే నా ఇల్లు, నా మనుషులు అన్న భావనతో ఓ నిర్దుష్టమైన జీవన విధానానికి కట్టుబడి ఉంటాడు . చూశావా? పెళ్ళి కాకుండా బతికే నీకు, పెళ్ళి చేసుకుని బతికే సురేష్ భార్యకీ తేడా? రమ్యా! ఆడది ఎంత విప్లవ భావాలు కలిగి ఉన్నా ఆమెలో ఓ బలహీనత ఉంది. అదేంటంటే, ఒకకాలంలో ఒక మగవాడ్ని నమ్ముతుంది. తనకి తెలీకుండానే ఈ సమాజం తనకు నిర్దేశించిన నీతి సూత్రాలను అనుసరించి బతకడానికే ప్రయత్నిస్తుంది. ఆ బలహీనతకే ప్రేమ అని, ఆరాధన అని పేర్లు పెట్టుకుంటుంది. ఆ బలహీనతని జయించలేరు. కాబట్టి ఆడవాళ్ళు మాంగల్యానికి ప్రాధాన్యత నిస్తారు. అంతేగాని దానికేదో పవిత్రత ఉందని కాదు. అది లేనంత మాత్రాన భర్త ఆయుష్షు కి గండం ఉంటుందన్న సెంటి మెంట్ తో కూడా కాదు. ఒక్క మగవాడితో కట్టుబడి ఉండాలన్న సూత్రాన్ని కాపాడేది మంగళ సూత్రం కాబట్టి."
రమ్య సౌజన్య వైపు అభినందనగా చూసింది.
"ఆడవాళ్ళ హిపోక్రసీ ని ఎంత అందంగా నిర్వచించావు సౌజన్యా!"
"టీ తాగుదామా" అంటూ నవ్వింది సౌజన్య.
"ఆ....కొంచెం అగు నువ్వింత మాట్లాడావు. నేను కూడా కొంత మాట్లాదాలిగా.
"ఓ యస్. మాట్లాడు" బుద్దిగా కూర్చుంది సౌజన్య.
రమ్య జామచెట్టు మీద పాకుతున్న ఉడతని చూస్తూ- "సౌజన్యా! నువ్వన్నది అక్షరాల నిజమే! పెళ్ళి, సూత్రం అనేవి మగవాడిని కట్టేస్తాయన్నది వాస్తవం కావచ్చు, కానీ నా సిద్దాంతం ప్రకారం ప్రేమ పొందాలంటే మనిషిని కట్టేయాలి కానీ ఓ పసుపు తాడుతో కాదు. ఎంతో శాస్త్రోక్తంగా పెళ్ళి చేసుకున్న భార్యాభర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో ఏ శాస్త్రమూ , మంత్రమూ లేకుండా పరస్పరఅవగాహన తో కలిసి ఉంచగల స్త్రీ పురుషులు ఉంటే ఎంత బాగుంటుంది అన్నదే నా అభిమతం. ఏది ఏమైనా నా సిద్దాంతం మాత్రం మారదు." అంది.
సౌజన్య నిట్టూర్చింది.
"ఒకే! అల్ ది బెస్ట్. రా , టీ తాగుదాం"
ఇద్దరూ లేచి లోపలికి నడిచారు.
సాయంత్రం దాకా అక్కడే గడిపి తిరిగి వచ్చేసింది రమ్య. తను వస్తోంటే సౌజన్యా, కిరణ్ " అప్పుడప్పుడు వస్తుండు" అన్నారే కానీ "సురేష్ ని తీసుకురా" అనకపోవడం గమనించింది. అంత సంతోషకరమైన , ఆహ్లాదకరమైన వాతావరణం లో ఆ ఒక్క విషయం తీయని రాగంలో చిన్న అపశ్రుతిలా రమ్య మనసులో చేదు అనుభూతిని మిగిల్చింది.
***
వారం, పది రోజులుగా బలవంతంగా అణచుకున్న అనురాగం, అభిమానం ఆ క్షణం లో వెల్లువై పొంగాయి. దారిలో కేనేటిక్ హోండా ఆపి, సురేష్ కి ఫోన్ చేసింది. సురేష్ కూతురు కాబోలు రిసీవ్ చేసుకుని "డాడీ, లేరండీ....మమ్మీ డాడీ సినిమా కెళ్ళారు" అని చెప్పింది.
ఆమె మనసులో ఒక్కసారిగా ముళ్ళు దిగినట్టనిపించింది. ఉత్సాహం చప్పగా చల్లారి పోయింది. నీరసంగా ప్లాట్ కెళ్ళి కళ్ళు మూసుకు పడుకుంది. సౌజన్య దంపతులు, సురేష్ అతని భార్య , అమ్మా, నాన్న, ఫ్లాట్స్ లోని దంపతులు ఒక్కొక్కరే ఆమె కళ్ళ ముందు జంటలు జంటలుగా కదలసాగారు.
కాళ్ళలో అరచేతుల్లో సన్నని ప్రకంపన. గుండెల్లో అలజడి, నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం లో ఊపిరాడనట్లైంది. వంటరితనం వెక్కిరిస్తున్నట్లనిపిస్తోంది. ఏంటిలా ? ఏం జరుగుతోంది? పది రోజులైంది సురేష్ తన దగ్గరికి రాక. ఆ స్పృహే లేకుండా భార్యతో సినిమా కెళ్ళాడు ఇంతేనా? ఇంక ఎప్పటికీ ఇలాగేనా? కానీ... కానీ ఈ నిర్లక్ష్యాన్ని తనెంత కాలం భరించ గలదు?
సురేష్ కి తనకీ మధ్య దూరం పెరిగిపోతోంది. ఆ దూరం తగ్గించాలని తను ప్రయత్నిస్తోంది. అసలు ఆ దూరం ఏర్పడకుండా ఉండడానికి తనెంత సహనం వహించింది. మొదట్లో రోజుకోసారి పలకరించాలని పించేది. తరువాత రోజూ కలిస్తే బాగుండుననిపించేది. ఆ తరువాత కలిసి బతకాలని పించింది. బతకడం ప్రారంభించాక తనలో కలిగే అనుభూతులన్నీ అతనితో పంచుకోవాలని తహతహలాడింది. మెల్లిమెల్లిగా విడిచి ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంటే భయపడి బలవంతంగా ఆ కోరికను నిగ్రహించుకుంది. అయితే ఇప్పుడు అతను రోజుల తరబడి రాకపోయినా బతుకుతోంది. వారానికోసారి కలుసుకున్నా కలుసు కోబోయే రోజు కోసం ఎదురు చూస్తూ , ఎదురు చూసిన క్షణాల్ని పదిలపర్చు'కుంటూ బతికిన ఆరోజులు తీయగా ఉండేవి. వారం తరువాత కలుసుకుంటామన్న ఆశతో, నమ్మకంతో ఎదురు చూడడంలో విరహ బాధ ఉండేది. ఇప్పుడు ఆ ఆశా, నమ్మకం సన్నగిల్లి పోతున్నాయి. విరహం స్థానం లో వేదన, నిరీక్షణ నిండిన కళ్ళల్లో నిరాశా నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. గుండెల్లో బాధ, రగులుతున్న అగ్ని గుండం లా.
అమ్మా, నాన్నా, సౌజన్యా, శ్రీధర్ ఎవరేం చెప్పినా వినలేదు. పక్కవాళ్ళు ఎదురు వాళ్ళు కొలీగ్స్ విమర్శలతో గురి చూసి బాణాలు విసిరినా పట్టించుకోలేదు. ఆఖరికి తోడబుట్టిన తమ్ముడు తనని పలకరించక పోయినా ఎక్కువగా బాధపడలేదు. ఈ చింతలన్నింటి కీ సురేష్ పరిష్వంగం లో సేద తీరింది.
కానీ ఇప్పుడు సురేష్ తనని అవమానిస్తున్నాడు. నిర్లక్ష్యంతో దూరం అవుతున్నాడు. తననో అంటరానిదానిలా అతని కుటుంబాన్నించి , అతని వ్యక్తిగత జీవితాన్నించి వేలేస్తున్నాడు. ఈ బాధ ఎవరికీ చెప్పుకోవాలి? శ్రీధర్ మాటలు గుర్తొచ్చాయి. రేపు నువ్వెవరివి? అని నీ అంతరాత్మ నిలదీస్తే ఏం జవాబిస్తావు? రమాకాంత్ కూతురివా? సురేష్ భార్యవా?"
"నిజమే! తనేవరు? తన ఉనికి ఏమిటి? ఈ సమాజంలో తన స్థానం ఏమిటి?
ఒకరి భార్య గానో, మరొకరి కూతురి గానో , ఓ కుటుంబానికి కోడలిగానో తప్ప రమ్యగా తనకేం స్థానం లేదా ఈ సమాజంలో? గౌరవం లేదా? ఎంతసేపటికి స్త్రీ కుటుంబ వ్యవస్థలో కుదించుకు పోయి బతకాలె తప్ప స్వతంత్రంగా , తనదైన ఓ ప్రత్యెక స్థానం ఈ సమాజంలో కల్పించుకునే అవకాశం లేదా? తనకి జీవితం ఓ తీయటి పాటలా ఉండాలని కోరిక.
తనకిష్టమైనప్పుడు , తీరిక ఉన్నప్పుడు ఆ వాంఛ కలిగినప్పుడే ఆ పాటలోని తీయదనాన్ని ఆస్వాదించాలని అనిపిస్తుంది కానీ ఇదేంటి? ఈ సమాజం తన కిష్టమైన పాట వినవద్దని శాసిస్తుందేం? అలా శాసించే హక్కు ఈ సమాజానికి ఎవరిచ్చారు? బతికితే రమాకాంత్ కూతురి గా లేదా మరో వ్యక్తీ భార్యగా బతుకు అని అంటారేం వీళ్ళంతా.... ఎందుకలా బతకాలి? అవును ఎందుకలా బతకాలి? తను రమ్య అంతే! రమ్యగానే బతుకుతుంది.
***