యాక్సిడెంట్
మంచు కురుస్తోంది... అయినా లోపలికి వెళ్లాలని పించడం లేదు.
నా గుండెల్లో రగులుతున్న మంట చలిని కస్చుకున్నట్టు వెచ్చగానే అనిపిస్తోంది.
జరిగిన సంఘటన తాలూకూ షాక్ నుంచి నేను బైట పడలేదు. పడలేను కూడా. ఆ షాక్ లో నా కాళ్ళు చచ్చుబడినట్టు అయినాయి. సర్వశక్తులు నన్ను అసహ్యించుకుని వదిలేసి వెళ్లినట్టు నిస్సత్తువగా మారిపోయాను.
ఎలాగోలా మంచం మీంచి లేచి బాల్కానీ లో నిలబడ గలిగాను కానీ, ఇక్కడి నుంచి మాత్రం అంగుళం కూడా కాదల్లెను అనిపిస్తోంది. కదలలేక పోతున్నాను. ఎదురుగా ఉన్న పార్క్ లో ఏపుగా ఎదిగిన చెట్లు నన్ను చూస్తూ వికటంగా నవ్వుతూ పరిహాసం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. గాలి, పగలబడి నవ్వుతూ నానుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా నిలువునా ముచ్చెమటలు పోశాయి. నాకళ్ళ ముందు నా బెడ్ రూమ్, బెడ్ రూమ్ నున్చిఒ పక్కగా డైనింగ్ హాల్, దాన్నానుకుని కిచెన్... నాకిప్పుడు ఎలాగో కనిపిస్తున్నాయి. ఆ పరిసరాలన్నీ చాలా అపరిచితంగా అనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ళుగా నాది అనుకున్న ఆ సామ్రాజ్యం నాది కానట్టు అందులోనేనిప్పుడు ప్రవేశం కోల్పోయినట్టు అనిపిస్తోంది.
ఆ పవిత్రమైన ప్రదేశాల్లో నా పాదం మోపలేను మహాపాపం నేను చేశాను. చూపుతిప్పుకుని కిటికీ వైపు చూశాను. కిటికీ లోంచి బెడ్ మీద నలిగిన దుప్పటి నన్ను చూసి వికటాట్టహాసం చేస్తోంది? నో...కళ్ళు మూసుకుని కిటికీ రెక్క ధభాల్న వేసేశాను.
ఎంత దారుణం జరిగింది? అసలెలా జరిగింది? ఇలా జరగడానికి నేనెంతవరకూ బాధ్యురాల్ని? ఈ పాపంలో నా పాత్ర ఎంత? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం ఎవరు చెప్తారు? చెప్పగలిగితే ఒక్కరే చెప్పగలరు. ఆ ఒక్కరు ఎవరో కాదు. నా భర్త. నిజమే ఆయనే చెప్పగలడు. ఎంతో మంచివాడు. సహృదయుడు. నిజాయితీ పరుడైన నా భర్త.
అవును అతడే నా పట్ల న్యాయమూర్తిగా వ్యవహరించి నేను చేసిన అపరాధాన్ని క్షమించగలరో, శిక్షించగలరో నిర్ణయించేది. నిర్ణయించాల్సింది.
ఎంతటి ఘోరం నేను చేసింది? ఎంతటి మహాపరాధం!
సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలియకుండా జరిగిపోతుంటాయి. వాటి తాలుకూజ్ఞాపకాలు మాత్రం చిత్రవధ చేస్తాయి. జీవితాలను చిందర వందర చేస్తాయి. అందుకేనేమో ఓ అనుభవజ్ఞుడు జీవితాన్ని యాక్సిడెంట్ తో పోల్చాడు. ప్రమాదంలో ఏర్పడే గాయాలే జీవితంలో జరిగే విషాదాలు. ఆ గాయాల మచ్చలు ఎన్నటికీ మానిపోకుండా నిరంతరం జరిగిన ప్రమాదాన్ని తల్చుకుంటూ , మరో ప్రమాదం జరక్కుండా మనల్ని మనం కాపాడుకోడానికి దోహదం చేసే గుర్తులు కాబోలు!
ఏది ఏమైనా ఈరోజు నా జీవితంలో జరిగింది మాత్రం మేజర్ యాక్సిడెంట్.
జరిగిన యాక్సిడెంట్ నా హృదయానికి చాలా పెద్ద గాయమే చేసింది. ఆ గాయం తాలుకూ మచ్చ నామీదే కాదు నా కుటుంబం మీద కూడా శాశ్వతంగా ఉండి పోతుంది.
ఎలా నేనేం చేయనిప్పుడు? ఈ పాపాన్ని ప్రక్షాళనం చేసుకునే మార్గం ఏమిటి? తల పగిలిపోయే ఆలోచనలు. పవిత్రమైన స్నేహాన్ని అశాశ్వతమైన క్షణ భంగురమైన శారీరక సుఖం కోసం అపవిత్రం చేసిన అతడిని నేను క్షమించలేను. అలా అని అతని పైన ఏం చర్య తీసుకోగలను? అతనికి ఏ శిక్ష విధించగలను.
నిజం చెప్పాలంటే ఇవాళ జరిగిన సంఘటనలో నా తప్పు ఎంత మాత్రం లేదని నా అంతరాత్మ ఘోషిస్తోంది. ఈ మనిషిని నమ్మడమే నేను చేసిన తప్పు.
ఈ మాట నేనే కాదు విషయం తెలిశాక నా భర్త , నా పిల్లలు , ఈ సమాజమూ కూడా నన్నే నిందిస్తారు. ఎందుకంటె నేను స్త్రీని స్త్రీకి తరతరాలుగా ఈ సమాజం ఎన్నో పరిమితులు విధించింది. నేను వాటిని అతిక్రమించాను. అందుకే భగవంతుడు నాకీ శిక్ష వేశాడు.
ఒక స్త్రీగా సమాజం గీసిన లక్ష్మణ గీతని దాటకూడదు. కానీ, దాటాను. యాభైకి చేరువ అవుతూ కూడా అందం పట్ల , ఆకర్షణ పట్ల ఆసక్తి చూపించాను పెద్దదానిలా , ఓ తల్లిలా , ఇల్లాలి లా హుందాగా ప్రవర్తించ కుండా అతనిని రెచ్చ గొట్టేలా ప్రవర్తించి ఉంటాను. అందుకే అతను అవకాశం తీసుకున్నాడు. అవును అతను మగాడు. మగాడు ఆడదానితో పవిత్రమైన స్నేహాన్ని ఎన్నడూ ఆకాంక్షించడన్న నగ్న సత్యం నాకిప్పుడే తెలిసింది. చాలా ఆలస్యంగా తెలిసింది.
అతనికి చనువు ఇవ్వడం నా తప్పు. అవును చనువిచ్చే ముందు నేను నా వయసు గురించి , నా కుటుంబ నేపధ్యం గురించి ఆలోచించాను కానీ, అతని వయసు గురించి నేను ఆలోచించలేదు. బహుశా అదే నేను చేసిన తప్పు కావచ్చు.
అదేంటో ఇంతకాలం నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను అనుకున్నాను. నిజం చెప్పాలంటే అయన నన్ను ప్రేమగా గానీ, మొహంతో గానీ తాకి ఎంత కాలమైంది! వ్యాపారం పనుల్లో తలమునకలుగా ఉంటూ బాగా పొద్దుపోయాక అలసిపోయి ఇంటికి వచ్చే ఆయనకి విశ్రాంతి కలగచేయడమే నా లక్ష్యంగా భావించాను. రకరకాల సమస్యలతో చికాగ్గా వచ్చే ఆయనని, నా చేతి వేళ్ళతో సున్నితంగా స్పృశించి వేళ్ళ సందుల్లోంచి అనురాగ దారాలు కురిపిస్తూ సాంత్వన కలిగించడమే భార్యగా నా ధర్మం అనుకున్నాను. అయన నన్ను శారీరక సుఖం కోసంవేదించనే వేధించరు. బహుశా ఆయనకి సంపాదన ధ్యాస తప్ప, సుఖాల పట్ల వ్యామోహం లేకపోవడం చేతేమో. నాకు ఆ ధ్యేసే రాలేదు. పిల్లల పెళ్ళిళ్ళు అయి వాళ్ళు రెక్కలు విదిల్చి యెగిరి పోతుంటే విస్మయంతో చూస్తూ ఉండిపోయాను. వంటరిదాన్ని అయానని విషాదం లో మునిగిపోయాను.
కానీ...కానీ ఇదేంటి ఇలా జరిగిందేమిటి? నేను మర్చిపోయాననుకున్న అనుభూతులను అతను తట్టి లేపుతుంటే నా వయసు నాకెందుకు గుర్తు రాలేదు. ఆ స్పర్శ తో కొత్త లోకాలకి ద్వారాలు తెరిచినట్టు ఎందుకైంది? నేనింత బలహీనురాలినా? ఎలా? ఎలా జరిగింది? ఇంతకాలం కాపాడుకున్న నా నైతిక విలువలని ఆ ఒక్క క్షణం నేనెందుకు దిగజార్చాను?
ఎందుకు? ఎందుకలా జరిగింది?
సాధారణంగా ప్రయాణం లో అప్రమత్తంగా లేకపోతె ప్రమాదాలు జరుగు తాయంటారు.
కానీ, నా జీవన యానం లో ఏంతో అప్రమత్తంగా ఉన్నాను. ప్రతి క్షణం నన్ను నేను కాపాడుకుంటూ, దాదాపు 35 సంవత్సరాలుగా ఎంతో జాగ్రత్తగా ఉన్నాను. ఇలాంటి ప్రమాదాలు ఎన్నెన్నో జరిగే పరిస్థితుల నుంచి చాకచక్యంగా బైట పడుతూ ఇవాళ జీవితపు చివరి దశకు వచ్చాను. అనుకుని తృప్తిగా అనుకునే లోగా నా ఆత్మవిశ్వాసం మీదా, నా సిద్దాంతాల పట్లా, నా వ్యక్తిత్వం మీదా దారుణమైన దెబ్బ తగిలింది.
నేనింక నా వాళ్ళ కేవరికీ మొహం చూపించలేను. ఇంతకాలం నా సిద్దంతాలకి, నాలోని విలక్షణ మైన వ్యక్తిత్వానికి గర్వపడుతూ బతికిన నేనివాళ ఓ అపరాధిలా నా వాళ్ళందరి ముందూ తలవంచుకుని నిలబడే స్థితికి వచ్చాను. జరిగిన సంఘటన వలన ఎంతో అన్యోన్యంగా , అపురూపంగా సాగిపోతున్న నా దాంపత్య జీవితంలో తుఫానురేగుతుంది. నా సంసార నావను తల్లకిందులు చేసి, ముంచేస్తుంది. అయన ఎంత మంచివారు? వీధిలోకి వెళ్ళినా, ఇంట్లోకి మరొక స్త్రీ వచ్చినా తలెత్తి కూడా చూడని గుణాభిరాముడు. అలాంటి రాముడికి నేను భార్యగా ఇంక ఎలా బతకగలను? సీతమ్మ లాంటి పవిత్రురాలు పుట్టిన ఈ గడ్డ మీద నాలాంటి చపలచిత్తురాలు.... ఛీ, ఛీ నాకింక చావే శరణ్యం. కానీ, కానీ నాకు చావాలనిపించడం లేదు. అయన నన్ను క్షమించి చేరదీస్తే అయన భార్యగా, ముత్తైదువుగా హాయిగా పిల్లల సమక్షంలో దర్జాగా చనిపోవాలని ఉంది. అయినా నేనిలా ఎలా అయ్యాను?
ఓణీలు వేసుకుంటున్న రోజుల నుంచీ నా అందానికి ముగ్ధులై పిచ్చివాళ్ళ అయి నా వెంట తిరిగిన ఎందరినో తప్పించుకుని నన్ను నేను రక్షించుకుంటూ ఓ సంస్కార వంతుడికి ఇల్లాలి నై అతని ప్రేమానురాగాల జలధి లో తలమునకలుగా మునిగిపోయి, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను. అనుకూల దాంపత్యం , ముత్యాల్లాంటి పిల్లలు, ఇద్దరు పిల్లలు ఇంజనీర్లయ్యారు. మగపిల్లలు కావడంతో ఎక్కువ బాధ్యత కూడా నామీద పడలేదు. పెద్దవాడు తనంతట తానుగా అమెరికా వెళ్ళిపోయాడు. భార్య ని తీసుకుని. అమ్మా నాన్నల్ని కనిపెట్టుకుని ఇక్కడే ఉంటానన్న రెండో వాడిని వాడి భార్య బలవంతంగా లండన్ తీసి కెళ్ళి పోయింది.
పిల్లలిద్దరూ లేకపోవడంతో జీవితం శూన్యంగా మారినట్టనిపించింది.
ఇంతకాలం అయన వ్యాపార పనులతో ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా ఏమీ మాట్లాడని నేను ఆయన్ని వేధించడం ప్రారంభించాను . అయన ఎంత ఓదార్చినా వంటరితనం నన్ను భయపెడుతోంటే , ఆయన్ని మూడు రోజుల పాటు కదలకుండా ఖైదీని చేశాను. ఇంట్లో "ఇలా ఇంట్లో ఎంత కాలం ఉంటాను. బిజినెస్ దెబ్బతింటుంది. నీకేదైనా వ్యాపకం కల్పిస్తాను. దిగులు పడకు" అంటూ వ్యాపారం అనే వ్యాపకంలో పడేశారు అయన. అది అయన చేసిన నేరం. ఆ నేరానికి శిక్షగా నేనీ వయసులో నైతికంగా దిగజారి పోయాను పతనమై పోయాను.