Previous Page Next Page 
ఒప్పందం పేజి 8


    "రాడు కదూ!" శ్రీధర్ నవ్వాడు. "పిచ్చి రమ్యా! ఎక్కడికక్కడ నాకిదే బావుంది , నేను ఫ్రీగా ఉండచ్చు. అనుకుంటూ రాజీపడిపోతూ బతుకుతున్నావు. కానీ నువ్వేం కోల్పోతున్నావో నీకర్ధం కావడం లేదు. నీ నిర్ణయం.... నీకు సమంజసం గా అనిపించవచ్చు. సమాజాన్ని లక్ష్య పెట్టాల్సిన అవసరం నీకు లేకపోవచ్చు. కానీ నీ అంతరాత్మ కి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకసారి వస్తుంది. నువ్వెవరివి? రమాకాంత్ కూతురివా? సురేష్ భార్యవా? అన్న సమస్య ఎదురైనప్పుడు నువ్వెవరివో తేల్చుకోలేక సతమతమవుతావు...." శ్రీధర్ కాఫీ ఆర్డరిచ్చి మళ్ళీ అన్నాడు . "రమ్యా! జీవితం స్వాతిచినుకులాంటిది. ఈ ఉపమానం చాలాసార్లు వినే ఉంటావు. జీవితం నీటిబొట్టు లా అవిరవాలని కోరుకునేవాళ్ళు మూర్ఖులు. స్వాతి ముత్యం లా ప్రకాశించాలనుకునే వాళ్ళు అందుకు కృషి చేసేవాళ్ళు వివేకవంతులు. రమ్య వివేకం, మీద నాకు నమ్మకం ఉంది. ఫెమినిజం పేరుతొ అర్ధం లేని స్వేచ్చ కోరుకుని , అర్ధ విహీనమైన జీవితం గడుపుతున్నావు. నీ వివేకం మేల్కొని నీకేం కావాలో అంతరాత్మ సాక్షిగా తెలుసుకున్న రోజున నా సహాయం నీకుంటుంది. నేను నీ అంత చదువుకోలేదు. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాడిని. అయినా జీవితాలన్నీ చదివిన వాడిగా నీకు సలహా లిస్తున్నాను. "మన సిద్దాంతాలు మన జీవితాన్ని అందంగా... ఆహ్లాదంగా మలచాలి- విమర్శనాత్మకంగా కాదు" రమ్య నిశ్శబ్దంగా సంభ్రమంగా వింటోంది శ్రీధర్ మాటల్ని.
    "చాలా బాగా మాట్లాడావు శ్రీధర్.నాకు సాయం చేస్తానన్నందుకు చాలా థాంక్స్. కానీ నువ్వు భయపెట్టినంత వికృతంగా నా జేవితం మారదనీ ఆశిస్తాను.నా జీవితం నా స్వేచ్చని హరించేది కాకూడదు."
    "ఎందుకలా అనుకుంటున్నావు? నీ స్వేచ్చ ని నువ్వు కాపాడుకుంటూ నీ ఆత్మాభిమానాన్ని పదిల పరచుకుంటూ గడిపే లాగ పెళ్ళికి ముందే మాట్లాడు కోవాలి."
    "బాగుంది పెళ్ళంటే అగ్రిమెంటా?"
    "కలిసి బతకడం లో కూడా మీకో అగ్రిమెంట్ ఉందిగా?"
    "అది వేరు...."
    "ఎలా అవుతుంది? జీవితమే ఓ అగ్రిమెంట్ ఒప్పందం. ఈ ఒప్పందం అనేది ఆటవికుల నుంచి నాగరికుల దాకా అందరి మధ్యా ఉన్నదే."
    "మొత్తానికి నేను చేస్తున్నది తప్పు అని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నావా?" అంది రమ్య.
    శ్రీధర్ నవ్వుతూ "ఎలాగైనా అనుకో... కానీ ఓ విషయం గుర్తుంచుకో. నీకీ బతుకు మీద విముఖత కలిగినప్పుడు , భవిష్యత్తు గురించిన సలహా కోసమైనా, నేనున్నానని మర్చిపోకు."
    రమ్య కృతజ్ఞత గా చూసింది.
    "చాలా సంతోషం శ్రీధర్. కనీసం నువ్వైనా నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇంతసేపు మాట్లాడావు. పైగా అన్నివేళలా నేనున్నానంటూ నీ స్నేహ హస్తం నాకందిస్తున్నావు థాంక్యూ సోమచ్."
    శ్రీధర్ లేచాడు. "నీ మొహం , మనలో మనకి కృతజ్ఞత లేమిటి?' రమ్య కూడా లేచింది. రమ్యని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేశాడు. లోపలికి  రమ్మంది. తరువాత వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
    కారు కనుమరుగైందాకా చూసి పైకి వెళ్ళిన రమ్య బాల్కనీ లో నిల్చున్న సురేష్ ని చూసి ఆశ్చర్యంగా అడిగింది.
    "అరె! ఎంతసేపైంది వచ్చి" తాళం తీసింది.
    సురేష్ జవాబివ్వలేదు. రమ్య లోపలికి నడిచి లైటు వేసింది. సురేష్ మొహం అసహనంగా ఉంది. "ఆఫీస్ కి ఫోన్ చేస్తే మధ్యాహ్నమే వెళ్ళావని చెప్పారు. ఎక్కడి కెళ్ళావు?"
    "శ్రీధర్ వచ్చాడు బైటి కెళ్ళాం...."
    "బైటి కంటే....?"
    అతనడిగిన తీరుకి తలతిప్పి అతని మొహం లోకి చూస్తూ చెప్పింది "హోటల్ కి"
    'ఇంతసేపా!" వాచీ చూసుకుంటూ అన్నాడు.
    "ఏదో మాట్లాడుతూ కూర్చున్నాం. అయినా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఏమిటి?' చిలిపిగా అతని క్రాఫ్ చెరిపేస్తూ అంది.
    సురేష్ సీరియస్ గా అన్నాడు.
    "మొన్న కనిపించినా పలకరించని వాడు ఇవాళ ఆఫీస్ కి ఎందు కొచ్చినట్లు" పైగా ఇంతసేపు అతనితో హోటల్లో గడపడం నీ పద్దతి నాకేం నచ్చలేదు."
    "వ్వాట్!' రమ్య ఆశ్చర్యంగా చూసింది.
    "ఏమిటి సురేష్ ఉద్దేశ్యం! మగాడిగా అనుమానిస్తున్నాడా? భర్తగా అధికారం చెలాయించాలని చూస్తున్నాడా?"
    విసురుగా అంది "నేను హోటల్లో గడపాను కానీ హోటల్ రూమ్ లో కాదు."
    
    "రమ్యా! చూడు , ఆడది పెళ్ళి చేసుకుంటే గౌరవం, పెళ్ళి చేసుకోకుండా ఒకే మగాడితో బతికితే అదో రకం... అంతేకాని ఇలా ఎవరితో పడితే వాళ్ళతో హోటల్స్ కి వెళ్ళడం , సినిమాలకి తిరగడం , ఇంటికి తీసుకురావడం నాకు నచ్చదు."
    "కానీ నాకు నచ్చుతుంది. నీకు నచ్చదని నేను మానాలా? సురేష్! మన అగ్రిమెంట్ లో ;లేని విషయాలు మాట్లాడద్దు ప్లీజ్..." తీవ్రంగా అంది.
    "ఏంటి అగ్రిమెంట్ .....పెమించేప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నామా? మనం సొసైటీ లో బతుకుతున్నాం. గుర్తుంచుకో.
    రమ్యకి చిర్రేత్తు కొచ్చింది.
    "ఏంటి గుర్తుంచుకోనేది నాకు తెలుసు నేను సొసైటీ లో బతుకుతున్నానని, అయినా నీకేమైంది ఇవాళ? పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకిలాంటి అనవసరమైన పెత్తనాలు ఇష్టం ఉండవని తెలుసుగా నీకు. ఉండు కాఫీ ఇస్తాను" అక్కడితో సంభాషణ తుంచేస్తూ లేచింది రమ్య.
    సురేష్ కూడా లేచాడు. కాఫీ అక్కర్లేదు. వెళ్తున్నాను."
    "ఎందు కొచ్చావసలు?"
    "నిన్ను చూడాలనిపించింది వచ్చాను. చూశాను. కడుపు నిండింది వస్తాను."
    రమ్య మనసు విలవిలలాడింది. ఇవాళ అతనితో ఉండాలని పిస్తోంది. శ్రీధర్ తో మాట్లాడినవన్నీ అతనికి చెప్పాలని ఉంది. సురేష్ సాన్నిధ్యం లో తను వారం రోజుల నుంచీ పడిన మానసిక క్షోభకు సాంత్వన పొందాలని ఉంది. అందుకే మరోసారి ఓడిపోతున్న స్త్రీత్వం తో లాలనగా అంది.
    'అనవసరమైన విషయాలు తీసుకొచ్చి అమూల్యమైన మనకాలం పాడు చేయకు సురేష్. ఇవాళ ఉండిపో ప్లీజ్ " అంది.
    "కుదర్దు" అయినా మన అగ్రిమెంట్ ప్రకారం నేను శుక్రవారం గాఉండాల్సింది." మాములుగా అన్నా అతని స్వరంలో వెటకారం రమ్య మనసుని గాయం చేసింది.
    "దెప్పి పోడుస్తున్నావా?"
    "దెప్పి పోడుపెంటి? నువ్వు నేర్పిందేగా" నిర్లక్ష్యంగా అన్నాడు.
    "సరే వెళ్ళు నీకు మనసు కుదురు పడ్డాకే రా" నిర్లిప్తంగా అంది. సురేష్ వెళ్ళిపోయాడు. రమ్య గుండెల మీంచి అడుగులేస్తూ.
    మర్నాడు ఆ మర్నాడు వారం దాటింది సురేష్ రాలేదు.
    రమ్య మనసులో దిగులు. అటు తల్లిదండ్రులతో, ఇటు సమాజంతో సవాల్ చేసి తను స్వీకరించిన ఈ జీవితంలో తను ఒడి పోబోతోందా? ఏంటో తెలివైంది వివేక వంతురాలు అన్న గర్వంతో తనేంచుకున్న సురేష్ కూడా మామూలు మనిషేనా? అతనిలో ప్రత్యేకమైన సంస్కారం, ధైర్యం, తెగింపు , ప్రేమించిన తన కోసం త్యాగం చేయాలన్న తపన ఏమీ లేవా? తన మీద అతనికి ఉన్నది ప్రేమ కాదా? అదే అయితే.... ఆ ప్రేమ ఇంత త్వరగా బలహీనపడిందేం? ఇలా నిర్వీర్య మైపోయిందేం?రమ్య మనసులో ఆలోచనలు అదిల్చిన తేనెపట్టు నుంచి గుంపుగా చెదిరిన తేనెటీగల్లా ముసురుకున్నాయి. ఇదివరకులా మళ్ళీ ఆ జీవితం పొందలేదా.... తన ప్రేమ సామ్రాజ్యం శిధిలం కాబోతోందా?
    నో! అలా కాకూడదు. రమ్య గబగబా వెళ్ళి సురేష్ నెంబరు డయల్ చేసింది. ఎంతో ఆరాటంతో పలకరించిన రమ్యతో ముభావంగా, ముక్తసరిగా మాట్లాడాడు.
    రమ్య చాలా బాధపడింది. ఆత్మాభిమానం చంపుకొని తనే బతిమాలుతోంది. ప్రతిసారీ, కారణం, సురేష్ తనవాడని. కానీ ఇదేంటి?
    రమ్య ఆఫీసులో లోన్ తీసుకుని కెనేటిక్ హోండా కొనుక్కుంది. ఆరోజు ఆఫీసు నుంచి వస్తోంటే సౌజన్య ఆమె భర్తా కలిశారు.
    "సినిమాకు వెళ్తున్నాం నువ్వూ రాకూడదూ?" అంది సౌజన్య.
    రమ్య మృదువుగా నిరాకరించింది.
    ఆదివారం వాళ్ళింటికి రమ్మని మరీ మరీ ఆహ్వానించారు దంపతులు.
    ఆదివారం సురేష్ రాలేదు. రమ్య సౌజన్య ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది.
    గుమ్మంలో అడుగు పెట్టగానే ఘుమఘుమ లాడే సాంబారు వాసనే కాక కళకళలాడే వారి దాంపత్యం కూడా రమ్య మనసుని దోచింది.
    సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాక కిరణ్ ని వదిలేసి స్నేహితురాళ్ళు ఇదరూ పెరట్లో కూర్చున్నారు.
    "ఎలా ఉందే నీ జీవితం?" అడిగింది సౌజన్య.
    రమ్య చిరునవ్వుతో అంది. "ఎలా ఉంటుంది? అనుకున్నట్టుగానే.
    "మరైతే ఎలా? అలవాటుపడ్డావా? ఎదిరిస్తున్నావా?"

 Previous Page Next Page