అది విన్న రమణమూర్తి అక్కడే కుప్పకూలిపోయాడు.
సబ్ ఇన్స్ పెక్టరు అలా అనగానే మళ్ళీ పెద్దపెట్టున ఏడవడం మొదలెట్టింది జానకి.
"నాకు తెలుసండీ! ముడుపుకట్టిన నగలు ఎప్పుడు పోయాయో, అప్పుడే అర్ధమైపోయింది నా బంగారు కొండ నాకింక దొరకదని! దిక్కులేని వాళ్ళకు దేముడే దిక్కంటారు. ఆ దేముడికే మనమీద దయలేకపోతే ఇంక మనకు దిక్కెవ్వరండీ!"
"ఊరుకోజానకీ!" అన్నాడు రమణమూర్తి బొంగురు పోతున్న గొంతుతో ---
అప్పుడు వచ్చాడు సుందరరావు.
"సార్!" అన్నాడు భయంగా.
ప్రశ్నార్ధకంగా చూశాడు యస్సై.
"మాఇంట్లో పనిచేసే నరేష్ రెండ్రోజుల నుంచి కనబడటం లేదండీ!"
"మీ ఇంట్లో పనిచేసే కుర్రాడా? ఇంట్లో వస్తువు లేమన్నాపోయాయా?" సుందర్రావు బుర్ర గోక్కున్నాడు.
"పోయాయా అంటే వెంటనే చెప్పలేమండీ. మా యిల్లు మహాకంగాళీగా ఉంటుంది. బనీన్లూ, చేతిగుడ్డలూ కూడా ఏ రోజుకారోజు గంట సేపు వెదికితే గాని దొరకవు. ఏమైనా పోయాయేమో రెండ్రోజులు పోతేగానీ తెలియదు."
"ఎన్నేళ్ళు వాడికి?"
"పదహారండీ."
"వాడు రెండ్రోజులనుంచి కనబడటంలేదంటున్నారు. పోలీసు స్టేషన్ రిపోర్టు ఇవ్వలేదా?" అన్నాడు యస్సై.
ఇబ్బందిగా చేతులు నులుముకున్నాడు సుందర్రావు "లేదండీ!"
"ఎందుకని?"
"వాడు ఇంతకు ముందుకూడా ఒకసారి ఇలాగే చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడండీ!"
"ఎక్కడికి?"
"మెడ్రాసుకండీ!"
"ఎందుకు?"
"సినిమాల్లో చేరడానికికండీ!"
అంతసీరియస్ పరిస్థితిలోనూ, అక్కడ నిలబడి ఉన్న కొంతమంది మొహాల్లో నవ్వు మెదిలింది.
"సినిమాల్లో చేరాడా?" అన్నాడు యస్సై.
"చేరితే మళ్ళీ వెనక్కెందుకు వస్తాడండీ?"
"సృజన కోసం!" అన్నారెవరో.
ఇంకెవరోనవ్వారు.
"సృజన కోసమా? అదేమిటి?" అన్నాడు యస్సై.
"వాదివన్నీ సినిమా పోకిళ్ళు! నువ్వు పెద్దయితే హీరోయిన్ లా ఉంటావ్. అని ఒకసారి సృజనతో చెప్పాడుట. ఆ అమ్మాయియింట్లో చెప్పింది. తర్వాత నలుగురంకలిసి వాడి మొహంవాచేటట్లు చివాట్లు పెట్టాం" అన్నాడు సుందర్రావు.
"ఐసీ!" అన్నాడు యస్సై సాలోచనగా" ఇదొక కొత్త యాంగిలు! ఈ పద్దతిలో ఆలోచిస్తూ ఒక ట్రయిల్ వేసి చూడొచ్చు మనం"
"అంటే?" అన్నాడు రమణమూర్తి పెద్దగా "అంటే నరేష్ గాడుమా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడంటారా? వాడ్ డూ యూ మీన్?"
"ప్లీజ్! దర్యాప్తు జరుపుతున్నప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించవలసి వస్తుంది నో అఫెన్స్ ఇన్ టెడ్ డెడ్!" అన్నాడు యస్సై.
కొంచెం తగ్గాడు "అలా జరిగి ఉంటుందని నేను అనుకోను" అన్నాడు. బలహీనంగా తన కూతురు ఒక జులాయివెధవతో కలసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుందన్న ఆలోచనే దుర్భరంగా ఉన్నా, దానితోబాటు, కూతురు ఎక్కడోఒకచోట సురక్షితంగా ఉండి ఉండవచ్చునన్న ఊహ అతనికి కొద్దిగా ఊరటని కూడా కలిగించింది.
"చెప్పలేం!" అన్నాడు యస్సై నాన్ కమిటల్ గా, "ఓకే! ఇంక మాప్రయత్నంలో మేం ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి."
యస్సై వెళ్ళిపోయాక మళ్ళీ చర్చ మొదలైంది.
"మన ఆశకు మళ్ళీ ఊపిరి" అన్నాడు రమణమూర్తి.
దిగులుతో తల అడ్డంగా ఊపింది జానకి.
"నాకు తెలుసండీ! ఇంక మళ్ళీ మన అమ్మాయి మనకు దక్కుతుందనుకోవడం ఉత్త భ్రమ!"
"నోరెత్తితేచంపుతా!" అన్నాడు రమణమూర్తి హఠాత్తుగా సహనం కోల్పోతూ.
"అమ్మాయి దొరకకూడదని నీకే కోరిగ్గా ఉన్నట్లుంది చూడబోతే! లేకపోతే అపశకునపు అక్కుపక్షిలా నిమిషానికోసారి అమ్మాయి దొరకదు. అమ్మాయి దొరకదు అని డిక్లేర్ చేస్తావేమిటి? వెధవ్వాగుడు వాగితే పీకపిసుకుతా!"
అతని కేకలు విని విస్మయంగా తిరిగి చూశారు అందరూ.
ఎప్పుడూ సౌమ్యంగా ఉండే భర్తలో ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయింది జానకి.
మరుక్షణంలోనే తనని తాను నిగ్రహించుకున్నాడు రమణమూర్తి "ఐ యామ్ సారీ జానీ! బాధతో ఒళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నాను, ఏమనుకోకేం!"
"మీరు రెస్ట్ లెస్ గా ఉన్నారు. లోపలికి వచ్చి కాసేపు పడుకోండి. మీరు లేచేసరికి మనమ్మాయి గురించి ఇన్స్ ఫర్మేషన్ ఏదో ఒకటి తెలియవచ్చు" అంది జానకి మెల్లిగా.
తన మాటలమీద తనకేనమ్మకం లేనట్లు చెబుతున్న జానకి వైపు విషాదంగా చూశాడు రమణమూర్తి. కాలం ఆగిపోయినట్లు అనిపిస్తున్నా గంటలు గడిచిపోయాయి.
గుండెలు పిండేసి ఆ దుఃఖాన్ని తాత్కాలికంగానైనా మర్చిపోవాలంటే ఊపిరాడని పనిలో జొరబడిపోవడం కంటే వేరే మార్గం లేదనిపించింది జానకికి. గుండెరాయి చేసుకుని లేచి నిలబడి, భర్తవైపు చూసింది అతను గోడకి జేరగిలబడి, రెప్పవెయ్యడం మర్చిపోయినవాడిలా వీధి గుమ్మంవైపే చూస్తున్నాడు.
కప్ బోర్డు దగ్గరికి వెళ్ళింది జానకి. నేలమీద గుట్టగా పడివున్న బట్టలు ఒక్కొక్కటిగా తీసి, ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, మడత పెట్టింది. తర్వాత, గంగా వెర్రులెత్తినదానిలా, ఒకటి తర్వాత ఒకటిగా పనులు చెయ్యడంమొదలెట్టింది.
ఇల్లంతా చిమ్మింది. మూడ్రోజులనుంచి పేరుకు పోయినమాసిన బట్టలన్నీ తడిపి, రేవులా ఉతకడం మొదలెట్టింది. తర్వాత, నల్లగా మసిబారిన నీళ్ళకాగుని ముందేసుకుని, తన ఆక్రోశాన్నంతా చీపురు కట్టి బూజు దులపడం మొదలెట్టింది.
తనని తాను శిక్షించుకుంటున్నట్లు బండ చాకిరీ చేసుకుపోతున్న జానకిని వారించడానికికూడా ఎవరికీ ధైర్యం చాలకపోయింది. చీకటిపడుతుండగా మళ్ళీ రోడ్డుమీద సందడి వినబడింది.
స్విచ్ వేస్తే ఎలక్ట్రిసిటీ ప్రవహించినట్లుగా ఒక్కసారిగా ఆశ అందరి నరనరాల్లో పరిగెత్తింది. అందరినీ పరుగులెత్తించింది.
పెద్దగుంపుపోగయి ఉందని సుందర్ ఇంటిముందు. ఆ గుంపు మధ్య బిక్కుమని ఉన్నాడు నరేష్, సుందర్ ఇంట్లో పనిచేసే కుర్రాడు. ఎడమ చెయ్యి చెంపకు అడ్డంగా పెట్టుకుని ఉన్నాడు. మళ్ళీ ఇంకో దెబ్బపడుతుందేమోనని బెదిరిపోతున్నట్లు.
కానీ ఈసారి దెబ్బ అతని చెంపమీద పడలేదు. ఎవరో కాలుఎత్తి బలంగాతన్నారు.
దభేల్న కిందపడ్డాడు నరేష్. ఫుట్ పాత్ అంచుని వరసగా పేర్చి ఉన్న రాళ్ళ అంచునుదుటికి తగిలింది. బొటబొట రక్తం కారడం మొదలెట్టింది.
పడి ఉన్న నరేష్ ని కాలర్ పట్టుకుని లేవదీశాడు రమణమూర్తి. పిడికిలిబిగించి డొక్కలో గుద్దాడు.
"దొంగవెధవా! చెప్పు ఎక్కడుంది నా సృజన! చెప్పరా?"
వెంటనే జారి రమణమూర్తికాళ్ళు పట్టుకున్నాడు నరేష్, "సార్సార్! నాకేం తెలీదుసార్!"
"ఊరికే చెప్పడు వెధవ! వెయ్యండి నాలుగు!" అన్నాడు సుందర్.
మళ్ళీ ఫట్ మని కొట్టారెవరో నరేష్ కి నలుగు పళ్ళు కదిలాయి. నోరంతా రక్తంతో ఎర్రగా అయింది.
"సార్! నే చెప్పేది వినండి సార్!"
నరేష్ జుట్టు పట్టుకులాగి మోకాలుతో వెన్నుమీదకొట్టాడు ఒకతను.
"అమ్మోవ్! సార్సార్! మా అమ్మ చచ్చిపోతే మా ఊరికెళ్ళాసార్!
నాకేమీ తెలీదు సార్!"
"కొట్టడానికి ఎత్తిన చెయ్యిదించి నెమ్మదిగా అన్నాడు రమణమూర్తి.
"ఏమిటీ? మీ అమ్మ.....?"
పెద్దగా ఏడ్చాడు నరేష్. "మా అమ్మ చచ్చిపోయింది సార్! మా ఊరి బస్సు డ్రైవరు చేత కబురు పెట్టారు సార్! ఇంటికొచ్చి చెప్పే టైం లేక అట్నుంచి అటే ఊరెళ్ళిపోయాను సార్! నాకీ లోకంలో మా అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేదు సార్!"
అక్కడంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. నరేష్ వెక్కిళ్ళు మాత్రం మెల్లిగా వినబడుతున్నాయి. ఆ తర్వాత అందరి సానుభూతీ నరేష్ మీదికి మళ్ళింది. అతన్ని తిట్టికొట్టిన వాళ్ళంతా పశ్చాత్తాప పడుతూ పరామర్శగా ప్రశ్నలు వెయ్యడం మొదలెట్టారు. ఏడుస్తూనే జవాబులు చెబుతున్నాడు నరేష్. అంతా విన్నాక "మరి సృజన ఎక్కడికెళ్ళి ఉంటుందీ?" అన్నాడు రమణమూర్తి పెద్దగా అంటూ బుగ్గలు గాలితో పూరించి, చూపుడు వేలుతో నుదుటి మీద కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్లు అభినయించాడు.
జానకి ఒకసారి పరీక్షగా భర్తవైపు చూసి "ఏమండీ!" అంది భయంగా.
నరేష్ వాళ్ళ అమ్మపోయింది. వాళ్ళ నాన్నేమో ఇదివరకే పోయాడు.
పోయినవాళ్ళతోబాటు మనమూపోదామా జానకి! హ్హహ్హహ్హ! పెద్దాళ్ళందరూ పోయిపిల్లలే మిగిలితే ఎట్లా ఉంటుందీ లోకం? అల్లీబిల్లీ లోకంలో అందరూ అమ్మాయిలూ, అబ్బాయిలూ! అంతే! అవునా? అహ్హహ్హ! ఊరికే మాట వరసకంటున్నా!
హ్హహ్హహ్హ!"
రమణమూర్తిమాటలు విని అనుమానంగా మొహమొహాలు చూచుకున్నారు అందరూ.
"తీవ్రమైన మానసిక వ్యధవలన కలిగిన టెంపోరరీషాక్ లో ఉన్నారాయన! లెట్ హిమ్ టేక్ సమ్ రెస్ట్!
నథింగ్ టూ వర్రీ!" అన్నాడు ఆ గుంపులో ఉన్న ఒక డాక్టరు.