Previous Page Next Page 
అర్దరాత్రి ఆడపడుచులు పేజి 8


    సృజనకు అర్ధమయిందల్లా, అది ఆడపిల్లలకు తప్పనిసరి అనీ ఆ సమయంలో అమ్మసాయం ఎంతో ఉండాలనీ.
    అంతే!
    ఎందుకు ఇంత బ్లడ్ కారిపోతోంది! ఈ బ్లీడింగ్ ఇంక ఆగదా? వంట్లోని రక్తం అంతా బయటకు వెళ్ళిపోతుందా? రక్తమంతా కారిపోయాక వళ్ళంతా తెల్లకాగితంలా అయిపోయి తను చచ్చిపోతుందా?
    చచ్చిపోతానని అనుకుంటే భయం వెయ్యలేదు సృజనకి. పైగా చాలా రిలీఫ్ గా కూడా అనిపించింది.
    కానీ చనిపోయే ముందు ఒక్కసారి, ఒక్కసారన్నా అమ్మనీ, నాన్ననీ, సంజయ్ నీ, స్పందననీ చూడగలుగుతుందా తను?
    తల్లిదండ్రులూ, తమ్ముడూ చెల్లెలు గుర్తురాగానే సృజన పెదిమలు వణకడం మొదలెట్టాయి.
    ఇప్పుడు గనుక అమ్మ తనపక్కనే ఉంటే ఏం చేస్తుంది.
    తక్షణం తనని డాక్టర్ దగ్గరకు తీసుకెళుతుంది. మందు వేయిస్తుంది. తనకు ఇది తగ్గేదాక ఆఫీసుకు లీవుపెట్టి, తన ప్రక్కనే తన ప్రక్కమీదే కూర్చుని, చందమామలాచల్లని చిరునవ్వుతో తన మొహంలో కే చూస్తూ కూర్చుంటుంది. మృదువైన రగ్గుని కప్పి మెత్తటి చేతులతో తన మెడ దగ్గరగా పాదాల దగ్గరగా మాటిమాటికీ సరిచేస్తుంది. చాకుతో యాపిల్ పండు ముక్కలు ముక్కలుగా కోసి తనకు తినిపిస్తుంది. బత్తాయి పళ్ళనిస్తుంది. అరగంట అరగంటకీ గ్లూకోజు నీళ్ళు తాగిస్తుంది. బ్రెడ్డు కాల్చి, నెయ్యిరాసి ముక్కలుగాతుంచి తినిపిస్తుంది. నోరు చేదుగా అయిపోతే ఆలూపకారా (ఆల్-బుఖారా) పళ్ళు తెప్పించిఇస్తుంది.
    బోర్ కొట్టి చందమామలూ, కామిక్సూ చదువుకుంటానంటే కళ్ళు మంటలు పుడుతాయనిచెప్పి వాటిని తనే చదివివినిపిస్తుంది.
    అందుకనే తనెప్పుడూ అనుకుంటుంది. తనకు జ్వరం వస్తే అది తగ్గేది డాక్టర్లు మందులవల్ల కాదు, అమ్మ చేసే సపర్యలవల్ల అని. అది నిజంగానే నిజం!
    "ఏయ్ పిల్లా వళ్ళంతా రగతంలో తడిచిపోతా ఉంది. ఇది తీసుకో!" అని ఒక పాతబట్టను ఆమె మీదికి విసిరేశాడు రాఘవులు.
    ఉలిక్కిపడి చూసింది సృజన. మాసితోలులా ఉన్న ఆ గుడ్డను ముట్టుకోవడానికే ఆమెకి అసహ్యం వేసింది.
    అసహ్యంతో చిట్లించిన ఆమె మొహంచూసిరాఘవులు నవ్వాడు. ఎవరో తలుపుని దబదబ బాదుతున్న చప్పుడు!
    ఒక్కసారి అనుమానంగా అటువైపు చూసి అడుగులో అడుగేస్తూ తలుపుని సమీపించాడు రాఘవులు.
    వ్వవ్వవ్వ
    రమణమూర్తి ఇంట్లో ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. సృజన గురించిన మాటల్లోనే గంటలు గడిచిపోతున్నాయి గడప దగ్గర కూర్చుని మోకాలు మీద గెడ్డం ఆనించి వింటోంది జానకి. చూస్తూ ఉండగానే రాత్రి తలుపు విరిగి తూరుపు ఎరుపుకి మారడంకనబడింది. పాలవాళ్ళ కేకలు మొదలయ్యాయి.
    "పాల నాగయ్య రాగానే ఇవ్వాళ మూడు లీటర్ల పాలు ఎక్స్ ట్రాగా పొయ్యమనిఅడగాలి" అని మనసులోనే నోట్ చేసుకుంది జానకి.
    తప్పిపోయి మళ్ళీ దొరుకుతుంది సృజన. నిజానికి ఇదిపునర్జన్మే ఇవాళే నిజమైన బర్త్ డే సృజనకి. సృజన కనబడకుండా వెళ్ళిపోయి అప్పుడే ఒకరాత్రి ఒక పగలూ గడిచి రెండో రాత్రి కూడా గడిచిపోతోంది. ఈ రెండు రాత్రులనుంచి ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు జానకి, కళ్ళు ఎర్రబడి మండుతున్నాయి. రెప్పలు బరువెక్కి ఒక్కక్షణం పటు మూతలుపడ్డాయి. మళ్ళీ వెంటనే బలవంతంగా కళ్ళు తెరిచింది జానకి. ఇన్ని గంటలు ఎదురు చూసి తీరా సృజన వచ్చే టైంకి తెల్లారిపోతున్నాకా ఇప్పుడా నిద్రపోవడం తను? తలగట్టిగా విదిలించింది.
    మోటారు వాహనమేదో సందు మళ్ళిన శబ్దం. క్షణాల్లో ఆ శబ్దం పెద్దదయిదగ్గరయింది. ఇంటిముందు ఆగింది పోలీసుజీపు. ఒక్క ఉదుటున లేచి గేటు దగ్గరకు పరుగెత్తింది జానకి. ఆమెతో బాటే ఉరికాడు రమణమూర్తి. తక్కినవాళ్ళందరూ కూడా గేటుదగ్గర గుమిగూడారు. జీపులో నిశ్చలంగా కూర్చుని ఉంది సృజన. చాలా నీరసంగా కనబడుతోంది ఆమె మొహం. తను జీపు దిగి సృజనకు చెయ్యి అందించి కిందకు దింపాడు ఎస్సై. మరుక్షణంలో తల్లినీ, తండ్రి చేతులతో చుట్టేసింది సృజన.
    "అమ్మా! నాన్నా! సంజయ్..... స్పందనా!"
    "తల్లీ! నా తల్లీ! నా కన్నా! నా బంగారూ! నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా!" అంటున్నాడు రమణమూర్తి జీరపోయిన గొంతుతో.
    జానకికి అసలు నోటివెంబడి మాట రావడంలేదు. కూతురి మీదకు ఒరిగిపోయి ఆమెనుదుటి పెదమలతో తడితడిచేస్తూ చేతులతో జుట్టు రేపేస్తూ కన్నీటితో ఆమెకు అభ్యంగనస్నానం చేయిస్తోంది.   
    సంజయ్ స్పందన అక్క చేతులని పట్టుకుని ఊపేస్తున్నాడు తక్కినవాళ్ళందరూ అత్యంత ఆర్ద్రంగా ఉన్న ఆ దృశ్యాన్ని సజలనయనాలతో చూస్తున్నారు.
    "అమ్మా!" అంది సృజన వినీ వినబడని గొంతుతో.
    "ఏంనాన్నా?" అంది జానకి, కూతుర్ని గారంచేస్తూ.
    మొహమాటంగా తల్లి మొహంలోకి చూసింది సృజన "అమ్మా!" అంది మళ్ళీ.
    "చెప్పుకన్నా!"
    జవాబు చెప్పకుండా తదేకంగా తల్లి కళ్ళలోకే చూస్తోంది సృజన.
    కూతురు ఏదో చెప్పాలని చెప్పలేక సతమతమవుతోందని గ్రహించింది జానకి. సృజన భుజంమీద చెయ్యివేసి ప్రక్కకు నడిపించుకు వెళ్ళింది.
    తల్లి అంత లావులేకపోయినా దాదాపు తల్లి అంత పొడుగున్న సృజన ఒకచేత్తో జానకి భుజాన్ని పట్టుకువంచి చెవి దగ్గర నోరుపెట్టి పెదిమలు కదిలించింది.
    అది వినగానే చప్పున తలఎత్తి ఒకసారి భర్త మొహంలోకి చూసింది జానకి. ఆ తర్వాత "మరే భయంలేదు!" అన్నట్లు చిరునవ్వుతో సృజన వెన్నునిమిరి పక్కింటి యశోధర వైపు తిరిగింది జానకి.
    "యశోధరగారూ! ఓసారిలా రండి"
    ఆడవాళ్ళందరూ ప్రశ్నార్ధకంగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. చేతులు జోడించి సబ్ ఇన్ స్పెక్టరుకి నమస్కారం చేశాడు రమణమూర్తి "మీ మేలు ఈ జన్మలో మర్చిపోను! ఇవి ఉత్తమాటలు కావు"
    ఇన్స్ పెక్టర్ చిరునవ్వుతో రమణమూర్తి భుజంతట్టిపదింటి తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చి కొన్ని పేపర్స్ సైన్ చెయ్యవల్సి ఉంటుందని చెప్పివెళ్ళిపోయాడు.
    "ఏమండీ! మాట!" అని పిలిచింది రమణమూర్తిని జానకి.
    ప్రశ్నార్ధకంగా చూస్తూ దగ్గరగా వచ్చాడతను.
    "మన అమ్మాయి పెద్దమనిషయిందండీ!"
    వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు రమణమూర్తికి. కొద్దిక్షణాలు ఆగి "ఏం చేద్దాం? ఐ మీన్ ఏం చెయ్యాలి మనం?" అన్నాడు తడుముకుంటూ.
    తప్పిపోయిన కూతురు తిరిగి వచ్చింది. మొన్ననేమో బర్త్ డే సెలబ్రేట్ చెయ్యలేకపోయాం. ఇప్పుడు ఈ విశేషం కూడా కలసివచ్చింది.
    అందుకని ఉన్నంతలో ఘనంగా ఫంక్షన్ చేద్దాం. మీరు వెంటనే వెళ్ళిపురోహితుడుశ్యామశాస్త్రి గారిని ఒక్కసారికనబడమని చెప్పండి. వస్తూ వస్తూ వంటతను సేమసుందరంని హెచ్చరించండి. అలా మార్కెట్ కి కూడా ఒకసారి వెళ్ళి రిఫైన్డ్ ఆయిల్ పెద్దటిన్నూ, రెండు కిలోల మంచినేయి......"ఇదిగో! వడగళ్ళవాన కురిసినట్లు నువ్వట్లాగడగడ చెబితే నాకు గుర్తుండదు.
    లిస్టురాసివ్వు"
    "మీరు గనుక చప్పున వెళ్ళి ఇవన్నీ తెచ్చే శారంటే తర్వాత మనిద్దరం కలిసి కొత్త పెంటయ్య షాపుకి వెళ్ళాలి. సృజనకి పట్టు పరికిణీ ఓణీ, హేమవదినకు జరీ....."
    పెద్దగా హారన్ వినబడగానే బెదిరిన కళ్ళు తెరిచింది జానకి. కల చెదిరిపోయింది.
    ఇంటిముందు ఆగివుంది పోలీసు జీపు.
    ఇంతసేపూ మగత నిద్రపోయిందన్న మాట తను! మగత నిద్రలోనే మంచికల!
    జీపులోంచి కిందకు దిగుతున్న ఎస్సై కనబడ్డాడు.
    మళ్ళీ అందరూ గేటు దగ్గరకు పరుగెత్తారు.
    "సృజన ఏదీ!" అన్నాడు రమణమూర్తి.
    ఆమాటకు వెంటనే సమాధానం చెప్పలేదు ఎస్సై.
    "ఆటోని ట్రేస్ చేశాంకాని ఆటో డ్రైవర్ ని కాంటాక్ట్ చేయడం కుదరలేదు" అన్నాడు.
    "ఎందువల్ల" అన్నాడు రమణమూర్తి హీనస్వరంతో.
    "నవాబ్ కూకట్ పల్లి వద్ద రాష్ గా వస్తూ చీకట్లో ఆగి ఉన్న లారీని డాష్ కొట్టాడు.
    లారీనిండా ఇనుపచువ్వలు లోడ్ చేసి ఉన్నాయి. డాష్ కొట్టగానే స్పీడ్ గా వస్తున్న నవాబ్ శరీరంలోకి ఆ చువ్వలు శూలాల్లాదిగబడ్డాయి. మేం వెళ్ళి అతన్ని ఆ చువ్వలనుంచి తప్పించడం కుదరక చువ్వలనే కోయించి అతన్ని హాస్పిటల్లో చేర్చాం. ఒంట్లో ఇరుక్కుపోయినచువ్వలని ఆపరేట్ చేసి తీశారు డాక్టర్లు."
    "సృజన ఆచూకీ చెప్పాడా అతను?" అన్నాడు రమణమూర్తి వెర్రిగా.
    "లేదు! స్పృహలోకి రాకుండానే చనిపోయాడు నవాబ్. ఐయామ్ సారీ మిస్టర్ రమణమూర్తీ! మీకు దొరికిన క్లూ కూడా ఇలా పనికిరాకుండా పోయింది ప్రస్తుతానికి" అన్నాడు ఎస్సై ఆపాలజెటిక్ గా.

 Previous Page Next Page