Previous Page Next Page 
లీడర్ పేజి 9

    శ్రీహరిరావు బృందం సాయంత్రానికి జబల్ పూర్ చేరారు. మార్గం పొడుగూతా సైనికులు నల్లదుస్తు లేసుకుని, నల్ల బ్యాడ్జీలూ పెట్టుకుని కనిపించారు. కారణమేమిటని కనుక్కుంటే ఆరోజు జార్జి చక్రవర్తి మరణించిన రోజని" తెలిసింది. ఊళ్ళోకెళ్ళుతూనే "ఇక్కడెవరన్నా డాక్టరున్నారా?" అని వాకబు చేశారు.    
    డాక్టరుగారి అడ్రసు తీసుకుని వెళ్ళారు. డా|| డాసిల్యాని ఆ విధంగా కలవడం తటస్థించింది. ఆయన భార్య కూడా డాక్టరే. శ్రీహరి రావుగారు పరిస్థితంతా వివరించి చెప్పారు.
    "ఒక స్త్రీనీ, చంటిపిల్లనీ, లేవలేని మనిషినీ వదిలిపెట్టివచ్చారా?" అని ఆవిడ ఆశ్చర్యపోయింది.    
    డాక్టరుగారు కూడా ఖంగారుపడి, వెంటనే డ్రైవర్ని పిలిచి, "శ్రీనగర్ అనే చిన్న ఊర్లో, పోస్టాఫీసు అరుగుమీద ఓ స్త్రీ, చిన్నపిల్లా, ఒకాయనా వుంటారు. వెంటనే తీసుకురా" అని పంపించారు.    
    చీకటి పడిపోయింది రమణకి దుఃఖం ఆగట్లేదు. పిల్ల ఆకలని ఏడుస్తోంది. సత్యనారాయణగారు అపస్మారకంలో వుండి ఆమెకి భయం కలుగుతోంది. ఊరుకాని ఊళ్ళో దిక్కూ దివాణం లేకుండా ఇలా ఎంత సేపు? వెళ్ళిన మనుషుల జాడలేదు. ఒకవేళ రాకపోతే ఏమిటి గతి? రాత్రంతా ఏ విధంగా గడపాలి? ఆమె కొక్కసారిగా తల్లీ దండ్రీ పుట్టిన ఊరు గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడుపొచ్చింది. కాసేపటికి తెప్పరిల్లి రామ నామం చేస్తూ కూర్చుంది. ఎటువంటి ఆపదొచ్చినా, ఆనంద మొచ్చినా ఆమె రామనామం వదిలిపెట్టలేదు   
    ఎదురుగుండా కారొచ్చి ఆగేటప్పటికీ ఆమె ఉలిక్కిపడి చూసింది. "శ్రీహరిరావు సాబ్! ఆన్ పూట్ బ్యాచ్" అంటున్న అతని మాటలు వినగానే, ఆమెకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. "మైహూ" అంది ఆనందంగా డ్రైవరూ, ఆమె కలిసి సత్యనారాయణగారికి ఊతమిచ్చి, కార్లో పడుకోబెట్టారు. ఆమె కార్లో కూర్చున్నాక, వెనక్కి వాలి, పిల్లని దగ్గరగా తీసుకుని "రామా! నా మొర ఆలకించావా తండ్రి!" అనుకుంది కళ్ళనిండా నీళ్ళు నిండగా.    
                                   *    *    *    *    
    జబల్ పూర్ లో డా|| డాసిల్వా ఆతిథ్యంలో ఎనిమిది రోజులుండి పోయారు. ఆయన, ఆయన భార్యా అత్యంత ఆదరంగా చూశారు. సత్యనారాయణగారికి పూర్తిగా నిమ్మళించాక బయల్దేరారు. బయల్దేరేటప్పుడు, ఆ దంపతుల దారి ఖర్చులకుగాను, వెయ్యి రూపాయల పైకం కూడా శ్రీహరి రావుగారికి బలవంతం చేసి ఇచ్చారు. సత్యకాలం కదా!    
    తరువాత 'బోరియా' చేరారు. కనుచీకటి పడుతుండగా వూళ్ళో కడుగు పెట్టారు. అక్కడో చెట్టుకింద రొట్టెలు చేసి అమ్ముతుంటే, అందరూ ఆవురావురుమని అవి కొరుక్కు తినేశారు. ఆ తరువాత అక్కడే బిస్తరులు పరుచుకుని నిద్ర కుపక్రమించారు. ఈదురుగాలి రయ్యిమని వీస్తోంది, ఆరుబయట ప్రదేశం అయినా అలిసిపోయి వుండడంవలన 'నిద్ర సుఖ మెరగదు' అన్నమాట నిజం చేస్తూ అందరూ గొడ్లల్లా పడి నిద్రపోయారు.    
    తెల్లవారి లేచి, బడ్డీకొట్టు దగ్గర టీ కొనుక్కుని తాగుతుండగా, ఆ బండివాడు, "ఇప్పుడో బస్సు ఇక్కడికొస్తుంది, అది ఇక్కడనుండి 'జఖేరా' వెళుతుంది" అని చెప్పాడు.    
    పిల్లకి కొంచెం ఒళ్ళు వెచ్చగా వుంది. శ్రీహరిరావు వెంటనే నిర్ణయం తీసుకుని, రమణా! నువ్వూ, పిల్లా బస్సులో వెళ్ళిపొండి, మేమందరం సాయంత్రానికల్లా జఖేరా చేరుకుంటాం" అని ఆమె మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొందరపెట్టి, బస్సు రావడంతో అందులో కెక్కించేశారు. కండక్టర్ తో "రోడ్డు ప్రక్కగా ఏదైనా సత్రం వుంటే అక్కడ దింపెయ్యి" అని చెప్పారు. వయసులో వున్న స్త్రీని, చంటిపిల్లనీ రాష్ట్రం కాని రాష్ట్రంలో భాషరానిచోట అంత ధైర్యంగా వదిలిపెట్టేశారు.    
    మధ్యాహ్నానికల్లా ఆమెను ఊరి చివర సత్రం, ఓ ఆస్పత్రీ వుంటే అక్కడ దింపి, బస్సు వెళ్ళిపోయింది. పిల్లని భుజాన వేసుకుని, పెట్టెతో దిగింది. ఆమె బిక్కుబిక్కుమంటూ చుట్టూ పరికించి చూసింది. ఒక కిళ్ళి బడ్డీ వుంది. ఎదురుగా పోలీస్ స్టేషన్ లాంటిది. అక్కడో పోలీసు నిలబడి ఇటే చూస్తున్నాడు. పోలీసుని చూడగానే ఆమెకి భయమేసింది. వాళ్ళకి తమకీ వున్న 'వైరం' గుర్తుకొచ్చి ఆస్పత్రి వరండామీద పక్కపరిచి పిల్లని పడుకోబెట్టి, తను మోకాళ్ళమీద గడ్డం ఆన్చుకుని కూర్చుంది. అలా సాయంత్రం నాల్గింటిదాకా కూర్చుంది. పిల్ల లేచి, ఆకలేసింది కామోసు ఏడవసాగింది. లేచి కిళ్ళీబడ్డీ దగ్గరకెళ్ళి రెండు గ్లాసులతో టీ కొని, తను తాగి, పిల్లకి తాగించింది. అంతకన్నా ఏమీ దొరికే ఆస్కారం లేదామెకి.    
    పిల్లకి జ్వరం ఎక్కువయిపోయింది. ఒళ్ళు పెనంలా కాలిపోసాగింది. ఏడుపు బిగబట్టుకుని జోరుగా రామనామం చెయ్యసాగిందామె, ఇంతలో ఎవరో పెద్దమనిషి అటుకేసి రావడం గమనించింది. అతను వచ్చి ఆస్పత్రి తలుపులు తెరుస్తున్నారు. ఆ నిమిషంలో అతను ఆమెకి దేవుళ్ళా కనిపించాడు.    
    "ఆప్ డాక్టర్ సాబ్ హై?" అనడిగింది.    
    అతను ఔనూ, కాదూ అనలేదు. ఆమెవంకా, చేతిలో పిల్లవంకా చూసి, లోపలికి నడిచాడు. ఆమె కూడా అనుసరించింది. పిల్లని పరీక్షించి, ఒక మాత్ర పొడిచేసి గొంతులో వేశాడు. ఇంకో రెండు మాత్రలు పొట్లం కట్టి ఇచ్చి, "రాత్ కో" అన్నాడు. "రాత్రి వెయ్యమంటున్నాడు" అని ఆమెకి అర్ధమయింది. వచ్చినంత హడావుడిగానూ, అతను మళ్ళీ ఆస్పత్రి మూసి వెళ్ళిపోయాడు.    
    ఆమె ఉసూరుమంటూ పిల్లని పెట్టుకుని మళ్ళీ అరుగుమీద కూర్చుంది.    
    సాయంత్రం ఆరవుతుండగా, పిల్లకి జ్వరం జారిన గుర్తుగా చెమట్లు పట్టాయి.    
    చీకటి ముసురుకుంటోంది. 'బడ్డీషాపు' వాడు దుకాణం మూసేసి "మీ వాళ్ళెవరూ రాలేదా?" అని సైగచేసి అడిగాడు. తల అడ్డంగా వూపుతుండగా ఆమెకి దుఃఖం ముంచుకొచ్చేసింది. అతను వెళ్ళిపోయాడు. ఆమె ఇప్పుడు పూర్తిగా మనుష్య తోడులేని ఒంటరిదైపోయింది.    
    కాసేపటికి చీకటిలోంచి ఒక ఆకారం లాంతరు తీసుకుని రావడం ఆమె గమనించింది. ఎవరై వుంటారా? అని ఆమె నిలువెల్లా ఒణికిపోయింది.

 Previous Page Next Page