అతను కానిస్టేబుల్ లాంతరు అరుగుమీద పెట్టి వెనుదిరిగి వెళ్ళి పోతుండగా, "ఇది ఎవరు పంపించారు?" అనడిగింది వచ్చీరాని హిందీలో.
"ఇన్ స్పెక్టర్ సాబ్!" అని జవాబిచ్చి అతను వెళ్ళిపోయాడు.
ఆమెకెందుకో భయం మరింతగా పెరిగిపోసాగింది. పిల్లని భుజాన వేసుకుని, వడివడిగా రోడ్డుమీదకొచ్చి నిలబడింది.
అలా ఎంతసేపు నిలబడి, కన్నీరు కారిపోతుండగా రామజపం చేస్తూ గడిపిందో ఆమెకే తెలియదు. ఎనిమిదవుతుండగా, చీకట్లోంచి "రమణా! ఎక్కడున్నావు?" అన్న భర్త కేకలు వినపడ్డాయి. "ఇక్కడున్నాను" అంటూ ఎలుగెత్తి అరిచింది. అయన సమీపించగానే, ఒక్క ఉదుటున వెళ్ళి గుండెలమీద వాలిపోయి భోరుమని ఏడ్చేసింది.
వయసులో వున్న ఒంటరి ఆడదాన్ని, ఊరి చివర నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రొద్దుటినుంచీ రాత్రిదాకా ఒంటరిగా వదిలేసినా, ఎదురుగుండా పోలీస్ స్టేషనున్నా ఏం కాలేదంటే, ఈ కలం వాళ్ళకి బహుశా నమ్మశక్యం కాదు.
శ్రీహరిరావు జరిగినదంతా తెలుసుకుని, డాక్టర్ గారిల్లు వెతుక్కుంటూ వెళ్ళి, తనని తాను పరిచయం చేసుకుని సత్రం తాళాలిమ్మని అడిగాడు. "మీరు ప్రొద్దుట మందిచ్చిన స్త్రీ నా భార్య" అని చెప్పగా, "నేనసలు ఇవాళ ఆస్పత్రికి రాలేదే!" అన్నారు. చివరికి, ఆయన కూడా బయలుదేరి ఆస్పత్రికొచ్చి, "అమ్మా ఆ వ్యక్తి ఎలా వున్నాడూ?" అని అడిగి ఆమె చెప్పిన గుర్తులనిబట్టి, "అతను మా కాంపౌండరు, ఊరికెళతానని చెప్పాడు. ఏం మరిచిపోయి వచ్చాడో ఏమో!" అన్నారు.
ఆ రాత్రికి తన వంటవాడితో వంట చేయించి. తను కూడా సత్రంలో వారితోబాటే కలిసి భోంచేశారు. కాంగ్రెసంటే ప్రజల్లో వున్న అభిమానం అలాంటిదప్పుడు.
మర్నాడు ప్రొద్దుట కూడా అయన భోజనాలు చేస్తే కానీ కదలనివ్వలేదు.
రోడ్డుమీద కొచ్చేసరికి, "అభానా" వెళ్ళే బస్సు అక్కడ సిద్దంగా వుంది.
"ఎక్కుతావా?" అని శ్రీహరిరావు అడగ్గానే, ఆమె సివంగిలా రెచ్చిపోయి,
"చచ్చినా ఎక్కను" అంది ఏడుపొచ్చేస్తుండగా.
ఆయన నవ్వి, "సరేలే!" అని ఓ ఎద్దుబండి మాట్లాడారు.
బండి వెనకాలగా పాటలు పాడుకుంటూ, కబుర్లు చెపుతూ తక్కిన బృందం నడవసాగారు.
"మా యావిడ ఏం చేస్తోంది?" అని సుబ్రహ్మణ్యం మధ్యమధ్యలో సావిత్రిని ముద్దుచేసేవాడు. అందరికీ సావిత్రంటే ముద్దే. పేచీపూచీ వుండేది కాదు. ఏదిపెడ్తే అది తిని బంతిలా ఆడుతుండేది.
అభానా యింకా వంద గజాలుందనగా, "భగవాన్!" అన్న బండి వాడి అరుపు వినిపించింది. అందరూ ఉలిక్కిపడి చూశారు.
భయానకమైన దృశ్యం! జభేరానుండి ఇందాక బయలుదేరి అభానా వచ్చిన బస్సు చెట్టుకు గుద్దుకుని పక్కకి పడిపోయి వుంది. దాని మీద 60 మైల్స్, 60 ప్యాసింజర్స్ అని రాసుంటుంది. అక్కడో కానిస్టేబుల్ కూర్చుని కనిపించాడు. వాడి ద్వారా, "ఛత్రపూర్ నుండొచ్చే బస్సులో, కొనప్రాణాలతో వున్నవాళ్ళనీ, శవాలనీ తిరిగి జభేరా పంపించేసినట్లు" తెలిసింది.
రమణ హఠం చేయకుండా వున్నట్లయితే చంటిపిల్లతోసహా ఆ బస్సు ఎక్కించేసేవారు. అందుకే ఒక్కొక్కసారి ఆత్మప్రభోధాన్ని పెడచెవిన పెట్టకూడదు!
అభానా చిన్న వూరు, అందమైన లక్కపిడతల్లాంటి ఇళ్ళు. చుట్టూ కొండలూ చాలా రమణీయమైన ప్రదేశం. వూరి మధ్యలో రచ్చబండ వుంది. దానిమీద తమ తమ సామాన్లు వుంచి అందరూ విశ్రాంతి తీసుకోసాగారు.
"నే వెళ్ళి ఊరి పెద్దలెవరో తెలుసుకుని వస్తాను" అని శ్రీహరిరావు వూళ్ళోకెళ్ళారు.
రమణకింకా చెట్టుకి గుద్దుకుని క్రిందపడ్డ బస్సు, భయంకరమైన ఆ దృశ్యం మనోఫలకం మీదనుంచి చెరిగిపోవడంలేదు! ఎంత ప్రమాదం తప్పింది అనుకుంది పిల్లని దగ్గరకు తీసుకుని, ఆమెని మామూలుగా చెయ్యాలని రాజూ, కోటయ్యా ఏవో జానపద గీతాలు పాడడం మొదలు పెట్టారు. ఒకరిని మించి ఒకరు కర్ణకఠోరంగా పాడుతుంటే ఆమె నవ్వకుండా వుండలేకపోయింది.
అభానా వూరి పెద్ద లక్ష్మీచంద్ పాల్ ఆయన శ్రీహరిరావు చెప్పిన దంతా విని, ఎంతో సాదరంగా ఆహ్వానించారు. ముందుగా పనివాడిచేత అందరికి 'ఛా' ఇప్పించారు. తరువాత అక్కడే మకాం.
మర్నాడు ప్రొద్దుటే అయన దగ్గర వీడ్కోలు తీఉస్కుని, తిరిగి నడక మొదలుపెట్టారు. నడుస్తుండగా వారికి దారి పొడుగూతా బంగాళా దుంపల చేలు కన్పించాయి.
కాపలావాడికి అనుమానం రాకుండా, ఒక్కొక్క ఒక్కొక్క చెట్టు లాక్కొచ్చారు. ఓ చెట్టుకింద నిప్పుచేసి వాటిని కాల్చుకుని తిన్నారు. "ఈ పూటకి భగవంతుడింతె ఇచ్చాడు" అనుకున్నారు.
మధ్యలో చిన్న పల్లెటూరొచ్చింది ఒక గచ్చరుగూ, పోలీస్ స్టేషనూ కనిపించింది. ఆ పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసుకి ఇంగ్లీషు బాగావచ్చు. అతనికి శ్రీహరిరావుగారి పేరు సుపరిచితమేనట. ఈయన్ని చూసి చాలా సంతోషించి, హుటాహుటీ ఇంటికెళ్ళి టీ, రొట్టెలూ పట్టుకొచ్చాడు. ఆ పూటకి కడుపులు నింపుకుని, తిరిగి తెల్లవారి నడక సాగించారు.
దార్లో కుర్రవాళ్ళు ఆకలికి తట్టుకోలేకపోయారు. "పంతులూ నరాలు తోడేస్తున్నాయి" అంటూ గొడవచేశారు. రమణ పరిస్థితి కూడా అలాగే వుంది. కానీ పంటి బిగువున నడుస్తోంది. సావిత్రికోసం ఎప్పుడూ రెండు డబ్బాలలో బిస్కెట్లూ, జీడిపప్పు, ఎండుద్రాక్ష దగ్గర పెట్టుకునేది. పైగా ఆమె పాలు పిల్లకి పుష్కలంగా సరిపోయేవి. దాంతో పిల్లవలన పెద్దగా ఇబ్బందులెదురయ్యేవి కాదు.
శ్రీహరిరావు కళ్ళు ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని వెతుకుతూనే వున్నాయి. చివరికాయన ఆశ ఫలించి, దూరంగా ఒక కిరాణాషాపు లాంటిది కనిపించింది. ఆయన వెంటనే ఓ శేరు పెసరపప్పు కొన్నారు. అంతకంటే ఆ కొట్లో తినగలిగినదేమీ కనపళ్ళేదు. తన కండువాలో దానిని మూటగట్టి, కాలవలో ఓ పది నిముషాలు నానబెట్టారు. అది నానిన తరువాత తీసి, అందరికీ తలా గుప్పెడూ పెట్టారు. ఆ పూటకి అదే వారి ఆధారం.