రాత్రుళ్ళు ఏ చెట్టుకిందో, అరుగుమీదో బిస్తర్లు పరుచుకున్నప్పుడు, శ్రీహరిరావు రమణని ఆ పక్కా, పిల్లని ఈ పక్కా పడుకోబెట్టుకుని కళ్ళు తెరుచుకునే వుండేవారు. ఏ తెల్లవారగట్లో మరొక యిద్దరిని నిద్రలేపి, తను కాసేపు కునుకు తీసేవారు. ఒళ్ళు అలసిపోయి వుండేదేమో, పడుకో గానే ఒళ్ళు మరిచిపోయేవారు కుర్రాళ్ళు. అన్ని వేల వేల మైళ్ళు నడకంటే మాటలా?
తరువాత మజిలీగా 'చట్టికోనా' చేరుకున్నాడు.
* * * *
'చట్టికోనా' స్టేషన్ నిర్జనంగా వుంది. అక్కడ తమ బిస్తర్లు పరుచుకుని అందరూ అలసట తీర్చుకోసాగారు. స్టేషన్లో అక్కడక్కడా విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. మార్గమధ్యంలో జరిగిన సరదా సంగతులూ, కబుర్లూ చెప్పుకుంటూ పెద్ద గొంతులతో నవ్వుతూ మాట్లాడుతున్నారు అందరూ ఇంతలో దూరంనించి కాగడాల వెలుగూ, మనుష్యుల ఆకారాలూ, గజ్జెల శబ్దం వినిపించసాగింది.
"అటు చూడండి! ఎవరో వస్తున్నట్టున్నారు" అంటూ శ్రీహరిరావుగారు అటుకేసి అడుగులు వేశారు. రాజు గుప్తా కూడా ఆయన్ని అనుసరించారు.
ఆ ఆకారాలు దగ్గరపడ్డాయి. పూసలు మొలకి కట్టుకుని, చేతిలో గజ్జెల కర్రలు పట్టుకున్న కొండవాళ్ళు వాళ్ళు! వీళ్ళని చూడగానే ముందు హడలిపోయారు. ఆ తర్వాత వీళ్ళు మనుషులేనని నిర్దారించుకొని దగ్గర కొచ్చారు. అదోరకం అర్ధంకాని హిందీలో నానారకాల ప్రశ్నలూ వేశారు.
శ్రీహరిరావుగారు శుద్ద హిందీలో "ఈ స్టేషన్ మాష్టరిక్కడ వుంటాడూ? ఈ స్టేషన్ లో జనసంచారం లేదే?" అనడిగారు.
వారికామాటలు అర్ధమైనట్లున్నాయి "ప్చ్, ప్చ్" అంటూ పెదవులు విరిచి చప్పుడుచేస్తూ అక్కడ కూలబడి చెప్పడం మొదలెట్టారు. వారు చెప్పిన ఉదంతమిది.
కొత్తగా పెళ్ళయి, భార్యతోగూడా ఆ వూరు చేరాడు బదిలీ మీదొచ్చిన ఆ స్టేషన్ మాష్టర్ స్టేషన్ వెనుకవైపుగా ఇళ్ళున్నాయి. అందులో వుండేవాడతను ఓనాడు మామూలుగా అతను స్టేషన్ కొచ్చేశాడు. ఆ ఇల్లాలు స్నానం చెయ్యడానికి స్నానాల గదిలోకి వెళుతూ, ఒక వేళ పనిమనిషి వస్తుందేమోనని, దొడ్డితలుపు దగ్గరికి చేరవేసి పెట్టి, తను స్నానానికి వెళ్ళిపోయింది.
కళ్ళుమూసుకుని తల రుద్దుకుంటుండగా అలికిడయింది. పనిమనిషి వచ్చిందనుకుని ఆమె తన పని తను చూసుకోసాగింది.
కానీ ఆ వచ్చినది పెద్దపులి ఆమె కళ్ళు తెరిచేటప్పటికీ ఎదురుగా మృత్యువు పులిరూపంలో వుంది.
కాసేపటికి కాలవనుండి నీళ్ళబిందె తీసుకుని యధాప్రకారం పని మనిషి వచ్చింది. అమ్మగారికోసం ఇల్లంతా వెదికి, ఎక్కడా కనిపించక పోవడంతో అనుమానమొచ్చి, స్టేషన్ కి పరుగెత్తుకొచ్చింది. డ్యూటీలోఉన్న స్టేషన్ మాష్టర్ తో, "అమ్మగారు కనపడటంలేదు! ఇల్లంతా అలా వదిలేసి ఎక్కడికెళ్ళారు?" అని ఖంగారుగ ఆడిగింది. దానికీ ఆయన ఖంగారు హుటాహుటీ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసాడు. ఎక్కడా ఆమె జాడలేదు. ఊరంతా ఈవార్త గుప్పుమని అందరూ వెతకసాగారు. చీకటి పడుతుండగా పశులని మేపుకుని ఇళ్ళు చేరుతున్న కొండవాళ్ళకి, ఒక గుట్టమీద చీర తుంపులూ, గాజులూ, గొలుసూ కనిపించాయిట. అవి పట్టుకుని వచ్చి, గుమిగూడి వున్న జనాన్ని చూసి, సంగతంతా తెలుసుకొని, "ఇవిగో మెకం ఎవర్నో తినేసి, ఇవి మిగిల్చింది మీ తాలూకు మనిషి వేమో గుర్తుపట్టండి!" అన్నారు. అవి చూడగానే తన భార్యవిగా ఆనమాలు పట్టి, స్టేషన్ మాష్టర్ కుప్పకూలిపోయాడట.
ఆ దెబ్బతో అతను, ఇంకీ ఊర్లో నిమిషం కూడా వుండనని ఏడుస్తూ, వాళ్ళ వూరు పారిపోయాడట. ఈ కధంతా వాళ్ళు చెప్పాక రమణ కింక ఆ స్టేషన్లో ఆ రాత్రి గడపటానికి ధైర్యం చాలలేదు.
"ఎవరైనా ఆశ్రయమిస్తారేమో చూద్డామండీ!" అంది బెదురుగా.
"పిచ్చిదానా! మృత్యువు రాసిపెట్టుంటే ఎక్కడైనా తప్పదు! మనకి దేవుడే దిక్కు, ధైర్యంగా వుండు" అన్నారాయన.
ఆ కొండవాళ్ళు నిప్పుచేసి, అందరూ ఆదమరచి నిదురపోకండి. అని హెచ్చరించి, తమ దారిన తాము పోయారు.
కుర్రవాళ్ళందరూ మంచి హుషారుగా వుండేవారు.
"మనకేం భయమండీ! మానని చూసి అదే భయపడి పారిపోవాలి" అంటూ నవ్వుతూ, నవ్విస్తూ ఆమె భయం పోగొట్టారు.
ఆ రాత్రి ఎవరూ ఆదమరిచి నిదురపోలేదు.
తెల్లవారుతూనే, "ఇక్కడింకో నిమిషం కూడా వుండేదిలేదని" రమణ హఠం చేసింది.
కాలకృత్యాలు తీర్చుకుని, దార్లో రొట్టెలు కొనుక్కుని తిని, 'మహా సముండ్' వైపు బయల్దేరారు.
* * * *
మహా సముండ్ లో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెసాఫీసులో ఆతిధ్యం దొరికింది. కాంగ్రెసు పేరు జెప్తేనే ప్రజలు పులకాంకితులయ్యే వారు, శ్రీహరిరావుగారి ఉపన్యాసాలు విని మేను మరిచిపోయేవారు. ప్రతి ఊళ్ళోనూ, ఊళ్ళో కెళ్ళాగానే "కాంగ్రెస్ మనుషులెవరైనా వున్నారా?" అని వాకబు చేసేవారు. కాంగ్రెసువాళ్ళు వెంటనే వచ్చి, వీళ్ళని సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్ళి ఆతిధ్య మిచ్చేవారు. మీదే కులం? అంటే 'కాంగ్రెసు కులం, అని తడుముకోకుండా చెప్పేవారు. అంతటి ఆదర్శవాదులు.
'మహా సముండ్' నుండి 'రాయపూర్' చేరుకున్నారు. అక్కడ 'రవిశంకర్ శుక్లా' గారు సహాయాదరాలు అందచేశారు.
అక్కడినుండి 'జబల్ పూర్' మార్గం పట్టారు. దారిలో పోకల సత్యనారాయణగారికి ముమ్మరంగా జ్వరమొచ్చింది. అడుగుతీసి అడుగు వేసే పరిస్థితుల్లో లేరు. ఏం చెయ్యాలి? అని ఆలోచించాడు శ్రీహరిరావు. అందరితో సంప్రదించి చివరికో నిర్ణయానికొచ్చాడు. రమణమ్మనీ, పిల్లనీ, ఆయననీ ఓచోట వుంచి, తామందరూ జబల్ పూర్ చేరుకుని, ఏదైనా కారో, బండో మాట్లాడి వీళ్ళని తీసుకెళ్ళాలని ఆయన భార్యని వుంటావా? అని అడగలేదు. ఆమె తన మాట కాదనదని ఆయన నమ్మకం! "మేము వచ్చేదాకా ఈ అరుగుమీద వుండండి" అనిచెప్పి, గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
ఆమె పిల్లని డొక్కలో పెట్టుకుని కూర్చుంది. సత్యనారాయణగారు మూసినకన్ను తెరవకుండా పడున్నారు. చుట్టూ నిర్మానుష్యం! తను వంటరిగా! ఆమె ఆలోచనలూ, పరిస్థితీ వర్ణనాతీతం.