Previous Page Next Page 
నిశాగీతం పేజి 9


    "ఈ కోట  గోడలచుట్టూ  కందకాలూ, అగధాలూకూడా ఉంటాయి. ఆ  కోటకు  ద్వారం ఎటు  వున్నదో ముందుగా  తెలుసుకోవాలి. ఆ ద్వారాన్నితెరవడానికి బలహీనమైన భాగం  ఎక్కుడుందో తెలుసుకోవాలి ముందు  ఆ భాగాన్ని  బద్దలుకొట్టి, చీకటి గుహలా  వున్న  సబ్ కాన్ క్షన్ మైండులోకి ప్రవేశించగలిగితే, మూడొంతుల వ్యాధిని  నయం  చేసినట్టే. నేను మానసి విషయంలో అలాగే  భావించాను. ఆమె అచేతన మనసుకు దారి దొరికిందని భావించాను. ఆమెను  మామూలు మనిషిని చెయ్యగలిగాననుకున్నాను. కాని శివరామయ్యగారూ! ఇక్కడే  ఏదో  మోసం  జరిగింది. ఆ దారి పెడదారి అయింది. ఆద్యంతం నేను కనుగొన్నది మాయ ద్వారామే  అయింది. మానసి నన్ను బోల్తా కొట్టించింది. ఆమె చాలా  తెలివైనది. ఈ  మానసిక వ్యాధులు తాలూకు ప్రధాన లక్షణాల్లో పక్కదారులు పట్టించడం ఒకటి. వాళ్ళ బ్రైర్  సునిశితంగానూ, పట్టుదలగానూ పనిచేస్తూందనే విషయం, ఎన్నో కేసుల్లో రుజువైంది."
    డాక్టర్ ఉదయచంద్ర  శివరామయ్య ముఖంలోకి  చూసి ఠక్కున ఆగిపోయాడు.
    "అంటే  మానసి కావాలనే ఇలా చేస్తున్నాదని మీ అభిప్రాయమా?" తీవ్రంగా  వుంది శివరామయ్య కంఠం.
    "నో! నో! శివరామయ్యగారూ! నా ఉద్దేశ్యం అదికాదు. వ్యాధి లక్షణాల  గురించి  చెప్పాను. అంతేగాని, మనసి  కావాలని అలా చేస్తున్నదనడం లేదు."
    "ఏమో డాక్టర్ గారూ? నాకు మతిపోతున్నది. ఒక్కగా నొక్కబిడ్డ. అదీ తల్లిలేని బిడ్డ. చిన్నప్పట్నుంచీ గుండెలమీద పెంచాను. పెళ్ళీడు కొచ్చింది.అయిన సంబంధం మంచి సంబంధం అని........"
    "సంబంధం కుదిరిందా?" మధ్యలో అందుకొని అడిగాడు డాక్టర్ ఉదయ్.
    "చిన్నప్పట్నుంచీ అనుకున్న  సంబంధమే. అతడు నా భార్యకు మేనల్లుడే. పేరు సూరిబాబు అతడికిచ్చి ఆ మూడు  మూళ్ళూ వేయించి, నా బాధ్యత తీర్చుకుందామనుకున్నాను. ఇలా ముంచుకొస్తుందనుకోలేదు. త్వరలో  సూరిబాబూ వస్తున్నాడు."
    "ఎక్కడ్నుండీ ?"
    "అమెరికానుండి. దీని ఈ జబ్బుగురించి తెలిస్తే ఇంకేమైనా వుందా? అతను పిచ్చిదాన్ని  పెళ్ళిచేసుకొనేంతటి విశాల  హృదయుడేం కాదు. అందుకే ఈ జబ్బు  గురించి  ఎవరికీ  తెలియకుండా వీలయినంత వరకు  జాగ్రత్తపడ్డాను. డ్రైవర్ కూ, పని పిల్లకు మాత్రమే  తెలుసు. మీ  దగ్గరకు  చాలా  రహస్యంగా  తీసుకొస్తున్నాను. సూరిబాబు  అమెరికానుంచి  వచ్చేలోగా మానసి  జబ్బు  కుదరాలి. మళ్ళీ  మామూలు  మనిషి కావాలి. మానసి  జీవితాన్ని  మీ చేతుల్లో  పెట్టాను డాక్టర్ బాబూ? పాల ముంచినా నీట ముంచినా  ఆ భారం  మీదే."
    శివరామయ్య కుర్చీలో ముందుకు జరిగి, వొంగి, డాక్టర్ రెండు చేతులూ పట్టుకున్నాడు.
    స్ప్రింగ్  తలుపు సగం తెరిచి లోపలకు రాబోతున్న మానసికాళ్ళకు బంధం పడినట్టు ఆగిపోయింది.
    "డాడీ ! బాధపడుతున్నారా?"
    "లేదమ్మా లేదు" చట్టుక్కున డాక్టర్ చేతులు వదిలేసి తడబాటుగా అన్నాడు.
    "డాక్టర్ గారూ! మీరైనా  చెప్పండి మా నాన్నకు. నాకు జబ్బు లేదని మీకు తెలుసుగా ? ఆ రాస్కెల్ ను పట్టుకొని  జైల్లో వేస్తే  అన్ని  బాధలూ  పోతాయని  చెప్పండి" డోర్ దగ్గర  నిలబడి  చేతిని గాలిలో తిప్పుతూ అన్నది మానసి.
    "యస్. యస్. యూ ఆర్ కరెక్ట్. ఆ పని చేసేద్దాం . అందుకేగా నేనక్కడికొస్తున్నాది?"
    "అదంతా నీభ్రమేనమ్మా. అక్కడ నిన్ను బాధపెట్టే  వాళ్ళెవరూ  లేరు. నీ మనసే  నిన్ను మోసం...."
    "శివరామయ్యగారూ?" వారిస్తున్నట్టుగా పిల్చాడు డాక్టర్.
    శివరామయ్య ఏదో  తప్పుచేసినవాడిలా  తలదించుకున్నాడు.
    "శివరామయ్యగారూ పొరపాటు  పడుతున్నారు. అతను  మీకు కన్పించనంత మాత్రాన, ఆ దుర్మార్గుడు మానసిని వేధించడం లేదనుకోవడం సబబు కాదు."
    "ఈయనదో పిచ్చి డాక్టర్ గారూ___నేనున్నాడంటే  ఆయన  లేడంటాడు ఆ మనిషి మా తోటలోనే వుంటున్నాడు. మా ఇంట్లోనే తిరుగుతున్నాడు. నా గదిలో దాక్కుంటున్నాడు. నేను ఎక్కడికి  వెళ్తే  అక్కడికే.....నా వెంటే  నా వెనకే......"
    "ఇక్కడిక్కూడా వచ్చాడా?" ఉదయ్ ప్రశ్నించాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు.
    మానసి పకపక నవ్వింది.  ఉదయ్ ఆమె ముఖంలో  ఏదో  వెదుకుతున్నాడు.
    "వాడికి ఇక్కడికి వచ్చే ధైర్యంలేదు"
    "ఏం  ఎందుకని?"
    "మీరుండగా వాడికెన్ని  గుండెలు  కావాలి  ఇక్కడకు  రావడానికి?"
    ఆమె కళ్ళు మిలమిలలాడాయి.
    "అయితే ఇక్కడే  వుండిపోకూడదు?" అనేసి ఆమె ముఖంలో  ఆత్రుతగా చూశాడు ఉదయ్.
    "ఇక్కడా?"
    "అవును ఇక్కడే  వుండిపోతావా?"
    "పిచ్చాసుపత్రిలో వుండి పొమ్మంటారా? అంటే ...."
    "డాక్టర్ కంగారుపడ్డాడు. మానసి అతడ్ని  తేలిగ్గా బోల్తా కొట్టించింది.
    "డాక్టర్ గారూ!నిజం చెప్పండి"
    "ఏమిటి?"
    "వీళ్ళలాగే మీరూ నా మాటలు నమ్మడంలేదు కదూ?"
    "నమ్ముతున్నాను. అక్షరాలా నమ్ముతున్నాను."
    "మనస్ఫూర్తిగా?"
    "మనస్ఫూర్తిగా"
    "నిజంగా?"
    "నిజంగా. అందుకే మీతో మీ ఊరు వస్తున్నాను."
    "థాంక్యూ డాక్టర్. కనీసం మీరైనా  నన్ను అర్థంచేసుకున్నారు." మానసి కళ్ళనుంచి  బోట  నీళ్ళు  కారాయి.
    "ఏమిటిది  మానసీ? నేనుండగా నీకేం భయంలేదు."
    కన్నీటి పొరల్ని  చీల్చుకుంటూ  ఆమె కళ్ళ  వెలుగుల్ని  చిమ్మాయి.
    "సార్  కారొచ్చింది" బాయ్  లోపలకొచ్చి  చెప్పాడు.
    "మానసీ రెడీయేనా ?"
    "మీదే ఆలస్యం డాక్టరుగారూ నేనెప్పుడో తయారయ్యాను" అన్నది మానసి.
    "గుడ్ శివరామయ్యగారూ! మీరు గదికి వెళ్ళండి. ఓ గంటలో  బయలుదేరదాం."
    "అలాగే! రామ్మా!" అంటూ  ఇద్దరూ  డాక్టర్  గదినుంచి  బయటకు  వెళ్ళారు.
                                         *    *    *
                                             9

    ఉదయ్ , తన అసిస్టెంటు జయంత్ నూ, నర్సునూ పిల్చి తను లేని సమయంలో చూసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పాడు. ఎమర్జెన్సీ  వుంటే డాక్టర్  రావుకు ఫోన్  చెయ్యమని  చెప్పాడు. బట్టలు  సర్దిపెట్టివున్న  సూట్ కేసు  తీసుకురమ్మనమని  బాయ్ ని  ఇంటికి  పంపించాడు. డాక్టర్  ఉదయ్ చంద్ర  ఇల్లు నర్సింగ్  హొమ్  కు దగ్గర్లోనే వుంది.
    "హల్లో! ఉదయ్" డాక్టర్ రావు  లోపలకు ప్రవేశించాడు.
    ఎప్పుడూ నవ్వుతూ, ఉల్లాసంగా వుండే డాక్టర్ రావు ఉదయ చంద్రకు సహధ్యాయే కాక, మంచి మిత్రుడు కూడా.
    "రా! రా!నీ కోసమే చూస్తున్నాను" ఉదయ్ ఆహ్వానించాడు.
    "ఏమిటి అంత అర్జంటుగా  బయలుదేరావ్ ఎక్కడి కేమిటి?"
    "ఆ సంగతి తర్వాత చెప్తాను. ముందు రోగులగురించి విను."
    "ఊఁ చెప్పు!"
    "ఆరో నెంబరు గదిలో డెమెన్షియా  ప్రీకాక్స్  కేసు. పదమూడో  నంబరు గదిలో  వున్నది ఎలక్ట్రా కాంప్లెక్సు  కేసు. ఈ రెండు  కేసుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి."
    "ఎలక్ట్రా కాంప్లెక్సా?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రావు.
    "అవును. నీ కెక్కడా తగల్లేదా?"
    "థియరెటికల్ గానే తెలుసు. ఇలాంటి కేసు ఏదీ  నేను ట్రీట్ చేయ్యలేదు. ఇలాంటి  మానసిక  రుగ్మతకూడా  వుంటుందని నాకు నమ్మకంకూడా  లేదు. ఈ విచిత్రమైన సంబంధం ఊహిస్తే  మనసులో  కలచినట్టుగా అవుతుంది. కూతురికి  తండ్రిమీద  వాంఛ.....ఆ కారణంగా  తల్లిని  ద్వేషించడం నో! నో! నాకు  నమ్మబుద్ది కాదు. అలాంటి పేషెంటుకు  ట్రీట్  మెంట్  ఇవ్వాలంటేనే ఏదోగా....."
    "అంత సెంటిమెంటర్ అయితే ఎలా రావ్? ఫ్రాయిడ్ థియరీని క్షుణంగా అర్థం చేసుకుంటే  ఇలాంటి సెంటిమెంట్లు  ఉండవు. ఆడ__మగ  ఆ మాటకొస్తే  మనిషికి  మనిషికి మధ్య ఉండే  అనుబంధాలన్నిటికీ  సెక్సు మూలమంటాడు ఫ్రాయిడ్ . ఈ విషయం నీకూ తెలుసు."
    "ఉదయ్ నాకు ఈ సిద్దాంతం మీద నమ్మకంలేదు."
    "అంటే ఫ్రాయిడ్  చెప్పిందంతా....?"
    "నో! నో! నా ఉద్దేశ్యం......నేను  బొత్తిగా ఫ్రాయిడ్  సిద్దాంతాలను కొట్టివేయడంలేదు. ఫ్రాయిడ్  మహొన్నత శిఖరాలను అందుకున్న మానసిక  వేత్త. అతని సిద్దాంతాలూ, నిర్వచనాలూ, ప్రయోగాలూ, మానవాళి  మానసిక  జగత్తుకు మహొపకారం  చేశాయి. ఈనాటి  మానసిక విజ్ఞానానికి  గట్టి పునాది వేసింది. ఫ్రాయిడ్  అన్నది  నిర్వీవాదాంశం. అయితే  మానవుడి ప్రతిచేష్టకూ వక్రగతికీ, సెక్సే మూలకారణం  అంటే నాకెందుకో మింగుడు పడదు ఉదయ్."
    "మహామేధావులెందరో ఈ అభిప్రాయాన్నే  వెలిబుచ్చారు. అయినా  మన  అనుభవంలో, అధిక  శాతం  మానసిక  రోగుల  మానసిక  అవసామన్యతకు సెక్సు  ఒక బలమైన  కారణంగానే  కన్పిస్తుంది గదా? సెక్సును  సామాన్య మానవుడు అర్థం  చేసుకున్న రీతిలో  మనం  చూడకూడదు. సాంఘిక, ఆర్ధిక, సామాజిక పరిథుల్నిదాటి చూడగలిగితే సెక్సుపట్ల మనకున్న సెంటిమెంట్సు పోతాయి. మన వృత్తికి ఇది అవసరం కూడాను."
    "ఓ.కే ఆ పేషెంటు పేరు...."
    "నాగమణి. ఇదిగో. ఇది ఆమె కేసుకు సంబంధించిన రికార్డు. వీలుంటే రాత్రికి  ఒకసారి చదువు. రేపు ఉదయం  ఒక సిట్టింగ్  పెట్టు. నాగమణితో  మాట్లాడేటప్పుడు చాలా  జాగ్రత్తగా  మాట్లాడాలి. కారణం- ఆమెను  చూడటానికి  ఎవరొచ్చినా, తనతల్లే , తనను  చంపడానికి  వాళ్ళను  పంపించినట్టుగా  అనుమానిస్తుంది. ముందు  అనుమానం  పోగోడ్తేనేగాని, ఆమె నీతో మనసు విప్పి  మాట్లాడదు. ఇక పోతే  పదమూడో  నంబరు గదిలో...."
    "నాగమణిని ప్రశ్నించాలంటే......"ముఖం అదోలా  పెట్టాడురావు.
    "రావ్ ఇలా ఇబ్బంది పడిపోవడంకూడా ఒక రకమైన మానసిక.....రుగ్మతే\నని నీకూ  తెలుసు."
    "రావ్  పెద్దగా నవ్వేశాడు. "యూ ఆర్ రైట్ . చెప్పు  పదమూడో నంబరు గది గురించి."
    "పాపం! చిన్నవాడు.ఎం . ఎ. చేస్తున్నాడు. అతనితో వీలయినంత సమయం గడుపు రావ్."
    "ఏమిటి జబ్బు?"
    "తనాటోఫోబియా?"
    "చావంటే  భయమా? అసలు  కారణం...."
    "ఇంకా  తెలుసుకోలేదు. అతడికి  వంటిరిగా వుండాలంటే  భయం. వంటరిగా ప్రయాణం చెయ్యలేదు. అంతేకాదు. రాత్రిళ్ళు నిద్ర పోవాలంటే  భయం. ఎంత నిద్ర వచ్చినా పడుకోనంటాడు. భోజనం చేస్తుంటే..... వంటరిగా కూర్చుని.....ఏదో భయంతో  వణికిపోతాడట. వళ్ళంతా చమట్లు పడ్తుందట."

 Previous Page Next Page